ఆధార్ వివరాలతో డబ్బులు మాయం చేస్తున్న మోసగాళ్లు.. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలంటే..

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

దేశంలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)ని ఉపయోగిస్తూ జరిగే సైబర్ మోసాల కేసులు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ఏ, బీ, సీ కేటగిరీ నగరాల్లోని ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నారు.

ఇలాంటి మోసాలకు సంబంధించి ఒక్క బెంగళూరులోనే 116 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని కడప, తెలంగాణలోని హైదరాబాద్, బిహార్‌లోని నవాదా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్, హరియాణా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని చిన్న నగరాలు, పట్టణాలతో ముడిపడి ఉన్నాయి.

ఇవే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ సహా ఇతర రాష్ట్రాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

ఆధార్ కార్డు ప్రస్తుతం భారతీయుల ప్రధాన గుర్తింపు కార్డుగా మారింది. అలాగే, ప్రజలను మోసం చేయడానికి మోసగాళ్లకు ఇది ఇప్పుడు ఆయుధంగా మారింది.

ఆధార్ కార్డు విషయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.

వీటిపై నిపుణుల అభిప్రాయాన్ని తెలుసుకునే ముందు, బెంగళూరులో నమోదైన కొత్త కేసులను చూద్దాం.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరులో కొత్త కేసులు

బెంగళూరు కేసుల్లో బిహార్‌కు చెందిన మొహమ్మద్ పర్వేజ్ ఎజ్దానీ, అబుజర్ షమీమ్ అఖ్తర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

ఈ ఇద్దరు వ్యక్తులు ఓటీపీ కోసం ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా ప్రజలను సంప్రదించలేదు.

కానీ, బ్యాంక్ నుంచి ‘‘ఖాతాలోని డబ్బులు విత్‌డ్రా అయినట్లు’’ సందేశం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు తాము మోసపోయిన సంగతి తెలిసింది.

గతంలో ఆస్తుల అమ్మకం లేదా కొనుగోళ్లను రిజిస్ట్రేషన్ చేయడం కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన వారిలో కొందరు బెంగళూరులో వెలుగు చూసిన కేసుల్లో బాధితులుగా ఉన్నారు. వీరు స్టాంపులు- రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ‘కావేరీ 2.0’ పోర్టల్‌లో తమ పత్రాలను అప్‌లోడ్ చేశారు. తర్వాత అవి పబ్లిక్ డాక్యుమెంట్‌లుగా మారిపోయాయి.

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

నిందితులు ఈ పత్రాలను డౌన్‌లోడ్ చేసి, వాటిలోని ఆధార్ నంబర్లు, బయోమెట్రిక్ వివరాలను దొంగిలించి ప్రజల్ని మోసం చేశారు.

అయితే, ఇందులో ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, నిందితులు రోజుకు రూ. 25 వేల కంటే ఎక్కువగా దోచుకోలేకపోయారు. ఎందుకంటే, ఏఈపీఎస్‌లో ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే సదుపాయం లేదు.

‘‘ఈ 116 కేసుల్లో దోపిడికి గురైన మొత్తాన్ని ఇంకా లెక్కించలేదు. దీనిపై ఇంకా దర్యాప్తు చేస్తున్నాం’’ అని బీబీసీతో బెంగళూరు పోలీసు కమిషనర్ బి. దయానంద్ అన్నారు.

ఆధార్‌ వ్యవస్థకు సంబంధించిన అధికారుల సలహా మేరకు ‘స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ’’ అధికారి మమతా గౌడ కొత్త ఆదేశాలు జారీ చేశారు.

పౌరులు ఆధార్ కార్డును ఉపయోగించాలనుకుంటే, కార్డుపై ఉన్న నంబర్లలోని చివరి నాలుగు అంకెలను మాత్రమే వాడాలని చెప్పారు.

డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ వంటి ఇతర ఐడీలను కూడా ఉపయోగించవచ్చని సూచించారు. ఇక నుంచి కావేరీ 2.0 పోర్టల్‌లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మొదటి పేజీ మాత్రమే కనిపించేలా చర్యలు తీసుకున్నారు.

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్ భద్రతపై ప్రశ్నలు

ఈ కేసులు వెలుగు చూసిన తర్వాత, డేటాబేస్‌కు తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయా? క్లౌడ్‌లో పోర్టల్ ఎన్‌క్రిప్ట్ చేశారా? అంటూ పలు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

అరెస్టయిన వ్యక్తులు 'బలిపశువులు' మాత్రమే. వీరి వెనుక పెద్ద ముఠా ఉండొచ్చు.

ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సెక్యూరిటీ కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు శశిధర్ సీఎన్ అన్నారు.

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్‌పై ప్రైవేట్ డీలర్ల పెత్తనం

అయితే దీనర్థం ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలకు సంబంధించిన కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయని కాదు.

ముంబైకి చెందిన డైరెక్ట్ సెల్లింగ్ కన్సల్టెన్సీ అయిన ‘స్ట్రాటజీ ఇండియా’కు చెందిన ప్రాంజల్ ఆర్ డేనియల్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

తమ ఉత్పత్తులను, సేవలను ప్రమోట్ చేయడం కోసం డైరెక్ట్ సెల్లింగ్ మోడల్‌ను ఉపయోగించే కార్యకలాపాలు (ఆపరేషన్లు) దేశంలో 600కు పైగా ఉన్నాయని ఆయన చెప్పారు.

ఈ కార్యకలాపాలన్నీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-2000, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ -2023, కన్జూమర్ ప్రొటెక్షన్ (డైరెక్ట్ సెల్లింగ్) రూల్స్ 2021, కన్జూమర్ ప్రొటెక్షన్ (ఈ-కామర్స్) రూల్స్-2020 వంటి వాటి నిబంధనలకు లోబడి ఉండాలి.

ఇలాంటి పరిస్థితుల్లో, భారత్‌లో ఉన్న సర్వర్‌లలో సున్నితమైన, ముఖ్యమైన డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.

అయితే, చాలా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తమ డైరెక్ట్ సెల్లర్స్, కస్టమర్ల వ్యక్తిగత డేటాను భారతదేశం బయట ఉన్న సర్వర్‌లలో నిల్వ చేస్తాయి. వినియోగదారులు ఆర్డర్లు చేసేటప్పుడు, రిజిస్టర్ అయ్యేటప్పుడు వారి డేటాను సేకరిస్తారు.

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్‌ను లాక్, అన్‌లాక్ చేసే సౌకర్యం

ఆధార్ కార్డు అందరికీ గుర్తింపు కార్డుగా మారిపోయిందని ముంబయికి చెందిన ఓపెన్ లయబిలిటీ అలయన్స్ అధినేత దినేష్ బరేజా అన్నారు. కానీ, దీనికి సంబంధించిన భద్రతా చర్యల గురించి ప్రజలకు పెద్దగా తెలియదని చెప్పారు.

‘‘ఆధార్ కార్డ్‌ను ఒకసారి వాడిన తర్వాత దాన్ని బ్లాక్ చేయవచ్చు. మళ్లీ మీకు అవసరమైనప్పుడు దాన్ని అన్‌లాక్ చేయవచ్చు. దీనికి పరిమితులు విధించడం మీ చేతుల్లోనే ఉంది.

ప్రజల్లో ఈ అవగాహన కల్పించేందుకు డబ్బు ఎందుకు ఖర్చు చేయడం లేదో నాకు అర్థం కావట్లేదు. ఆధార్‌లో లాక్, అన్‌లాక్ చేసే సౌకర్యం ఉంది. కానీ, ఇది చాలా పెద్ద వెబ్‌సైట్. ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుందో దాన్ని ఎలా పొందాలో ప్రజలకు తెలియదు’’ అని ఆయన వివరించారు.

ఆధార్ కార్డ్

ఫొటో సోర్స్, AFP

ఏం చేయాలి? ఏం చేయకూడదు?

సైబర్ నిపుణులు, కన్సల్టెంట్లు, పోలీసులతో సంభాషణల ఆధారంగా ఆధార్ కార్డు విషయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

  • డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు నంబర్‌ని ఉపయోగించడం తప్పనిసరి కాదు. నిజానికి ఆధార్‌ను నిర్దిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని చట్టం నిర్దేశిస్తోంది.
  • బ్యాంకులో ఖాతా తెరవడం, మొబైల్ కనెక్షన్ తీసుకోవడం, స్కూల్ అడ్మిషన్, ప్రైవేట్ కంపెనీలలో ఆధార్ కార్డుకు బదులుగా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, రేషన్ కార్డ్ వంటి ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించాలి.
  • ఏవైనా డాక్యుమెంట్లను పబ్లిక్‌గా ఉంచాల్సి వస్తే, వాటిలో పూర్తి ఆధార్ నంబర్‌ను కాకుండా చివరి నాలుగు అంకెలు మాత్రమే ఉపయోగించాలి.
  • ఒకసారి ఆధార్ కార్డు వాడిన తర్వాత లాక్ చేసుకోవచ్చు. UIDAI వెబ్‌సైట్‌లో కార్డ్‌ని లాక్ లేదా అన్‌లాక్ చేసే సదుపాయం ఉంటుంది.
  • ఒకే డాక్యుమెంట్‌పై ఆధార్ నంబర్, వేలిముద్ర, పేరును ఉపయోగించకూడదు.
  • మీ బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల అన్ని లావాదేవీలకు పరిమితిని విధించండి. మీరు వాటిని ఉపయోగించినప్పుడు మాత్రమే పరిమితిని తీసేయండి.
  • మీరు సైబర్ మోసానికి గురైతే, వెంటనే సైబర్ నేరాల జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి. డబ్బు బదిలీ అయిన ఖాతాను పోలీసులు ట్రాక్ చేస్తారు. డబ్బును తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ, డబ్బు రికవరీ అనేది అదృష్టానికి సంబంధించిన విషయం.

ఆధార్ డేటా చోరీ

81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ డేటా చోరీ అయ్యాయని, ఆ డేటాను 'డార్క్ నెట్'లో ఉంచారని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.

ఈ నివేదికలపై వివరణ కోసం యూఐడీఏఐని మేం సంప్రదించగా వారి నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు.

యూఐడీఏఐ స్పందించినప్పుడు ఈ వార్తలు అప్‌డేట్ చేస్తాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)