ఓటర్ ఐడీ-ఆధార్ లింక్ చేస్తే డూప్లికేట్ ఓటర్లను ఏరివేయొచ్చా? ఎన్నికల చట్టంలో మార్పుల గురించి మీరు తెలుసుకోవాల్సిన 6 అంశాలు..
ఓటర్ ఐడీలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసే బిల్లును పార్లమెంటు ఆమోదించింది. అయితే, ఓటింగ్ ప్రక్రియకు సంబందించిన ఈ కీలకమైన బిల్లును రెండు సభల్లోనూ ఎలాంటి ఓటింగ్ లేకుండానే ఆమోదించడం ఓ విశేషం. ఈ చట్టం ద్వారా డూప్లికేట్ ఓటర్లను ఏరివేయొచ్చని, మొత్తంగా ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయొచ్చని ప్రభుత్వం చెబుతుండగా... ప్రతిపక్షాలకు, రాజకీయ విశ్లేషకులకు మాత్రం దీనిపై అనేక అనుమానాలున్నాయి... మరెన్నో అభ్యంతరాలున్నాయి.
1. ఈ బిల్లులో ఏముంది?
The Election Laws Amendment Bill, 2021 అని పిలిచే ఈ బిల్లును సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించాయి. ఓటర్ల జాబితాను ఆధార్ ఎకోసిస్టమ్‌తో అనుసంధానం చేసే ఈ బిల్లును ముందుగా సెలక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రతిపక్ష పార్టీల డిమాండ్‌ను, ఆఖరుకు దీనిపై సభలో ఓటింగ్ జరపించాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పక్కనపెట్టింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఎన్‌సీపీ, వామపక్ష పార్టీలు దీనికి నిరసనగా సభలోంచి వాకౌట్ చేయగా.... బీజేపీ, జేడీయూ, వైఎస్సార్‌సీపీ, ఏఐఏడీఎంకే, బీజేడీ ఈ బిల్లుకు మద్దతునిచ్చాయి.
ఇది చాలా మంచి చట్టమని న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజూ అభివర్ణించారు. దీంతో ఫేక్ లేదా బోగస్ ఓటర్లను తొలగించవచ్చని, దేశ ఎన్నికల వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మల్చవచ్చని ఆయన అన్నారు. కాగా, ఇది ప్రైవసీ హక్కును హరిస్తుందని, ఇది కొందరికి ఓటుహక్కు లేకుండా చేయొచ్చని, ఓటర్ల ప్రొఫైలింగ్ కూడా జరిగే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు, విమర్శకులంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఈ బిల్లు ఆమోదం ఎలా జరిగింది?
దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన ఈ ముఖ్యమైన చట్టానికి విస్తృత స్థాయి సంప్రదింపులు, లోతైన పరిశీలన, అధ్యయనం అవసరం కాగా, పార్లమెంటులో చాలా ఆదరాబాదరాగా, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం తెలపడం పట్ల అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభలోనైతే కేవలం 20 నిమిషాల్లోనే ఈ బిల్లు పాసైంది.
మోదీ ప్రభుత్వం ఇటీవలి కాలంలో పార్లమెంటులో చర్చలు జరపకుండానే బిల్లులను ఆమోదింపజేస్తోందనే విమర్శలు మూటగట్టుకుంది. ఉదాహరణకు, గత వర్షాకాల సమావేశాల్లో 15 కొత్త బిల్లుల్ని ఎలాంటి చర్చా లేకుండానే ఆమోదించారు.
అయితే, ఎన్నికల సంఘంతో అనేక దఫాలు చర్చించిన తర్వాతే ఈ బిల్లును రూపొందించామని కిరణ్ రిజిజు పార్లమెంటులో అన్నారు.
3. ఆధార్ లింక్ స్వచ్ఛందమా, అనివార్యమా?
నిజానికి ఈ బిల్లులో ఉన్న వివాదాస్పద అంశం ఇదే. ఓటర్ ఐడీ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం స్వచ్ఛందమేనని, అనివార్యమేమీ కాదని మంత్రి కిరణ్ రిజిజు సభలో నొక్కి చెప్పారు.
ఆధార్ వివరాలు, నెంబర్ వెల్లడి చేయలేని ఓటర్ల పేరును ఓటర్ లిస్టులోంచి తొలగించబోమని, లేదా వారి పేర్ల నమోదును తిరస్కరించబోమని ఈ బిల్లు డ్రాఫ్టులో పేర్కొన్న మాట నిజమే. అయితే, దీనికి తగిన కారణం ఉండాలి.
కానీ 'తగిన కారణం' అనేదాన్ని భవిష్యత్తులో ఎలాగైనా నిర్వచించే అవకాశం ఉంది కాబట్టి స్వచ్ఛందం అని పైపైన చెప్పడమే తప్ప దీన్ని అనివార్యం చేయడమే అసలు ఉద్దేశమని విమర్శకులంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4. ఆధార్‌తో ఉన్న వివాదాలేంటి?
మొదటి విషయం - ఆధార్ పౌరసత్వాన్ని రుజువు చేసే గుర్తింపు కార్డు కాదు.
కానీ ఓటు హక్కు మాత్రం కేవలం దేశ పౌరులకు మాత్రమే పరిమితం. కాబట్టి అక్రమ మార్గాల్లో ఆధార్ కార్డులు సంపాదించే వీలున్నప్పుడు, పౌరులు కానివారు కూడా ఓటర్లు అయ్యే అవకాశం ఉండొచ్చనేది ఒక చర్చ.
రెండోది - ఆధార్ డేటా లీకేజి సమస్య. ఆధార్‌లో అనేక లొసుగులున్నాయనే విమర్శలే కాదు, ఆ విషయాన్ని స్వయంగా UIDAI కూడా అనేక సార్లు కోర్టుల్లో అంగీకరించింది.
ఉదాహరణకు, హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ ఏపీ, తెలంగాణల్లోని 7.82 కోట్ల మంది ఆధార్ కార్డ్ హోల్డర్ల డేటాను అక్రమంగా సేకరించి, తన డేటాబేస్‌లలో నిల్వ చేసుకుందని 2019లో స్వయంగా UIDAIనే ఓ కేసు వేసింది. ఆ తర్వాత ఈ కేసును సిట్‌కు అప్పగించారు.
ఇక మూడోది - ఆధార్ ప్రైవసీని ఉల్లంఘిస్తుందనే చర్చ మొదటి నుంచీ ఉంది.
పుట్టస్వామి కేసులో ప్రైవసీ పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. ఆధార్‌ను కేవలం పీడీఎస్, గ్యాస్ కనెక్షన్, తదితర సంక్షేమ పథకాల కోసం, అలాగే పాన్ కార్డుతో లింక్ చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలని సర్వోన్నత న్యాయస్థానం వివిధ తీర్పుల్లో పేర్కొంది. బ్యాంకుల్లో కూడా ఆధార్ వాడకం స్వచ్ఛందమేనని ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
5. ఆధార్-ఓటర్ ఐడీ లింక్ చేస్తే వచ్చే సమస్యలేంటి?
ఆధార్-ఓటర్ ఐడీలను లింక్ చేసే ప్రక్రియను ఎన్నికల సంఘం నిజానికి 2015లోనే ప్రారంభించింది. అగస్ట్ 2015లో ఆధార్ రాజ్యాంగబద్ధత కేసుపై ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించేనాటికే 30 కోట్ల ఐడీలతో ఆధార్ అనుసంధానం పూర్తయిందని ఓ అంచనా.
ఇలా ప్రయోగాత్మకంగా లింక్ చేసినప్పుడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2018లో దాదాపు 55 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితాలోంచి గల్లంతయ్యాయని తేలింది. గుత్తా జ్వాల వంటి ప్రముఖ క్రీడాకారిణి పేరు కూడా ఓటర్ల లిస్టులోంచి డిలీట్ అయ్యింది. రెండు డేటాబేసుల్ని లింక్ చేయడానికి తాము వాడిన ఓ కొత్త సాఫ్ట్‌వేరే ఇలా పేర్లు గల్లంతు కావడానికి కారణం కావొచ్చని అప్పటితెలంగాణ ఎన్నికల సంఘం చీఫ్ రజత్ కుమార్ కూడా అంగీకరించారు.
కాబట్టి ఈ కొత్త చట్టంతో కూడా ఇలా ఓటర్ల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉంటుందనే భయాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
6. ఈ బిల్లుపై ప్రతిపక్షాల అభ్యంతరాలు, వాటికి ప్రభుత్వ సమాధానం ఏంటి?
ప్రైవసీ మౌలిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పును ఇది ఉల్లంఘిస్తుందని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు.
ఈ చట్టాన్ని ఆసరా చేసుకొని మోదీ ప్రభుత్వం కొందరు పౌరులకు ఓటు హక్కు లేకుండా చేయొచ్చని, పౌరుల ప్రొఫైలింగ్ జరగొచ్చని, వారికి ప్రభుత్వ పథకాల లబ్ధి పొందకుండా చేయొచ్చని AIMIM ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సీక్రెట్ బ్యాలెట్ అనే సూత్రానికి కూడా ఇది ఉల్లంఘన అవుతుందన్నారు ఓవైసీ.
కానీ ప్రస్తుత చట్టాల్లో ఉన్న లోపాలను సవరించడానికి, ఎన్నికల సంఘంతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ సవరణలు తెచ్చామని మంత్రి కిరణ్ రిజిజు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: నరసాపురం దగ్గర కిలోమీటరు ముందుకొచ్చి ఊళ్లను మింగేసిన సముద్రం, మళ్లీ వెనక్కి ఎందుకు వెళ్తోంది
- నాణ్యమైన బంగారు గనుల్లో కంటే మిన్నగా.. టన్ను మొబైల్ వ్యర్థాల్లో 300 రెట్లు బంగారం...
- ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న జుగాడ్ జీప్.. ఎక్స్ఛేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తానన్న పారిశ్రామికవేత్త
- గురు గ్రంథ సాహిబ్‌ను చివరి గురువుగా సిక్కులు ఎందుకు భావిస్తారు? అందులో ఏం రాసి ఉంది?
- ఫైనాన్షియల్ ప్లానింగ్: కొత్త ఉద్యోగంలో చేరగానే ఏం చేయాలి?
- బలవంతపు మతమార్పిడికి 10 ఏళ్ల జైలు: కర్ణాటకలో తమపై దాడులు పెరుగుతున్నాయంటూ క్రైస్తవుల ఆందోళన
- ‘శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- చలికాలం: కోల్డ్‌వేవ్ అని ఎప్పుడు ప్రకటిస్తారు, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రూ. 5,500 కోట్ల పరిహారం ఇచ్చి ఆరో భార్యతో విడాకులు
- 5,000 రకాల వంటలు చేసే రోబో, ధర ఎంతంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


