ఆంధ్రప్రదేశ్‌లో పశువులకూ 'ఆధార్‌'.. విశిష్ఠ సంఖ్య ఉంటేనే ప్రభుత్వ పథకాలు - ప్రెస్ రివ్యూ

ఇనాఫ్ ట్యాగ్

ఫొటో సోర్స్, Haryana Veterinary Services Association/Facebook

మనుషులకు ఆధార్‌ కార్డు ఉన్నట్లే పశువులకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ తరహా కార్డులు ఇవ్వనుందని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు సర్కారు 12 అంకెల విశిష్ఠ సంఖ్యను కేటాయించబోతోంది. ఈ సంఖ్యతో పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్‌ వేస్తారు. దీంతో భవిష్యత్‌లో ట్యాగ్‌ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి.

ఈ విశిష్ట సంఖ్యలు లేని పశువులు ప్రమాదంలో చనిపోయినా రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరు. రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయిస్తున్న రూ. వెయ్యి కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది.

ఇవి దుర్వినియోగం కాకుండా ఉండేందుకే 'ఇనాఫ్‌ ట్యాగ్‌' (ఇన్ఫర్మేషన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ యానిమల్‌ ప్రొడక్టవిటీ అండ్‌ హెల్త్‌)ను వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పైలట్‌ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఎంపిక చేసింది.

అడ్డగీత
News image
అడ్డగీత

ఈ నెల (ఫిబ్రవరి) 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్‌తో పాటు ఇనాఫ్‌ ట్యాగ్‌ను వేయనున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నాయి. రెండు నెలల వ్యవధిలో వీటన్నింటికీ వాక్సిన్‌తో పాటు ట్యాగ్‌లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ. 31 కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 15 కోట్లు ఇనాఫ్‌ ట్యాగ్‌లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్‌ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు.

చికెన్ లెగ్స్

ఫొటో సోర్స్, Getty Images

భారతదేశానికి అమెరికా చికెన్‌లెగ్స్ తీసుకొస్తున్న డోనల్డ్ ట్రంప్.. పర్యటనలో ఒప్పందం!

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ త్వరలో భారత్‌లో కాలు మోపబోతున్నారని.. తనతో పాటే అమెరికా కోడి కాళ్లనూ ఈ దేశానికి తీసుకురావటానికి సమాయత్తమయ్యారని ‘ఈనాడు’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. అమెరికాలో చికెన్‌లెగ్స్ (కోడి కాళ్లు)ను ఎక్కువగా తినరు. కోడి ఛాతీభాగాన్ని బాగా ఇష్టపడతారు. దానివల్ల ఆ దేశంలో చికెన్‌లెగ్స్ ఏళ్లుగా కుప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటిని భారత్‌కు విక్రయించే పనిలో డోనల్డ్ ట్రంప్ నిమగ్నమయ్యారు.

ఇందుకు సిద్ధపడిన భారత్.. చికెన్ లెగ్‌ల మీద ఉన్న 100 శాతం దిగుమతి సుంకాల్ని 25 శాతానికి తగ్గించటానికి అంగీకరిస్తున్నట్లు సమాచారం. అయితే.. దానిని 10 శాతానికి తగ్గించాలని అమెరికా పట్టుబడుతోందట.

ట్రంప్ పర్యటనలో దీనిపై అవగాహన కుదిరితే.. రెండు దేశాలూ పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయొచ్చు. భారత పాడి పరిశ్రమలోకి అమెరికాను పరిమిత స్థాయిలో అనుమతించడానికీ అంగీకారం కుదరొచ్చు.

అయితే అమెరికా చికెన్ లెగ్స్‌ను దిగుమతి చేసుకుంటే ఘోరంగా నష్టపోతామని దేశీయ కోళ్ల పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనివల్ల లక్షలాది కోళ్ల ఫాంలు మూతబడతాయని, వాటిపై ఆధారపడిన లక్షల మంది ఉపాధి కోల్పోతారని, గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుదేలవుతుందని పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

బర్డ్‌ఫ్లూ కారణంతో 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. చివరికి డబ్ల్యూటీఓ ద్వారా అమెరికా ఒత్తిడి తేవటంతో చికెన్‌లెగ్స్ దిగుమతికి 2017లో మోదీ సర్కారు అంగీకరించింది.

గౌతమ్ అదానీ

ఫొటో సోర్స్, Getty Images

అదానీ గ్రూపు చేతికి మూడు విమానాశ్రయాలు...

దేశంలోని మూడు కీలక విమానాశ్రయాలను అదానీ గ్రూపు స్వాధీనం చేసుకోనుందని.. అహ్మదాబాద్‌, మంగళూరు, లక్నో విమానాశ్రయాల అభివృద్ధికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఎఐ)తో ఒప్పందం కుదుర్చుకుందని ‘ప్రజాశక్తి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఈ మూడు విమానాశ్రయాలను 50 ఏళ్ల పాటు నిర్వహించేందుకు చేసుకున్న ఒప్పందం ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ శుక్రవారం బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది.

ఇవి అదానీ అహ్మదాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అదానీ లక్నో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, అదానీ మంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ పేర్లతో తమ గ్రూపులో భాగస్వామ్యంగా ఉండనున్నాయని వెల్లడించింది.

2018 డిసెంబర్‌లో ఆరు విమానాశ్రయాల ప్రయివేటీకరణ కోసం జరిగిన బిడ్డింగ్‌లో గౌతమ్‌ అదానీకి చెందిన గ్రూపు అన్నింటినీ సొంతం చేసుకుంది. ఇంకా జైపూర్‌, త్రివేండ్రం, గౌహతి విమానాశ్రయాలపై ఒప్పందం జరగాల్సి ఉంది.

కరోనా వైరస్

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో కొవిడ్19 కేసు ఒక్కటి కూడా నిర్ధారణ కాలేదు: ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కొవిడ్-19 (కరోనా వైరస్‌) కేసు కూడా నిర్ధరణ కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అధికారికంగా తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఒక వ్యక్తి ఐసోలేషన్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 88 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో ఒక్కరికి కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదని మంత్రి ఈటెల తెలియజేశారు.

ప్రజలు పుకార్లను నమ్మవద్దనీ.. కొవిడ్-19పై ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నదని ఈ సందర్భంగా మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు.

స్పోర్ట్స్ ఉమెన్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)