ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?

ఫొటో సోర్స్, Getty Images
బ్యాంకుల నుంచి రుణాలు పొందేందుకు తన ఆస్తుల నికర విలువను పెంచి చూపారంటూ సివిల్ ఫ్రాడ్ లా సూట్ ను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఆయన పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ వాంగ్మూలం ఇచ్చారు.
నాలుగు గంటలపాటు ఆమె కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ వాంగ్మూలం సారాంశమంతా ఒక్క ముక్కలో తేల్చిపడేయాలంటే ‘‘నాకేమీ గుర్తు లేదు’’ అని చెప్పుకోవచ్చు.
ఇంతకుముందు ట్రంప్ కుటుంబంలో ముగ్గురు సభ్యులను విచారించారు. ట్రంప్ ఇద్దరు కుమారులు డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్‌లు కూడా వాంగ్మూలం ఇచ్చారు.
అయితే ఇవాంకా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తి కారు.
కోర్టులో ఇవాంకా చాలా ప్రశాంతంగా వ్యవహరించారు. న్యాయవాదులు, న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ కోపంతో ప్రశ్నలు సంధించినా ఆమె చెక్కుచెదరలేదు.
న్యాయమూర్తి, కోర్టు అధికారుల వంక మర్యాదగా, నవ్వుతూ చూస్తూ, తన కంఠంలో ఎక్కడా భావోద్వేగాలు కనిపించకుండా స్థిరచిత్తంతో సమాధానాలు చెప్పారు.
కిందటివారం ఆమె తండ్రి ట్రంప్ ప్రవర్తించిన తీరుకు ఆమె పూర్తి భిన్నంగా వ్యవహరించారని యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మండ్ లా ప్రొఫెసర్ కాల్ టోబియాస్ చెప్పారు.
‘‘ఆమె న్యాయమూర్తి ఎంగోరాన్‌తో కానీ, అటార్నీ జనరల్ కౌన్సిల్‌తో కానీ యుద్ధం చేస్తున్నట్టు కాకుండా, ఎటువంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా, వారిని చాలా మర్యాదగా సంబోధించారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘నాకు తెలియదు, గుర్తులేదు’
ట్రంప్ ఆర్థిక నివేదికల గురించి ఆమెకు అవగాహన ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడమే లక్ష్యంగా ప్రాసిక్యూటర్ లౌ సోలమన్ వేసిన ప్రశ్నలలో చాలావాటికి ఆమె ‘నాకు తెలియదు’ ‘నాకు గుర్తు లేదు’ అని చెప్పారు.
‘‘ట్రంప్ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి తయారుచేసిన నివేదికలతో మీ పాత్ర ఏమైనా ఉందా’’ అని సోల్మన్ ఇవాంకాను అడిగారు.
‘దాని గురించి నాకేమీ తెలియదు’ అని ఇవాంకా జవాబిచ్చారు.
‘ట్రంప్ ఆర్థిక స్థితిగతులను నిర్థరించేముందు మీరెప్పుడైనా వాటిని సమీక్షించారా’ అని ప్రాసిక్యూటర్ అడగ్గా, ‘నాకు గుర్తు లేదు’ అని ఇవాంకా తెలిపారు.
‘‘సహజంగా ఇలాంటి కేసులలో తాము రోజూ అనేకమందిని కలుస్తుంటామని, అనేక వ్యవహారాలు చూస్తుంటామని, ఎంతోమందితో ఎన్నో విషయాలు మాట్లాడుతుంటామని, అనేక డాక్యుమెంట్లపై సంతకాలు చేస్తుంటామని ఎగ్జిక్యూటివ్‌లు వాదిస్తుంటారు’’ అని వైట్ కాలర్ నేరాలను విశ్లేషించే కేస్ వెస్ట్రర్న్ రిజర్వ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎరిక్ చాఫే చెప్పారు.
‘కానీ ఇలాంటి వాంగ్మూలం చాలా భిన్నమైంది.’ అని చాఫే తెలిపారు.
‘‘చట్టప్రకారం ఇది చాలా తెలివైన పని. తనకేమీ గుర్తులేదని ఇవాంకా పదేపదే చెప్పడం వల్ల అది నిజంగా భావించాల్సి వస్తుంది. దీనివలన ఆమె తన ప్రతిష్ఠ దెబ్బతినకుండా చూసుకోవడంతోపాటు ఈ కేసులోని ముద్దాయిలకు సహాయకారిగానూ మారుతుంది’’ అని విశ్లేషించారు.
‘‘పైగా ఇవాంకా వాంగ్మూలం ఇచ్చిన సమయం కూడా ఆమెకు కలిసొస్తుంది. ఎందుకంటే కోర్టుకు సమర్పించిన పత్రాలలో చాలాభాగం పదేళ్ళ కిందటివి. కాబట్టి, అప్పడెప్పుడో సంగతులో గుర్తులేదని చెప్పడంలో లాజిక్ కనిపిస్తుంది’’ అని తెలిపారు.
కోర్టులో ప్రశ్నలు ప్రారంభం కాగానే 12ఏళ్ళ కిందట తాను 9 నెలల గర్భవతిని అని, ఆ సమయంలో ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చినట్టుగా గుర్తుంది అంతే అని ఆమె కోర్టుకు తెలిపారు.
మొత్తంగా ఇవాంకా వాంగ్మూల ప్రభావం ఈ కేసుపై పెద్దగా ఉండదని నిపుణులు బీబీసీకి చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS/JANE ROSENBERG
ఈ సాక్ష్యంతో ఒరిగేదేమీ లేదు
గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన లాయర్‌గా వ్యవహరించి, తరువాత ట్రంప్‌కు ఎదురుతిరిగిన టైకాబ్ మాట్లాడుతూ ఈ కేసు విషయంలో ఇవాంకా సాక్ష్యం చూపే ప్రభావం శూన్యమని చెప్పారు.
‘‘ఆమె వాంగ్మూలంలో ఒక్క నిజం లేదు, ఈ వాంగ్మూలానికి సంబంధించినంత వరకు ఆమె చెప్పిన నిజమేదైనా ఉందంటే ‘తాను 9నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఏదో ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్నట్టు గుర్తు’ అన్నమాటే’’ అని ఆయన తెలిపారు.
ఈ కేసులో చివరి వాంగ్మూలం ఇవాంకాదే. దీని తరువాత డిఫెన్స్ తమ సాక్షుల విచారణ ప్రారంభిస్తారు.
రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థిత్వానికి ముందున్న ట్రంప్ సివిల్ ఫ్రాడ్ కేసులో బాధ్యులుగా గుర్తించారు. ఈయనతోపాటు ఈయన ఇద్దరు కుమారులు కూడా ఈ కేసులో భాగస్వాములుగా ఉన్నారని ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. అయితే వీరు ముగ్గురు ఈ అభియోగాలను ఖండించారు.
ఈ కేసులో వారికి పడే జరిమానా ఏమిటో నిర్ణయమవుతుంది.
ట్రంప్ పై లా సూట్ దాఖలు చేసిన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ 250 మిలియన్ల పెనాల్టీ విధించడంతోపాటు, న్యూయార్క్‌లో ఆయన వ్యాపారాలపై కఠిన ఆంక్షలు విధించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆధార్ వివరాలతో డబ్బులు మాయం చేస్తున్న మోసగాళ్లు.. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలంటే..
- విమానం నుంచి పడిపోతున్న పైలట్‌ను కాళ్లు పట్టుకుని ఆపారు, ఆ తర్వాత ఏమైందంటే?
- ఏపీ-తెలంగాణ: NMC కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఎంబీబీఎస్ సీట్లు తగ్గిపోతాయా?
- సామూహిక సెక్స్, విచ్చలవిడి శృంగారం, మత్తు పదార్థాలు, విలాసవంతమైన విందు.. ప్రాచీన చక్రవర్తులు శ్రుతిమించి సుఖపడేవారా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














