ఇరాన్, భారత్ కలిసి ఇజ్రాయెల్‌ను కాల్పుల విరమణకు ఒప్పించగలవా?

ఫొటో సోర్స్, ANI
- రచయిత, ప్రియాంక ఝా
- హోదా, బీబీసీ ప్రతినిధి
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై భారీ సంఖ్యలో రాకెట్లతో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ దాడి చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దానిని ‘‘తీవ్రవాద దాడి’’గా అభివర్ణిస్తూ ఖండించారు.
అప్పటి నుంచి గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబులతో దాడులు చేస్తోంది.
ఇజ్రాయెల్- హమాస్‌ల మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు.
ఈ సంభాషణ తర్వాత, గాజా విషయంలో ఇజ్రాయెల్‌ను భారత్, ఇరాన్ కలిసి ఒప్పించగలవా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
ఇరాన్ అధ్యక్షుడితో సంభాషణ గురించిన సమాచారాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.
‘‘పశ్చిమాసియాలో కఠిన పరిస్థితులు, ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణ గురించి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో చర్చించాం. తీవ్రవాద ఘటనలు, హింస, సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం అనేవి ఆందోళన కలిగించే అంశాలు’’ అని ట్వీట్‌లో రాశారు.
మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ సంఘర్షణను ఆపడానికి భారత్ తన పూర్తి సామర్థ్యాలను ఉపయోగించాలని ప్రధాని మోదీని రైసీ కోరినట్లు ఇరాన్ తెలిపింది.
కానీ, ఈ చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్‌పై ఇరాన్ సూటిగా ఆరోపణలు చేయడంతో, భారత వైఖరి మరోసారి చర్చల్లో నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ-రైసీ గురించి ఇరాన్ ఏం చెప్పింది?
సోమవారం మోదీ-రైసీల మధ్య జరిగిన చర్చ గురించి ఇరాన్ సమాచార ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఐ సమాచారం ఇచ్చింది.
తక్షణ కాల్పుల విరమణకు, గాజా ప్రజలకు సహాయం అందించేందుకు తమ దేశం అనుకూలంగా ఉందని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించినట్లు తెలిపింది.
ఐఆర్‌ఎన్‌ఐ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘‘గాజా నివాసితులపై జియోనిస్ట్‌ల నేరాలను ఆపడానికి భారత్ తన పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుందని అనుకుంటున్నాం.
పాలస్తీనియన్ల హత్యలు కొనసాగుతున్నందున స్వతంత్ర దేశాలన్నీ ఆందోళనలో ఉన్నాయి. ఈ హత్యల ప్రభావాలు ఈ ప్రాంతం వెలుపల కూడా కనిపిస్తున్నాయి.
జియోనిస్టుల ఆక్రమణలను ప్రతిఘటించే హక్కు పాలస్తీనా సమూహాలకు ఉంది. ఈ అణచివేత నుంచి విముక్తి కోసం పోరాడుతున్న పాలస్తీనా ప్రజలకు అన్ని దేశాలు మద్దతు ఇవ్వాలి’’ అని మోదీతో రైసీ వ్యాఖ్యానించినట్లు పేర్కొంది.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత దిగజారకుండా అడ్డుకోవాలని, తక్షణమే శాంతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
రైసీతో చర్చ సందర్భంగా గాజాలో పరిస్థితులు మరింత అదుపు తప్పకుండా ఆపాలని, మానవతా సహాయం అందించడానికి ప్రయత్నాలను కొనసాగిస్తామని, అక్కడ శాంతి-స్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఉందని నరేంద్ర మోదీ చెప్పారని భారత ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్-పాలస్తీనా విషయంలో దీర్ఘకాల తమ వైఖరిని మోదీ పునరుద్ఘాటించినట్లు ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఇమేజ్ ఏంటి?
ఇరాన్ ఒక షియా ఇస్లామిక్ దేశం. భారత్‌లో కూడా షియా ముస్లింల సంఖ్య ఎక్కువ. ఇరాన్ తర్వాత అత్యధిక సంఖ్యలో భారత్‌లో షియా ముస్లింలు ఉన్నారు.
ఒకవేళ భారత విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడి ఉండకపోతే, ఇరాన్‌తో భారత్‌కు సరిహద్దు ఉండేది.
2014లో మోదీ ప్రభుత్వం భారత్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్, భారత్ దగ్గరయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య రక్షణ, సైబర్, సాంకేతిక రంగాల్లో సహకారం పెరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, భారత ప్రధాని మోదీల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరాన్ బహిరంగంగానే హమాస్‌కు మద్దతు తెలిపింది. భారత్ మాత్రం పాలస్తీనా, హమాస్ అనే పదాల ప్రస్తావన లేకుండా దీన్నొక తీవ్రవాద దాడిగా పేర్కొంది.
తాజా పరిణామాల తర్వాత, ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య బ్యాలెన్స్ కోసం భారత్ ప్రయత్నిస్తోందా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
అయితే, అలాంటిదేమీ జరగట్లేదని భావిస్తున్నారు న్యూ దిల్లీకి చెందిన మేధోమథన సంస్థ సెంటర్ ఫర్ ఇండియా వెస్ట్ ఏషియా డైలాగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమైర్ అనస్.
ఇప్పుడు గాజా సంక్షోభం దిశ మార్చుకుంటున్న తీరు అన్ని దేశాలను సహనం కోల్పోయేలా చేస్తోందని రైసీ-మోదీల మధ్య జరిగిన సంభాషణతో అర్థమవుతోందని అనస్ అన్నారు.
ఇప్పుడు ఈ వివాదం పెద్ద ప్రాంతీయ సంక్షోభంగా మారుతుందని అన్ని దేశాలు భయపడుతున్నాయని, వీటిలో భారత్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
"ఇజ్రాయెల్, ఇరాన్‌లను బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు పెద్ద ప్రశ్న కాదు. కానీ, ఇప్పుడు జరుగుతోన్న సంక్షోభం గాజాలో అతిపెద్ద సమస్య. ఇజ్రాయెల్, గాజా విషయంలో భారత్ పూర్తిగా ఇజ్రాయెల్‌కే మద్దతుగా నిలుస్తోందనే ఇమేజ్ ఏర్పడింది. అరబ్ లేదా పర్షియన్ మీడియాలో చూస్తే, పాలస్తీనాను పూర్తిగా వదిలేసి ఇజ్రాయెల్ వైపే భారత్ నిలిచిందనే కథనాలు ప్రతిచోటా కనిపిస్తాయి. ఈ ఇమేజ్ వల్ల అరబ్ దేశాల్లో భారత్‌కు నష్టం కలిగే అవకాశం ఉంది’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌పై ఇరాన్‌కు ఎందుకంత నమ్మకం?
భారత్‌పై ఇరాన్ ఎందుకంత నమ్మకం పెట్టుకుందనే అంశానికి ఉమైర్ అనస్ సమాధానం చెబుతూ, దీని వెనుక ఇరాన్ సొంత ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
"ఈ పెద్ద వివాదంలో భాగం కావడానికి ఇరాన్ ఇష్టపడదు. ఇరాన్‌పై కూడా చాలా ఒత్తిడి ఉంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లాతో పాటు, సిరియా నుంచి ఎవరినీ రానివ్వకూడదనే ఒత్తిడి ఉంది. గాజాలో ఇంతమంది ప్రజలు చనిపోతున్నా ఇంకా ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే ఒత్తిడి కూడా ఇరాన్ మీద ఉంది. ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న మిలిటెంట్ గ్రూపులన్నీ కూడా ఈ వివాదంలోకి మమ్మల్ని ఎప్పుడు అనుమతిస్తారంటూ ఇరాన్‌ను నిరంతరం అడుగుతున్నాయి. ఇలా ఇరాన్‌పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉంది’’ అని ఆయన వివరించారు.
జామియా మిలియా ఇస్లామిక్ యూనివర్సిటీకి చెందిన నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ ప్రేమానంద్ మిశ్రా కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని బీబీసీతో పంచుకున్నారు.
‘‘ప్రపంచ రాజకీయాల్లో భారత్ ఆధిపత్య శక్తి కాదనే విషయం ఇరాన్‌కు తెలుసు. కానీ, అత్యంత శక్తిమంతమైనదనే సంగతి కూడా ఇరాన్‌కు తెలుసు. భారత్‌కు ఇజ్రాయెల్, పాలస్తీనాతో పాటు అరబ్ దేశాలు, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని ఇరాన్ గుర్తు పెట్టుకుంటుంది. అలాగే, గత 40 ఏళ్లుగా తమకు సున్నీ అరబ్బులు, అమెరికా, ఇజ్రాయెల్‌లతో సత్సంబంధాలు లేవని విషయం ఇరాన్‌కు తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ తమకున్న అనేక అభిప్రాయాలను భారత్ ద్వారా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని భారత్ ఆపగలదా?
నిరుడు యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పుడు, ఈ యుద్ధాన్ని ఆపడంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషిస్తుందా అనే ప్రశ్న తలెత్తింది.
ఇప్పుడు మరోసారి ఇదే ప్రశ్న తలెత్తుతోంది. భారత్‌కు ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాన్‌లతో సత్సంబంధాలు ఉన్నాయి.
ప్రధాని మోదీ రెండు విషయాల్లో చాలా స్పష్టంగా ఉన్నారని ఉమైర్ అనస్ చెప్పారు.
మొదటిది, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి, ఇది జరగకూడని సంఘటన అని ఆయన అన్నారు. దీన్ని భారత బలమైన దౌత్యానికి ఉదాహరణగా చెప్పారు.
మరోవైపు, పాలస్తీనాలో గాయపడుతున్న పౌరుల గురించి కూడా భారత్ ఆందోళన చెందుతోందని ఆయన అంటున్నారు. ఇది భారత దౌత్యానికి నిదర్శనం.
కానీ, అంతర్జాతీయ వేదికపై ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వివాదాన్ని పరిష్కరించగల పెద్ద శక్తిగా భారత్ ఎదిగిందా? అనే ప్రశ్నకు చాలామంది నిపుణులు లేదనే సమాధానం ఇస్తారు.
డా. ప్రేమానంద్ మిశ్రా దీని వెనుక కారణాన్ని వివరిస్తూ, "ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాలు భారత్ మాట విని వివాదాన్ని ముగించడం జరగదు. ప్రస్తుతం, అమెరికా తప్పా ఈ వివాదాన్ని ఆపగలిగే శక్తి మరొకటి లేదు. ఐక్యరాజ్యసమితి కూడా ఈ స్థితిలో లేదు.
ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చేలా ఒత్తిడిని సృష్టించడం మాత్రమే భారత్ చేయగలదు.
భారతదేశం పరోక్ష మధ్యవర్తి పాత్ర పోషిస్తుంది’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?
- గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...
- పారాసైట్ ఫీటస్: రక్తం తాగుతూ 10 నెలల పాప కడుపులో ఎదగని పిండం, ఎలా తెలిసిందంటే....
- భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










