ఆంధ్రప్రదేశ్ - దిశా: ఓటీపీ చెప్పాలంటూ ఆర్మీ జవాన్‌పై పోలీసుల దౌర్జన్యం, మగవాళ్లతో ఈ యాప్ ఎందుకు ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పరవాడ సంత సమీపంలో ‘సర్...వీడియో తీయండి, పోలీసులు నన్ను తీసుకుని వెళ్తున్నారంటూ” ఒక ఆర్మీ జవాన్ అరుస్తున్న వీడియో వైరల్ అయింది.
దిశా యాప్ ఓటీపీ చెప్పలేదని ఆర్మీ జవాన్‌పై అనకాపల్లి జిల్లాలో నలుగురు పోలీసులు దాడి చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ ఇతరులకు చెప్పకూడదని బ్యాంకులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తుంటారు.
కానీ అదే ఓటీపీ చెప్పలేదని ఆర్మీ జవాన్‌పై పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశమైంది.
పైగా దిశ యాప్‌ని మగవాళ్ల చేత కూడా ఎందుకు బలవంతంగా డౌన్ లోడ్ చేయిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
అసలు పోలీసులు ఎందుకు దిశ యాప్ డౌన్‌లోడ్ చేయిస్తున్నారు? దీంతో పాటు వ్యక్తిగతంగా ఉండాల్సిన ఓటీపీని పోలీసులు ఎందుకు అడిగారు? దీనిపై పోలీసు అధికారులు ఏమంటున్నారు? ఐటీ రంగ నిపుణులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు?
అసలేం జరిగింది?
అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం రేగుపాలేనికి చెందిన సయ్యద్ అలీముల్లా జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో 52వ రాష్ట్రీయ రైఫిల్ క్యాంపులో సైనికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
గతవారం ఆయన సెలవుపై ఇంటికి వచ్చారు. వ్యకిగత పనులపై వెళ్తూ...ఈ నెల 7వ తేదీన అంటే మంగళవారం పరవాడ సంత సమీపంలోని బస్ కోసం ఆగారు.
అదే సమయంలో అక్కడ దిశ యాప్ సబ్‌స్క్రిప్షన్ స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది.
పరవాడ పీఎస్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభారాణి అక్కడ ఉన్న వారితో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయిస్తున్నారు.
ఈ క్రమంలోనే సయ్యద్ అలీముల్లా ఫోన్‌లోనూ యాప్ డౌన్‌లోడ్ చేయించారు. ఈ క్రమంలో వచ్చిన ఓటీపీని చెప్పమని ఆలీముల్లాను అడిగారు.
దీనిపై తనకు అభ్యంతరం ఉందని, ఓటీపీ చెప్పనని అలీముల్లా పోలీసులకు చెప్పారు.
పైగా కానిస్టేబుళ్ల బ్యాడ్జిలపై పేర్లు లేకపోవడంతో ఐడీ కార్డులు చూపించాలని అడిగారు. దీంతో ఐడీ కార్డులు అడుగుతావా అంటూ అతడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇదంతా స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలలో తాను ఆర్మీ ఉద్యోగినని, మగాడినైన తనకు దిశ యాప్‌తో పనేముందని అడుగుతూ కనిపించారు.
అలాగే తన ఫోన్ నెంబరు తీసుకోండని అక్కడున్న ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇంతలోనే మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని బలవంతంగా అలీముల్లాను ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు.
తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఆయన చొక్కా చిరిగిపోయింది. చివరకు జనాలు పెద్ద సంఖ్యలో వచ్చి పోలీసుల తీరును తప్పు పట్టడంతో ఆర్మీ ఉద్యోగిని వదిలేశారు.
ఐడీ కార్డు అడిగినంత మాత్రాన దాడి చేస్తారా అని అలీముల్లా పోలీసులను ప్రశ్నించారు.
సోషల్ మీడియాలో ఇదంత రావడంతో ...అనకాపల్లి జిల్లా ఎస్పీ నలుగురు కానిస్టేబుల్స్‌ను ఆర్మ్డ్ రిజర్వ్‌కు అటాచ్ చేస్తూ ఘటనపై విచారణకు ఆదేశించారు.
నివేదిక రాగానే ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ మురళీకృష్ణ చెప్పారు.
అసలు ఒక యాప్‌ని డౌన్ లోడ్ చేసుకోమని బలవంత పెట్టడం ఎందుకని, పైగా వ్యక్తిగతంగా ఉండాల్సిన ఓటీపీని పోలీసులు అడగడం ఏంటని ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, UGC
వివాదం ఎందుకు?
ఆర్మీ ఉద్యోగి, పోలీసులకు మధ్య ఈ ఘటన జరుగుతున్నప్పుడు ఆర్మీ ఉద్యోగి “పురుషుడినైన నాకు దిశ యాప్ ఎందుకు?” అని ప్రశ్నించారు.
ఈ విషయం వీడియోలో స్పష్టంగా కనపడుతుంది.
అయితే దానికి పోలీసులు “ప్రభుత్వం స్త్రీ, పురుష భేదం లేకుండా అందరితో దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించమని తమకు ప్రభుత్వం చెప్పింది” అని తెలిపారు.
“దేశ సరిహద్దు కశ్మీర్‌లో పనిచేసే తనకు దిశా యాప్ ఎందుకు?” అని ఎదురు ప్రశ్నించారు. దీనికి పోలీసుల నుంచి ఏం సమాధానం రాలేదు.
మహిళల భద్రత కోసం "దిశ" పేరుతో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ 2020 ఫిబ్రవరిలో మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది.
ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన దిశ యాప్‌కు ఆదరణ లభిస్తోంది.
ఈ యాప్‌ను ఇప్పటికే 5 మిలియన్లకు పైగా డౌన్ లోడ్లు నమోదైనట్లు గూగుల్ ప్లే స్టోర్ చూపిస్తోంది.
దిశ యాప్ ద్వారా చాలా మంది మహిళలను రక్షించిన సందర్భాలు ఉన్నాయి.
దీంతో ఈ యాప్‌ను మరింత మంది ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దిశ యాప్ సబ్ స్క్రిప్షన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు.
ఆర్మీ ఉద్యోగి సంఘటనతో పాటు బలవంతంగా టార్గెట్లు పెట్టి మరీ దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి.
దీనిపై అనకాపల్లి జిల్లా దిశ యాప్ పర్యవేక్షకులు, డీఎస్పీ మల్ల మహేష్‌తో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, UGC
దిశ యాప్ పురుషులకి ఎందుకంటే...
యువతులు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు తక్షణమే సమాచారం చేరవేసే వ్యవస్థ దిశ యాప్‌లో ఉంది.
ప్రయాణ సమయంలో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది.
వాహనం దారి తప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుందని దిశ యాప్ పర్యవేక్షకులు చెప్తున్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
“దిశ యాప్‌లో 100, 112 వంటి అత్యవసర నెంబర్లతో పాటు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, మెడికల్ షాపుల వివరాలుంటాయి.
విపత్కర పరిస్థితుల్లో ఫోన్‌ను గట్టిగా అటూ ఇటూ ఊపితే చాలు.. పోలీసులకు సందేశం చేరిపోతుంది.
అప్రమత్తమైన పోలీసులు కాల్ బ్యాక్ చేస్తారు. ఫోన్‌కు స్పందించకపోతే పోలీసు వాహనంలో ఉన్న మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్‌కు పోలీసులు చేరుకుంటారు’’ అని డీఎస్పీ మల్ల మహేష్ చెప్పారు.
ఈ యాప్‌పై అవగాహన కల్పించడంతో పాటు పోలీసులే దగ్గరుండి దిశ యాప్‌ని ఇన్‌స్టాల్ చేయిస్తుంటారని, ఈ యాప్ మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరి వద్ద ఉంటే మంచిదని మహేశ్ అన్నారు.
‘‘మహిళల రక్షణ కోసమే ఇది ప్రవేశపెట్టినా...ఏదైనా అనుమానస్పదంగా ఉన్నప్పుడు, తమ కళ్లెదుట ఎవరైనా మహిళకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు...పురుషులు కూడా దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించవచ్చు. యాప్ ఉపయోగించలేని పరిస్థితుల్లో ఉన్నవారి బదులు పురుషులు తమ ఫోన్‌లోని యాప్ ద్వారా సమాచారం అందించవచ్చు. అందుకే పురుషులు కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇదేమి బలవంతం కాదు, పది మందికి పనికి వచ్చే విషయం అని భావిస్తే ఎవరికి వారు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు” అని డీఎస్పీ మల్ల మహేష్ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
‘సంతలో దిశ ఇన్‌స్టాలేషన్ మిస్ ఫైర్ అయ్యింది’: డీఎస్పీ
‘‘దిశ యాప్ డౌన్‌లోడ్ చేయిండమనేది ఈ యాప్ ప్రవేశపెట్టినప్పటి నుంచి చేస్తున్నాం. ఇది మహిళల రక్షణకు అవసరమైన యాప్. ఎందరో ఆపదలో ఉన్న మహిళల్ని నిమిషాల వ్యవధిలో ఈ యాప్ సమాచారంతో కాపాడగలిగాం. అయితే పరవాడ సంతలో జరిగిన ఘటన దురదృష్టకరం. ఇక్కడ దిశ యాప్ డౌన్‌లోడింగ్, ఇన్‌స్టాలేషన్ కార్యక్రమం మిస్ ఫైర్ అయ్యింది. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని డీఎస్పీ మల్లా మహేష్ బీబీసీతో చెప్పారు.
ఓటీపీ అడగడం అనేది యాప్ ఇన్‌స్టాలేషన్ చేయడంలో భాగంగానే జరిగిందని, చాలా మందికి దీని ఇన్‌స్టాలేషన్ తెలియదని మహేశ్ చెప్పారు.
పరవాడ సంతలో పోలీసులు ఆ ఆర్మీ ఉద్యోగి చేత యాప్‌ని డౌన్ లోడ్ చేయిస్తున్నారు. అందులో భాగంగా వచ్చిన ఓటీపీని చెప్పమని పోలీసులు అడిగారు.
‘‘మిస్ కమ్యూనికేషన్ వలన వివాదం అయ్యింది. నిజానికి పోలీసులకే కాదు ఏ వ్యక్తి మరో వ్యక్తికి ఓటీపీ చెప్పకూడదు. ఇది ఖచ్చితంగా పాటించాలి కూడా” అని మల్ల మహేష్ తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
‘ఓటీపీ చెప్పడం ప్రమాదకరం’
‘‘అసలు ఒకరి ఓటీపీ మరొకరు అడగడం నేరం, అలా జరిగినప్పుడు మనం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కానీ, పరవాడ సంతలో జరిగిన ఘటనలో పోలీసులే ఓటీపీ అడగటం కరెక్ట్ కాదు’’ అని ఐటీ కన్సెల్టెంట్, యాప్స్ రూపకర్త పీలా రామకృష్ణ బీబీసీతో అన్నారు.
రామకృష్ణ ఏపీలోని అభయం, చాణుక్య, తెలంగాణాలోని టీఎస్ కాప్ వంటి యాప్‌లతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన పోలీసు శాఖలకు కూడా యాప్స్ రూపొందించారు.
“మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ వంటి యాప్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోమనడం, దగ్గరుండి ఇన్‌స్టాల్ చేయించడం వరకు బాగానే ఉంది. కానీ ఇష్టం లేకపోయినా చేసుకోమనడం, ఓటీపీ అడగటం, దానిని వారు నోట్ చేసుకోవడం సరైనది కాదు. ఓటీపీ ద్వారా ఆ యాప్‌లోకి ఎంటరై, ఆ తర్వాత ఫోన్‌ని హ్యక్ చేసే ప్రమాదం ఉంది. దీంతో ఫోన్ యాక్సెస్ మూడో వ్యక్తి చేతిలోకి వెళ్లిపోయే అవకాశం ఉంది” అని రామకృష్ణ బీబీసీకి తెలిపారు.
“ముఖ్యంగా దిశ లాంటి మరో యాప్‌ని ఎవరైనా ఆగంతకులు తయారు చేసి, దిశ యాప్ ఇన్‌స్టాలేషన్ పేరుతో ఫోన్‌ని హ్యక్ చేసే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇన్‌స్టాలేషన్‌పై అవగాహన కల్పించాలి కానీ, బలవంతంగా యాప్స్ డౌన్‌లోడ్ చేయించడం, ఇన్‌స్టాల్ చేయించడం, ఓటీపీలు ఆడగటం నేరం కిందే లెక్క.’’ అన్నారాయన.
‘‘పరవాడ సంతలో బాధితుడు ఆర్మీకి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఎవరు? ఐడీ కార్డు చూపించాలని అడిగారు. అదే ఈ యాప్స్, టెక్నాలజీపై అవగాహన లేనివారు అడగలేరు, పైగా పోలీసు యూనిఫాంలో ఉండటంతో భయపడతారు కూడా” అని రామకృష్ణ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
దిశ యాప్ పేరుతో దందా నడుస్తోంది: నారా లోకేష్
ఈ దిశ యాప్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపణలు చేశారు.
ఏపీలో దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.
పురుషుల మొబైల్స్‌లో దిశ యాప్‌ను బలవంతంగా డౌన్‌లోడ్ చేయించడంపై నారా లోకేశ్ సందేహాలు వ్యక్తం చేశారు.
యాప్‌ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించారు. సైనికుడు సయ్యద్ అలీముల్లాపై పోలీసులు గుండాల్లా మారి దాడి చేశారని ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ట్వీట్ చేశారు.
ఈ ఏడాది మేలో ఏపీ హోం శాఖపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. దిశ యాప్ మహిళలకు చాలా బాగా ఉపయోగపడుతుందని, ఈ యాప్‌పై మరోసారి డ్రైవ్ నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రతి ఇంట్లో కూడా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలని సూచించారు. దిశ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ-తెలంగాణ: NMC కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఎంబీబీఎస్ సీట్లు తగ్గిపోతాయా?
- ‘మేం వెనకడుగు వేయం’ - బీబీసీతో మణిపుర్ వైరల్ వీడియోలోని బాధిత మహిళలు
- మ్యాక్స్‌వెల్: భరించలేని నొప్పితో పరుగెత్తలేకపోతున్నా అతడికి 'రన్నర్' ఎందుకు రాలేదు?
- దక్షిణ కొరియా నల్లుల దండయాత్ర.. ఆస్పత్రులకు జనం పరుగులు
- పవన్ కల్యాణ్: ప్రధాని నరేంద్ర మోదీ సభలో జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడారంటే....
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














