ఆంధ్రప్రదేశ్: మద్యం అమ్మకాల పేరుతో ప్రభుత్వం కొందరికి మేలు చేస్తోందా, రూ. వేల కోట్ల అక్రమాలు జరుగుతున్నాయా?

ఆంధ్రప్రదేశ్ మద్యం

ఫొటో సోర్స్, BBC/APCMO

    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విధానం చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ మద్యం విధానం మీద తీవ్రమైన విమర్శలు వస్తుండగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఈ వివాదం కొనసాగుతుండగానే గత ప్రభుత్వ పాలసీలు తప్పంటూ ప్రస్తుతం ప్రభుత్వం కేసు పెట్టింది. తెలుగుదేశం పార్టీ హయంలో నిబంధనలకు విరుద్ధంగా కొన్ని డిస్టిలరీలకు మేలు చేశారంటూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కేసు నమోదైంది.

ఆయనతో పాటుగా నాటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కమిషనర్ నరేష్‌ని కూడా దోషులుగా పేర్కొంది సీఐడీ.

మద్యం సరఫరా చేసే డిస్టిలరీలకు లైసెన్సుల కేటాయింపులోనూ, వాటి నుంచి వివిధ బ్రాండ్ల మద్యం కొనుగోళ్లలోనూ అవకతవకలకు పాల్పడ్డారన్నది సీఐడీ అభియోగం.

అయితే, దాదాపుగా అవే డిస్టలరీల నుంచి గడిచిన నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం కూడా మద్యం కొనుగోలు చేస్తుండటం విశేషం. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్లకు గానీ, కంపెనీలకు కూడా అనుమతివ్వలేదని ఇప్పటి వరకూ ప్రభుత్వం వాదిస్తోంది.

మరోవైపు ప్రభుత్వానికి మద్యం ద్వారా లభించిన ఆదాయం రూ. లక్ష కోట్లు దాటినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సగటున ఏడాదికి రూ. 25వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తున్నట్టు లెక్కలు చూపుతున్నాయి.

రోజుకి సగటున మద్యం ద్వారా ప్రభుత్వానికి లభిస్తున్న ఆదాయం 2019 నాటికి రూ. 50 కోట్ల వరకు ఉండగా ప్రస్తుతం అది రూ. 80కోట్లను దాటింది. నెలకు రెండన్నర వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

మద్యం కొనుగోళ్ల నుంచి వాటిని సరఫరా చేసిన డిస్టిలరీలు, బ్రాండ్లు, ఆన్‌లైన్ పేమెంట్స్ లేకపోవడం వంటి అంశాలను అన్ని విపక్షాలు ప్రస్తావిస్తున్నాయి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, AFP

మద్యం అమ్మకాలు తగ్గినా...

రాష్ట్రంలో 2024 ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం అమలు చేస్తామని వైఎస్సార్సీపీ ప్రకటించింది. మేనిఫెస్టోతో పాటుగా స్వయంగా వై.ఎస్. జగన్ కూడా పలు సభల్లో ప్రస్తావించారు.

కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం అమలుకి ప్రయత్నించిన దాఖలాలు లేవు. మద్యం దుకాణాలు మాత్రం ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా పేరున్న కొన్ని రకాల లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి లేకుండా చేశారు. కొత్త కొత్త, చిత్రమైన పేర్లతో రకరకాల బ్రాండ్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ధరలు ఒకేసారి రెండు, మూడు రెట్లు కూడా పెంచారు.

వాటికి తోడుగా బెల్ట్ షాపులు మూసివేస్తున్నట్టు తొలినాళ్లలో డ్రైవ్ నిర్వహించారు. కానీ, ఆ తర్వాత క్రమంగా మళ్లీ అనేక చోట్ల బెల్ట్ షాపుల మాదిరిగా మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి.

మద్యం ధర పెంచడం, దుకాణాల సంఖ్య తగ్గించడం ద్వారా మద్యం అమ్మకాలు నియంత్రించామని ప్రభుత్వం చెబుతోంది. దానికి తగ్గట్టుగా గత నాలుగేళ్లలో జరిగిన విక్రయాలు చూపుతోంది.

అధికారిక లెక్కల ప్రకారం 2018-19లో బీరు అమ్మకాలు 2.77 కోట్ల కేసులు ఉంటే, 2022-23 నాటికి అది 1.16 కోట్ల కేసులకు పడిపోయింది. ఐఎంఎల్ అమ్మకాలు కూడా 3.84 కోట్ల కేసుల నుంచి 3.35 కోట్ల కేసులకు తగ్గింది.

బాటిళ్ల వారీ సంఖ్య తగ్గినప్పటికీ గత ప్రభుత్వ హయంలో అంటే 2014-19 మధ్య రూ. 75,284 కోట్ల ఆదాయం లభించగా, జగన్ పాలనలో మద్యం అమ్మకాల ద్వారా లభించే ఆదాయం ఇప్పటికే రూ. 1.10 లక్షల కోట్లకు చేరుతోంది.

2018-19 నాటికి ఏడాదికి రూ. 20,128 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2022-23లో రూ. 28,113 కోట్లకు పెరిగింది. అంటే అమ్మకాలు తగ్గినా ఆదాయం పెరిగిందన్నది స్పష్టమవుతోంది. దానికి ప్రధాన కారణం పెరిగిన మద్యం ధరలేనని అర్థమవుతోంది.

వైన్‌షాపు

నాణ్యతపై అనుమానాలు..

మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగినప్పటికీ అక్రమార్జన అంతకుమించి ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఈడీ, సీఐడీ వంటివి జోక్యం చేసుకోవాలని పురందేశ్వరి కూడా కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానం కారణంగా అనేక మద్యం బ్రాండ్లు ఏపీ నుంచి మాయమయ్యాయి. మద్యం ప్రియుల్లో బాగా డిమాండ్ ఉండే బ్రాండ్లు సైతం అందుబాటులో లేవు. వాటి స్థానంలో వచ్చిన ప్రెసిడెంట్ మెడల్ సహా వివిధ బ్రాండ్ల చుట్టూ సోషల్ మీడియాలో సెటైర్లు చాలానే ఉన్నాయి.

బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేసి, నాసిరకం మద్యం విక్రయాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకున్నారన్నది పురందేశ్వరిదే కాదు, చాలామంది విమర్శకులు చేస్తున్న వాదన. అందుకు అనుగుణంగా మద్యం వినియోగదారుల మరణాలు, ఇతర ఆరోగ్య సమస్యలు వంటివి పెరుగుతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. సామాన్యుల్లో కూడా మద్యం నాణ్యత మీద చాలా సందేహాలు వినిపిస్తున్నాయి.

"రేటు పెంచారు. గతంలో రూ. 90 కి వచ్చేది, ఇప్పుడు దాని కోసం రూ. 210 పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ, మందు తాగిన తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. మా వాళ్లలోనే చాలా మంది పనిచేయలేని పరిస్థితికి వచ్చేశారు. కరోనా తర్వాత మందు తాగే వాళ్లలో సమస్యలు పెరిగాయని డాక్టర్లు అంటున్నారు. కానీ, మా వాళ్లంతా మందు బాగోలేదనే అనుకుంటున్నాం. మాకైతే తేడాగానే ఉంటోంది" అంటూ తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గూడ్స్ షెడ్ వర్కర్ ఆర్. రమేష్ అన్నారు.

ఆసుపత్రి పాలవుతున్న మద్యం వినియోగదారుల సంఖ్య కూడా గతం కన్నా పెరిగిందని గుంటూరు జీజీహెచ్ వైద్యులు చెబుతున్నారు. అయితే, అందుకు మద్యం నాణ్యత మాత్రమే కారణమని తాము చెప్పలేమంటూ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్ పీవీ రావు అభిప్రాయపడ్డారు. దాని మీద పరిశోధన జరగాల్సి ఉందంటున్నారు.

ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు శాంపిళ్లను పరీక్షిస్తున్నామని, గతంలో పోలిస్తే 0.29 శాతం నుంచి 0.47 శాతం శాంపిళ్లను పరీక్షించినట్టు లెక్కలు చెబుతోంది.

మద్యం దుకాణం

కొద్ది కంపెనీల నుంచే కోట్ల లావాదేవీలు..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్ ) దగ్గర రిజిస్టర్ అయిన వివిధ డిస్టిలరీల నుంచి మద్యం సేకరిస్తారు. ప్రస్తుతం ప్రభుత్వ హయంలో నడుస్తున్న రిటైల్ షాపుల ద్వారా మద్యం విక్రయిస్తున్నారు.

డిస్టిలరీల నుంచి మద్యం సేకరణ విషయంలో కొన్ని సంస్థలకే ప్రాధాన్యం దక్కుతోందన్నది విపక్షాల వాదన. చంద్రబాబు పాలనలో అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి చెందిన ఎస్పీవై ఆగ్రో వంటి సంస్థలకు ప్రాధాన్యతనిచ్చారని ఇటీవల సీఐడీ కేసులో పేర్కొన్నారు. ఇప్పటికీ అదే పంథా కొనసాగుతుండటం ఆసక్తికరం. కేవలం 16 కంపెనీల నుంచి 74 శాతం మద్యం సేకరించడం అందుకు ఆధారంగా విపక్షాలు చూపుతున్నాయి.

2019 లో అంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన అదాన్ డిస్టలరీస్‌కి ప్రాధాన్యత దక్కుతుండడాన్ని ప్రశ్నిస్తున్నాయి. సొంతంగా డిస్టలరీ కంపెనీ లేని అదాన్ సంస్థ, చింతకాయల రాజేష్ అనే వ్యక్తి పేరుతో ఉన్న విశాఖ డిస్టలరీస్, పుట్టా మహేష్ పేరుతో ఉన్న పీఎంకే డిస్టలరీస్‌కి సబ్ లీజుదారుడిగా ఉంది.

సబ్ లీజుదారుడిగా ఉన్న అదాన్ సంస్థకు అధికంగా లబ్ది చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ.

వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత తెరమీదకు వచ్చిన అదాన్ డిస్టలరీస్ సంస్థ నుంచే ఏపీఎస్బీసీఎల్ సంస్థ ఎక్కువగా మద్యం కొనుగోలు చేస్తున్న అంశంతో పాటుగా ఆ సంస్థకు సొంతంగా డిస్టిలరీస్ కూడా లేవన్నది వాస్తవమేనని బీబీసీ పరిశీలనలో తేలింది.

అధికారాన్ని ఉపయోగించుకుని విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్ వంటి సంస్థలను చేజక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అదాన్ పేరుతో సేకరిస్తున్న మద్యం వెనుక ఆ రెండు సంస్థల పాత్రపై వివరాల కోసం బీబీసీ ప్రయత్నించింది.

మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు బంధువులుగా చెబుతున్న ఆ రెండు సంస్థల ప్రతినిధులు దీనిపై స్పందించేందుకు నిరాకరించారు.

అదాన్‌తో పాటుగా కొన్ని సంస్థల నుంచే అత్యధిక మద్యం కొనుగోలు జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం కూడా కాదనడం లేదు. పైగా సమయంలో గత ప్రభుత్వ హయంలో కూడా అదే రీతిలో మద్యం సేకరించిన విషయాన్నిప్రస్తావిస్తోంది.

డిజిటల్ లావాదేవీలు..

ఏపీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నప్పటికీ డిజిటల్ పేమెంట్స్ మాత్రం జరగడం లేదు. ఇటీవల పలు ఆరోపణల తర్వాత అక్కడక్కడా కొన్ని క్యూఆర్ కోడ్‌లతో కూడిన బోర్డులు పెట్టినప్పటికీ అనేక చోట్ల అవి పనిచేయడం లేదు. కొన్ని చోట్ల నామమాత్రంగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నట్టు బీబీసీ పరిశీలనలో అర్థమైంది.

ప్రభుత్వం డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయని అంటున్నా పరిశీలిస్తే తూతూ మంత్రం అని అర్థం అవుతుంది. డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఈ గందరగోళం ఎందుకోసం ఎవరికోసం అనేది అర్థం కాని వ్యవహారం. ప్రభుత్వ దాటేస్తున్న వ్యవహారం కూడా.

చిరు వ్యాపారాలలో సైతం ఆన్‌లైన్ పేమెంట్స్‌ని అంగీకరిస్తున్న దశలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు స్వీకరణ వెనుక పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందన్నది మరో ఆరోపణ.

రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించే వారున్నారని, వారంతా రోజుకి రూ. 200 కనీసంగా ఖర్చు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా రూ. 50వేల కోట్ల ఆదాయం రావాల్సి ఉందని, కానీ అందులో సగమే అధికారికంగా జమ చేస్తూ, పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వాదిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలకు అంగీకరించకపోవడానికి అసలు కారణమిదే అన్నది ఆమె ఆరోపణ.

ప్రభుత్వం మాత్రం తాము డిజిటల్ పేమెంట్స్ కోసం ఖాతాదారులకు అవకాశం ఇస్తున్నట్టు చెబుతోంది.

ప్రతీ బాటిల్ అమ్మకం అకౌంట్ అవుతోందని, రోజువారీ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం షాపుల్లో సిబ్బంది ద్వారా ఎస్బీఐలో జమ చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. తమది బెస్ట్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీస్‌గా అవార్డ్ కూడా వచ్చినట్టు వివరిస్తోంది.

కానీ, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వాదనకు భిన్నమైన పరిస్థితి ఉన్నట్టు , డిజిటల్ పేమెంట్స్ నామమాత్రమేనని అర్థమవుతోంది.

మద్యం అమ్మకాలు

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో చాలాకాలంగా ఇసుక, మద్యం అనేవి పాలకపక్ష నేతల అక్రమార్జనకు ప్రధాన వనరులుగా మారిన అంశం బహిరంగ సత్యం. ప్రస్తుతం ఏపీలో ఈ వ్యవహారాలు నేరుగా ప్రభుత్వ హయంలోనే ఉన్నట్టు అధికారికంగా చెబుతున్నారు. కానీ ప్రజలకు మాత్రం నామమాత్రపు ప్రయోజనం కూడా దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

ప్రైవేటు వ్యాపారుల దగ్గర కొనుగోలు చేయాల్సిన దాని కన్నా తక్కువ ధరకు దక్కాల్సిన ఇసుక, మద్యం కూడా ఇప్పుడు అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభాల కోసం ప్రజల నుంచి భారీగా గుంజుకుంటున్నారని ప్రభుత్వ పరం చేసిన తర్వాత అంతకు మించి జనం చెల్లించాల్సి రావడం ఆశ్చర్యంగా మారింది.

అదే సమయంలో కొన్ని కంపెనీల నుంచే పెద్ద మొత్తం మద్యం కొనుగోలు చేయడం, పైగా ఆయా కంపెనీలకు సొంతంగా తయారీ యూనిట్లు లేవనే అంశం కీలకంగా మారింది. ప్రధాన బ్రాండ్లను దూరం చేసేసి కొత్త కొత్త పేర్లతో ఉన్న మద్యం అమ్మకాలు సాగించడం కూడా సందేహాలకు కారణమవుతోంది.

అయినా ప్రభుత్వం కూడా ఏ కంపెనీ నుంచి ఎంత మొత్తం, ఏ ఏ బ్రాండ్లను సేకరించారనే అంశాన్ని పారదర్శకంగా వెల్లడించడానికి సిద్ధంగా లేదు. కనీసం ఆర్టీఐ ద్వారా అడిగినా సమాధానం లేదన్నది విపక్షాల విమర్శ.

ఈ అంశాలపై స్పందించాలని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామిని బీబీసీ కోరగా, ఆయన నిరాకరించారు. రాజకీయ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

వీడియో క్యాప్షన్, ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)