ఏపీ-తెలంగాణ: NMC కొత్త నిబంధనలు అమలులోకి వస్తే ఎంబీబీఎస్ సీట్లు తగ్గిపోతాయా?

మెడికల్ సీట్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెడికల్ విద్యార్ధినులు (ఫైల్ ఫోటో)
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై జనాభా ప్రాతిపదికన మెడికల్ కాలేజీలకు అనుమతిస్తామని వెల్లడించింది. 10 లక్షల మందికి 100 మెడికల్ సీట్ల చొప్పున ఉండేలా క్రమబద్ధీకరణ చేస్తామని తెలిపింది.

ఈ మార్గదర్శకాలు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీల పరిస్థితిని డోలాయమానంలోకి నెట్టాయి. కొత్త కాలేజీల కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి కోరుతోంది. అందుకు తగ్గట్టుగా నిర్మాణాలను ప్రారంభించింది.

పాడేరు, పిడుగురాళ్ల వంటి చోట్ల మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వమే నిధులు కూడా ఇచ్చింది.

తెలంగాణలో సైతం ఇప్పటికే ప్రతీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఎంబీబీఎస్ సీట్లలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన మెడికల్ సీట్లు అంటే ఉన్న కాలేజీల పరిస్థితి ఏంటి? కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలనుకుంటున్న వారి పరిస్థితి ఏమవుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల మందికి 100కు పైగా సీట్లు ఉన్నందున అదనంగా ఉన్న సీట్లను తగ్గిస్తారా? లేదా? అనే విషయం మీద స్పష్టత లేదు.

ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఎంసీ ఆదేశాలను తప్పుబట్టింది. రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ వ్యవహారం ఎటు మళ్లుతుందోననే విషయంపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి.

ఎంబీబీఎస్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పటి వరకు ఉన్న విధానం ఏంటి?

2014 వరకు దేశంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే 2023 నాటికి అవి దాదాపు రెట్టింపు అయ్యాయి. అప్పట్లో 51,348 సీట్లు ఉండగా, 2023-24 నాటికి 1,07,948 కి పెరిగాయి. దాదాపు 110 శాతం పెరుగుదల ఉంది.

పీజీ సీట్లు సైతం 2014లో 31,185 నుంచి 2023-24 విద్యాసంవత్సరానికి 67,802 లకు చేరుకున్నాయి.

దేశంలోని ప్రతీ జిల్లాకు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ ఉండాలనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తమ విధానంగా తీసుకుంది. ఆ ప్రాతిపదికన అనేక చోట్ల కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి.

తెలంగాణాలో కూడా రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల విభజన జరగడంతో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్క 2023-24 విద్యా సంవత్సరంలోనే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు మొదలయ్యాయి. దాంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య కూడా 2,950 నుంచి 8,540కి చేరుకుంది.

ఏపీలో కూడా రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా నాలుగు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాగా, 2023-24 నుంచి అయిదు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో క్లాసులు మొదలయ్యాయి. దాంతో 3,234 నుంచి 6,435కు ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయి.

ఎంబీబీఎస్

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా

తెలంగాణలో పెరిగిన మెడికల్ సీట్లను ఏకంగా ‘వైట్ కోట్ విప్లవం’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో కూడా రాబోయే రెండు విద్యాసంవత్సరాల్లో మరో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధమవుతున్నట్టు ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

ఏపీ, తెలంగాణాతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య బాగా పెరిగింది. అందులో తమిళనాడు, కర్ణాటకతో పాటుగా మహారాష్ట్ర ముందంజలో ఉన్నాయి. పెరిగిన సీట్లలో అధిక భాగం కూడా ఈ రాష్ట్రాల్లోనే ఉంటుంది.

నీట్ 2023 పరీక్షల్లో తెలంగాణలో ఓపెన్ కేటగిరీ సీటు కటాఫ్ 451 మార్కులు ఉండగా, అదే ఉత్తరాది రాష్ట్రాల్లో 620 మార్కులు వచ్చినా సీట్లు రాని రాష్ట్రాలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో దక్షిణ, ఉత్తర భారత రాష్ట్రాల మధ్య మెడికల్ విద్యలో చాలా వైరుధ్యం ఏర్పడుతోంది. ఎన్ఎంసీ ఆధ్వర్యంలో కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు జనాభా ప్రాతిపదికన కొత్త సీట్లకు అనుమతినివ్వాలనే అంశం ముందుకొచ్చింది.

ఎంబీబీఎస్
ఫొటో క్యాప్షన్, నిర్మాణంలో ఉన్న పిడుగురాళ్ల మెడికల్ కాలేజ్

ఉత్తరాదిలో తక్కువ సీట్లు

ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన మెడికల్ సీట్ల రేషియో ఎక్కువగా ఉంది.

10 లక్షల మందికి 100 మెడికల్ సీట్ల లెక్క చూస్తే తెలంగాణలో ఈ పరిమితికి మించి 95 సీట్లు అదనంగా ఉన్నాయి. అంటే, దాదాపు రెట్టింపు సంఖ్యలో మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

కర్ణాటకలో 63, తమిళనాడు 46, ఆంధ్రప్రదేశ్‌లో 6 సీట్లు చొప్పున ఎక్కువగా ఉన్నట్టు అధికారిక డేటా చెబుతోంది.

అదే సమయంలో బిహార్‌లో 80, ఉత్తరప్రదేశ్‌లో 61, మధ్యప్రదేశ్‌లో 52, పశ్చిమ బెంగాల్ లో 51 చొప్పున తక్కువగా ఉన్నట్లు ఎన్ఎంసీ పేర్కొంది.

ఈ అసమానతలను అదుపు చేసేందుకు ఎన్‌ఎంసీ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఎంబీబీఎస్
ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది ప్రారంభమైన మచిలీపట్నం మెడికల్ కాలేజ్

రాజ్యాంగ విరుద్ధమంటున్న తమిళనాడు

ఎన్ఎంసీ కొత్త మార్గదర్శకాలు అమలైతే దక్షిణ భారతదేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలకు కొత్తగా మెడికల్ సీట్ల పెంపుదలకి అవకాశం ఉండదు. దాని వల్ల కొత్త కాలేజీలకు అనుమతి కోసం చేసే యత్నాలకు అడ్డుకట్ట పడుతుంది.

ఏపీలో ఇప్పటికే పులివెందుల, ఆదోని, మదనపల్లె, పాడేరు, మార్కాపురం మెడికల్ కాలేజీల అనుమతి కోసం ఎన్ఎంసీకి దరఖాస్తు చేశారు. 2024-25 విద్యాసంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభించేందుకు అనుమతించాలంటూ రూ. 84 లక్షల దరఖాస్తు రుసుము కూడా చెల్లించారు.

కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి దరఖాస్తు వెళ్లిన తర్వాత ఎన్ఎంసీ కొత్త నిబంధన తీసుకురావడంతో వ్యవహారం ఊగిసలాటలో పడింది.

ఇప్పటికే ఈ వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. ఎన్ఎంసీ మార్గదర్శకాలను ఆయన తప్పుబట్టారు. రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొన్నారు.

కొత్త విద్యాసంస్థల ఏర్పాటుని అడ్డుకోవడం రాజ్యాంగంలోని అర్టికల్ 19(1)(జీ) కి భిన్నంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని కూడా ఆయన కోరారు.

ఎన్ఎంసీ నిబంధన ప్రకారం తమిళనాడులో 7.68 కోట్ల జనాభాకి గానూ 7,685 ఎంబీబీఎస్ సీట్లు ఉండాలి. కానీ, ఈ ఏడాది ఆ రాష్ట్రంలో 11,600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుని అడ్డుకోవద్దంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.

ఎంబీబీఎస్

ఏపీ, తెలంగాణ కూడా స్పందించాలి

ఎన్ఎంసీ నిబంధన, కేంద్ర ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ప్రతీ జిల్లాలోనూ కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా అందుబాటులో ఉండాలనే విధానాన్ని కేంద్రం గడిచిన కొన్నేళ్లుగా అనుసరిస్తోంది. ఇప్పుడు ఏపీలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేని జిల్లాలు 7 వరకు ఉన్నాయి.

అందులో పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, ప్రకాశం, పల్నాడు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి వంటి జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు. ఆయా జిల్లాల్లో కనీసం ఒక్క మెడికల్ కాలేజీకైనా అనుమతి వస్తుందన్న అంచనాతో ఏపీ ప్రభుత్వం కొత్త కాలేజీల నిర్మాణానికి పూనుకుంది.

కానీ, తాజాగా ఎన్ఎంసీ మార్గదర్శకాలు ఈ విధానానికి విరుద్ధంగా ఉండడంతో స్పష్టత కోసం ప్రయత్నించాలనే అభిప్రాయం బలపడుతోంది.

"కేంద్ర ప్రభుత్వ వైఖరికి భిన్నంగా ఎన్ఎంసీ గైడ్‌లైన్స్ ఉండటం విడ్డూరం, వాటిని సరి చేయాలి. కొత్తగా మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావడాన్ని ఆహ్వానించాలి. దేశంలో జనాభా, డాక్టర్ల రేషియో డబ్ల్యూహెచ్ఓ అంచనా మేరకు ఉన్నప్పటికీ పెరుగుతున్న అవసరాలకు అది సరిపోదు. కొత్త వైద్యులను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మెడికల్ సీట్లు తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వడంలో తప్పులేదు గానీ జనాభా నియంత్రణ జరిగిన రాష్ట్రాల్లో కొత్త కాలేజీలు, సీట్లకు అనుమతివ్వబోమని చెప్పడం తగదు" అంటూ మాజీ ఎంపీ డాక్టర్ ఎం. బాబూరావు అన్నారు.

గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు నేటికీ అరకొరగానే ఉన్నాయి. అక్కడ సిబ్బందిని పెంచేందుకు అనుగుణంగా కొత్త వైద్యులను తయారుచేసుకోవడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎంబీబీఎస్

సానుకూల స్పందన వస్తుంది

ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెడికల్ సీట్ల ప్రకారం 10 లక్షల జనాభాకి తెలంగాణాలో 224, కర్ణాటకలో 173, తమిళనాడులో 151 చొప్పున సీట్లున్నాయి.

అదే బిహార్‌లో 21, ఉత్తరప్రదేశ్‌లో 41 మాత్రమే ఉన్నాయి.

ఈ అసమానతలు తొలగించాల్సి ఉన్నప్పటికీ మెడికల్ విద్య విస్తృతంగా అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లో కొత్త కాలేజీలను అడ్డుకోకూడదని రంగరాయ మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు.

"ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ ఆలిండియా కోటాలో భర్తీ చేసే 15 శాతం సీట్లలో యూపీ, బిహార్ విద్యార్థులే ఎక్కువగా ఉంటారు. తెలంగాణ, ఏపీ కాలేజీల్లో కూడా హిందీ ప్రాంత విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. అయినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచాల్సి ఉంది. అందుకు ప్రయత్నించాలి. అదే సమయంలో దక్షిణాన సీట్లకు పరిమితి విధించే ప్రయత్నం అసంబద్ధం. కాబట్టి ఎన్ఎంసీ నిబంధన సవరించే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కొత్త కాలేజీలకు అనుమతి విషయంలో ఢోకా ఉండదనే నమ్ముతున్నా" అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీ ప్రభుత్వంతో పాటుగా కేరళ సహా ఇతర రాష్ట్రాలు కూడా కొత్త కాలేజీలకు అనుమతి కోరుతున్నాయని, వాటన్నింటికీ సానుకూల స్పందన వస్తుందనే నమ్ముతున్నానంటూ డాక్టర్ మల్లికార్జున రావు బీబీసీతో అన్నారు.

ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంలోని సంబంధిత అధికారులను స్పందన కోరగా, కేంద్రం నుంచి తమకు సమాచారం వచ్చిన తర్వాత స్పందిస్తామని బీబీసీకి తెలిపారు.

వీడియో క్యాప్షన్, కాంపిటిటివ్ ఎగ్జామ్స్‌లో టాప్ రావాలంటే ఏం చేయాలి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)