ఉల్లి ధరలు ఎందుకు పెరిగాయి? ఇంకెంత కాలం ఇలా ఉంటాయి?

జమున
ఫొటో క్యాప్షన్, ఉల్లి ధరను స్థిరంగా ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు.
    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

టమోటా ధర సామాన్యులకు మొన్నటి వరకు చుక్కలు చూపిస్తే, ఇప్పుడు ఆ వంతు నాది అంటోంది ఉల్లి.

టమోటా ధర పెరిగినా ఎలాగోలా దాని వాడకం తగ్గించుకున్నవారు ఇప్పుడు ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.

ఉల్లి రేట్లు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయని హోటళ్ల నిర్వాహకులు అంటున్నారు. రెండు నెలలకు ముందు రూ. 20 లోపు ఉన్న ధర ఇప్పుడు రూ. 70-రూ.80‌కి వచ్చిందని చెబుతున్నారు.

తిరుపతిలో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు రెండు వేల హోటళ్లు ఉన్నాయి. వీటితోపాటు తిరుపతిలో నివసించే ప్రజల అవసరాలకు, హోటళ్లకు రోజుకు మూడు లారీలు అంటే 60 టన్నుల ఉల్లిపాయలు అమ్ముడవుతాయని తిరుపతి హోల్ సేల్ డీలర్లు అంటున్నారు.

పెరిగిన ఉల్లి ధరలు హోటల్ యజమానులకు ఎంత భారంగా మారాయో తిరుపతిలో ఓ చిన్న హోటల్ నిర్వహిస్తున్న యజమాని చంద్రమోహన్ బీబీసీకి వివరించారు.

ఉల్లి

‘ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించాలి’

‘‘గతంలో ఒకసారి ధర రూ. 200 వరకు వెళ్ళింది. అప్పుడు బాగా ఇబ్బంది పడ్డాం. ఈసారి రూ. 100 దాటేలా ఉంది. ఇలాగే ఉంటే హోటల్ వాళ్లు, సాధారణ పౌరులు ఉల్లి వాడటం మానేసే పరిస్థితి వస్తుంది. రేటు పెరిగినప్పుడు ఉన్న బడ్జెట్‌లోనే క్వాంటిటీ తగ్గించి వాడతాం. కానీ వంటల్లో ఉల్లిని వాడాల్సిందే’’ అని చంద్రమోహన్ చెప్పారు.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు.

‘‘ఉల్లి సరఫరా తగినంతగా లేదని స్థానిక మార్కెట్‌లో చెబుతున్నారు. సరఫరా సంగతి పక్కనబెడితే, అసలు ఉల్లి తగినంత ఉత్పత్తి అవుతోందా? ఉల్లి కొరతకు కారణాలేంటి? అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. కోల్డ్ స్టోరేజ్‌లను సరిగ్గా నిర్వహిస్తే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రావు. ధరల పెరుగుదలకు ఎగుమతులు కూడా కారణమని మేం అనుకొంటున్నాం’’ అని అభిప్రాయపడ్డారు.

ఉల్లి
ఫొటో క్యాప్షన్, ఉల్లి విషయంలో ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించాలని హోటల్ యజమాని చంద్రమోహన్ కోరుతున్నారు.

సెకండ్ క్వాలిటీ ఉల్లి ధర కూడా మండిపోతోంది

తిరుపతి రైతు మార్కెట్‌లో తమకు రెండో, మూడో శ్రేణి ఉల్లి దొరుకుతుందని, వాటి ధరలు కూడా మండిపోతుంటే ఇక కూరల్లో ఉల్లి వాడకం తగ్గించుకోవాల్సిందేనని జమున అనే మహిళ బీబీసీతో అన్నారు. ఉల్లి ధరను స్థిరంగా ఉంచాలని ఆమె కోరుతున్నారు.

‘‘సెకండ్ క్వాలిటీ ఉల్లి రూ.70, రూ.80 ఉంది. ప్రజల వద్దకు ఫస్ట్ క్వాలిటీ ఉల్లి రావట్లేదు. ధర పెరగడం వల్ల మధ్యతరగతి, పేదవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఉల్లికి కచ్చితంగా ఒక ధరను నిర్ణయిస్తే బాగుంటుంది’’ అని జమున చెప్పారు.

గతంలో నష్టాలు వచ్చాయని రైతులు పంట తగ్గించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని వ్యాపారులు చెబుతున్నారు. మరో నెల, రెండు నెలల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు.

ఉల్లి
ఫొటో క్యాప్షన్, తిరుపతిలోని కేవీ ట్రేడర్స్ యజమాని ఖాసిం

సాగును తగ్గించేశారు: వ్యాపారి

తిరుపతిలోని కేవీ ట్రేడర్స్ యజమాని ఖాసిం కుటుంబం 30 ఏళ్ల నుంచి ఉల్లి హోల్‌సేల్ వ్యాపారం చేస్తోంది.

‘‘రైతులు ఇప్పుడు అరటి, లేదా వేరే పంటలు సాగు చేస్తూ ఉల్లి సాగును తగ్గించేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంతో పోలిస్తే 30% విస్తీర్ణంలోనే ఇప్పుడు ఉల్లి సాగు అయ్యింది. దానివల్ల స్థానికంగా ఉల్లి ఉత్పత్తి తక్కువ కావడంతో మహారాష్ట్ర ఉల్లికి డిమాండ్ పెరిగింది.

ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దీనివల్ల రేట్లు పెరిగాయి. ఈ రేట్లు మరో నెల వరకు ఉంటాయి. 40 రోజుల క్రితం రిటైల్‌గా ఉల్లి ధర రూ.20 నుంచి 30 వరకు ఉండేది. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఉల్లి ధర రూ.60, 70 వరకు పలుకుతోంది’’ అని ఖాసిం చెప్పారు.

ధర ఎక్కువైనప్పటికీ హోటళ్లు, ఇళ్లలో వంటలకు ఉల్లి తప్పనిసరి కావడంతో రోజుకు దాదాపు 60 టన్నుల ఉల్లి అమ్ముడవుతోందని ఆయన తెలిపారు.

అయ్యప్పన్
ఫొటో క్యాప్షన్, తిరుపతి రైతుబజార్ ఎస్టేట్ అధికారి అయ్యప్పన్

రైతులందరూ టమోటా పంట మీద దృష్టి పెట్టడం వల్లే ఉల్లి దిగుబడి తగ్గి ఈ పరిస్థితి తలెత్తిందని తిరుపతి రైతుబజార్ ఎస్టేట్ అధికారి అయ్యప్పన్ చెప్పారు.

2020లో కూడా ధరలు పెరిగిన సమయంలో సబ్సిడీపై రూ.50కే కిలో ఉల్లిపాయలు అందించామని అయ్యప్పన్ తెలిపారు.

ధరల పెరుగుదలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, మరింతగా పెరిగితే సబ్సిడీపై ఉల్లి సరఫరా చేయొచ్చని ఆయన అంచనా వేశారు.

నిల్వ చేసిన ఉల్లి పాడవ్వటం కూడా ఈ పరిస్థితికి ఒక కారణమని ఆయన చెప్పారు.

సాయిలక్ష్మి
ఫొటో క్యాప్షన్, సాయిలక్ష్మి

ఉల్లి వంటి నిత్యావసరాల ధరలు పెరిగినపుడు, వాటిని ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా సబ్సిడీకి అందిస్తే వినియోగదారులకు కాస్త ఉపశమనంగా ఉంటుందని సాయిలక్ష్మి అనే మహిళ అన్నారు.

నష్టం వచ్చిన పంట వైపు రైతులు మరోసారి మొగ్గు చూపట్లేదని, దీంతో దిగుబడి తగ్గిపోతుందని రైతు సంఘాలు చెబుతున్నాయి.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా పంటలు వేసేలా ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హేమలత సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)