‘మేం వెనకడుగు వేయం’ - బీబీసీతో మణిపుర్ వైరల్ వీడియోలోని బాధిత మహిళలు

మణిపుర్
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మణిపుర్‌లో ఆరు నెలల క్రితం, ఇద్దరు మహిళలను ఓ గుంపు వివస్త్రలను చేసి, నడిపించుకుంటూ తీసుకుని వెళ్లి, లైంగిక దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చి, దేశమంతా తీవ్రమైన చర్చకు తెరలేచింది.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత తొలిసారిగా బాధిత మహిళలు ముందుకొచ్చి బీబీసీతో మాట్లాడారు.

అజ్ఞాతంలో కొనసాగుతున్న తమ జీవితం, న్యాయం కోసం చేస్తున్న పోరాటం, వారి తెగకు ప్రత్యేకమైన పరిపాలనపై బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్యతో వారు మాట్లాడారు.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక హింసకు సంబంధించిన వివరణలు ఉన్నాయి.

నేను వారిని చూసినప్పుడు, వారి చూపులు నేలపైనే ఉన్నాయి.

తమ ముఖాలను పెద్ద నల్లటి ముసుగుల వెనకాల దాచుకుని కనిపించారు గ్లోరీ, మెర్సీ (ఇద్దరి పేర్లూ మార్చాం). వారి నుదుటిని స్కార్ఫ్‌తో కప్పేశారు.

ఆ ఇద్దరూ కుకీ మహిళలు తమ ముఖాలను ఎవరికీ చూపించాలని అనుకోవడం లేదు. కానీ, తమ గళం వినిపించాలని అనుకుంటున్నారు.

నాడు వారిని వివస్త్రలను చేసి, వీడియో తీసి, ఆన్‌లైన్‌లో పెట్టారు. నిమిషం వ్యవధి కన్నా తక్కువ ఉన్న ఆ వీడియో హృదయ విదారకమైనది. అందులో మెయితీ తెగకు చెందిన పురుషుల గుంపు మధ్య ఇద్దరు మహిళలు నగ్నంగా నడుస్తున్నారు. వారంతా ఆ మహిళలను అసభ్యంగా తాకుతూ వేధిస్తూ కనిపించారు. అనంతరం వారిని మైదానంలోకి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఇద్దరు మహిళలు కఠిన పరీక్షను ఎదుర్కొన్నారు.

“నన్నొక జంతువులా చూశారు’’ అంటూ గ్లోరీ ఆ ఘటనను గుర్తుచేసుకున్నారు.

“ఆ దారుణం తర్వాత జీవించడం చాలా కష్టంగా అనిపించింది. రెండు నెలల తర్వాత ఆ వీడియో వైరల్ అయ్యాక జీవితం మీద విరక్తి కలిగింది” అన్నారు.

“మీకు భారత సమాజపు పోకడ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇలాంటి ఘటన జరిగాక ఆ యువతిని సమాజం ఎలా చూస్తుందో మీకూ తెలుసు” అన్నారు మెర్సీ.

“ఎవరికైనా ఎదురుపడాలంటేనే కష్టంగా ఉంది. మా తెగవారిని కలుసుకోవాలన్నా కూడా ఇదే బాధ. నా పరువు పోయింది. నేను ఎప్పటికీ మునుపటిలా ఉండలేను” అన్నారామె.

ఆ వీడియో వారి వేదనను మరింత పెంచింది.

ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాక, అంతటా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అయితే, ఆ మహిళలు కుంగిపోయేలా చేశాయి.

మణిపుర్

‘గుంపును చూస్తే భయమేస్తోంది’

గ్లోరీ ఒక విద్యార్థి. తమపై దాడి జరగడానికి ముందు ఆమె కళాశాలకు వెళ్లి చదువుకునేవారు. మెర్సీ తన ఇద్దరు పిల్లలనూ చూసుకుంటూ, చర్చికి వెళ్తూ సాధారణ జీవితం గడిపేవారు.

కానీ, ఈ దాడి తరువాత వారు ఉన్న ఊరిని వదిలి వేరే ప్రాంతానికి వచ్చి, అజ్ఞాతంలో, నాలుగు గోడల మధ్యే జీవితాన్ని సాగించాల్సి వచ్చింది.

తన పిల్లలను రోజూ స్కూల్‌‌కు తీసుకెళ్లి, ఇంటికి తీసుకొచ్చే మెర్సీ, ఇప్పుడు ఆ నాలుగు గోడలకే పరిమితమయ్యారు.

“ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటే భయంగా అనిపిస్తోంది. ఇంతకు ముందు నేను ఉన్నట్లుగా మళ్లీ జీవితం సాగించలేనని అనిపిస్తోంది. ఎవరినైనా కలవాలంటే భయంగానూ, సిగ్గుగానూ అనిపిస్తోంది అన్నారు” మెర్సీ.

గ్లోరీ తన పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. “ఆ గాయాలు నన్ను ఇంకా వెంటాడుతున్నాయి. జనాల గుంపును చూస్తే భయం వేస్తోంది” అని చెప్పారు. కౌన్సిలింగ్ వల్ల కాస్త ఉపశమనం కలిగిందన్నారు.

కానీ, కోపం, అసహ్యాలు లోతుగా గాయపర్చిన వేళ, ఏ మహిళకూ తమలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వీరు తమ గొంతును వినిపించడానికి ముందుకు వచ్చారు.

మణిపుర్

మణిపుర్‌లో అసలేం జరిగింది?

  • మణిపుర్‌లోని 30 లక్షల మంది జనాభాలో సగానికి పైగా మెయితీ తెగవారే ఉన్నారు. 43% మంది కుకీలు, నాగాలు ఉన్నారు.
  • మెయితీ తెగను కూడా షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది మే నెలలో కుకీలు నిరసనలు చేపట్టడంతో ఇరు తెగల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. ఇలా చేయడం వల్ల మెయితీల ప్రాబల్యం మరింత పెరిగి, కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూములు కొని లేదా స్థిరపడేందుకు వారికి అనుమతి ఇచ్చినట్లు అవుతుందనేది కుకీల ఆందోళన.
  • మెయితీ తెగకు చెందిన ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ప్రభుత్వం కుకీల తిరుగుబాటును రెచ్చగొట్టేలా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి.
  • ఈ ఘర్షణల్లో రెండు వందల మందికి పైగా మరణించగా, వారిలో కుకీ తెగకు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారు. ఇరు తెగలకు చెందిన వేల మంది నిరాశ్రయులయ్యారు.
  • తమపై కూడా దాడులు జరిగాయని మెయితీ తెగకు చెందిన మహిళలు చెప్పారు. కానీ, ఒక్క ఫిర్యాదు మాత్రమే అందింది. ఈ దాడులకు గురయ్యామని అవమానంగా భావించి, ఎవరూ ముందుకు రాలేదు.
మణిపుర్

‘నిస్సహాయతను తల్చుకుంటే కోపంగా ఉంది’

ఆరు నెలల క్రితం మెయితీ, కుకీలు కలిసి చదువుకునే కాలేజీలోనే గ్లోరీ కూడా చదువుకుంది. ఎంతో మంది స్నేహితులు ఉన్న గ్లోరీ, ఇప్పుడు మెయితీ తెగకు చెందిన ఏ వ్యక్తినీ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు.

“నేనెప్పటికీ నా ఊరికి తిరిగి వెళ్లను. నేను అక్కడే పెరిగాను. అదే నా ఇల్లు. కానీ, అక్కడ ఉంటే మెయితీ తెగకు చెందిన ఇరుగుపొరుగుతో మాట్లాడాలి. నేను వారిని ఎప్పటికీ కలవాలని అనుకోవడం లేదు” అన్నారు గ్లోరీ.

తాను కూడా గ్లోరీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లుగా మెర్సీ తన చేతి సైగలతో మద్దతు తెలిపారు.

తమ గ్రామంపై దాడి జరిగిన సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు తీశారు. గ్లోరీ తండ్రి, సోదరుడిని మూక బయటకు లాగి, చంపేశారు.

“వారు నా కళ్ల ముందే చనిపోయారు” అని బాధగా అన్నారు గ్లోరీ.

తనను తాను కాపాడుకోవడానికి వారి మృతదేహాలను మైదానంలోనే వదిలి వచ్చేశానని, ఇప్పుడు వాటి కోసం తిరిగి వెళ్లలేనని కూడా అన్నారు.

మణిపుర్‌లో హింస మొదలైనప్పటి నుంచి మెయితీ, కుకీ-జోమి తెగల మధ్య ఎలాంటి సంబంధాలు లేవు. వాస్తవ సరిహద్దుల ఆధారంగా వారిని విభజించారు. పోలీసులు, ఆర్మీ, ఇరు తెగలకు చెందిన వాలంటీర్లతో చెక్ పాయింట్లను నిర్వహిస్తున్నారు.

“నా తండ్రి, సోదరుల మృతదేహాలు ఇప్పుడు ఏ మార్చురీలో ఉన్నాయో కూడా నాకు తెలీదు. నేను వెళ్లి వెతకలేను. ప్రభుత్వమే వారి మృతదేహాలను అప్పగించాలి” అన్నారు గ్లోరీ.

మెర్సీ భర్త ఆరు నెలల క్రితం తమ గ్రామంలోని ఇళ్లు, చర్చిలు తగలబడిన ఘటనలను గుర్తు చేసుకున్నారు.

“నేను స్థానిక పోలీసులకు కాల్ చేశాను. కానీ, వారు నాకు సాయం చేయలేనని చెప్పారు. పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి జరుగుతుందని వారు నాతో చెప్పారు” అంటూ ఆయన జరిగినది వివరించారు.

“ఆ తర్వాత నేను రోడ్డుపై పోలీస్ వాహనాన్ని చూశాను. కానీ వారేమీ స్పందించలేదు” అన్నారు.

“ఏమీ చేయలేని నా నిస్సహాయతను చూసి నాకు కోపం, బాధ కలుగుతున్నాయి. నేను ఇటు నా భార్యనీ అటు గ్రామస్థుల్లో ఎవరినీ రక్షించలేకపోయాను. ఇది తల్చుకుంటే నా గుండె బరువెక్కుతోంది” ఆయన అన్నారు.

“కొన్నిసార్లు జరిగిందంతా తలచుకుని కలత చెందుతాను. కోపం, దుఖంతో ఎవరినైనా చంపేయాలన్నంత కసిగా ఉంది” అన్నారు.

దాడులు జరిగిన రెండు వారాల తర్వాత, మెర్సీ భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ, జులైలో ఈ వీడియో వెలుగులోకి వచ్చేవరకు పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఈ ఘటనకు సంబంధించి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసు అధికారితోపాటు మరో నలుగురిని సస్పెండ్ చేసి, విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు బీబీసీకి తెలిపాయి.

మణిపుర్

ప్రధాని మోదీ స్పందన

వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా మణిపుర్ హింసపై స్పందించారు. అనంతరం ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేసి, సామూహిక అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు పోలీసులు.

వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో ఆన్‌లైన్ వేదికగా తమకు లభించిన మద్దతు, పలువురి సందేశాలు తమలో ఆత్మస్థైర్యాన్ని నింపాయని గ్లోరీ, మెర్సీ, ఆమె భర్త బీబీసీతో చెప్పారు.

“ఆ వీడియో లేకపోయుంటే, మేం చెప్పేది నిజమని ఎవరూ నమ్మేవారు కూడా కాదు. మా బాధను కూడా అర్థం చేసుకునేవారు కాదు అన్నారు” మెర్సీ భర్త.

తనకు పీడకలలు వస్తున్నాయని, భవిష్యత్తు గురించి తలచుకుంటే భయం వేస్తోందని, ముఖ్యంగా తన పిల్లల గురించి భయంగా ఉందని అన్నారు మెర్సీ.

“నా పిల్లల గురించి తలచుకుంటేనే భయంగా ఉంది. గుండె బరువెక్కుతోంది. వారికి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు. అంతా పోగొట్టుకున్నాం” అన్నారు.

తమ తెగకు ప్రత్యేక పరిపాలన అధికారాలను ఎందుకు కోరుకుంటున్నారో గ్లోరీ వివరిస్తూ, “మేం ప్రశాంతంగా, సురక్షితంగా జీవించడానికి ఇదే మాకున్న ఏకైక మార్గం” అన్నారు.

కుకీలు ఈ వివాదాస్పద డిమాండ్‌ను చాలాసార్లు వినిపించారు. కానీ, దీన్ని మెయితీ తెగ వ్యతిరేకించింది. ఇదే తెగకు చెందిన సీఎం ఈ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ సమైక్య మణిపుర్‌కు అంతా సహకరించాలని చాలాసార్లు చెప్పారు.

గ్లోరీ, మెర్సీ రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.

ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా ముఖ్యమంత్రి బీరేన్‌ను బీబీసీ కోరినా, ఆయన స్పందించలేదు. అయితే, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ- “నా పనుల్లో గానీ, నా గుండెల్లో గానీ పక్షపాతానికి చోటులేదు” అన్నారు.

మణిపుర్ మహిళలపై హింసకు సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఘటనపై స్పందించింది. ఈ జాతి ఘర్షణలకు సంబంధించి హింసాత్మక కేసులను ప్రభుత్వ దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని సూచించింది.

ఈ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.

వీడియో క్యాప్షన్, మణిపుర్ వైరల్ వీడియోలోని బాధిత మహిళ విషాద అనుభవాలు

‘నా సందేశం ఇదే’

తన భవిష్యత్తు గురించి గ్లోరీ ఆశాభావం వ్యక్తం చేస్తూ, మరో కాలేజీకి వెళ్లి తన చదువును తిరిగి కొనసాగించడం ద్వారా ఆర్మీ లేదా పోలీసు విభాగంలో చేరాలనే తన కలను నెరవేర్చుకుంటానని చెప్పారు.

నిష్పక్షపాతంగా, అందరి కోసం పని చేయాలనే తన ఆశయం బలపడిందని అన్నారు.

“నాకు జరిగినట్లుగా వేరే ఏ మహిళకూ, ఎలాంటి హానీ జరగకూడదని నేను మాట్లాడుతున్నాను. ఏదేమైనా సరే, నాకు న్యాయం జరగాలి” అన్నారు.

“ఆదివాసీ మహిళలమైన మేం వెనకడుగు వేయం, ఆత్మస్థైర్యంతో ఉంటాం. పోరాటం ఆపం” అంటూ మెర్సీ చెప్పారు.

మేం అక్కడి నుంచి వెళ్లబోతుండగా, మెర్సీ మమ్మల్ని ఆపి, తానొక సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

“నేను అన్ని వర్గాలకు చెందిన మాతృమూర్తులను ఒకటే కోరుతున్నాను. మీ పిల్లలకు ఒకటి మాత్రం నేర్పించండి. అదేంటంటే, ఏం జరిగినా సరే, మహిళల గౌరవానికి భంగం కలిగించవద్దని చెప్పండి” అన్నారు మెర్సీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)