బంగ్లాదేశ్ యుద్ధం 1971: పాకిస్తాన్‌తో యుద్ధం‌లో ఆ రాత్రి ఏం జరిగింది, భారత సైన్యం ఏం చేసింది?

బీఎస్ఎఫ్ జవాన్లు

ఫొటో సోర్స్, BSF ARCHIVES

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడినవారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో, అసలు 1971లో యుద్ధం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎలా విడిపోయింది? లాంటి ప్రశ్నలు చాలామందికి వచ్చి ఉంటాయి. కాబట్టి, ఆ యుద్ధానికి సంబంధించిన కీలకమైన ఘటనల గురించి కళ్లకు కట్టినట్టు వివరించే ఈ కథనం మరోసారి అందిస్తున్నాం.

వాట్సాప్ చానల్

ఆ రోజు ఏం జరిగింది?

మేఘాలయలోని తురాలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన 83వ బెటాలియన్ ప్రధాన కార్యాలయం ఉంది. అది 1971 మార్చి 26వ తేదీ. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఈ భద్రతా దళానికి చెందిన డిప్యూటీ కమాండెంట్ వీరేంద్ర కుమార్ గౌర్ నిద్రలేచారు.

తూర్పు పాకిస్తాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడకు వచ్చిన భారత్‌లో ఆశ్రయం కోరుతున్నారని మాంకచర్ అవుట్‌పోస్ట్‌కు చెందిన ఇన్‌ఛార్జ్ ఆయనకు చెప్పారు.

‘‘నేను దీన్ని అనుమతించలేను. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు బీఎస్‌ఎఫ్‌కు అధికారాలు లేవు. ఇలాంటి డిమాండ్ ఎప్పుడూ నా ముందుకు రాలేదు. ఉదయాన్నే ఈ విషయాన్ని పై అధికారులకు చెబుతాను. కానీ, అప్పటి వరకు ఎవర్ని భారతీయ సరిహద్దుల్లోకి అనుమతించవద్దు’’ అని గౌర్ మాంకచర్ ఇన్‌ఛార్జ్‌కు తెలిపారు.

కొన్ని నిమిషాల్లోనే, బాఘ్‌మరా పోస్ట్‌ నుంచి కూడా ఇదే రకమైన వార్త అందింది. తూర్పు పాకిస్తాన్‌లో ప్రజల్ని చంపేస్తున్నట్లు శరణార్దులు చెబుతున్నారని బాఘ్‌మరా పోస్ట్‌కు చెందిన అధికారి చెప్పారు. ఆ ఫోన్ పెట్టేయగానే, దాలు అవుట్‌పోస్ట్ నుంచి కూడా ఇదే రకమైన వార్త అందింది. గౌర్ వెంటనే ఈ మెసేజ్‌ను కోడ్ భాషలో తన బాస్ డీఐజీ బారువాకి తెలిపారు. పెరుగుతోన్న సంక్షోభాన్ని ఆయనకు వినిపించారు.

కానీ, మధ్యరాత్రి కావడంతో ఆయన గాఢ నిద్రలో ఉండటంతో డీఐజీ నుంచి స్పందన రాలేదు. బీఎస్‌ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఒకరు డీఐజీని లేపి, సరిహద్దులో చోటు చేసుకుంటోన్న విషయాన్ని తెలియజేశారు. శరణార్థులను రాత్రి వరకు భారత సరిహద్దు లోపల ఉండేలా అనుమతించాలని గౌర్‌కి చెప్పారు డీఐజీ.

శరణార్థుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోందని, ఆ సంఖ్య కోటికి పైగా చేరుతుందని ఎవరికి తెలుసు. వాళ్లు అలా దాదాపు ఏడాదిపాటు భారత గడ్డపైనే ఉండాల్సి వచ్చింది.

బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో పారామిలటరీ దళం బీఎస్‌ఎఫ్ ఇంత చురుకుగా వ్యవహరిస్తుందని ఎవరూ ఊహించలేదు కూడా.

బీఎస్ఎఫ్ జవాన్లు

ఫొటో సోర్స్, BSF ARCHIVES

సరిహద్దు భద్రతా దళం పాత్ర

తూర్పు పాకిస్తాన్ రైఫిల్స్‌కు చెందిన చగ్గల్నయ్యా పోస్ట్‌కు హెడ్‌ కానిస్టేబుల్ నూరుద్దీన్ బెంగాలీ ఇన్‌ఛార్జ్‌గా ఉండేవారు. భారత్‌లోని శ్రీనగర్ పోస్టుకు చెందిన పరిమళ్ కుమార్ ఘోష్‌తో ఆయనకు మంచి స్నేహం ఉంది.

ఘోష్‌ను కలిసేందుకు ఆయన తరుచూ సరిహద్దుకు వస్తుండేవారు.

మార్చి 26న పాకిస్తానీ ఆర్మీతో నెలకొన్న ఘర్షణ తర్వాత, సరిహద్దు దాటి వచ్చి, ఈ ఘర్షణలో తమకు సాయం చేయాలని పరిమళ్ ఘోష్‌ను నూరుద్దీన్ అభ్యర్థించారు.

ఘోష్‌ తన యూనిఫామ్‌ను మార్చుకుని, సాధారణ దుస్తులను ధరించి చిట్టగాంగ్‌లోని పటియా కాలేజీకి చెందిన ప్రొఫెసర్ అలీ అనే నకిలీ ఐడెంటీ కార్డుతో అక్కడికి వెళ్లారు.

కొంతదూరం నడిచిన తర్వాత, నూరుద్దీన్‌తో కలిసి రిక్షాలో శుభపూర్ బ్రిడ్జ్‌ వద్దకు చేరుకున్నారు. తూర్పు పాకిస్తాన్ రైఫిల్స్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు అప్పటికే అక్కడ ఉన్నారు.

తూర్పు పాకిస్తాన్‌‌లో నిలబడి అక్కడి మట్టిని తన చేతుల్లోకి తీసుకుని, ఇక నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్రం కోసం పనిచేస్తానని పరిమళ్ ఘోష్‌ వాగ్దానం చేశారు.

తూర్పు పాకిస్తాన్‌లోని సైనికులకు పలు ఆదేశాలు ఇచ్చిన తర్వాత, ఘోష్‌ తిరిగి భారత సరిహద్దుకు వచ్చారు.

తూర్పు పాకిస్తాన్‌లో చోటు చేసుకున్న పరిస్థితులన్నింటిపై తన రిపోర్టులో వివరించారు.

కానీ, సరిహద్దు దాటి, తూర్పు పాకిస్తాన్‌లోకి వెళ్లిన విషయాన్ని మాత్రం చెప్పలేదు.

ఆ తర్వాత రోజు తన బాస్ లెఫ్టినెంట్ కల్నల్ ఏకే ఘోష్ ఆయన్ను కలిసేందుకు తన పోస్టు వద్దకు వచ్చారు.

బీఎస్ఎఫ్ జవాన్లు

ఫొటో సోర్స్, PENGUIN RANDOM HOUSE

ఫొటో క్యాప్షన్, అసిస్టెంట్ కమాండెంట్ పీకే ఘోష్ (కుడి నుంచి రెండో వ్యక్తి)

యుద్ధానికి ముందు కొత్త సమాచారం

‘‘ఇండియా సీక్రెట్ వార్ బీఎస్ఎఫ్ అండ్ నై మంత్స్ టూ ది బర్త్ ఆఫ్ బంగ్లాదేశ్’’ పేరుతో ఉశినోర్ మజుందార్ ఒక పుస్తకం రాశారు.

‘‘టీ తాగిన తర్వాత, పరిమళ్ ఘోష్ సరిహద్దు దాటి శుభపూర్ వంతెన వద్దకు వెళ్లిన సంగతిని ఆయన బాస్ ఏకే ఘోష్‌కు తెలిపారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన ఏకే ఘోష్ గట్టిగా తన చేతిని టేబుల్‌పై గుద్దారు. ఈ దెబ్బకు టేబుల్‌పై ఉన్న టీ కింద ఒలికి పోయింది’’

‘‘ఎంత ధైర్యముంటే నా అనుమతి లేకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటావు. దీని కోసం మిమ్మల్ని కోర్టు మార్షల్ చేయొచ్చని మీకు తెలుసా?’’ అంటూ ఏకే ఘోష్ తన జెర్కిన్ తీసుకుని జీప్ వద్దకు వెళ్లిపోయారు.

ఆయన వెళ్లిపోయేటప్పుడు పరిమళ్ ఘోష్ గౌరవ వందనం చేశారు. కానీ, ఏకే ఘోష్ ఆయన్ను పట్టించుకోలేదు. తన ఉద్యోగం ఇక ప్రమాదం పడినట్లేనని పరిమళ్ ఘోష్‌కు అర్థమైంది.

ఆ తర్వాత దిల్లీలో హోమ్ సెక్రటరీ గోవింద్ నారాయణ్ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి అప్పటి ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు, సరిహద్దు భద్రతా దళానికి చెందిన డైరెక్టర్ కె.రుస్తంజీ, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ‘రా’ డైరెక్టర్ ఆర్ఎన్ కావ్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో మధ్య ప్రదేశ్‌లోని టెకాన్‌పూర్‌లో ఉన్న తమ అకాడమీకి చెందిన కొందరు సీనియర్ అధికారులను తూర్పు పాకిస్తాన్ సరిహద్దుకు పంపాలని నిర్ణయించారు. అలా పరిస్థితులను అదుపులో ఉంచాలని భావించారు.

ఆ తర్వాత రోజు లెఫ్టినెంట్ కల్నల్ ఏకే ఘోష్ శ్రీనగర్ అవుట్‌పోస్ట్‌కు చేరుకున్నారు. నవ్వుతూ జీప్ దిగారు.

‘‘నువ్వు ఇచ్చిన టీని నేను అంతకుముందు తాగలేకపోయాను. ఈ రోజు టీ పెడుతున్నారు కదా’’ అంటూ ఏకే ఘోష్ నవ్వారు.

ఇది విన్న తర్వాత పరిమళ్ ఘోష్‌కు మనసు కాస్త తేలికపడింది.

‘‘మార్చి 29న మరోసారి తన బాస్ అనుమతితో పరిమళ్ ఘోష్ ప్రొఫెసర్ అలీ వేషంలో మరోసారి తూర్పు పాకిస్తాన్‌కు వెళ్లారు . ఆయనతో పాటు తూర్పు పాకిస్తాన్‌ రైఫిల్స్‌కు చెందిన నూరుద్దీన్, బీఎస్ఎఫ్‌కు చెందిన కొందరు యువకులు ఉన్నారు. సాధారణ దుస్తులలో వారు అక్కడకు వెళ్లారు’’ అని ఉశినోర్ మజుందార్ తన పుస్తకంలో రాశారు.

భారత్ తమకు సాయం చేయాలని నిర్ణయించినట్లు తెలుసుకుని తూర్పు పాకిస్తాన్‌కు చెందిన రెబల్ ఫైటర్స్ ఆనందం వ్యక్తం చేశారు.

పరిమళ్ ఘోష్‌ను తమ భుజాలపై ఎత్తుకుని డ్యాన్స్ చేశారు. రెబల్ కమాండర్ మేజర్ జియా-ఉర్-రెహ్మాన్‌ను ఘోష్‌ కలిశారు.

ఉశినోర్ మజుందార్ పుస్తకం

ఫొటో సోర్స్, PENGUIN RANDOM HOUSE

పట్టుబడొద్దు అని చెప్పిన ఇందిరా గాంధీ

ముక్తి వాహినికి సాయం చేసేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మానెక్ షా అంగీకరించారు.

ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ డైరెక్టర్ రుస్తంజీ, లెఫ్టెనెంట్ కల్నల్ ఏకే ఘోష్‌కు తెలిపారు. పరిమళ్ ఘోష్‌కు కూడా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఆ తర్వాత రోజు అంటే మార్చి 30న, పరిమళ్ ఘోష్‌ కొన్ని యుద్ధ పరికరాలను ముక్తి వాహిని ఫైటర్లకు పంపారు.

భారతీయ రక్షణ అధికారులు రెబల్స్‌ను కలిశారన్న విషయం తూర్పు పాకిస్తాన్ అంతటా వ్యాపించింది.

మేజర్ జియా ఈ వార్తను ముక్తి వాహినికి చెందిన ఇతర వారియర్లకు తెలియజేశారు.

ఈ విషయంపై మార్గదర్శకాలు పొందేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ రుస్తంజీ అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ వద్దకు వెళ్లారు.

ఆ సమయంలో ఇందిరాగాంధీ, ‘‘మీరు చేయాల్సింది చేయండి. కానీ, పట్టుబడొద్దు’’ అని తెలిపారు.

ఇందిరా గాంధీ సన్నిహితులు, సోవియట్ యూనియన్‌కు భారత రాయబారి అయిన డీపీ దాహర్, తొలి రోజు నుంచే ముక్తి వాహిని ఫైటర్లకు ఫిరంగులు అందించాలనుకున్నారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఇందిరా గాంధీని కలిసిన అవామీ లీగ్ నేతలు

ఇద్దరు సీనియర్ అవామీ లీగ్ నేతలు తాజుద్దీన్ అహ్మద్, అమీరుల్ ఇస్లాంలు భారతీయ సరిహద్దు వద్దకు వచ్చారని 1971 మార్చి 30న సరిహద్దు భద్రతా దళానికి సమాచారం అందింది.

76వ బెటాలియన్‌కు చెందిన అధికారులు ఈ విషయాన్ని కోడ్ మెసేజ్ రూపంలో బీఎస్ఎఫ్ ఐజీ గోలక్ మజుందార్‌కు తెలియజేశారు.

వెంటనే మజుందార్ తన పై అధికారి రుస్తంజీని హాట్‌లైన్‌లో సంప్రదించారు. రుస్తంజీ ఈ విషయాన్ని తెలుసుకోగానే, ఎయిర్‌పోర్టుకు వెళ్లి, బీఎస్ఎఫ్ విమానంలో కోల్‌కతా చేరుకున్నారు. అప్పుడు సమయం రాత్రి 12 అవుతుంది.

‘‘విమానశ్రయానికి దగ్గర్లో పార్క్ చేసిన జీప్ వద్దకు మజుందార్ నన్ను తీసుకెళ్లారు. ఆ జీప్‌లో తాజుద్దీన్ అహ్మద్ కూర్చుని ఉన్నారు. చుట్టూ సెక్యూరిటీ అధికారులున్నారు. వారిని తీసుకుని మేం అస్సాం హౌస్‌కు వెళ్లాం’’ అని రుస్తంజీ రాశారు.

‘‘స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు వేసుకునేందుకు వారికి నా కుర్తా పైజమాఇచ్చాను. అప్పుడు సమయం అర్ధరాత్రి ఒకటి అవుతుంది. ఆ రాత్రివేళలో తినేందుకు ఎక్కడా ఫుడ్ దొరకదు. మా ఐజీ గోలక్‌ ఆ ఇద్దరికి తన చేతులతో ఆమ్లెట్ వేసి ఇచ్చారు’’ అని కూడా రాశారు.

‘‘ఆ తర్వాత రోజు నేను, గోలక్ కలిసి న్యూ మార్కెట్‌కు వెళ్లి, తాజుద్దీన్, అమీరుల్ కోసం బట్టలు, సైట్‌కేసులు, మిగిలిన అవసరమైన వస్తువులు కొన్నాం. ఏప్రిల్ 1న గోలక్ తాజుద్దీన్‌ను తీసుకుని, దిల్లీ వెళ్లారు. అక్కడే ఒక సురక్షితమైన ఇంట్లో వారిని ఉంచారు. రెండు రోజుల తర్వాత, ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కలుసుకున్నారు. దిల్లీలో వారం గడిపిన తర్వాత, ఏప్రిల్ 9న కోల్‌కతా తిరిగి వచ్చారు’’ అని రుస్తంజీ తన పుస్తకంలో తెలిపారు.

బంగ్లాదేశ్ బహిష్కృత ప్రభుత్వానికి రాజ్యాంగం అవసరం ఉంది. బీఎస్ఎఫ్ లా అధికారి కల్నల్ ఎన్ఎస్ బెయిన్స్, బారిస్టర్ అమీరుల్ ఇస్లాం, తాజుద్దీన్ అహ్మద్‌లకు బంగ్లాదేశ్‌కు తాత్కాలిక రాజ్యాంగం రాసేందుకు సాయపడ్డారు.

కోల్‌కతాకు చెందిన మరో బారిస్టర్ సుబ్రోతో రాయ్ చౌదరి దీన్ని తిరిగి చెక్ చేశారు. ఆ తర్వాత కొత్త దేశానికి ఏం పేరు పెట్టాలనే దానిపై చర్చ జరిగింది. దీని కోసం చాలా పేర్లు ప్రస్తావనకు వచ్చాయి.

తూర్పు బెంగాల్ అని, బంగ్ భూమి అని, బంగా అని, స్వాధిన్ బంగ్లా అని పలు పేర్లు ప్రతిపాదించారు.

చివరికి బంగ్లాదేశ్ పేరుకి షేక్ ముజీబ్ సపోర్ట్ ఇచ్చినట్లు తాజుద్దీన్ చెప్పారు. బంగ్లాదేశ్ అనే పేరుకి నేతలందరూ మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.

అయితే, బంగ్లాదేశ్ బహిష్కృత ప్రభుత్వం ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది.

తూర్పు పాకిస్తాన్ గడ్డపైనే ప్రమాణ స్వీకారం జరగాలని రుస్తంజీ సూచించారు.

దీని కోసం మెహెర్‌పూర్‌ పట్టణంలోని బైద్యనాథ్ తాల్‌లో ఒక మామిడి తోటను ఎంపిక చేశారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన అధినేత సమర్ బోస్, కల్నల్ ఐ రిఖియా, 200 మంది జర్నలిస్ట్‌లతో కలిసి కోల్‌కతా నుంచి బైద్యనాథ్ తాల్ వెళ్లారు.

రుస్తంజీ పుస్తకం

ఫొటో సోర్స్, WISDOM TREE

తుపాకీ నీడలో మంత్రుల ప్రమాణ స్వీకారం

జర్నలిస్ట్‌లను ఎక్కడికి తీసుకెళ్తున్నారో ముందుగా వారికి చెప్పలేదు.

ఈ విషయాన్ని ‘బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో’ అనే పుస్తకంలో మానస్ ఘోష్ రాశారు.

బీఎస్ఎఫ్ జవాన్లు కూడా సాధారణ దుస్తులలో వెల్లారు. బైద్యనాథ్ తాల్‌ను అన్ని దిక్కులా బీఎస్ఎఫ్ జవాన్లు సంరక్షించారు.

భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ఈ ప్రాంతమంతా పెట్రోలింగ్ చేసింది. ఎటువైపు నుంచి పాకిస్తాన్ దాడి చేసినా తిప్పికొట్టేలా భారత ఎయిర్‌ఫోర్స్ సిద్ధమైంది.

తూర్పు పాకిస్తాన్ రైఫిల్స్‌కు చెందిన సైనికులు, తమ చినిగిపోయిన, మాసిపోయిన యూనిఫామ్‌లతోనే, బంగ్లాదేశ్ బహిష్కృత ప్రభుత్వానికి చెందిన మంత్రులకు గౌరవ వందనం ఇచ్చారు.

మరోవైపు ఎలాంటి మ్యూజికల్ ఇక్విప్‌మెంట్ లేకుండానే మ్యూజికల్ గ్రూప్ బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించింది.

దగ్గర్లోని ఒక భారత గ్రామం నుంచి తబలా, హార్మోనియాన్ని గోలక్ అడిగి తీసుకొచ్చారు.

దినజ్‌పూర్ అవామీ లీగ్ ఎంపీ యూసుఫ్ అలీ బంగ్లాదేశ్ స్వాతంత్య్రాన్ని మైక్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.

బంగ్లాదేశ్ జాతీయ పతకం ఎగరవేశారు. ‘జాయ్ బంగ్లా’ అనే నినాదంతో చుట్టుపక్కల ప్రాంతమంతా మారుమోగింది.

బంగ్లాదేశ్ తొలి కేబినెట్ మంత్రులు

ఫొటో సోర్స్, TAJUDDINAHMED.COM

ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో హాట్‌లైన్‌లో మాట్లాడగలిగే కొంతమంది వ్యక్తుల్లో రుస్తంజీ ఒకరు.

కోల్‌కతాలోని పాకిస్తాన్ సబ్-హై కమిషన్‌లో పనిచేసే బెంగాలీ ఉద్యోగులందరూ ఇటువైపు వస్తే, మీరు వారికి మద్దతు ఇస్తారా? అని ఆయన ఒకరోజు ఇందిరా గాంధీని అడిగారు.

ఈ ప్రతిపాదనపై ఇందిరా గాంధీ సంతోషంగా లేరు. ఈ ఆపరేషన్‌లో ఏదైనా చిన్న తప్పిదం జరిగినా, భారత్ మొత్తం ప్రమాదంలో పడుతుందన్నారు.

‘‘అలా జరగనివ్వను. పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్ హుస్సేన్ అలీని వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రతిపాదనపై ఒప్పించడమే కాకుండా, బంగ్లాదేశ్ బహిష్కృత ప్రభుత్వ ప్రధానమంత్రి తాజుద్దీన్ అహ్మద్‌ను కూడా కలిశాను’’ అని రుస్తంజీ చెప్పారు.

పాకిస్తాన్‌తో తన సంబంధాలను తెంచుకుని, బంగ్లాదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు తాను కట్టుబడి ఉన్నట్లు ఏప్రిల్ 18న హుస్సేన్ అలీ చెప్పారు.

‘’10 గంటల సమయంలో కోల్‌కతాలో పెద్ద తుపాను వచ్చింది. పార్క్ సర్కస్ గ్రౌండ్‌లో చాలా చెట్లు కూకటివేళ్లతో సహా కూలిపోవడమే కాకుండా, సబ్-హై కమిషన్‌లో ఎగురుతున్న పాకిస్తాన్ జెండాకు చెందిన పోల్ కూడా తెగిపడింది.

తుపాను తగ్గిన తర్వాత బిల్డింగ్ వద్దకు వెళ్లిన హుస్సేన్ అలి, ఆయన స్టాఫ్.. జెండా పోల్ నుంచి పాకిస్తాన్ జెండాను తొలగించి, ఆ స్థానంలో బంగ్లాదేశ్ జెండాను ఎగరవేశారు’’ అని ఉశినోర్ మజుందార్ తన పుస్తకంలో రాశారు.

అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లు బిల్డింగ్ వద్దనున్న పాకిస్తాన్ నేమ్‌ప్లేట్‌ను తీసేసి, కొత్త బోర్డును పెట్టారు. దానిపై ‘‘ఆఫీసు ఆఫ్ ది హై కమిషనర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ డెమొక్రాటిక్ బంగ్లాదేశ్’’ అని రాసి ఉంది.

బీఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కేఎఫ్ రుస్తంజీ

ఫొటో సోర్స్, WISDOM TREE

రేడియో ట్రాన్స్‌మిటర్ అందజేసిన బీఎస్ఎఫ్

పాకిస్తాన్ దీనిపై ప్రతీకార చర్య తీసుకుంది. ఢాకాలోని భారత డిప్యూటీ హై కమిషన్‌ను మూసివేసింది.

1971 మార్చి 27న రాత్రి 7 గంటల సమయంలో ముక్తి వాహినికి చెందిన మేజర్ జియా-ఉర్-రెహ్మాన్ కలూర్‌ఘాట్ రేడియో స్టేషన్‌ నుంచి ముజీబ్ స్వాతంత్ర్య ప్రకటనను బ్రాడ్‌కాస్ట్ చేశారు.

మూడు రోజుల తర్వాత పాకిస్తానీ యుద్ధ విమానాలు ఈ రేడియో స్టేషన్‌పై బాంబులు వేసి, దాన్ని నాశనం చేశాయి.

బీఎస్ఎఫ్ డైరెక్టర్ రుస్తంజీ 200 వాట్ షార్ట్ వేవ్ ట్రాన్స్‌మీటర్‌ను బీఎస్ఎఫ్ టెకాన్‌పూర్ అకాడెమీ నుంచి ఆర్డర్ చేశారు.

తన బెటాలియన్ పాత రికార్డు ప్లేయర్‌ను లెఫ్టినెంట్ కల్నల్ ఏకే ఘోష్‌ అందించారు. స్వాధిన్ బంగ్లా బెతార్ కేంద్ర ప్రసారాలు ప్రారంభమయ్యాయి.

‘‘ రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన రేడియో ట్రాన్స్‌మిటర్‌ను ఎలా ఆపరేట్ చేయాలో తెలిసిన ఒకే ఒక వ్యక్తి బీఎస్ఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్ రామ్ సింగ్.

రోజులో గంటన్నర మాత్రమే ఈ ట్రాన్స్‌మిటర్ ఆపరేట్ అయ్యేది. ఇంజనీర్లు, స్క్రిప్ట్ రైటర్ల బృందం యుద్ధంలో బంగ్లాదేశ్ పోరాటానికి చెందిన ప్రజల ప్రోగ్రామ్‌లను పాకిస్తాన్ నుంచి ప్రసారం చేసేది’’ అని ఉశినోర్ మజుందార్ తన పుస్తకంలో రాశారు.

ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను బంగ్లాదేశ్ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

పాత ట్రాన్స్‌మిటర్ బాగా వేడి అయ్యే కారణంతో ప్రతి అర్ధగంటకు ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకునే వారు.

ఇద్దరు బీఎస్ఎఫ్ అధికారులకు, డిప్యూటీ కమాండెంట్ ఎస్‌పీ బెనర్జీకి, అసిస్టెంట్ కమాండెంట్ ఎంఆర్ దేశ్‌ముఖ్‌కు రహస్యంగా రేడియో స్టేషన్‌ నడిపే బాధ్యత అప్పజెప్పారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ రేడియో స్టేషన్‌ను పశ్చిమ బెంగాల్‌కు బదిలీ చేశారు. కోల్‌కతాకు వచ్చిన తూర్పు పాకిస్తాన్‌కు చెందిన రేడియో ఆర్టిస్ట్‌ల సాయంతో రేడియో ప్రోగ్రామ్‌లను రూపొందించే బాధ్యతలను ‘రా’ చేపట్టింది.

బీఎస్ఎఫ్ జవాన్లు

ఫొటో సోర్స్, BSF ARCHIVE

29 వంతెనలు ధ్వంసం

శుభపూర్ వంతెన ధ్వంసం చేసేందుకు ముక్తి వాహినికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఇంజనీర్లు, సైనికులు సహకరించారు.

తూర్పు పాకిస్తాన్‌లో 6 వారాల్లో 29 రోడ్లు, వంతెనలను బీఎస్ఎఫ్ నాశనం చేసింది. ఫలితంగా పాకిస్తాన్ ఆర్మీకి సరఫరాలు చేరుకోవడం ఆలస్యమైంది.

తూర్పు పాకిస్తాన్‌ సరిహద్దుల్లోకి బీఎస్ఎఫ్ జవాన్లు ప్రవేశించేందుకు అనుమతించిన ప్రతీసారి కూడా వారిని యూనిఫామ్ ధరించేందుకు ఒప్పుకునే వారు కాదు.

జంగిల్ బూట్లు ధరించడానికి కానీ, భారత్‌లో తయారు చేసిన ఆయుధాలు తీసుకెళ్లేందుకు కానీ అంగీకరించే వారు కాదు.

శుభపూర్ వంతెన

ఫొటో సోర్స్, PENGUIN RANDOM HOUSE

ముక్తి వాహినికి సాయం చేయలేదన్న భారత్

పాకిస్తాన్‌కు అమెరికా ఆయుధాలు ఇస్తుందని అమెరికా అధ్యక్షుడి భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింగర్‌కు ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పరమేశ్వర్ నారాయణ్ హక్సర్ ఫిర్యాదు చేసినప్పుడు, బెంగాలీ గెరిల్లాలకు భారత్ ఆయుధాలు ఇస్తోందని ఆరోపించారు. దీన్ని హక్సర్ కొట్టివేశారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముక్తి వాహిని వారియర్లకు సాయం చేసినట్లు భారత్ బహిరంగంగా ఒప్పుకోలేదు.

ముక్తి వాహిని సైనికులకు శిక్షణ ఇచ్చే సరిహద్దు భద్రతా దళాలకు చెందిన ట్రైనింగ్ క్యాంపు వద్దకు న్యూయార్క్ టైమ్స్ కరెస్పాండెంట్ సిడ్నీ షాన్‌బర్గ్ వచ్చారు.

భారత్, తూర్పు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆయన నాలుగు రోజులు గడిపారు. పాకిస్తాన్ సరిహద్దులోకి కూడా ఆయన వెళ్లగలిగారు. ఆ తర్వాత దీనిపై ఆయన ఒక ఆర్టికల్ రాశారు. 1971 ఏప్రిల్ 22న న్యూయార్క్ టైమ్స్ ఇష్యూలో అది ప్రచురితమైంది.

‘‘ముక్తి వాహిని ఫైటర్లకు శిక్షణ, ఆయుధాలను సరిహద్దు భద్రతా దళం ఇస్తుందో నేను నా కళ్లతో చూశాను’’ అని ఆ ఆర్టికల్‌లో రాశారు.

రుస్తంజీకి పద్మ భూషణ్

ఫొటో సోర్స్, WISDOM TREE

ఫొటో క్యాప్షన్, రుస్తంజీని పద్మ భూషణ్‌తో సత్కరిస్తున్న అధ్యక్షులు వీవీ గిరి

1971 యుద్ధంలో సరిహద్దు భద్రతా దళానికి చెందిన 125 మంది ప్రాణత్యాగం చేశారు. 392 మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధం తర్వాత, ఇద్దరు బీఎస్ఎఫ్ ఉన్నతా అధికారులు రుస్తంజీ, అశ్వనీ కుమార్‌లను పద్మ భూషణ్‌తో సత్కరించారు.

ఐజీ గోలక్ బిహారీ మజుందార్‌ను పరమ విశిష్ట సేవా పతకంతో గౌరవించారు. ఈ అవార్డును పొందిన సైన్యంలో పనిచేయని తొలి అధికారి ఈయన. అంతేకాక, అసిస్టెంట్ కమాండెంట్ రామ్ క్రిష్ణ వాద్వాను మరణించిన తర్వాత మహావీర్ చక్రతో సత్కరించారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)