అహ్మదాబాద్: భారత ప్రేక్షకులు, టీమిండియా ఆటగాళ్ల తీరుపై ఆస్ట్రేలియా మీడియా ఏం రాసింది?

వరల్డ్ కప్ ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి, మూడోసారి కప్ అందుకోవాలని ఆశపడ్డ భారత్‌ను ఫైనల్లో ఓడించి, ఆరోసారి టైటిల్ విజేతగా నిలిచింది ఆస్ట్రేలియా.

ప్రపంచ కప్ ఫైనల్లో భారత్‌పై విజయంతో ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆసీస్ ఘన విజయంపై ఆస్ట్రేలియాతోపాటు వివిధ దేశాల్లోని మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియంలో భారత ప్రేక్షకులకు క్రీడా స్ఫూర్తి లేదని ఓ పత్రిక కథనం రాస్తే, మరికొన్ని పత్రికలు మ్యాచ్ పరిస్థితులను విశ్లేషించాయి.

ఫైనల్ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చే లక్షా 30 వేల మంది ప్రేక్షకులను నిశ్శబ్దంలోకి నెట్టాలనుకుంటున్నామని మ్యాచ్‌కు ముందు చెప్పిన తమ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ఆస్ట్రేలియా మీడియా ఆకాశానికెత్తేస్తోంది.

మ్యాచ్ భారత్ చేజారిపోతుండటంతో ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోని భారత ప్రేక్షకులు చాలా సేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు. కోట్ల మంది భారతీయులను నిశ్శబ్దంలో ముంచేసిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రపంచ కప్ ఎలా చేజిక్కించుకున్నారో ది డైలీ టెలిగ్రాఫ్ కథనం రాసింది. అందులో “అహ్మదాబాద్‌లో భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా ఆరోసారి ప్రపంచ కప్ గెలిచింది. కానీ చాలా రకాలుగా చూస్తే ఈ కప్ భారత్‌కు దక్కుండేది. కానీ అలా జరగలేదు” అని రాసింది.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న పరిణామాలపై మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

'భారత ప్రేక్షకులు క్రీడా స్ఫూర్తి చూపలేదు'

ఆస్ట్రేలియాకు చెందిన ది క్రానికల్ పత్రిక ప్రపంచ కప్ ఫైనల్లో క్రీడా స్ఫూర్తి చూపలేదని భారతీయులను విమర్శిస్తూ హెడ్ లైన్ పెట్టింది.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లో కూడా ఓటమి రుచిచూడని ఆతిథ్య జట్టుపై గెలుపు కాబట్టి ఈ విజయం చాలా ప్రత్యేకమని పత్రిక వర్ణించింది.

“ఇది పెద్ద విజయమని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, అతడి టీమ్‌కు అనిపించకపోయుండవచ్చు. ఎందుకంటే లక్షా 30 వేల మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్నప్పటికీ, వాళ్లు ఖాళీ స్టేడియంలో ఈ ట్రోఫీని అందుకున్నారు. దానికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే వారికి ట్రోఫీ ఇస్తున్న సమయంలో భారత జట్టు అక్కడెక్కడా కనిపించలేదు” అని చెప్పింది.

“ఆట సమయంలో భారత ఆటగాళ్ల ఉదాసీనతను పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వారి మనోభావాలు వారిపై ఆధిపత్యం సాధించి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అంతమాత్రాన అలాంటి ప్రవర్తన క్రీడా స్ఫూర్తికి విరుద్ధం కాదనలేం” అని ది క్రానికల్ రాసింది.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

'భారత్‌కు బ్యాక్ ఫైర్ అయిన పిచ్'

హెరాల్డ్ సన్ పత్రిక ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చేసిన ఒక కామెంట్ ప్రచురించింది. అందులో ఆయన పిచ్ పట్ల భారత్ వ్యూహంపై ప్రశ్నలు సంధించారు. పిచ్ భారత్‌కు బ్యాక్ ఫైర్ అయ్యిందన్నారు.

లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించిన అదే పిచ్‌పై ప్రపంచ కప్ ఫైనల్ కూడా ఆడించారన్నారు.

ఒక రోజు ముందు పాట్ కమిన్స్ కూడా పిచ్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు. చివరికి పిచ్ మీద గడ్డి ఉండడం వల్ల ఆస్ట్రేలియా తన లక్ష్యాన్ని అందుకోవడానికి సాయం లభించింది.

మ్యాచ్ తర్వాత మాట్లాడిన రికీ పాంటింగ్ “ఈ పిచ్ నేను అనుకున్నదానికంటే చాలా స్లోగా ఉంది. ఊహించిన దానికంటే తక్కువ స్పిన్ అయ్యింది. కానీ బౌలర్లు అందరూ పిచ్‌కు అనుగుణంగా బాగా బౌలింగ్ చేశారు” అన్నాడు.

మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టీమ్ ఓటమికి పిచ్‌ను నిందించలేదు.

“వెలుగు కోసం ఇది కాస్త మెరుగ్గా ఉంటుందని అనుకున్నాం. కానీ, ఇప్పుడు నేను ఏ సాకులూ చెప్పాలనుకోవడం లేదు” అన్నాడు.

కామెంటరీ చేస్తున్న పాంటింగ్, “నిజం చెప్పాలంటే ఇక్కడ ఎలా పిచ్ తయారు చేశారంటే, అది భారత్‌కు బ్యాక్ ఫైర్ అయ్యింది” అన్నాడు.

అటు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ కూడా భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా బౌలర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారని అన్నాడు. వ్యూహాత్మకంగా అది తెలివైన టీమ్ అన్నారు.

వరల్డ్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

'ప్రధాని ట్రోఫీ ఇవ్వడంలో ఆలస్యం'

సందడి చేసే వేల మంది భారతీయులతో నిండి ఉన్న స్టేడియంలో విరాట్ కోహ్లీ వికెట్ పడిన శబ్దం రాగానే, కేవలం 11 మంది ఆస్ట్రేలియన్ ఆటగాళ్ల ఉత్సాహం నిండిన అరుపులే వినిపించాయని ది ఏజ్ పత్రిక రాసింది.

కోహ్లీ వికెట్ తీసిన తర్వాత కమిన్స్ తన జట్టును విజయమార్గంలోకి తీసుకొస్తే, మిగిలినదాన్ని ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్ 192 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసిందని చెప్పింది.

పిచ్ నుంచి కోహ్లీ వెళ్లడమైనా, హెడ్ సెంచరీ చేసినా, గెలిచిన సంబరమైనా నరేంద్ర మోదీ స్టేడియంలో ఆవరించిన నిశ్శబ్దం కమిన్స్, అతడి జట్టుకు మాత్రం చాలా అమూల్యమైనదని రాసింది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కమిన్స్‌కు ట్రోఫీ ఇవ్వడం కూడా ఆలస్యమయ్యిందని పేర్కొంది.

భారత్‌తో వరల్డ్ కప్ గెలవడంపై మాట్లాడిన కమిన్స్, ఇది ‘క్రికెట్‌లో పీక్స్’ అన్నాడని ది సండే మార్నింగ్ హెరాల్డ్ రాసింది.

ఈ భారత్‌ జట్టును ఓడించి వరల్డ్ కప్ గెలవడం తమ అత్యుత్తమ ప్రదర్శన అని ఆస్ట్రేలియా జట్టుకు అనిపిస్తుందని ఆ పత్రిక చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)