రోజుకు 4 సెం.మీ. కుంగిపోతున్న పట్టణం.. అక్కడేం జరుగుతోంది?

ఐస్‌లాండ్ దీవిలో ప్రమాదకర స్థాయిలో కనిపిస్తున్న విస్పోటనం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, ఐస్‌లాండ్ దీవిలో ప్రమాదకర స్థాయిలో కనిపిస్తున్న విస్పోటనం
    • రచయిత, జెస్సికా పార్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఐస్‌లాండ్ పశ్చిమ ప్రాంతంలోని చిన్న మత్స్యకార పట్టణం గ్రిండావిక్ నవంబరు 10 నుంచి రోజుకొక సెంటీమీటర్ చొప్పున కుంగిపోతూ వచ్చింది. ఇప్పుడది రోజుకు నాలుగు సెంటీమీటర్ల చొప్పున కుంగిపోతోంది.

దేశంలోని నైరుతి ప్రాంతంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఐస్‌లాండ్ వాతావరణ కార్యాలయం (ఐఎంవో) హెచ్చరించింది. గ్రిండావిక్ ఈ ప్రాంతంలోనే ఉంది. దీని ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు ఉండవచ్చని ఐఎంవో చెబుతోంది.

భూకంపాలు, అగ్ని పర్వతాలు బద్దలు కావచ్చనే భయాలతో పట్టణంలోని ప్రజలంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు.

800 ఏళ్ల విరామం తర్వాత 2021లో తిరిగి రీయెక్‌జేన్స్ ద్వీపకల్పంలో మరోసారి అగ్ని పర్వతాల విస్పోటన చక్రం మొదలైందని ఐస్‌లాండ్ వాతావరణ కార్యాలయం అధికారి మాధ్యూ రాబర్ట్స్ చెప్పారు.

“ద్వీపకల్పం అంతటా అగ్నిపర్వత విస్ఫోటనాలు రావచ్చని మేము అంచనా వేస్తున్నాం. అది కూడా ఒకే చోట పదే పదే కాకపోవచ్చు”.

రెజావిక్ ప్రధాన కేంద్రంలో రాబర్ట్స్ ఐఎంవోకి డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఆయన మమ్మల్ని ఓ గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ 24 గంటలు భూకంపాల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న బృందం ఒకటి ఉంది.

గత శుక్రవారం భూగర్భంలో శిలాద్రవం చొచ్చుకుని వచ్చి భూమికి 15 కిలోమీటర్ల లోతున ఓ రాయిని బద్దలు కొట్టడాన్ని గుర్తించిన ఈ బృందం ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.

అది గ్రిండావిక్ కిందనే జరిగింది.

“అది దాదాపు అండర్‌గ్రౌండ్‌లో వెళుతున్న కార్గో రైలులా ఉంది” అని రాబర్ట్స్ చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇలాంటిది ఎప్పుడూ కనివినీ ఎరుగని పరిణామం.

పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షిస్తున్న వాతావరణ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, పరిస్థితిని 24 గంటలు పర్యవేక్షిస్తున్న వాతావరణ కార్యాలయం

భూకంపం వచ్చిన తర్వాత రోడ్లు, భవనాలకు పగుళ్లు రావడంతో వెంటనే పట్టణాన్ని ఖాళీ చేయాలనే ఆదేశించారు.

ఈ పట్టణం త్వరలోనే మునిగిపోనుంది. భవనాలు, రోడ్లకు తిరిగి నిర్మించలేనంత నష్టం జరగనుందని రాబర్ట్స్ చెప్పారు.

ఇటీవల పట్టణంలో ఏ ప్రాంతంలో భూమి ఏ స్థాయిలో కుంగిపోయిందో సూచించేలా రంగు రంగుల మ్యాప్ ఒకటి సిద్ధం చేస్తున్నారు.

ఒక ప్రాంతంలో అయితే పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. రానున్న రోజుల్లో లేదా వారాల్లో అక్కడ భూమి బద్దలయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ అగ్ని పర్వతం బద్దలైతే ఈ ప్రాంతంలో మౌలిక వసతులకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుంది. అంతే కాకుండా ప్రమాదకర విషవాయువులు బయటకు రావచ్చు.

వందల ఏళ్ల నాటి చీలిక నుంచి శిలాద్రవం కింద నుంచి చొచ్చుకు వస్తున్నట్లు గగనతలం నుంచి తీసిన చిత్రాలు సూచిస్తున్నాయి.

శిలాద్రవం మళ్లీ ఇదే ప్రాంతంలో పేలుతోందని రాబర్ట్స్ చెప్పారు.

బుధవారం గ్రిండావిక్‌లో తీసిన గగనతల చిత్రం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, బుధవారం గ్రిండావిక్‌లో తీసిన గగనతల చిత్రం

మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఐస్‌లాండ్

అగ్ని పర్వత ప్రాంతాల్లో జరిగే వివిధ ప్రక్రియలు ఐస్‌లాండ్ ప్రజలకు చాలా కాలంగా తెలిసినవే. మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ ప్రాంతంలో ఐస్‌లాండ్ ఉంది. అక్కడ భూమి లోపల యూరేషియన్, నార్త్ అమెరికన్ ఫలకాలు ఏటా కొన్ని సెంటీమీటర్లు ఒకదానికి మరొకటి దూరం జరుగుతుంటాయి.

అయితే ఈ స్థాయిలో ప్రజల్ని ఖాళీ చేయించడం గత 50 ఏళ్లలో ఎన్నడూ లేదు.

1973లో హెయిమేలో ఈ చీలిక గుండా ఎర్రటి లావా ఉబికివచ్చింది. ఐస్‌లాండ్‌లోని వెస్ట్‌మాన్ ఐలండ్స్‌లో ఇదే పెద్దది.

ప్రస్తుతం రీయెక్‌జేన్స్ ద్వీపకల్పంలో భూ ఉపరితలానికి 800 మీటర్ల లోతులో శిలాద్రవం ఉంది.

ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేందుకు స్థానికులు మరి కొన్ని వారాలు వేచి చూడాల్సి రావచ్చు.

ముక్కలైన రహదారి

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భూమి లోపల యూరేషియన్, నార్త్ అమెరికన్ ఫలకాలను వేరు చేసే మిడ్-అట్లాంటిక్ రిడ్జ్ ఐస్‌లాండ్ గుండా సాగుతుంది.

“ప్రస్తుతం ఎలాంటి పేలుడు జరగకపోవచ్చని మేము అనుకుంటున్నాం” అని రాబర్ట్స్ అన్నారు. ఇది అంత మంచి పరిణామం కూడా కాకపోవచ్చు.

అగ్ని పర్వతం తక్కువ తీవ్రతతో బద్దలైతే, కొన్ని చీలికల ద్వారా లావా వారాల పాటు వెదజల్లుతూనే ఉండవచ్చు.

“అదే జరిగితే, లావా దక్షిణం వైపు ప్రవహిస్తుంది. గ్రిండావిక్ వైపు వెళ్లే అవకాశం ఉంది. అలాగే ఉత్తరం, పశ్చిమం దిక్కులకు కూడా వెళ్లవచ్చు. ఇంకా స్వాట్సెంగి పవర్ స్టేషన్, బ్లూ లగూన్ వైపు కూడా వెళ్లవచ్చు’’ అని రాబర్ట్స్ వివరించారు.

అత్యవసర ప్రణాళికల్లో భాగంగా విద్యుదుత్పత్తి కేంద్రంలోకి లావా రాకుండా చుట్టూ రక్షణ గోడ నిర్మిస్తున్నారు. బ్లూ లగూన్ స్పాను మూసి వేశారు.

లావా ముప్పుపై పోరాడేందుకు ఐస్‌‌‌లాండ్ దగ్గర అన్ని రకాల అత్యాధునిక విధానాలు అందుబాటులో ఉన్నాయని రాబర్ట్స్ చెప్పారు. అయితే “విస్పోటనం ఎక్కువ కాలం కొనసాగితే ప్రకృతే విజయం సాధిస్తుంది” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)