జో బైడెన్, షీ జిన్‌పింగ్ సమావేశం గురించి మీరు తెలుసుకోవాల్సిన నాలుగు ముఖ్యాంశాలు...

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, మైక్ వెండ్లింగ్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సమావేశంపై భారీ అంచనాలు ఏర్పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త వహించినప్పటికీ ఇరువురు దేశాధినేతల భేటీలో పలు కీలక విషయాలపై ఒప్పందాలు కుదిరాయి.
''నిర్ణయాత్మక, ఆచరణాత్మక చర్చలు జరిగాయని నేను విశ్వసిస్తున్నా'' అని సమావేశం అనంతరం బైడెన్ అన్నారు. ''చర్చల్లో కొన్ని ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధించాం'' అన్నారు.
అమెరికా, చైనా సంబంధాలు ''అంత సజావుగా సాగడం లేదు'' అని గతంలో జిన్‌పింగ్ చెప్పారు.
అయితే, ఒకరి వెనుక మరొకరు తవ్వుకోవడం రెండు అగ్రరాజ్యాలకూ మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాలిఫోర్నియాలో జరిగిన ఇద్దరు దేశాధినేతల సమావేశంలో చర్చించిన అంశాల్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నాలుగు అంశాలు..
1. వాతావరణంపై ఏకాభిప్రాయం
ప్రపంచంలోనే అతిపెద్ద కర్బన ఉద్గారాలుగా ఉన్న రెండు దేశాలు వాతావరణంలో వచ్చే మార్పులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను అంగీకరించాయి. అయితే, శిలాజ ఇంధనాల (ఫాజిల్ ఫ్యూయెల్) వినియోగం నిలిపివేతకు కట్టుబడి ఉండడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మీథేన్ ఉద్గారాలను, ముఖ్యంగా శక్తివంతమైన గ్రీన్‌హౌస్ వాయువు ఉద్గారాలను తగ్గించేందుకు సహకరిస్తామని వాగ్దానం చేశారు. అలాగే, 2030 నాటికి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని మూడు రెట్లు పెంచేలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తగిన సహకారం అందిస్తారు.
ఈ నెలాఖరులో దుబాయ్‌లో జరగనున్న సీఓపీ28(కాప్28) సదస్సుకు ముందు వాతావరణ మార్పులకు సంబంధించి ఇలాంటి ముందస్తు నిర్ణయాలు చెప్పుకోదగినవేనని నిపుణులు బీబీసీతో చెప్పారు.
''ఈ నిర్ణయాలు చిన్నవే కానీ, వాతావరణ మార్పులకు సంబంధించి ముఖ్యమైనవి'' అని యూకేకి చెందిన విశ్లేషణ సంస్థ 'చతం హౌస్'లోనిచైనా వ్యవహారాల నిపుణులు బెర్నైస్ లీ అన్నారు.
మీథేన్ వాయువు ఒప్పందం ‘‘అతిపెద్ద ముందడుగు'' అని ప్రపంచ వనరుల సంస్థకు చెందిన డేవిడ్ వాస్కోవ్ అభిప్రాయపడ్డారు.
''మీథేన్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో చైనా ప్రధానమైనది. రానున్న రోజుల్లో గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టడం చాలా అవసరం'' అని వాస్కోవ్ అన్నారు.

2. ఫెంటానిల్ అక్రమ రవాణా అరికట్టేందుకు అంగీకారం
మత్తుమందుల అక్రమ రవాణాను అరికట్టడంలో పరస్పర సహకారానికి ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి.
అలాగే, అమెరికాలో మరణాలు పెరగడానికి కారణమైన ఫెంటానిల్‌ను అక్రమంగా అమెరికాకు సరఫరా చేస్తున్న కెమికల్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు చైనా అంగీకారం తెలిపింది.
ఫెంటానిల్ అనేది పెయిన్ కిల్లర్‌గా, మత్తుమందుగా పనిచేసే ఒక శక్తివంతమైన పదార్థం. ఈ శక్తివంతమైన డ్రగ్ నిరుడు అమెరికాలో 75,000 మంది మరణాలకు కారణమైంది.
ఫెంటానిల్‌తో తయారు చేసే ఔషధాల తయారీ మాత్రమే కాకుండా, దానితో కలిపే ఇతర రసాయనాలకు కూడా చైనా కంపెనీలే మూలం.
''ఇది కేవలం ద్వైపాక్షిక, రాజకీయ ప్రకటన మాత్రమే. క్షేత్రస్థాయిలో ఎంతవరకూ అమలవుతుందనేదే ప్రశ్న'' అని బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల నిపుణులు వాండా ఫెల్బాడ్ బ్రౌన్ అభిప్రాయపడ్డారు.
''ఈ నిర్ణయం తర్వాత ఆ కంపెనీలపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎంతమందిపై చర్యలు తీసుకుంటుందో చూడాలి'' అని ఆమె అన్నారు.
బహుశా ఈ నార్కోటిక్స్ సహకారాన్ని బేరసారాలకు, దౌత్యసంబంధాలను విస్తృత ప్రయోజనాలకు వాడుకునేందుకు చైనా ప్రయత్నిస్తుందని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు.
అయితే, అమెరికాకు అలాంటి డ్రగ్ ఎగుమతులను చైనా పూర్తిగా నిలిపివేసినప్పటికీ, మెక్సికో మీదుగా అక్రమ మార్గాల్లో అవి యూఎస్ చేరుతున్నాయి.
వాటిని అడ్డుకునేందుకు చైనా సరైన చర్యలు తీసుకోవడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. అది పూర్తిగా అమెరికా వైఫల్యమేనని చైనా ఎదురుదాడికి దిగుతోంది.
3. సైనిక సమాచారం పంచుకోవడంపై నిర్ణయం
అమెరికా కోరుకునే విషయాల్లో అత్యంత ముఖ్యమైంది మిలటరీ టూ మిలటరీ కమ్యూనికేషన్. దీన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించడం కీలకమైన అడుగు.
అమెరికా ప్రతినిధుల సభా స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ను సందర్శించిన తర్వాత కిందటేడాది చైనా అగ్రరాజ్యంతో సైనిక సంబంధాలను తెంచేసుకుంది.
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా ఖండాతరంపై చైనాకు చెందిన ఒక అనుమానిత నిఘా బెలూన్ చక్కర్లు కొట్టడంతో ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. ఈ నిఘా బెలూన్‌ను అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చేసింది అమెరికా.
‘‘ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో, అమెరికా, సోవియట్ యూనియన్లు సైనిక వ్యవస్థల మధ్య సమాచారాన్ని పంచుకునే వ్యవస్థను కలిగి ఉండేవి. దీంతో ఈ రెండు అణు దేశాల మధ్య యుద్ధాన్ని తీవ్రతరం చేసే ప్రమాదాన్ని, ఉద్దేశ్యపూర్వకంగా ప్రచారం చేసే తప్పుడు సమాచారాన్ని నిరోధించేవి’’ అని అమెరికా రక్షణ వ్యవస్థకు చెందిన మాజీ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ మిక్ ముల్రాయ్ చెప్పారు.
ప్రస్తుతం అమెరికా, చైనాల మధ్య ఈ వ్యవస్థ కావాల్సి ఉందన్నారు.
బుధవారం సమావేశానికి ముందే ఇరు దేశాల మధ్య కాస్త సానుకూల వాతావరణం కనిపించిందని దశాబ్ద కాలంగా చైనా నుంచి రిపోర్ట్ చేస్తున్న ఉత్తర అమెరికా బీబీసీ ప్రతినిధి జాన్ సుడ్వర్త్ అన్నారు.
ఎన్నో ఏళ్లలో తొలిసారి గత వారమే ఇరు దేశాల ప్రతినిధులు వాషింగ్టన్‌లో అణు ఆయుధశాల గురించి చర్చలు జరిపారు.
బుధవారం జరిగిన సమావేశంలో ఇరు దేశాల అధినేతల మధ్య తైవాన్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీనిలో కూడా ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు తెలిసింది.

4. చర్చలు కొనసాగుతాయి
‘‘ఒప్పందం విషయంలో ఎన్నో ముఖ్యమైన నిర్దిష్ట అంశాలున్నప్పటికీ, ఇద్దరి నేతల మధ్య ఈ సమావేశం జరిగింది. బైడెన్, జిన్‌పింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇది సానుకూల సంకేతం’’ అని ఉత్తర అమెరికా బీబీసీ ఎడిటర్ సారా స్మిత్ అన్నారు.
ప్రపంచంలోనే రెండు అతిపెద్ద శక్తిమంతమైన అధ్యక్షులు కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం దౌత్యపరంగా సాధించిన అతిపెద్ద విజయం. ఒకవేళ కలుస్తూ ఉందామని ఇరు దేశాల అధ్యక్షులు అంగీకరిస్తే, దానికదే చెప్పుకోదగ్గ ఘనతగా పరిగణించవచ్చు.
సమావేశం ప్రారంభమైన తర్వాత జిన్‌పింగ్‌తో మాట్లాడిన బైడెన్.. ‘‘మన ఈ సంభాషణకు నేను గౌరవమిస్తున్నాను. ఎందుకంటే, నువ్వు, నేను ఒకరినొకరం స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఇది అతి ముఖ్యమైంది. మనద్దరి(నేతకు నేతకు) మధ్య ఎలాంటి అపార్థాలు ఉండవు’’ అని అన్నారు.
‘‘ఘర్షణలు, వివాదాలు, నిందారోపణలు ఇరు వైపులా తట్టుకోలేని బాధను మిగుల్చుతున్నాయి’’ అని చైనా అధ్యక్షులు కూడా బైడెన్‌తో అంగీకరించారు.
ఇరు దేశాలు చాలా విషయాలపై ఇంకా ఒక అంగీకారానికి రావాల్సి ఉంది.
కానీ, ఇరు దేశాల అధినేతల మధ్య జరిగిన సంభాషణలపై ఎక్కువ ఆశలు, అంచనాలు పెంచుకోవడంపై కొందరు నిపుణులు మాత్రం అప్రమత్త హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
‘‘గత నాలుగు నెలలుగా వాషింగ్టన్, బీజింగ్ మధ్య సంభాషణల్లో మెరుగుదల కనిపించడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం’’ అని సిరాక్యూస్ యూనివర్సిటీ చైనీస్ స్టడీస్ డైరెక్టర్ డిమిటర్ గ్యూర్‌గేవ్ చెప్పారు.
‘‘అయితే, ఈ సమావేశం బట్టి ఇరు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పరడుతుందని లేదా కొనసాగుతుందని మనం అంచనావేయకూడదు’’ అని డిమిటర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వరల్డ్ కప్ 2023: ‘షమీ ఫెరారీ లాంటి వాడు.. స్పీడ్ తగ్గదు’ అన్నది నిజమైందా?
- 30 వేల అడుగుల ఎత్తులో గుర్రం గందరగోళం, వెనుదిరిగిన బోయింగ్ విమానం
- ‘విరాట్ GOAT’.. ‘షమీ ఫైనల్’ ఈ రెండు పదాలూ సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతున్నాయి?
- హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?
- యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ వయసు ఇప్పుడు 85 ఏళ్ళు- ఆ మహా విషాదం ఎలాంటిదో ఆయన మాటల్లోనే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















