‘షమీ ఫెరారీ లాంటి వాడు... స్పీడ్ తగ్గేదేలేదు’ అన్నది నిజమైందా?

ప్రపంచ క్రికెట్ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇది సెమీ ఫైనల్ కాదు.. షమీ ఫైనల్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు

సెమీ ఫైనల్ కాదు షమీ ఫైనల్..

సోషల్ మీడియాలో అందరూ అనుకుంటున్న మాట ఇది.

న్యూజీలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 50వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీతోపాటూ వేగంగా సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్‌లు ఈ మ్యాచ్‌ హీరోలుగా నిలిచిపోతారని అందరూ అనుకుంటే.. మ్యాచ్‌ ముసిగేసరికి అసలు సిసలు మ్యాచ్ విన్నర్‌గా నిలిచింది మాత్రం మహమ్మద్ షమీనే.

బుమ్రా, సిరాజ్, జడేజా లాంటి బౌలర్లు వికెట్ తీయడానికి నానా తంటాలు పడుతున్న పిచ్‌పై ఏకంగా ఏడు వికెట్ల ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గానే కాదు.. హీరో ఆఫ్ ద మ్యాచ్ అయిపోయాడు షమీ.

మహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సెమీ ఫైనల్‌లో ఏడు వికెట్లు తీసి ప్లేయరాఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షమీ

వచ్చాడు.. మలుపు తిప్పాడు

భారత జట్టు 50 ఓవర్లలో 397 పరుగుల భారీ స్కోరు చేసినా, లోలోపల భయపడిన అభిమానులకు మ్యాచ్‌లో తన తొలి ఓవర్ నుంచీ ఒక భరోసా ఇచ్చాడు షమీ.

పవర్ ప్లే లో సగం ఓవర్లు అయిపోయాయి. బుమ్రా, సిరాజ్ బౌలింగ్ పెద్దగా ప్రభావం చూపడం లేదు. అలాంటి సమయంలో ఆరో ఓవర్ వేయడానికి బంతి అందుకుని తన తొలి ఓవర్ మొదటి బాల్‌కే వికెట్ తీయడంతోపాటూ, ఆ తర్వాత ఓవర్లో అంటే ఎనిమిదో ఓవర్లోనే మరో వికెట్ తీసి విజయానికి దారులు వేశాడు.

తర్వాత కేన్ విలియమ్సన్, డరెల్ మిచెల్ నిలదొక్కుకోవడంతో మళ్లీ టెన్షన్ పెరిగింది.

బుమ్రా వేసిన 29వ ఓవర్లో విలియమ్సన్ ఇచ్చిన క్యాచ్‌ను షమీ చేజార్చడంతో మ్యాచ్ కూడా చేజారిపోతుందేమో అని కోట్ల మంది ప్రేక్షకులు భయపడ్డారు. బుమ్రా, కులదీప్, జడేజా బౌలింగ్‌లో ఇద్దరూ షాట్లు కొడుతున్నారు.

32 ఓవర్లు పూర్తయ్యే సమయానికి భారత్ 226 పరుగులు చేస్తే, న్యూజీలాండ్ కూడా ఆ స్కోరుకు చాలా దగ్గరగా వచ్చేసింది. అంటే రెండు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

అదే సమయంలో బంతిని మళ్లీ షమీకి ఇచ్చాడు రోహిత్ శర్మ.

మ్యాచ్ 33వ ఓవర్ రెండో బంతికే కేన్ విలియమ్సన్ వికెట్ తీశాడు షమీ. అంతకుముందు విలియమ్సన్ ఇచ్చిన కాచ్ చేజార్చాడని జట్టుకు, అభిమానులకు ఉన్న లోటును భర్తీ చేశాడు. అంతే కాదు, రెండు బంతుల తర్వాత టామ్ లాథమ్‌ను కూడా అవుట్ చేసి టీమ్‌కు బోనస్ ఇచ్చాడు. తన బౌలింగ్‌తో జట్టులో ఎంత జోష్ నింపాడంటే తర్వాత 5 ఓవర్లలో న్యూజీలాండ్‌కు కేవలం 17 పరుగులే వచ్చాయి.

అక్కడితో షమీ జోరు ఆగలేదు. తన సహచర బౌలర్లు కష్టంగా మరో మూడు వికెట్లు పడగొట్టినా 46వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు దిగి.. ఒంటరిపోరాటం చేస్తున్న డరెల్ మిచెల్‌ను అవుట్ చేయడమే కాదు, 49వ ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మొత్తం ఏడు వికెట్లు సాధించి మ్యాచ్‌కు ఘనంగా ముగింపు పలికాడు.

క్రికెట్ ప్రపంచ కప్ 2023

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండేళ్ల క్రితం విమర్శలు ఎదుర్కొన్న మహమ్మద్ షమీ

రెండేళ్ల క్రితం విమర్శలు.. ఇప్పుడు ప్రశంసలు

2021లో దుబాయ్ వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారతజట్టు పాకిస్తాన్ నిర్దేశించిన 152 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేకపోయింది.

ఈ మ్యాచ్‌లో తన ప్రదర్శనపై షమీ విమర్శలు ఎదుర్కొన్నాడు.

3.5 ఓవర్ల బౌలింగ్‌లో 43 పరుగులు ఇచ్చి, జట్టు ఓటమికి కారణం అయ్యాడని సోషల్ మీడియాలో కొంతమంది అభ్యంతరకర విమర్శలు చేశారు. ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతోపాటు చాలామంది క్రికెటర్లు మద్దతుగా నిలబడ్డారు.

విరాట్ కోహ్లీ ఆ సమయంలో మీడియాతో “మతం పేరుతో ఒక వ్యక్తిపై దాడి చేయడమన్నది అత్యంత నీచమైన పని” అంటూ విమర్శలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా పలు విమర్శలు ఎదుర్కొన్న షమీ, వరల్డ్ కప్ 2023 కోసం ఎంపికైనా, 5 మ్యాచ్‌ల వరకు జట్టులోకి రాలేదు.

అక్టోబర్‌ 22న ధర్మశాల వేదికగా జరిగిన భారత్, న్యూజీలాండ్‌ మ్యాచ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. టోర్నిలోని మొదటి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ప్లేయరాఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఇప్పుడు అదే న్యూజీలాండ్ జట్టును సెమీఫైనల్‌లో ఎదుర్కొని, ఏడు వికెట్లు తీసి సత్తా చాటాడు.

ఇప్పుడు విమర్శల స్థానంలో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

“షమీ ఫెరారీ లాంటి వాడు.. స్పీడ్ తగ్గదు”

షమీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో అడుగుపెట్టింది అక్టోబర్ 22న ధర్మశాలలో జరిగిన భారత్, న్యూజీలాండ్ మ్యాచ్‌తో.

ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ నిర్దేశించిన 274 పరుగుల లక్ష్యాన్ని 48 ఓవర్లకే చేధించింది భారత జట్టు.

ఐదు వికెట్లు తీసిన మహమ్మద్ షమీ ప్లేయరాఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఆ సమయంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షమీని ప్రశంసిస్తూ, “షమీ ఫెర్రారీ లాంటివాడు. గ్యారెజీ నుంచి ఎప్పుడు బయటకు తీసినా దాని ప్రయాణం అంతే స్పీడు, అదే థ్రిల్, అదే సంతోషం కలిగిస్తుంది’’ అంటూ ట్వీట్ చేశాడు.

మహమ్మద్ షమీ

ఫొటో సోర్స్, Getty Images

షమీ ఏమన్నాడంటే..

మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న షమీ తాను అవకాశం కోసం వేచిచూశానని చెప్పారు.

“అవకాశం వచ్చినపుడు మంచి ప్రదర్శన చూపాలని అనుకున్నా. ఈ వరల్డ్ కప్‌లో న్యూజీలాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో నేను జట్టులోకి వచ్చాను. నేను కొత్త బంతితో వికెట్లు తీయొచ్చని నమ్ముతాను” అన్నాడు.

“ఈరోజు కేన్ విలియమ్సన్ క్యాచ్ వదలడం బాధగా అనిపించింది. కానీ నేను తనను అవుట్ చేసినప్పుడు బాగా అనిపించింది. ఈ వికెట్ చాలా బాగుంది. దీనిపై మధ్యాహ్నం నుంచి చాలా రన్స్ చేశారు. మంచు పడుతుందేమోననే భయం ఉంది. కానీ వికెట్ మీద గడ్డి కట్ చేసి ఉంది. మంచు పడుంటే బంతి జారుతుందేమో అనే భయం ఉండేది. ఎక్కువ పరుగులు చేయడానికి అవకాశం ఉండేది.

నా ప్రదర్శన బాగుంది. గత రెండు వరల్డ్ కప్‌లలో సెమీ ఫైనల్లో ఓడిపోయాం. అందుకే మేం ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు” అన్నాడు.

వీడియో క్యాప్షన్, మహమ్మద్ షమీ: రైతు బిడ్డ నుంచి 'షమీ' ఫైనల్ వరకూ...

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)