విరాట్ కోహ్లీ: వన్డే క్రికెట్‌లో 50 సెంచరీల వరల్డ్ రికార్డ్.. ఇప్పట్లో ఎవరైనా బ్రేక్ చేయగలరా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శారద మియాపురం
- హోదా, బీబీసీ ప్రతినిధి
వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీని శిఖరం అని పిలవొచ్చా?
ఆల్ టైమ్ గ్రేట్‌గా పరిగణించవచ్చా?
గతానికి ఇప్పటికీ ఆటలో వచ్చిన మార్పులు, నియమ నిబంధనల్లో తేడాలు, జట్టు పరిస్థితులను పక్కనబెట్టి, సెంచరీల లెక్క పరంగా చూస్తే కోహ్లీ పై బిరుదులకు అర్హుడే.
ఎందుకంటే వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ ఎవరూ సాధించని ఘనతను అందుకున్నాడు.
వన్డేల్లో అత్యధిక సెంచరీల్లో సచిన్ (49)ను వెనక్కి నెట్టి కోహ్లీ కొత్త వరల్డ్ రికార్డును నెలకొల్పాడు.
న్యూజీలాండ్‌తో వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో వన్డే చరిత్రలోనే అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
ముంబయిలోని వాంఖెడే మైదానంలో బుధవారం విరాట్ కోహ్లీ 106 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 100 పరుగులు సాధించాడు. దీంతో వన్డేల్లో 50వ సంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
సెంచరీ తర్వాత స్టాండ్స్‌లో కూర్చున్న సచిన్‌కు అభివాదం చేసి సంబరాలు చేసుకున్నాడు.
స్టాండ్స్ నుంచే కోహ్లీని సచిన్ అభినందించగా, కోహ్లీ భార్య అనుష్క శర్మ సంతోషంగా చప్పట్లు కొడుతూ కనిపించారు.
కోహ్లీ సెంచరీ చేయగానే వాంఖెడే స్టేడియంలో ప్రేక్షకులంతా అరుపులు కేకలతో హోరెత్తించారు.
తన పుట్టినరోజున 49వ సెంచరీతో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేసిన కోహ్లీ, పది రోజులు తిరిగే సరికి వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ మొత్తం 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
కోహ్లీ తర్వాత ఎవరు?
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన టాప్-10 ఆటగాళ్ల జాబితాను చూస్తే ఇప్పుడు 50 సెంచరీలతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, 49 సెంచరీలతో సచిన్ తెందూల్కర్ రెండో స్థానానికి పడిపోయాడు.
ఇక, 31 సెంచరీలతో భారత క్రికెటర్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్ (30), శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య (28) వరుసగా నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచారు.
దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), వెస్టిండీస్ ప్లేయర్ క్రిస్ గేల్ (25), శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర (25), డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా-22) వరుసగా తర్వాతి అయిదు స్థానాల్లో ఉన్నారు.
టాప్-10 క్రికెటర్లలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లు మాత్రమే ప్రస్తుతం ప్రొఫెషనల్ క్రికెట్‌లో చురుగ్గా ఉన్నారు. మిగతా వారు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించారు.
రోహిత్, కోహ్లీకి మధ్య 19 సెంచరీల తేడా ఉండగా, వార్నర్‌కు కోహ్లీకి మధ్య 28 సెంచరీలు ఉన్నాయి.
భారత్ జట్టులో ఇప్పుడు ఆడుతున్న క్రికెటర్లలో కేఎల్ రాహుల్ 7 సెంచరీలు, శుభ్‌మన్ గిల్ 6 సెంచరీలతో ముందున్నారు.
శ్రేయస్ అయ్యర్ ఖాతాలో 4 సెంచరీలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా వన్డేల్లో ఇంకా సెంచరీ నమోదు చేయలేదు.
ఇలా చూస్తే కోహ్లీ రికార్డు బద్ధలు అయ్యే అవకాశం కనుచూపు మేరలో లేదు.

ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీ 50వ సెంచరీ ఎలా చేశాడంటే?
రోహిత్ శర్మ (47) అవుట్ అయ్యాక విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు జట్టు స్కోరు 71/1.
క్రీజులోకి వచ్చాక కోహ్లీ ఎదుర్కొన్న రెండో బంతికే న్యూజీలాండ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసింది. బంతి ప్యాడ్‌ను తాకుతూ బౌండరీకి వెళ్లినట్లు భావించి న్యూజీలాండ్ డీఆర్‌ఎస్ కోరింది. అయితే, కోహ్లీ నాటౌట్‌గా తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కోహ్లీ బౌండరీతో పరుగుల ఖాతా తెరిచాడు.
తర్వాత స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అడపాదడపా ఫోర్లు బాదాడు.
ఇలా 59 బంతుల్లో 4 ఫోర్ల సహాయంతో అర్ధసెంచరీ అందుకున్నాడు.
దీంతో ఒక వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధికంగా 8 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ మరో రికార్డును నెలకొల్పాడు.
గతంలో ఈ రికార్డు ఉమ్మడిగా సచిన్ తెందూల్కర్ (7 అర్ధసెంచరీలు), షకీబుల్ హసన్ (7 అర్ధసెంచరీలు) పేరిట ఉండేది.
అర్ధసెంచరీ తర్వాత కాస్త వేగం పెంచిన కోహ్లీ సౌతీ బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదాడు.
ఇదే జోరులో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు (674) చేసిన ఆటగాడిగా నిలిచాడు.
వ్యక్తిగత స్కోరు 90 దాటిన తర్వాత కోహ్లీ కండరాలు పట్టేయడంతో ఇబ్బంది పడ్డాడు.
ఫెర్గూసన్ వేసిన మ్యాచ్ 42వ ఓవర్ నాలుగో బంతికి ఫ్లిక్ షాట్‌తో రెండు పరుగులు చేసిన కోహ్లీ 50 సెంచరీని అందుకున్నాడు.
అర్ధసెంచరీ తర్వాత 53 బంతుల్లోనే సెంచరీని చేరుకున్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
సచిన్ రికార్డులను బ్రేక్ చేస్తూ...
న్యూజీలాండ్‌తో సెమీస్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, సచిన్ పేరిట ఉన్న రెండు ప్రముఖ రికార్డులను బ్రేక్ చేశాడు.
అందులో మొదటిది వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్‌గా నిలవడంతో పాటు, రెండోది ఒక వరల్డ్ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సచిన్ పేరిట ఉన్న రికార్డులను కోహ్లీ తన పేర రాసుకున్నాడు.
ఈ సెంచరీతో వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు.
సచిన్ తెందూల్కర్ 451 వన్డే ఇన్నింగ్స్‌లలో 49 సెంచరీలు స్కోర్ చేయగా, విరాట్ కోహ్లీ 279వ ఇన్నింగ్స్‌లో 50వ సెంచరీని అందుకున్నాడు.
సచిన్ 2003 ప్రపంచకప్‌లో అత్యధికంగా 673 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు.
ఈ వరల్డ్ కప్‌లో కోహ్లీ ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌లలో 101.57 సగటుతో 90.68 స్ట్రయిక్ రేటుతో 711 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
వరల్డ్ కప్‌లో కోహ్లీ సెంచరీలు...
ఈ వరల్డ్ కప్ టోర్నీలో కోహ్లీకి ఇది మూడో సెంచరీ. దీనికంటే ముందు గత వరల్డ్ కప్‌లలో మరో 2 శతకాలు చేశాడు.
ఈ సెంచరీ కంటే ముందు పుణేలో బంగ్లాదేశ్‌పై అజేయంగా 103 పరుగులు, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 101 పరుగులు చేశాడు కోహ్లీ. దక్షిణాఫ్రికా ప్లేయర్ డికాక్ 4 సెంచరీలతో కోహ్లీ కంటే ముందున్నాడు.
ఓవరాల్‌గా వరల్డ్ కప్‌లలో కోహ్లీ 5 సెంచరీలు సాధించాడు.
మీర్పూర్‌లో బంగ్లాదేశ్‌పై తొలి వరల్డ్ కప్ సెంచరీ చేశాడు. తర్వాత అడిలైడ్ వేదికగా పాకిస్తాన్ మీద రెండో సెంచరీని అందుకున్నాడు.
ఓవరాల్‌గా వరల్డ్ కప్ టోర్నీల్లో అందరి కంటే ఎక్కువగా రోహిత్ 7 సెంచరీలు చేయగా... డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా), సచిన్ తెందూల్కర్ 6 సెంచరీలతో తర్వాత స్థానంలో ఉన్నారు.
కోహ్లీతో పాటు కుమార సంగక్కర (శ్రీలంక), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) ఓవరాల్‌గా 5 వరల్డ్ కప్ సెంచరీలు చేశారు.
కోహ్లీ తొలి సెంచరీ ఎప్పుడు వచ్చిందంటే?
2008 ఆగస్టు 18న శ్రీలంకతో సిరీస్‌లో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. వన్డేలతోనే అతని ప్రస్థానం మొదలైంది.
యాదృచ్ఛికంగా శ్రీలంకపైనే 21 ఏళ్ల వయస్సులో కోహ్లీ వన్లేల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.
2009 డిసెంబర్‌లో కోహ్లీ ఖాతాలో తొలి అంతర్జాతీయ శతకం చేరింది. అరంగేట్రం చేశాక 15 మ్యాచ్‌ల తర్వాత ఈ సెంచరీ లభించింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విధించిన 316 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ తొలి సెంచరీ సాధించాడు. అదే మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ కూడా సెంచరీ చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
‘కలలా ఉంది’: కోహ్లీ
50 సెంచరీల అనుభూతిని మాటల్లో చెప్పడం తనకు చాలా కష్టమని విరాట్ కోహ్లీ అన్నాడు.
‘‘ఇదంతా కలలా ఉంది. స్టాండ్స్‌లో సచిన్ పాజీ కూర్చున్నారు. అనుష్క కూడా అక్కడే ఉంది. నా హీరోతో పాటు నా జీవిత భాగస్వామి, నాకు అందరి కంటే ఇష్టమైన వ్యక్తి (అనుష్క), వాంఖెడేలోని అభిమానుల ముందు 50వ సెంచరీ రావడం అద్భుతంగా ఉంది.
సచిన్ ఆట చూస్తూ పెరిగాను. అలాంటిది స్వయంగా సచిన్ నా ఎదురుగా నిలబడి నన్ను అభినందిస్తుండటం కంటే గొప్ప క్షణం ఏముంటుంది. ఈ మాట నేను కోల్‌కతాలోనే చెప్పాను’’ అని కోహ్లీ అన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
సచిన్ స్పందన ఏంటి?
తన రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేసిన తర్వాత కోహ్లీని ప్రశంసిస్తూ సచిన్ ఒక ట్వీట్ చేశాడు.
ఆట పట్ల పట్టుదల, నైపుణ్యంతో కోహ్లీ తన హృదయాన్ని తాకాడని సచిన్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
‘‘నిన్ను మొదటిసారి డ్రెసింగ్ రూమ్‌లో చూశాను. అప్పుడు మిగతా ఆటగాళ్ళు నిన్ను ప్రాంక్ చేసి నా కాళ్ళు మొక్కేలా చేశారు. ఆరోజు నేను నవ్వు ఆపుకోలేకపోయాను. కానీ, ఇప్పుడు ఆట పట్ల నీ పట్టుదల, నైపుణ్యంతో నువ్వు నా హృదయాన్ని తాకావు. నువ్వు ఈ స్థాయికి ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.
భారతీయుడు నా రికార్డును బ్రేక్ చేయడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. అది కూడా వరల్డ్ కప్ సెమీస్ లాంటి పెద్ద మ్యాచ్‌లో, పైగా నా సొంత మైదానం లాంటి వాంఖెడేలో సాధించడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఇవి కూడా చదవండి:
- గాజా ఆస్పత్రిలో పేరుకుపోతున్న శవాలు.. పనిచేయని ఐసీయూ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ప్రాణాలకు ముప్పు
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?
- ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?
- 1971 వార్: పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆ రాత్రి ఏం జరిగింది?
- గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















