సెమీ ఫైనల్: 'చోకర్స్’ ట్యాగ్‌ను తిప్పి కొట్టి, ఇండియా చరిత్ర తిరగరాస్తుందా?

రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రభాకర్ వద్ది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటీవల కోల్‌కతాలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ తెంబా బవుమాకు మీడియా సమావేశంలో ఓ జర్నలిస్టు వేసిన ప్రశ్న చర్చకు దారితీసింది.

ప్రపంచ కప్‌ లీగ్ దశలో భాగంగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య ముఖ్యమైన మ్యాచ్ జరగబోతోందని, ‘చోకర్స్’ అనే ట్యాగ్‌ను అధిగమించడానికి దక్షిణాఫ్రికా ఏం చేయబోతోందని అతడిని జర్నలిస్టు అడిగారు.

క్రికెట్‌లో కీలకమైన మ్యాచ్‌‌లలో చేతులెత్తేసే జట్లను, ప్లేయర్లను ఎద్దేవా చేసేందుకు ‘చోకర్స్’ అనే మాటను చాలా మంది వాడుతుంటారు.

దక్షిణాఫ్రికా అనేక టోర్నీల్లో అత్యంత బలమైన జట్లలో ఒకటిగా కనిపించినప్పటికీ, ఇప్పటివరకు ఏ ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయింది.

సెమీ ఫైనల్లో లేదా ఫైనల్లో ఓడిపోవడం ఆ జట్టుకు మామూలైపోయిందనే విమర్శలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని, సౌతాఫ్రికా కెప్టెన్‌ను ఆ ప్రశ్న అడిగారు. దీనికి బవుమా ఒకింత అసహనంతో బదులిస్తూ- ఇండియా ప్రస్తావన తీసుకొచ్చాడు.

''చోకర్స్ అనే మాట మా ట్రైనింగ్ శిబిరంలో మేం ఎప్పుడూ వినలేదు. ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. రేపు మేం గెలిస్తే ఆ పదం గుర్తురాదేమో. అదే ఇండియా ఓడిపోతే ఇలాగే ప్రశ్నిస్తావో, లేదో'' అని దక్షిణాఫ్రికా కెప్టెన్ స్పందించాడు. దీంతో ‘చోకర్స్’ అనే మాట మరోసారి తెర పైకి వచ్చింది.

2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ ఓడిపోయినప్పుడు కూడా టీమిండియా ఆటగాళ్లను ఇలాగే ‘చోకర్స్’ అని చాలా మంది సోషల్ మీడియా యూజర్లు అన్నారు.

ఇప్పుడు దేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌ టైటిల్ ఫేవరెట్లలో ఇండియా ముందంజలో ఉంది. నవంబరు 15 బుధవారం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో తలపడనుంది.

టోర్నీ లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచులు గెలిచి, ఓటమి ఎరుగని జట్టుగా సెమీస్ ఆడబోతున్నప్పటికీ, గతంలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటున్న అభిమానులూ లేకపోలేదు.

‘చోకర్స్’ అనే మాటను గుర్తుకు తెచ్చే ఆ చేదు అనుభవాలు ఏమిటి? అప్పటికీ, ఇప్పటికీ టీమిండియా బలంలో, ఆటతీరులో తేడా ఉందా? ఆ ట్యాగ్‌ను రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు తిప్పికొట్టగలదా? విజయ పథంలో మరింత ముందుకు వెళ్లగలదా?

ధోనీ రనౌట్

ఫొటో సోర్స్, Getty Images

ఐసీసీ టోర్నీల్లో భారత్ బోల్తా

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో ఇండియా 2011 వన్డే వరల్డ్ కప్, ఆ తర్వాత 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అప్పటి నుంచి ఐసీసీ టోర్నీ ఏదీ గెలవలేదు భారత్.

చాలా ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో బలమైన జట్టుగా ఉన్నా, ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి ఇండియా చతికిలపడుతోంది.

లీగ్ దశను దాటుతున్నా సెమీస్, ఫైనల్స్‌లో బోల్తా పడుతోంది.

2014 నుంచి ఇండియాను సెమీస్, ఫైనల్ భంగపాటు వెంటాడుతోంది.

2014 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓటమి.

2015 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పరాజయం.

ఆ తర్వాత 2016 టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమి.

2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో పరాజయం.

2019-21లో ఐసీసీ కొత్తగా టెస్టు చాంపియన్ షిప్‌ ప్రవేశపెట్టింది. రెండేళ్ల పాటు ఆడిన ప్రతీ జట్టుపై భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శిస్తూ టేబుల్ టాపర్‌గా నిలిచింది.

ఆ టోర్నీలో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ టెస్టు మ్యాచ్ ఆడింది భారత్.

అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సాగింది ఇండియా ఆట. ముఖ్యంగా భారత బ్యాటింగ్ విభాగం చేతులెత్తేసింది.

ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ లాంటి కీలక ఆటగాళ్లు విఫలమయ్యారు.

దీంతో కివీస్ జట్టు భారత్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి, మొదటి టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ సొంతం చేసుకుంది.

అంతేకాదు, తర్వాతి టెస్టు చాంపియన్ షిప్‌ (2021-23)లో కూడా ఆయా దేశాలతో జరిగిన ద్వైపాక్షిక టెస్టుల్లో ఆధిపత్యం ప్రదర్శించి, ఫైనల్లో బోల్తా పడింది ఇండియా.

ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో గెలిచింది.

ఆ తర్వాత 2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడింది ఇండియా.

కీలక మ్యాచ్‌లలో కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, మొహమ్మద్ షమీ, దినేష్‌ కార్తీక్‌, రిషబ్ పంత్‌, భువనేశ్వర్‌, రవిచంద్రన్ అశ్విన్‌లాంటి సీనియర్ ఆటగాళ్లు విఫలమయ్యారు.

బహుశా ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా భారత జట్టునూ ‘చోకర్స్ లీగ్’లోకి లాగారేమో!

కపిల్ దేవ్

ఫొటో సోర్స్, Getty Images

అప్పుడు కపిల్ దేవ్ ఏమన్నాడు?

దేశానికి తొలి ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, గతంలో భారత ఆటగాళ్లను చోకర్స్ అనడాన్ని తప్పుబడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2022 టీ20 వరల్డ్‌ కప్‌ సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఇండియా ఓడిన సమయంలో, చోకర్స్ వ్యాఖ్యలపై మీడియా సంస్థ ఏబీపీతో కపిల్‌ దేవ్ మాట్లాడుతూ..

‘‘అవును, చివరి వరకూ వచ్చి బోల్తా కొడుతున్నారు. ఈ ఒక్క విషయంలో వారిని చోకర్స్ అని పిలవొచ్చు, ఇండియా చెత్తగా ఆడిందని (2022 టీ20 వరల్డ్ కప్ సెమీస్) నేనూ అంగీకరిస్తాను. కానీ, ఒక్క మ్యాచ్‌తో మరీ అంతగా విమర్శించాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా కొందరు ఆటగాళ్లు బాగా ఆడారు. వాళ్లను దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆ పదం (చోకర్స్) వాడటానికి వీల్లేదు. ఒక్క మ్యాచ్ ఓడారని మరీ అంత కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు" అని చెప్పాడు.

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

కీలక పోరులో బ్యాటర్ల వైఫల్యం

క్రిక్‌ఇన్‌ఫో వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం- ఐసీసీ వన్డే, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో భారత ఆటగాళ్ల బ్యాటింగ్ యావరేజ్ పరిశీలిస్తే రోహిత్ శర్మ (61.7) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.

ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ (61.42), గంగూలీ (55) ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ (58), కేఎల్ రాహుల్ (54.46)ల బ్యాటింగ్ యావరేజ్ కూడా బాగానే ఉంది.

అయితే 2019 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్లైన రోహిత్, కోహ్లీ, రాహుల్ ముగ్గురూ సింగిల్ డిజిట్‌ (1)కే అవుటయ్యారు. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది.

2022 టీ20 క్రికెట్ ప్రపంచకప్ సెమీస్‌లో రోహిత్ (27), రాహుల్(5) ఇద్దరూ విఫలం కాగా, కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమి తప్పలేదు.

గత రెండు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్‌ ఫైనల్స్‌లో టాప్-4 బ్యాటర్లు విఫలమయ్యారు. బౌలర్లు పోరాడినా అది సరిపోలేదు. ఆ రెండు ఫైనల్స్‌లో భారత్ పరాజయం పాలైంది.

ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

ఈసారి కథ వేరేలా ఉంటుందా?

గత ఐసీసీ టోర్నీలలో ఆడిన భారత జట్లతో పోలిస్తే ఈసారి టీం ఎక్కువ బలంగా కనిపిస్తోంది.

అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దూసుకెళుతోంది.

హార్ధిక్ పాండ్యా లాంటి స్టార్ ఆల్ రౌండర్ టోర్నీకి దూరమైనా, దాని ప్రభావం పడకుండా సమష్టి కృషితో విజయాలు సాధిస్తోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ (503 పరుగులు) జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రెండు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీల సాయంతో 594 పరుగులు చేసి, టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు విరాట్.

ప్రస్తుతం జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడి లేదు. కోహ్లీ, రోహిత్‌లకు తోడుగా రాహుల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ లాంటి మ్యాచ్ విన్నర్‌లు ఉన్నారు. టోర్నీలో వీరి ప్రదర్శనే వారిపై నమ్మకం పెంచేలా చేస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైనా శ్రేయస్ అయ్యర్ (421 పరుగులు), కేఎల్ రాహుల్ (347 పరుగులు) సమయోచితంగా ఆడుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

అటు బౌలింగ్‌లోనూ ఇండియా బలంగా ఉంది.

గత ఐసీసీ టోర్నీలలో భారత బౌలర్లు మ్యాచ్‌కు ఒకరో లేదా ఇద్దరో రాణించేవారు. కానీ, ఈసారి బౌలింగ్ దళమంతా సత్తా చాటుతోంది.

జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్‌ల పేస్ త్రయం ప్రత్యర్థి జట్ల బ్యాటర్లపై ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వికెట్లు పడగొడుతోంది.

మిడిల్ ఓవర్లలో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా పరుగులు ఇవ్వకుండా కట్టడి చేస్తూ, ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు.

ఈ టోర్నీలో బుమ్రా 9 మ్యాచ్‌లలో 17 వికెట్లు, షమీ 5 మ్యాచ్‌లలో 16 వికెట్లు, జడేజా 13, సిరాజ్ 12 వికెట్లు తీశారు.

ప్రతీ మ్యాచ్‌లోనూ కనీసం ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు రాణిస్తూ భారత్‌ను విజయతీరాలకు చేరుస్తున్నారు.

ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరడం ఖాయమని మొదటి నుంచి సునీల్ గావస్కర్, మైఖేల్ వాన్ సహా పలువురు మాజీ క్రికెటర్లు చెబుతూ వస్తున్నారు.

అదే తరహాలో ఇండియా ఆట కూడా ఉంది. దీంతో ‘చోకర్’ ట్యాగ్‌‌ను రోహిత్ టీం, స్టేడియం బయటకు విసిరి కొట్టగలదేమో చూడాలి.

సౌతాఫ్రికా, కివీస్ జట్ల కెప్టెన్లు

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సంగతేంటి?

ప్రస్తుత ప్రపంచ కప్‌లో సెమీస్ చేరిన నాలుగు జట్లలో ఆస్ట్రేలియాకు తప్ప అన్ని జట్లకూ ఈ ‘చోకర్స్’ ట్యాగ్ ఉందని చెప్పొచ్చు.

సెమీస్‌లో ఇండియా, దక్షిణాఫ్రికా, ఆసీస్, కివీస్ ఉన్నాయి. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు కూడా ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై బోల్తా పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

నవంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరుగనుంది.

భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో గెలిచే జట్టు, రెండో సెమీఫైనల్లో గెలిచే జట్టుతో నవంబరు 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్లో తలపడుతుంది.

ఇవి కూడా చదవండి

వీడియో క్యాప్షన్, న్యూ 'చోకర్స్’ ట్యాగ్‌ను తిప్పి కొట్టి, టీమిండియా చరిత్ర తిరగరాయనుందా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)