సోవియట్ యుద్ధ విమానం మిగ్-21ను ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’ ఎలా దొంగిలించింది?

మిగ్-21 విమానం

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

    • రచయిత, రెహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇజ్రాయెల్ గూఢచార సంస్థ ‘మొసాద్’కు 1963 మార్చి 25న మేర్ ఆమెత్ అధినేత అయినప్పుడు, ఆయన ఇజ్రాయెల్‌కు చెందిన పలువురు రక్షణ దళ అధికారులను కలిశారు. ఇజ్రాయెల్ సెక్యూరిటీకి మొసాద్ అందించే అత్యున్నత సహకారం ఏదై ఉండొచ్చని మీరనుకుంటున్నారని అడిగారు.

సోవియట్ విమానం ఎంఐజీ-21(మిగ్-21)ను పట్టుకుని ఇజ్రాయెల్ తీసుకొస్తే అదే ఇజ్రాయెల్‌కు అందించే అతిపెద్ద సాయమని అందరూ చెప్పారు.

ఇజ్రాయెల్ వైమానిక దళానికి ఎజేర్ వాయిజ్మాన్ అధినేత అయినప్పుడు అసలు కథ మొదలైంది.

ప్రతి రెండు మూడు వారాలకోసారి ఆమెత్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవారు.

ఆ సమయంలో ఒకసారి మేర్ ఆమెత్ తన కోసం ఏం చేయాలని అడిగారు. ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ‘‘నాకు మిగ్-21 కావాలి’’ అని అడిగారు వాయిజ్మాన్.

మేర్ ఆమెత్ ‘హెడ్ టూ హెడ్’ అనే ఒక పుస్తకాన్ని రాశారు. దానిలో ఇలా రాసుకొచ్చారు.

‘‘నీకేమైనా పిచ్చి పట్టిందా? అని వాయిజ్మాన్‌తో అన్నాను. వాయిజ్మాన్ మాత్రం అసలు ఒప్పుకోలేదు. మొండిపట్టు పట్టారు. మనకు ప్రతి సమయంలోనూ మిగ్-21 అవసరం ఉంటుంది అన్నారు. దీన్ని తీసుకొచ్చేందుకు నీకున్న బలమంతా ఉపయోగించు అని అన్నారు’’ అని మేర్ ఆమెత్ తన పుస్తకంలో రాశారు.

‘‘ఈ బాధ్యతను నేను రహ్వియా వర్దికి అప్పజెప్పాను. అంతకుముందు ఈజిప్ట్, సిరియా నుంచి ఈ విమానం తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నించారు ఆయన’’ అని రాశారు ఆమెత్.

‘‘నెలల తరబడి ఈ ప్లాన్‌పై వర్ది పనిచేశారు. ఈ ప్రణాళికను ఎలా అమలు చేయాలన్నదే మా అతిపెద్ద సమస్య’’ అని ఆమెత్ తన పుస్తకంలో చెప్పారు.

మాజీ మొసాద్ చీఫ్ మేర్ ఆమెత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ మొసాద్ చీఫ్ మేర్ ఆమెత్

మిగ్-21 భద్రత బాధ్యతలు

1961లో మిగ్-21ను అరబ్ దేశాలకు సరఫరా చేయడం ప్రారంభించింది సోవియట్ యూనియన్.

ఈజిప్ట్, సిరియా, ఇరాక్‌ వైమానిక దళాల్లో అప్పుడు మిగ్-21 చాలా కీలకపాత్ర పోషించేదని ‘స్టీలింగ్ ఏ సోవియట్ మిగ్ ఆపరేషన్ డైమండ్’ అనే కథనంలో రాశారు డోరన్ గెల్లర్.

ఈ విమానం కోసం రష్యన్లు అత్యంత రహస్య విధానాన్ని అనుసరించేవారు.

అరబ్ దేశాలకు ఈ విమానాలను ఇచ్చేటప్పుడు వారు పెట్టిన అతిపెద్ద షరతు ఏంటంటే.. విమానాలు వారి భూభాగంలోనే ఉంటాయి.

ఈ విమానాల భద్రత, శిక్షణ, నిర్వహణ అంతా సోవియట్ అధికారుల చేతుల్లోనే ఉంటుంది.

పశ్చిమ దేశాలకు మిగ్-21 సామర్థ్యాల గురించి కనీస అవగాహన కూడా లేదు.

ఇరాక్ యూదుడు యూసెఫ్ శిమిష్

ఫొటో సోర్స్, SHEBA MEDICAL CENTER

ఫొటో క్యాప్షన్, ఇరాక్ యూదుడు యూసెఫ్ శిమిష్

‘‘అరబ్ దేశాల్లో ఈ విమానాలకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు వర్ది. కొన్ని వారాల తర్వాత, ఇరాన్‌లోని ఇజ్రాయెల్ మిలటరీ అటాచీ యాకోవ్ నిమ్రాది నుంచి ఒక రిపోర్ట్ అందింది.

ఇరాక్‌ మిగ్-21 విమానాన్ని ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చే ఇరాక్ పైలట్, యూదుడు యోసెఫ్ శిమిష్ తనకు తెలుసని ఆ రిపోర్ట్‌లో చెప్పారు.

శిమిష్‌కు పెళ్లి కాలేదు. ఆయన సంతోషకరమైన జీవితాన్ని సాగించేవారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మసులుకునే మనస్తత్వం ఆయనది. ప్రజల నమ్మకాన్ని శిమిష్ చూరగొనే వారు’’ అని గెల్లర్ తన పుస్తకంలో రాశారు.

శిమిష్‌కు బాగ్దాద్‌లో ఒక క్రిస్టియన్ గర్ల్‌ఫ్రెండ్ ఉండే వారు. ఆమె సోదరి కమీలా క్రిస్టియన్ ఇరాక్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేస్తున్న కెప్టెన్ మునీర్ రెద్ఫాను పెళ్లాడారు.

మునీర్ రెద్ఫా మంచి పైలట్ అయినప్పటికీ ఆయన్ను ప్రమోట్ చేయలేదని చాలా నిరుత్సాహంగా ఉండేవారని శిమిష్‌కు తెలుసు.

క్రిస్టియన్ కావడం వల్లే తాను ప్రమోట్ కాలేకపోయానని, స్క్వాడ్రాన్ నేత తానెప్పటికీ కాలేనని మునిర్ రెద్ఫా అంటుండేవారు.

రెద్ఫా చాలా లక్షణాత్మకంగా ఉండేవారు. ఇరాక్‌లో మునిర్ రెద్ఫా ఉండటం సరైంది కాదనుకున్నారు.

రెద్ఫాతో ఏడాది పాటు మాట్లాడిన తర్వాత ఆయన ఏథెన్స్‌కు వెళ్లేందుకు శిమిష్ ఒప్పించగలిగారు.

రెద్ఫా భార్య తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, పశ్చిమ దేశాల వైద్యులకు చూపిస్తేనే ఆమె ప్రాణాలు కాపాడుకోగలరని శిమిష్ ఇరాక్ అధికారులకు తెలిపారు. వెంటనే ఆమెను గ్రీస్ తీసుకెళ్లాలని చెప్పారు.

ఆమెతో పాటు రెద్ఫా కూడా వెళ్లాల్సి ఉందని, ఎందుకంటే ఆయన కుటుంబంలో ఇంగ్లీష్ వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి రెద్ఫా అని వివరించారు.

ఇరాక్ అధికారులు ఈ అభ్యర్థనకు అంగీకరించి, మునిర్ రెద్ఫా తన భార్యతో కలిసి ఏథెన్స్‌కు వెళ్లేందుకు ఒప్పుకున్నారు.

ఇరాక్ పైలట్ కెప్టెన్ మునీర్ రెద్ఫా

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

ఫొటో క్యాప్షన్, ఇరాక్ పైలట్ కెప్టెన్ మునీర్ రెద్ఫా

మొత్తం మిషన్‌కు ‘ఆపరేషన్ డైమండ్’ అనే పేరు

ఏథెన్స్‌లో మరో ఇజ్రాయెలీ వైమానిక దళానికి చెందిన పైలట్, కల్నల్ జీవ్ లిరోన్‌ను రెద్ఫాను కలిసేందుకు పంపారు.

రెద్ఫాకు కోడ్‌ పేరుగా ‘యాహోలోమ్’ అని పెట్టింది మొసాద్. ఈ పేరు అర్థం డైమండ్ అని. ఈ మొత్తం మిషన్‌కు ‘ఆపరేషన్ డైమండ్’ అనే పేరు పెట్టారు.

‘‘మీ విమానంలో మీరు ఇరాక్ నుంచి బయటికి వెళ్లిపోతే ఏమవుతుంది?’’ అని రెద్ఫాను లిరోన్ అడిగారు.

‘‘వాళ్లు నన్ను చంపుతారు. ఏ దేశం కూడా నాకు ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండదు’’ అని రెద్ఫా అన్నారు.

‘‘ఒక దేశం ఉంది. అది చేతులు చాచి మీకు స్వాగతం చెబుతుంది. అదే ఇజ్రాయెల్’’ అని లిరోన్ చెప్పారు.

ఒకరోజు ఆలోచించిన తర్వాత, మిగ్-21 విమానంతో పాటు ఇరాక్ నుంచి బయటికి వచ్చేందుకు రెద్ఫా ఒప్పుకున్నారు.

ఆ తర్వాత రెద్ఫాతో జరిగిన సంభాషణను లిరోన్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.

మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు రాసిన ‘ది గ్రేట్ మిషన్ ఆఫ్ ది ఇజ్రాయెలీ సీక్రెట్ సర్వీసు మొసాద్’

ఫొటో సోర్స్, JAICO PUBLISHING HOUSE

ఫొటో క్యాప్షన్, మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు రాసిన ‘ది గ్రేటెస్ట్ మిషన్స్ ఆఫ్ ది ఇజ్రాయెలీ సీక్రెట్ సర్వీసు మొసాద్’

అరబిక్ పాట కోడ్‌ పదం

గ్రీస్ నుంచి ఇద్దరూ రోమ్‌కు వెళ్లారు. శిమిష్, ఆయన స్నేహితురాలు కూడా అక్కడికి వచ్చారు.

కొన్నిరోజుల తర్వాత, ఇజ్రాయెల్ వైమానిక దళం గూఢచార విభాగానికి చెందిన పరిశోధనా అధికారి యెహుదా పోరాట్ కూడా అక్కడికి చేరుకున్నారు.

ఇజ్రాయెల్ గూఢచార సంస్థకు, రెద్ఫాకు మధ్యలో సంభాషణ ఎలా సాగాలన్నది రోమ్‌లోనే నిర్ణయించారు.

ప్రముఖ అరబిక్ పాట ‘మరహబతేం మరహబతేం’ ఇజ్రాయెల్ రేడియో స్టేషన్ కోల్ నుంచి వినపడిన తర్వాత ఇరాక్ నుంచి ఆయన బయటికి రావాలని సంకేతమని చెప్పారు.

ఈ విషయాన్ని ‘ది గ్రేటెస్ట్ మిషన్స్ ఆఫ్ ది ఇజ్రాయెలీ సీక్రెట్ సర్వీస్’ అనే పుస్తకంలో మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్ రాశారు.

కానీ, మొసాద్ అధినేత ఆమెత్ రోమ్‌లో ఉండి, స్వయంగా వారిపై ఒక కన్నేశారని మాత్రం ఎవరికీ తెలియదు.

రెద్ఫాను ఇజ్రాయెల్ పిలిచి, ఈ ప్లాన్‌నంతా వివరించారు. అక్కడ ఆయన కేవలం 24 గంటలు మాత్రమే ఉన్నారు. మొసాద్ ఆయనకు సీక్రెట్ కోడ్‌ను ఇచ్చింది.

ఇజ్రాయెల్ గూఢచారులు ఆయన్ను తీసుకుని టెల్ అవీవ్‌లోని ప్రధాన వీధి అలెనబై స్ట్రీట్‌కు తీసుకెళ్లారు. మంచి రెస్టారెంట్‌లో రాత్రి భోజనం పెట్టించారు.

అక్కడి నుంచి రెద్ఫా ఏథెన్స్ వెళ్లారు. ఆ తర్వాత బాగ్దాద్‌కు వెళ్లే ఓడ ఎక్కారు.

కానీ, పైలట్ కుటుంబాన్ని ఇరాక్‌ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? తొలుత ఇంగ్లాండ్, ఆ తర్వాత అమెరికా ఎలా పంపించాలన్నది సమస్య.

రెద్ఫాకు అక్కాచెల్లెళ్లు, బావమరదులు ఉన్నారు. ఆయన బయటికి రావడానికంటే ముందే వారందర్నీ ఇరాక్‌ నుంచి బయటికి తీసుకురావాలి.

ఆయన కుటుంబాన్ని ఇజ్రాయెల్‌కు తీసుకురావాలని నిర్ణయించారు.

‘‘రెద్ఫా భార్య కమీలాకు ఈ ప్లాన్ గురించి ఏమీ తెలియదు. ఆమెకు నిజం చెప్పేందుకు రెద్ఫా చాలా భయపడ్డారు’’ అని మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్ రాసిన పుస్తకంలో తెలిపారు.

‘‘రెద్ఫా కొంత కాలం పాటు యూరప్ వెళ్తున్నట్లు భార్యకు చెప్పారు. తొలుత ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఆమ్‌స్టెర్‌డామ్ వెళ్లారు. అక్కడ వారి కోసం వేచిచూస్తోన్న మొసాద్‌కు చెందిన వ్యక్తులు, రెద్ఫా భార్యను, పిల్లల్ని తీసుకుని పారిస్ వెళ్లారు. వారందరూ ఎవరన్నది రెద్ఫా భార్యకు తెలియదు’’ అని మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు తమ పుస్తకంలో రాశారు.

మిగ్ విమానం

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

రెద్ఫా భార్య గట్టిగా ఏడ్చేశారు

‘‘వీరు ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. అక్కడ ఒక్క డబుల్ బెడ్‌ మాత్రమే ఉంది. మేం బెడ్‌పై కూర్చున్నాం.

ఇజ్రాయెల్‌కు విమానం బయలుదేరే ముందు రాత్రి, నేను ఇజ్రాయెల్ అధికారినని కమీలాకు చెప్పాను. తర్వాత రోజు నీ భర్త వస్తారని చెప్పాం. ఆమె చాలా భయపడింది. రాత్రంతా ఏడుస్తూనే ఉంది.

తన భర్త ఒక దేశద్రోహి అని, ఆయనేం చేశారో ఆమె సోదరులకు తెలిస్తే చంపేస్తారని గట్టిగా ఏడ్చారు’’ అని లిరోన్ ఆ రాత్రి నాటి సంఘటనలను గుర్తుకు చేసుకున్నారు.

‘‘వారి వద్ద మరో ఆప్షన్ లేదని అర్థమైంది. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన కళ్లతో, అనారోగ్యంతో ఉన్న తన పిల్లల్ని తీసుకుని విమానమెక్కి, ఇజ్రాయెల్ వచ్చారు రెద్ఫా భార్య’’ అని లిరోన్ రాశారు.

1966 జూలై 17న యూరప్‌లోని మొసాద్ స్టేషన్‌కు మునీర్ రెద్ఫా నుంచి ఒక కోడ్ లెటర్ వచ్చింది.

విమానంతో పాటు ఇరాక్ నుంచి బయటికి వచ్చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు అందులో రాసి ఉంది.

ఆగస్ట్ 14న మునీర్ రెద్ఫా మిగ్-21 విమానంతో పైకి ఎగిరారు. కానీ, విమానం ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో ఏదో సమస్య రావడంతో, ఆ విమానాన్ని తిరిగి వెనక్కి తీసుకెళ్లి, రషీద్ ఎయిర్ బేస్‌లో దించారు.

ఆ తర్వాత విమానంలో వచ్చిన సమస్య అంత పెద్దది కాదని మునీర్‌కు అర్థమైంది.

రెండు రోజుల తర్వాత మునీర్ అదే మిగ్-21 విమానంతో ఆకాశంలోకి ఎగిరారు. ముందుగా నిర్దేశించిన మార్గంలోనే ఆయన ప్రయాణించారు.

‘‘తొలుత బాగ్దాద్ వైపు మునీర్ రెద్ఫా వెళ్లారు. ఆ తర్వాత విమానాన్ని ఇజ్రాయెల్ వైపు తిప్పారు. ఇరాక్ కంట్రోల్ రూమ్ ఈ విషయాన్ని గమనించింది.

మునీర్‌ రెద్ఫాను వెనక్కి వచ్చేయాలంటూ పదేపదే సందేశాలు పంపింది. కానీ రెద్ఫా పట్టించుకోలేదు. దీంతో విమానాన్ని కూల్చేస్తామని ఇరాక్ బెదిరించింది.

ఆ తర్వాత మునీర్ తన రేడియోను స్విచ్ఛాప్ చేశారు. ఇజ్రాయెల్ ఎయిర్ బేస్‌లోకి ఇరాక్ పైలట్ రాగానే ఆయన్ను తప్పించే బాధ్యతను ఇద్దరు ఇజ్రాయెల్ పైలట్లకు అప్పజెప్పారు’’ అని మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు తమ పుస్తకంలో రాశారు.

యుద్ధ విమానం

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

విమానాన్ని స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్

రెద్ఫాను తప్పించే బాధ్యతను ఇజ్రాయెల్ బెస్ట్ పైలట్లలో ఒకరైన రాన్ పాకర్‌కు అప్పజెప్పారు.

బాగ్దాద్ ఎయిర్‌ బేస్ నుంచి టేకాఫ్ అయిన 65 నిమిషాలకు, రెద్ఫా విమానం ఇజ్రాయెల్ హజోర్ ఎయిర్‌ బేస్‌లో ల్యాండ్ అయింది.

‘ఆపరేషన్ డైమండ్’ ప్రారంభమైన ఏడాది లోపల, 1967లో ఆరు రోజుల యుద్ధం ప్రారంభానికి 6 నెలల ముందు, ఇజ్రాయెల్ వైమానిక దళం వద్ద ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత అధునాతన విమానం మిగ్-21 ఉంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది మొసాద్ టీమ్. మిగ్-21 విమానంతో ల్యాండ్ అయిన తర్వాత మునీర్ రెద్ఫాను తీసుకుని హజోర్ బేస్ కమాండర్ ఇంటికి తీసుకెళ్లారు.

చాలా మంది సీనియర్ ఇజ్రాయెల్ అధికారులు పార్టీ చేసుకున్నారు. కానీ, మునీర్ రెద్ఫా మాత్రం పార్టీలో ఒక మూలన కూర్చుని, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

మాజీ మొసాద్ చీఫ్ మేర్ ఆమెత్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మాజీ మొసాద్ చీఫ్ మేర్ ఆమెత్

మీడియాను ఉద్దేశించి ప్రసంగించిన మునీర్ రెద్ఫా

ఆ తర్వాత మునీర్ రెద్ఫా పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఇరాక్‌లో క్రిస్టియన్లు ఎదుర్కొనే టార్చర్‌ను ఆ పత్రికా సమావేశంలో వెల్లడించారు.

వారి సొంత ప్రజలు కుర్దులపై ఎలా బాంబులు వేస్తారో తెలిపారు.

పత్రికా సమావేశం తర్వాత, మునీర్‌ను తన కుటుంబాన్ని కలిసేందుకు తీసుకెళ్లారు.

‘‘ఆయన్ను శాంతంగా ఉంచేందుకు, ప్రోత్సహించేందుకు, ఆయన చేసిన పనిని కొనియాడేందుకు నేను శాయశక్తులా ప్రయత్నించాను. రెద్ఫా కోసం, ఆయన కుటుంబం కోసం ఏది కావాలంటే అది చేస్తామని భరోసా ఇచ్చాను. కానీ, రెద్ఫా కుటుంబం, ముఖ్యంగా ఆయన భార్య అసలు సహకరించేందుకు ఒప్పుకోలేదు’’ అని ఆమెత్ చెప్పారు.

మునీర్ రెద్ఫా మిగ్-21తో ఇజ్రాయెల్‌లో దిగిన కొన్ని రోజులకు, ఇరాక్ వైమానిక దళంలో అధికారి, రెద్ఫా భార్య సోదరుడు ఇజ్రాయెల్‌ వచ్చారు.

శిమిష్, ఆయన గర్ల్‌ఫ్రెండ్ కూడా ఆయనతో పాటు వచ్చారు.

ఆ సమయంలో రెద్ఫాపై ఆయన తీవ్రంగా కోపడ్డారు. దేశద్రోహి అని తిడుతూ, రెద్ఫాపై దూకి చంపేందుకు ప్రయత్నించారు.

ఈ కుట్రలో తన సోదరి కూడా భాగస్వామి అయిందని ఆరోపించారు.

తన సోదరికి ఈ విషయం తెలియదంటే అసలు నమ్మబుద్ధి కావడం లేదన్నారు.

ఆయన సోదరి తనకు తెలియదని చెప్పేందుకు చాలా ప్రయత్నించారు. కానీ, ఆయన నమ్మలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన ఇరాక్ వెళ్లిపోయారు.

మిగ్-21ను నడిపిన ఇజ్రాయెల్ పైలట్

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

ఫొటో క్యాప్షన్, మిగ్-21ను నడిపిన ఇజ్రాయెల్ పైలట్

మిగ్-21ను నడిపిన ఇజ్రాయెల్ పైలట్

మిగ్-21 విమానాన్ని తొలుత ఇజ్రాయెల్‌లో అత్యంత ప్రముఖ ఎయిర్ ఫోర్స్ పైలట్ డానీ షాపీరా నడిపారు.

విమానం ల్యాండ్ అయిన తర్వాత, మిగ్-21ను నడిపిన తొలి పశ్చిమ దేశాల పైలట్‌గా అభివర్ణించారు. ఈ విమానాన్ని పరిశీలించి, దీని లోటుపాట్లు తెలపాలన్నారు.

‘‘మిగ్-21 విమానం పార్క్ చేసిన హజోర్ ప్రాంతానికి వెళ్లాం. రెద్ఫా దానిలోని అన్ని బటన్ల గురించి నాకు చెప్పారు.

విమానానికి సంబంధించిన అన్ని మార్గదర్శకాలను మేం చదివాం. అవి అరబిక్, రష్యన్ భాషల్లో రాసి ఉన్నాయి.

గంట తర్వాత ఈ విమానం నడుపుతానని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు. ఫ్లయింగ్ కోర్సును కనీసం నువ్వు పూర్తి చేయలేదు అన్నారు. నేను టెస్ట్ పైలట్ అని చెప్పాను. ఆ తర్వాత ఒప్పుకున్నారు’’ అని తెలిపారు డానీ షాపీరా.

ఇజ్రాయెల్‌ పైలట్ డానీ షాపీరా

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌ పైలట్ డానీ షాపీరా

మిరాజ్-3 కంటే ఒక టన్ను బరువు తక్కువుండే మిగ్-21

‘‘మిగ్-21 తొలి విమానాన్ని చూసేందుకు ఇజ్రాయెల్ వైమానిక దళంలోని సీనియర్ అధికారులందరూ హజోర్ వచ్చారు‘‘ అని మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు తమ పుస్తకంలో రాశారు.

‘‘మాజీ వైమానిక దళ అధినేత ఎజేర్ వాయిజ్మాన్ కూడా వచ్చారు. షాపీరాను భుజంపై తన్ని, ఎలాంటి స్టంట్లు ప్రయత్నించాలని చూడకు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ఉండనీవు. అక్కడ రెద్ఫా కూడా ఉన్నారు.

షాపీరా విమానాన్ని ల్యాండ్ చేసిన వెంటనే, మునీర్ రెద్ఫా ఆయన వైపుకు పరిగెత్తారు. ఆయన కళ్లలో నీళ్లొచ్చాయి’’ అని వారి పుస్తకంలో రాశారు.

నీలాంటి పైలట్ ఉంటే, అరబ్‌లు అసలెప్పటికీ నిన్ను ఓడించలేరు. కొన్ని రోజులు నడిపిన తర్వాత, పశ్చిమంలో మిగ్-21 విమానానికి ఎందుకంత ప్రాముఖ్యత, గౌరవం ఉందో వైమానిక దళ నిపుణులు అర్థం చేసుకున్నారు.

ఇది అత్యంత ఎత్తులో వేగంగా ప్రయాణించగలదు. మిరాజ్-3 యుద్ధ విమానాల కంటే టన్ను బరువు తక్కువగానే ఉంటుంది.

మిగ్-21 విమానం

ఫొటో సోర్స్, JEWISH VIRTUAL LIBRARY

యుద్ధం నుంచి లాభపడిన ఇజ్రాయెల్

ఈ విమానాన్ని పూర్తిగా అధ్యయనం చేసేందుకు, నడిపేందుకు అమెరికాలోని ఒక నిపుణుల బృందాన్ని ఇజ్రాయెల్ పంపారు.

అమెరికా పైలట్లు ఇజ్రాయెల్ వచ్చారు. మిగ్-21ను తనిఖీ చేశారు. దానిలో ప్రయాణించారు.

మిగ్-21 రహస్యాలను తెలుసుకోవడంతో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్‌ చాలా లబ్ది పొందింది.

అరబ్ దేశాలతో జరిగిన ఆరు రోజుల యుద్ధానికి ఇది వారికి సాయపడింది.

ఇజ్రాయెల్ విజయంలో మిగ్-21 రహస్యాలను చేధించడం చాలా సాయపడింది.

కొన్ని గంటల వ్యవధిలోనే మొత్తం అరబ్ ఎయిర్ ఫోర్స్‌ను ఇజ్రాయెల్ నాశనం చేసింది.

అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు

ఇజ్రాయెల్ విడిచిపెట్టిన రెద్ఫా

దీనికి మునీర్ రెద్ఫా, ఆయన కుటుంబం పెద్దమూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.

‘‘మునీర్ రెద్ఫా ఇజ్రాయెల్‌లో అత్యంత దుర్భలమైన జీవితాన్ని, ఒంటరితనాన్ని, బాధాకరమైన జీవితాన్ని అనుభవించారు.

స్వదేశం బయట కొత్త జీవితమన్నది ఆయనకు అసాధ్యమైంది. మునీర్, ఆయన కుటుంబం ఒత్తిడిలో కూరుకుపోయింది.

క్రమంగా ఆయన కుటుంబం కుంగిపోయింది’’ అని మైఖేల్ బార్ జోహార్, నిస్సిమ్ మిషల్‌లు తమ పుస్తకంలో రాశారు.

ఇజ్రాయెల్‌లో ఇళ్లు కట్టుకునేందుకు మూడేళ్లుగా ప్రయత్నించారు. ఇజ్రాయెల్ ఆయిల్ కంపెనీలకు చెందిన డకోటా విమానాల్లో ప్రయాణించినప్పటికీ, ఆయనకు సొంత అనే ఫీలింగ్ రాలేదు.

శరణార్థిగానే రెద్ఫాకు గుర్తింపునిచ్చింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో తన జీవితాన్ని ప్రశాంతంగా గడపలేకపోయారు. కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్ వదిలి, నకిలీ గుర్తింపుతో ఒక పశ్చిమ దేశంలో నివసించారు.

చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ ఆయన ఒంటరితనాన్ని అనుభవించారు.

ఇజ్రాయెలీ చరిత్రకారుడు, రచయిత మైఖెల్ బార్ జోహార్

ఫొటో సోర్స్, PENGUIN

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెలీ చరిత్రకారుడు, రచయిత మైఖెల్ బార్ జోహార్

మునీర్ రెద్ఫా కోసం కన్నీరు కార్చిన ఇజ్రాయెలీ ప్రజలు

మునీర్ రెద్ఫా 1988 ఆగస్ట్‌లో గుండెపోటుతో మరణించారు. మిగ్-21ను విమానాన్ని ఇజ్రాయెల్‌కు తీసుకొచ్చిన 22 ఏళ్ల తర్వాత ఈ సంఘటన జరిగింది.

మునీర్ రెద్ఫా గౌరవార్థం మొసాద్ ఒక స్మారక సేవను నిర్వహించింది. దానిలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది.

రెద్ఫా జీవితంలో ‘స్టీల్ ది స్కై’ మూవీ

ఫొటో సోర్స్, HBO MOVIES

ఫొటో క్యాప్షన్, రెద్ఫా జీవితంలో ‘స్టీల్ ది స్కై’ మూవీ

ఇరాకీ పైలట్ మరణంపై ఇజ్రాయెల్ గూఢాచర్య ఏజెన్సీ కూడా నివాళి అర్పించింది.

రెద్ఫా జీవితంపై ‘స్టీల్ ది స్కై’, ‘గెట్ మి మిగ్-21’ అనే రెండు సినిమాలు వచ్చాయి.

రెద్ఫా తీసుకొచ్చిన మిగ్-21 విమానాన్ని ఇజ్రాయెల్‌లోని హతజరీన్ ఎయిర్ ఫోర్స్ మ్యూజియానికి తరలించారు. ఇప్పటికీ ఇది అక్కడ ప్రదర్శనకు ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)