ఉత్తరాఖండ్: సొరంగంలో చిక్కుకున్న 36 మంది ఎలా ఉన్నారు? వారిని బయటికి ఎలా తీసుకొస్తారు?

ఉత్తరాఖండ్ సొరంగం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఆసిఫ్ అలీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి జాతీయ రహదారిపై నిర్మిస్తున్న సొరంగం కూలిపోయింది. అందులో 36 మంది కూలీలు చిక్కుకుపోయారు.

వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా, దండల్‌గావ్‌లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు.

సొరంగంలో చిక్కుకున్న వారంతా ఇప్పటివరకు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

సొరంగ మార్గం

ఫొటో సోర్స్, ASIFZAIDI/BBC

వైర్‌లెస్ కమ్యూనికేషన్..

సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో వైర్‌లెస్‌ ద్వారా మాట్లాడామని ఉత్తరకాశీ సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ సోమవారం ఉదయం తెలిపారు.

“సొరంగంలో నీరు, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్న నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) పైప్‌లైన్‌ ద్వారా వారిని సంప్రదించేందుకు ప్రయత్నించాం. దాని సహాయంతో లోపల చిక్కుకున్న వారితో మాట్లాడాం. వాళ్లు బాగానే ఉన్నామని చెప్పారు" అని అన్నారు.

"వైర్‌లెస్ కమ్యూనికేషన్ ద్వారా వాళ్లు బాగున్నారా? లేదా? అని అడగడమే కాకుండా వారికి ఏం కావాలో కూడా తెలుసుకోవచ్చు. మాట్లాడేటపుడు వేరే శబ్ధాలు వినిపిస్తున్నాయి. అందరూ సురక్షితంగా ఉన్నారు'' అని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

సొరంగంలో 40 మంది వరకు చిక్కుకుని ఉంటారని ప్రశాంత్ కుమార్ తెలిపారు. సొరంగంలోకి 15 మీటర్ల దూరం వరకు వెళ్లామని, మరో 35 మీటర్లు వెళ్లాల్సి ఉందని ఆయన చెప్పారు.

కూలీల్లో ఒకరు మాత్రమే ఉత్తరాఖండ్‌కు చెందినవారు. మిగిలిన వారు బిహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారు.

స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ సిబ్బంది సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు స్థానిక పోలీసులు, ఇతర విభాగాలతో కలిసి పనిచేస్తున్నారు. సొరంగం సమీపంలోని శిథిలాలను తొలగించేందుకు జేసీబీ, ఇతర యంత్రాలను ఉపయోగిస్తున్నారు.

రెస్క్యూ చర్యలు

ఫొటో సోర్స్, ANI

ఎప్పుడు జరిగింది?

ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, అకస్మాత్తుగా మట్టి పెళ్లలు, శిథిలాలు పడటంతో సొరంగం మూసుకుపోయిందని ఉత్తరకాశీ జిల్లా ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు.

కార్మికులు అందులోనే చిక్కుకుపోయారని, తర్వాత వారికి ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిందని చెప్పారు.

వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడమే తమ ప్రాధాన్యత అన్నారు.

ఇందుకోసం పోలీసు బలగాల బృందాలు, రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు 24 గంటలూ ఘటనాస్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

రెస్క్యూ అప్‌డేట్‌లు, సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ +917455991223కు కాల్ చేయాలని ఉత్తరకాశీ పోలీసులు తెలిపారు.

ఉత్తరాఖండ్ సొరంగం

ఫొటో సోర్స్, ANI

ఎంత దూరంలో ఉన్నారు?

సిల్క్యారా నుంచి సొరంగం వైపు 200 మీటర్ల దూరంలో ప్రమాదం జరగగా, ఆ సమయంలో అందులో పని చేస్తున్న కార్మికులు మార్గానికి 2,800 మీటర్ల దూరంలో ఉన్నారని ఏడీజీ ఏపీ అన్షుమన్ తెలిపారు.

సొరంగంలో వారు తిరగడానికి 400 మీటర్ల ఖాళీ స్థలం ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ చెప్పారు.

అందువల్ల వారికి పది గంటలకు సరిపడా ఆక్సిజన్ లభిస్తుందని చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు జేసీబీ, పొక్లెయిన్‌ మిషన్లతో 13 మీటర్ల వెడల్పుతో తవ్వుతున్నారు.

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర ధామికి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి రెస్క్యూ ఆపరేషన్ గురించి సమాచారం తెలుసుకున్నారు.

సొరంగంలో చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారికి బయటి నుంచి ఆక్సిజన్‌ ​​సరఫరా చేస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఆల్‌ వెదర్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ కింద 'నావిగ్‌ ఇంజినీరింగ్‌' కంపెనీ ఈ సొరంగం నిర్మిస్తోంది.

నేషనల్ హైవే అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పర్యవేక్షణలో సొరంగం పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సొరంగం సిద్ధం కావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)