ఉత్తర గాజా: 'నా ఇంటిపై ఇజ్రాయెల్ బాంబులు కురిపించినా, నా మాృతభూమిని విడిచి వెళ్లను’

ఫొటో సోర్స్, EPA-EFE
- రచయిత, ఫెరాస్ కిలానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
గాజా స్ట్రిప్‌లో ఉత్తరాన ఉన్న పౌరులు దక్షిణ ప్రాంతానికి వెళ్లడానికి ఇజ్రాయెల్ విధించిన గడువు ముగిసింది. అయితే కొందరు మాత్రం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. అందులో మొహమ్మద్ ఇబ్రహీం ఒకరు.
"నేను నా మాతృభూమిని విడిచి వెళ్లను, ఎప్పటికీ వెళ్లను" అంటూ 42 ఏళ్ల ఇబ్రహీం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బంధువులతో కిక్కిరిసిన గదిలో కూర్చున్నారు.
ఆ గదిలో కొందరు మాట్లాడుకుంటుండగా, మరికొందరు గాజాపై వస్తున్న తాజా వార్తల కోసం వారి ఫోన్‌లు చూస్తూ ఉన్నారు.
"వాళ్లు నా ఇంటిని నాశనం చేయాలనుకున్నా, నేను వేరే చోటకు వెళ్లలేను. నేను ఇక్కడే ఉంటాను" అని ఇబ్రహీం అంటున్నారు. గాజాలోని తన ఇంటి నుంచి ఇబ్రహీం ఇప్పటికే చాలాసార్లు మరో చోటకు వెళ్లారు.
''గత ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు రాకెట్లతో దాడులు చేశారు. నేను నా భార్య, నలుగురు పిల్లలతో పారిపోయాను'' అని అన్నారు ఇబ్రహీం.

ఫొటో సోర్స్, Getty Images
వారు జబాలియాలోని తమ ఇంటిని వదిలి షేక్ రద్వాన్ ప్రాంతానికి వెళ్లాలనుకున్నారు.
కానీ ఆ ప్రాంతాన్ని కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోబోతోందని తెలుసుకుని, గాజా సిటీ శివారు ప్రాంతానికి వెళ్లారు. అయితే ఉత్తర గాజాను వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన నిజంగా అనుకోలేదు.
"దక్షిణాదికి పారిపోవాలని మాకు చెప్పారు, నేను, నా కుటుంబం ఎక్కడికి వెళ్లాలి" అని ఇబ్రహీం ప్రశ్నించారు.
ఇబ్రహీం తన కుటుంబంతో కలిసి కిక్కిరిసిన ఫ్లాట్‌లో నివసించేవారు. ఇపుడు వెళ్లిపోతే పిల్లలకు ఆట స్థలం ఉండదు.
ఇబ్రహీం కుమారుడు అహ్మద్ తన స్నేహితుడితో కలిసి వీధుల్లో సైకిల్‌పై తిరిగేందుకు ఇష్టపడేవాడు.
‘‘నా బెస్ట్ ఫ్రెండ్ బతికే ఉన్నాడా’’ అని తండ్రిని అడుగుతూనే ఉన్నాడు అహ్మద్. అయితే, అతడి గురించి తెలుసుకునే మార్గం లేదు.

ఎనిమిది రోజులుగా తిండి, నీళ్లు లేవు: జమీల్
అక్కడికి సమీపంలోని వీధిలో అబో జమీల్ అనే 38 ఏళ్ల బిల్డర్ పైపు నుంచి వచ్చే కొద్దిపాటి నీళ్లు పట్టుకుంటున్నారు. బీబీసీ ఆయనతో మాట్లాడింది.
‘‘ఎనిమిది రోజులుగా ఆహారం, నీళ్లు లేవు'' అని ఆవేదన వ్యక్తంచేశారు జమీల్.
గాజాకు విద్యుత్, నీటిని నిలిపివేసింది ఇజ్రాయెల్. ఇంధనం, ఇతర సామగ్రి కూడా రాకుండా నిలిపివేసింది.
"నీరు లేదు, కరెంట్ లేదు, జీవితం లేదు, అంతా దుర్భరం" అని తన బాధను వ్యక్తంచేశారు జమీల్.
కానీ తన పిల్లలతో పాటు అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు జమీల్. ఆయనకు ఇద్దరబ్బాయిలు, ముగ్గురమ్మాయిలు.
"మేం ఎక్కడికి వెళ్లలేం, వారు మా ఇళ్లపై దాడులు చేయాలనుకున్నా వెళ్లం. ఐదారుగురు ఉన్న నా కుటుంబంతో ఎక్కడికని పరిగెత్తగలం'' అని ప్రశ్నిస్తున్నారు జమీల్.

ఫొటో సోర్స్, REUTERS
ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు?
ఇజ్రాయెల్ ఆర్డర్‌తో గత 48 గంటల్లో ఉత్తర గాజాలోని 11 లక్షల మందిలో 4 లక్షల మంది సలా అల్-దిన్ రోడ్‌లో దక్షిణం వైపు వెళ్లారని హమాస్ తెలిపింది.
ఇజ్రాయెల్ సరిహద్దుకు ఓ కిలోమీటరు దూరంలో ఉన్న కొండ నుంచి గాజా స్ట్రిప్‌లోకి చూస్తే ఇజ్రాయెల్ చేయబోయే గ్రౌండ్ ఆపరేషన్ ఎంత తీవ్రంగా ఉండొచ్చో స్పష్టమవుతుంది.
అక్కడి హైవే వెంబడి సైనిక సిబ్బంది తమ వాహనాలతో మోహరించగా, ఆకాశంలో మిలటరీ డ్రోన్ ఎగురుతూ ఉంది.
ఆ సరిహద్దు వద్ద ఒక హమాస్ సాయుధుడు కాల్పులు జరపగా, ప్రతిగా ఇజ్రాయెల్ ఏకంగా ట్యాంకర్‌తోనే దాడి చేసింది. అతను చనిపోయినట్లు స్థానిక మీడియా నివేదించింది.
సమీపంలోని ఇజ్రాయెలీ స్డెరోట్ పట్టణం ఇప్పటికే ఖాళీ అయింది.
బీబీసీ ప్రతినిధులు రోడ్డుపై వెళుతుండగా బార్డర్‌కు మరికొంత దూరంలోని పొలాల్లో తుపాకీ శబ్దాలు వినిపిస్తున్నాయి.
జీపులు, మిలటరీ ట్యాంకులతో కూడిన భారీ వాహనాలు రోడ్డుపై చాలా నెమ్మదిగా వెళుతున్నాయి.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హమాస్‌ను నాశనం చేస్తామని ప్రకటించారు. ఆయన ప్రణాళిక అమలులో ఈ సైనిక శక్తిదే కీలక భూమిక.
ఇజ్రాయెల్‌లో 1,300 మందిని చంపేసింది హమాస్, మరో 126 మందిని బందీలుగా చేసుకుంది. దీంతో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడికి దిగింది.
ఈ దాడిలో ఇప్పటివరకు 2,383 మంది పాలస్తీనియన్లు చనిపోగా, 10,814 మంది గాయపడ్డారని పాలస్తీనా అథారిటీ ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.

గాజా జనాభాలో సగం మంది మైనర్లే
గాజా నగరంలో పిల్లలు ఇప్పటికీ వీధిలో ఆడుకుంటున్నారు. రోడ్లు ప్రశాంతంగా ఉండటంతో ఆ క్షణాలను వాళ్లు ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం చుట్టూ ఉన్న జీవితంలో ఇదే వారికి ఉపశమనం.
గాజా జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలని పాలస్తీనా అథారిటీ ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటికే 700 కంటే ఎక్కువ మంది పిల్లలు మరణించారు.
గాజా ప్రజలు ఉత్తర ప్రాంతాన్ని విడిచి వెళ్లవద్దని హమాస్ అధికారులు సూచించారు. ఇదే సమయంలో గాజా ప్రజలను మానవ కవచాలుగా ఉపయోగిస్తారని ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను హమాస్ ఖండించింది.
ఇజ్రాయెల్ ఉత్తర గాజాపై గ్రౌండ్ అటాక్ చేయాలని నిర్ణయించుకుంటే హమాస్ మిలిటెంట్లు భవనాలు, సొరంగాల నుంచి వారిపై గెరిల్లా యుద్ధం చేయవచ్చు.
దీంతో ఆ ప్రాంతం స్వాధీనం చేసుకోవడానికి ఇజ్రాయెల్‌కు నెలల తరబడి పోరాటం చేయాల్సి రావొచ్చు. ఇదే సమయంలో అక్కడ వేల మంది పౌరులు చిక్కుకుపోతారు.
ఇవి కూడా చదవండి
- బీఆర్ఎస్ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందేంటి, చేసిందేంటి?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















