ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు: నెల రోజుల తర్వాత కూడా ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే...

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, హదాస్ తల్లి, మేనకోడల్ని చంపేశారు. ఆమె ఇద్దరు పిల్లల్ని, మాజీ భర్తను హమాస్ బందీలుగా చేసుకుంది
    • రచయిత, యోలాండే నెల్
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

ఇజ్రాయెల్ శక్తి సామర్థ్యాలు, మిలిటరీ చేష్టలుడిపోయిన రోజు అది. దేశంలోని ప్రతీ ఒక్కరూ అభద్రతా భావానికి, భయానికి లోనయ్యారు.

ఆరంభంలో ఇదంతా అసాధారణంగా ఏమీ కనిపించలేదు.

గాజా జరుపుతున్న రాకెట్ దాడుల గురించి ఉదయం పూట నా ఫోన్‌లో రెడ్ అలర్ట్ హెచ్చరికలు వచ్చినప్పుడు, ఆ దాడుల స్థాయి గురించి నాకు తెలియదు. అప్పుడు నేను ఆఫీసుకు వెళ్తానని చెప్పడానికి నా సహచరులకు మెసేజ్ చేశాను.

తర్వాత తీవ్రమైన మిస్సైల్ దాడుల కారణంగా నేను ఆఫీసులోని ఎయిర్ రైడ్ షెల్టర్‌లోకి పరిగెత్తాల్సి వచ్చింది.

గాజా సరిహద్దుల్లోని కంచెలను కత్తిరించి వాటి గుండా మోటార్‌బైక్‌లను నడుపుతూ దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడుతున్న హమాస్ ఫైటర్ల షాకింగ్ ఫొటోలను మేం చూశాం.

నోవా మ్యూజికల్ ఫెస్టివల్‌లో హమాస్ దాడుల నుంచి ప్రాణాలతో బయటపడినవారు, తమ జీవితంలో చూసిన అత్యంత దారుణమైన ఊచకోత గురించి ఇజ్రాయెల్ టీవీ స్టేషన్లలో చెబుతున్నారు.

ఇజ్రాయెల్ 75 ఏళ్ల చరిత్రలో అదొక భయంకరమైన రోజుగా నిరూపితమైంది. అత్యంత క్రమపద్ధతిలో, నిర్ధాక్షిణ్యంగా ఇజ్రాయెల్‌పై ఆరోజు దాడులు జరిగాయి. గాజాకు దగ్గరగా ఉన్న కిబ్బుట్జిమ్‌కు చెందిన కొందరి నుంచి, అక్కడి కుటుంబాల ఊచకోతకు సంబంధించిన ఫుటేజీ బయటకు వచ్చింది. మొత్తం 1,400 మందిని చంపినట్లు అంచనా.

యూదుల క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన ‘యోమ్ కిప్పుర్‌’ రోజున ఈజిప్ట్, సిరియాలు చేసిన ఆకస్మిక దాడికి సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో ఈ దాడి జరిగింది. నాటి దాడి ఒక పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారి తీసింది.

అక్టోబర్ 8వ తేదీన నేను అష్కెలాన్‌కు వెళ్లినప్పుడు ప్రజల్లో ఎలాంటి బాధ, షాక్ కనిపించిందో, ఇప్పుడు కూడా అక్కడి సామాన్య ఇజ్రాయెల్ పౌరుల్లో అదే శోకం, బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ భద్రతా దళాలు దారి పొడవునా భారీగా ఆయుధాలతో ఉన్న వ్యక్తులతో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. రాకెట్ సైరన్స్ నిరంతరం మోగుతున్నాయి. ఆసుపత్రుల వద్ద తమ పిల్లల కోసం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఇజ్రాయెల్ గాజా

ఫొటో సోర్స్, REUTERS

‘గాజాను నాశనం చేయండి’ అంటూ బాధితురాలైన ఒక తల్లి అరిచారు.

యుద్ధం ప్రారంభంలో శత్రువులకు తామేంటో చూపించాలి, ప్రతీకారం తీసుకోవాలనే కోరిక ఇజ్రాయెల్‌లో ఉండేది. అయితే, దాడులను తీవ్రం చేస్తే హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారిపై ప్రభావం పడొచ్చనే భయాలు పెరిగినట్లు పోల్స్ సూచిస్తున్నాయి.

హమాస్ వద్ద దాదాపు 240 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు. వీరిలో ఇజ్రాయెల్ పౌరులు, విదేశీయులు, సైనికులు, సాధారణ పౌరులు, యువత, వృద్ధులు ఉన్నారు.

బందీలుగా ఉన్న వారిని వెంటనే విడిపించాలనే విజ్ఞప్తులు, ప్రదర్శనలు జరుగుతున్నాయి.

నిర్ ఓజ్‌లో హమాస్ దాడుల నుంచి తప్పించుకొని హదాస్ కల్దెరాన్ అనే మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తన పిల్లలిద్దర్నీ విడిపించాలంటూ ఆమె నిర్విరామంగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.

హదాస్‌కు 12 ఏళ్ల ఎరెజ్, 16 ఏళ్ల సహర్ అనే పిల్లలు ఉన్నారు. ఆమె మాజీ భర్త ఒఫర్‌ను కూడా హమాస్ బంధించింది. అపహరణకు గురైన ఆమె తల్లి కర్మెలా డాన్, మేనకోడలు నోయా తర్వాత శవాలుగా కనిపించారు.

‘‘చనిపోయిన నా తల్లి, మేనకోడలు కోసం ఏడ్చే సమయం కూడా నాకు లేదు. ఎందుకంటే బతికి ఉన్న నా పిల్లలు, వారి తండ్రి కోసం నేను పోరాడాలి’’ అని బీబీసీతో హదాస్ చెప్పారు.

హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారంతా సురక్షితంగా వెనక్కి వచ్చేవరకు ఇజ్రాయెల్ తన సైనిక కార్యకలాపాలను ఆపాలని ఆమె కోరుతున్నారు.

బందీలను విడుదల చేయకుండా కాల్పుల విరమణ కోసం వచ్చిన పిలుపులను ఇజ్రాయెల్ తిరస్కరించింది. గాజాపై వైమానిక బాంబు దాడులను కొనసాగించింది.

గత నెలలో ఇజ్రాయెల్ బాంబు దాడులు ప్రారంభించినప్పటి నుంచి పాలస్తీనా భూభాగంలో 10 వేల మందికి పైగా చనిపోయినట్లు హమాస్ ఆధ్వర్యంలో పనిచేసే ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం చెప్పింది.

మరణించిన వారిలో 4,000 మంది చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.

ఇజ్రాయెల్

ఫొటో సోర్స్, REUTERS

అక్టోబర్ 7నాటి హమాస్ దాడులు, మధ్యప్రాచ్యంలో అత్యంత బలమైనదిగా భావించే ఇజ్రాయెల్ మిలిటరీ, దాని ప్రఖ్యాత ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని చూపించాయి.

2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగిన తర్వాత, 2007లో ఆ భూభాగాన్ని హమాస్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత ఇస్లామిక్ జిహాద్‌తో పాటు హమాస్ నుంచి తమకు పొంచి ఉన్న ముప్పును పరిమితం చేయడానికి ఇజ్రాయెల్ అధికారులు ప్రయత్నించారు.

గాజాలో ఇజ్రాయెల్ వ్యూహాన్ని ‘‘లాన్‌ను కత్తిరించడం (mowing the lawn)’’గా రక్షణ నిపుణులు వర్ణించడం సాధారణంగా మారింది.

అక్కడ తరచుగా చాలా పెద్ద ఘర్షణలు జరిగాయి. 2008, 2012, 2014, 2021లో ఇవి సంభవించాయి.

అయితే, ఇస్లామిక్ జిహాద్ లక్ష్యంగా నిరుటి ఆగస్టు, ఈ ఏడాది మే నెలలో జరిగిన ఘర్షణల్లో హమాస్ జోక్యం చేసుకోలేదని ఇజ్రాయెల్ పొరబడింది.

18 వేల గాజా ప్రజలకు వర్క్ పర్మిట్ ఇవ్వడం, హమాస్ సివిల్ సర్వెంట్లకు జీతాలు, సహాయం అందించేందుకు ఖతార్‌ను అనుమతించడం వంటి చర్యల ద్వారా అంతా బాగున్నట్లుగా ఇజ్రాయెల్ భావించింది.

కానీ, వారి భావన పెద్ద తప్పని నిర్ధరణ అయ్యింది. దూర శ్రేణి రాకెట్లు, డ్రోన్లు వంటి మెరుగైన ఆయుధాల సేకరణ, భూగర్భ సొరంగాలను మెరుగుపరుచుకోవడం వంటి వాటికి హమాస్ సమయం వెచ్చించినట్లుగా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

యుద్ధం ఇంకా ఉధృతంగా సాగుతున్నందున, అక్టోబర్ 7 నాటి దాడులకు దారి తీసిన పొరపాట్ల జాబితాను అందించడం తొందరపాటు అవుతుంది.

గాజా యుద్ధభూమిలో చాలామంది సైనికులు, హమాస్ దాడిలో పౌరులు మరణించడంతో ఇజ్రాయెల్ ఇంకా శోకంలోనే ఉంది.

దక్షిణ ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులు మొదలుపెట్టిన నెల రోజుల తర్వాత కూడా యుద్ధానికి సంబంధించిన వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)