ఆంధ్రప్రదేశ్: చెట్టు కిందే గర్భిణులు, రోగులకు వైద్యం.. కుట్లు, కట్లు కూడా అక్కడే.. రేకుల షెడ్డులో వైద్య సామగ్రి, మందులు

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
సకురు అనే మహిళ గర్భంతో ఉన్నారు. నెల నెలా పరీక్షల కోసం ఆసుపత్రికి వస్తారు. ఏడాదిన్నర క్రితం ఆమె తొలి కాన్పు కూడా అదే ఆసుపత్రిలో జరిగింది.
కానీ, అప్పుడూ, ఇప్పుడూ పరీక్షలన్నీ ఆరుబయట చెట్టు కిందనే. సూదిమందు ఇవ్వడానికి కూడా ఆసుపత్రిలో ఖాళీ లేదు. దాంతో ఆమెను బయట ఉన్న మంచం మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్‌లో వైద్యం కోసం వచ్చేవారి పరిస్థితి ఇది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రిలో వసతి సదుపాయం లేకపోవడంతో ఓపీ సీటు రాయడం నుంచి, మందు బిళ్లలు ఇవ్వడం, కట్లు, కుట్లు సహా అన్నీ చెట్టు కింద జరిగిపోతున్నాయి.
ఈమెకు మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో నివసించే అందరికీ అదే పద్ధతిలో వైద్యం అందుతోంది. ఏళ్ల తరబడి ఇదే జరుగుతోంది. దాంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి?
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే కొన్ని సదుపాయాలు ఉండాలి. రోజుకు కనీసం 200 మంది వరకు ఓపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కనీసం 20 మంది ఇన్ పేషెంట్స్ ఉండేందుకు అనువుగా సదుపాయాలు కల్పించాలి.
కానీ, దక్షిణ విజయపురి సీహెచ్‌సీ పాత భవనం శిథిలమైపోవడంతో కొత్త భవనం కట్టే వరకు తాత్కాలికంగా ఓ పాత భవనంలో రెండు గదులు కేటాయించారు.
ఆసుపత్రికి సంబంధించిన సామగ్రి, మందులు, ఇతర వస్తువులు పెట్టేందుకే ఆ రెండు గదులు సరిపోయాయి. పడకలు ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయింది.
2018 వరకు పాత భవనంలోనే అరకొర సదుపాయాల మధ్య సాగిన ఆసుపత్రిని తర్వాత, ప్రస్తుతం నడుస్తున్న రెండు గదుల్లోకి మార్చారు. అప్పటి నుంచి రోగులకు వైద్యం చెట్టు కిందనే అందించాల్సి వస్తోంది.
పాత భవనాన్ని 2020లో కూల్చేసి కొత్త భవన నిర్మాణం కోసం 2021లో శంకుస్థాపన చేశారు. రూ. 5.32 కోట్ల వ్యయంతో కొత్త ఆసుపత్రి భవనం కోసం 2021 జనవరి 26న శంకుస్థాపన జరిగింది.

ఇది జరిగి దాదాపు మూడేళ్లు కావొస్తున్నప్పటికీ, ఆ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో అరకొర సదుపాయాల మధ్య వైద్య సేవలు అందించాల్సి వస్తోంది.
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన కొత్త ఆసుపత్రి నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నందున, నీటిపారుదల శాఖకు చెందిన రెండు గదుల్లో ఆసుపత్రి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఏళ్ల తరబడి ఎండా, వాన, చలికి కూడా ఆరుబయటే వైద్యం అందించాల్సి వస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోగులకు అందించాల్సిన మందు బిళ్లలు, ఇతర సామాన్లు కూడా తాత్కాలికంగా రేకుల షెడ్డు వేసి అందులో దాచి ఉంచాల్సి వచ్చింది.
కొన్ని విలువైన పరికరాలు, పరీక్ష యంత్రాలు కూడా ఆరుబయటే ఉండిపోయాయి. చివరకు రక్తం నిల్వ చేసేందుకు వినియోగించే ఖరీదైన పరికరం వాడకుండానే మూడేళ్లుగా ఎండా, వానల్లో ఉండిపోయింది.

"ఎండా, వాన, చలితో చిక్కులు ఎదుర్కొంటున్నాం. అలాగే నడిచిపోతోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. మారుమూల ప్రాంతంలో మా గోడు ఎవరు వింటారు. అందుకే ఆసుపత్రి లేకుండానే చెట్టు కిందనే అన్నీ సాగిపోతున్నాయి. పక్కనే స్కూల్ బిల్డింగ్ ఏడాదిన్నరలో పూర్తయింది. కానీ, ఆసుపత్రి మాత్రం మూడేళ్లయినా కట్టడం లేదు’’ అని ఆదెమ్మ అనే స్థానికురాలు అన్నారు.
ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో తాము ఎక్కువగా ఆసుపత్రికి కూడా రావడం లేదని ఆమె వాపోయారు. దూరమైనప్పటికీ మాచర్లలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లపోతున్నాం అంటూ వివరించారు.
నవంబర్ 7వ తేదీన సుమారుగా 110 మంది ఓపీ కోసం వచ్చారు. వారందరికీ సేవలన్నీ చెట్టు నీడలోనే సాగిపోయాయి. ఉన్న వైద్యులందరూ ఒక్క గదిలోనే కూర్చోవాల్సి వచ్చింది. కేవలం ఒకే ఒక్క బెడ్ మాత్రం ఆక్సీజన్ అందించాల్సిన రోగికి అందుబాటులో ఉంది.

చిన్న గదిలో ఆపరేషన్ థియేటర్
అయితే, లోపల ఓ చిన్న గదిని ఆపరేషన్ థియేటర్‌గా మార్చుకుని, అక్కడే డెలివరీకి వస్తున్న వారికి సేవలందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
"ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఎందుకో నిర్లక్ష్యం వహించింది. పాత భవనం కూల్చేసినప్పుడే ఖాళీ ఎక్కడా లేదనే పేరుతో రెండు గదుల్లో ఆసుపత్రి పెట్టారు.
అప్పుడే ఏదైనా అద్దె భవనం తీసుకుని కొంత సదుపాయాలున్న చోట ఏర్పాటు చేసి ఉండాల్సింది.
అందుకు భిన్నంగా చెట్టు కింద బెడ్స్ వేసేసి చేతులు దులిపేసుకున్నారు. కొత్త భవనం నిర్మాణానికి కూడా నిధులు కేటాయించకుండా జాప్యం చేశారు.
ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తక్షణమే సరిచేయాలి" అంటూ మాచర్లకి చెందిన టీడీపీ నేత బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు.

‘‘త్వరలో అందుబాటులోకి ఒక బ్లాక్’’
రోగులు మాత్రమే కాకుండా సిబ్బంది, డాక్టర్లు కూడా ఇబ్బందుల మధ్యనే సేవలందించాల్సి వస్తోందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కటకం పోతు వీరయ్యచారి అన్నారు.
"సమస్య తీవ్రంగా ఉంది. అయినా అరకొర సదుపాయల మధ్య సేవలందిస్తున్నాం. ఇటీవల అధికారులు స్పందించి అదనంగా రెండు గదులు కేటాయించారు. అక్కడ ఆరు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం. రోగులకు అందించే సేవలకు ఆటంకం లేకుండా చేసేందుకు మా వంతు ప్రయత్నం జరుగుతోంది. కొత్త భవనం త్వరగా పూర్తి చేయాలని అధికారులకు నివేదించాం. ఒకట్రెండు నెలల్లో కనీసం ఒక బ్లాక్ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు. అది జరిగినా కొంత ఉపశమనంగా ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు.
కొత్త ఆసుపత్రి భవనం పనులు జరుగుతున్నాయి. మరికొన్ని నెలల్లో పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, డిసెంబర్ నెలాఖరు నాటికి ఒక్క బ్లాక్ అయినా సిద్ధం చేసే దిశలో అక్కడ పనులు సాగుతున్నట్టు కనిపించింది.

కొత్త భవనం సిద్ధమయ్యే వరకు చెట్టు కింద వైద్యం కొనసాగించాల్సిందేనా అంటూ వైద్యులను ప్రశ్నించగా అది ప్రభుత్వం చేతుల్లో ఉంటుందంటూ వారు సమాధానమిచ్చారు.
మరోవైపు ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ఇప్పటి వరకు 80 శాతం పూర్తయినట్టు ప్రభుత్వం చెబుతోంది. పెయింటింగ్, విద్యుత్, శానిటరీ ఏర్పాట్లు పూర్తి చేసి డిసెంబర్ 15 నాటికి కొత్త భవనం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. కాంట్రాక్ట్ సంస్థ మేఘా ఇంజనీరింగ్‌తో మాట్లాడి వేగంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.
కరోనా వంటి ఆటంకాల కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగిందని, త్వరలోనే కొత్త భవనం అందుబాటులోకి వస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?
- ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?
- 1971 వార్: పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆ రాత్రి ఏం జరిగింది?
- గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో
- ఆధార్ వివరాలతో డబ్బులు మాయం చేస్తున్న మోసగాళ్లు.. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














