తాయ్ చీ: పార్కిన్సన్ అనే భయంకరమైన మెదడు వ్యాధిని ఈ ఆర్ట్ నయం చేస్తుందా?

తాయ్ చీ

ఫొటో సోర్స్, Getty Images

‘తాయ్ చీ’ అనే చైనీస్ మార్షల్ ఆర్ట్‌ సాధన ద్వారా, పార్కిన్సన్ వ్యాధి లక్షణాలను చాలా సంవత్సరాల పాటు వాయిదా వేయవచ్చని చైనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.

పార్కిన్సన్ అనేది చాలా తీవ్రమైన మెదడు వ్యాధి. ఈ వ్యాధి వచ్చిన వారి పరిస్థితి క్రమక్రమంగా క్షీణిస్తుంది. శారీరక చర్యలను నియంత్రించడం వారికి కష్టంగా మారుతుంది.

‘తాయ్ చీ’ కళ పార్కిన్సన్ వ్యాధి పురోగతిని నెమ్మదించేలా చేస్తుందని ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ న్యూరోసర్జరీ అండ్ సైకియాట్రిక్‌’లో ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది.

పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 334 మంది రోగులపై ఈ అధ్యయనం చేశారు. ఇందులో 147 మంది రోగుల బృందం వారానికి రెండుసార్లు గంటపాటు ‘తాయ్ చీ’ కళను సాధన చేసింది.

ఈ కళను అభ్యసించని వారి కంటే, వారానికి రెండుసార్లు ఈ కళను సాధన చేసే వ్యక్తులు తక్కువ సమస్యలు ఎదుర్కొన్నట్లు ఈ అధ్యయనం గురించి రాసిన నివేదికలో బీబీసీ ప్రతినిధి ఫిలిప్ రాక్బీ పేర్కొన్నారు.

తాయ్ చీ

ఫొటో సోర్స్, Getty Images

పార్కిన్సన్ అంటే ఏంటి?

పార్కిన్సన్ వ్యాధిని అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారం, ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు తమ శారీరక కార్యకలాపాలపై నియంత్రణ కోల్పోతారు.

ఉదాహరణకు వారికి వణుకు, కండరాల పట్టేయడం, శారీరక సమతుల్యతను కోల్పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

చైనాలోని షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఈ అధ్యయనంలో అయిదేళ్ల పాటు వందలాది మంది పార్కిన్సన్ రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు.

ఇందులో 147మందితో కూడిన రోగుల బృందం క్రమం తప్పకుండా తాయ్ చీ సాధన చేసింది. మిగతా 187 మంది ఈ కళను ప్రాక్టీస్ చేయలేదు.

నెమ్మదిగా, సున్నితమైన కదలికలతో పాటు దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఈ కళను సాధన చేయాల్సి ఉంటంది.

తాయ్ చీ కళను ‘నెమ్మదిగా కదిలే శారీరక వ్యాయామం’ అంటూ ద చారిటీ పార్కిన్సన్ యూకే అనే సంస్థ అభివర్ణించింది. ఈ కళ రోగుల జీవితాన్ని, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతుందని చెప్పింది.

తాయ్ చీ కళను సాధన చేసే రోగుల్లో కదలికలు, లక్షణాలు, సమతుల్యతను అధ్యయనం చేసి వారిలో పార్కిన్సన్ వ్యాధి మందగించినట్లుగా పరిశోధకులు గుర్తించారు.

కళను సాధన చేసిన రోగుల సమూహంలో -

  • కళ్లు తిరిగి పడిపోవడం తగ్గింది
  • వెన్నునొప్పి తగ్గింది
  • జ్ఞాపకశక్తి, ఏకాగ్రతకు సంబంధించిన సమస్యలు తగ్గిపోయాయి.
  • నిద్ర, జీవన నాణ్యత మెరుగుపడినట్లు కనుగొన్నారు.
పార్కిన్సన్

ఫొటో సోర్స్, Getty Images

‘‘చాలా తక్కువ మందిపై పరిశోధన’’

న్యూరాలజీ న్యూరో సర్జరీ అండ్ సైకియాట్రీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం గురించి డాక్టర్ జనరల్ లీ, ఆయన సహరచయితలు మాట్లాడుతూ, ‘‘ఈ అధ్యయనం ద్వారా తాయ్ చీ సాధనతో పార్కిన్సన్ వ్యాధిపై చాలా ప్రభావం చూపవచ్చని తెలుస్తుంది’’ అని అన్నారు.

కానీ, ఈ పరిశోధన చాలా తక్కువ సంఖ్యలో వ్యక్తులపై జరిగిందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కళను సాధన చేసిన రోగుల సమూహంలో సానుకూల మార్పులకు తాయ్ చీ మాత్రమే కారణమని చెప్పలేమని వారు అన్నారు.

భారత్‌లో కూడా జీవనశైలి రుగ్మతల కారణంగా పార్కిన్సన్ రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

దిల్లీలోని బీఎల్ కపూర్, మ్యాక్స్ హాస్పిటల్‌లో న్యూరోసర్జరీ విభాగంలో పనిచేసిన డాక్టర్ వికాస్ గుప్తా, బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ రూఫీ జైదీతో దీని గురించి మాట్లాడారు.

‘‘పార్కిన్సన్ ప్రభావాలను తాయ్ చీ తగ్గించగలదు. అయితే, తాయ్ చీ ఒక్కటే పార్కిన్సన్‌ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడం సరైనది కాదు.

మీ జీవనశైలిని చురుగ్గా ఉంచే ఏ పని చేసినా దాన్నుంచి రోగులు కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. పార్కిన్సన్‌కు సంబంధించి కొత్త అధ్యయనం ప్రచురితమైంది. దీన్ని నిర్ధరించేలా మరిన్ని అధ్యయనాలు వచ్చేవరకు దీనిపై నేనేమీ వ్యాఖ్యానించలేను’’ అని ఆయన చెప్పారు.

తాయ్ చీ

ఫొటో సోర్స్, Getty Images

'తాయ్ చీ' అంటే ఏమిటి? దాని ప్రయోజనాలు ఏమిటి?

తాయ్ చీ అనేది మార్షల్ ఆర్ట్స్‌లో ఒక శైలి. ఇది చైనా సాంప్రదాయిక కళ. చైనాలోనే ఇది పుట్టింది. ఇందులో శారీరక కదలికలు నెమ్మదిగా ఉంటాయి. దీర్ఘ శ్వాస తీసుకోవాల్సి ఉంటుంది.

తాయ్ చీ సాధన ద్వారా శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండొచ్చు.

దీర్ఘకాలిక వ్యాధులకు తాయ్ చీ ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

ముంబైలోని లీలావతి, హిందుజా, ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రుల్లో రోగులకు తాయ్ చీ శిక్షణను అందిస్తున్న సందీప్ దేశాయ్ చెప్పినదాని ప్రకారం, తాయ్ చీ వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

దీని గురించి బీబీసీతో మాట్లాడిన సందీప్, ‘‘తాయ్ చీ కళ శరీర సమతుల్యతను మెరుగు పరుస్తుంది. వెన్నెముక గాయాలు, మోకాలి గాయాలను నయం చేయడంలో ఉపయోగపడుతుంది.

తాయ్ చీ ద్వారా శరీర భంగిమను సరిచేయవచ్చు. ఇది శరీరాన్నే కాదు మనసును కూడా ప్రశాంతంగా చేస్తుంది. క్రమం తప్పకుండా తాయ్ చీ కళను సాధన చేయడం వల్ల రక్తపోటు, రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఊపిరితిత్తులపై ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది’’ అని అన్నారు.

గత కొంతకాలంగా భారత్‌లో పార్కిన్సన్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోందని డాక్టర్ వికాస్ గుప్తా చెప్పారు.

‘‘మునుపటితో పోలిస్తే ఆయుర్దాయం కూడా పెరిగింది. దీనివల్ల ఈ సమస్య మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తుంది" అని అన్నారు.

పార్కిన్సన్ వంటి వ్యాధుల రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌లలో తాయ్ చీ వంటి వాటిని భాగస్వామ్యం చేయాలని తాయ్ చీ నిపుణులు సందీప్ దేశాయ్ అన్నారు. దీని పట్ల ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పారు.

వీడియో క్యాప్షన్, పార్కిన్సన్స్‌ వ్యాధిని ఈమె వాసన చూసి పసిగట్టగలరు!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)