జెరూసలెం 'అల్ అక్సా మసీదు' వద్ద తలపాగా ధరించిన భారత సైనికులు... వైరల్ అవుతున్న ఆ ఫోటోల వెనుక అసలు చరిత్ర ఏంటి?

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అప్పట్లో జెరూసలెంలో భారత సైనికులు
    • రచయిత, గుర్జోత్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లయల్‌పూర్‌కి చెందిన పాల్ సింగ్, పటియాలాకి చెందిన ఆసా సింగ్, అజ్నాలాకి చెందిన మగర్ సింగ్, గ్వాలియర్ పదాతిదళానికి చెందిన సీతారాం, గాజియాబాద్‌కి చెందిన బషీర్ ఖాన్ సమాధులు వాళ్లు పుట్టిన ఊళ్లలో కాకుండా వేల మైళ్ల దూరంలోని జెరూసలెం శ్మశానవాటికలో ఉన్నాయి.

మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల్లో మిడిల్ ఈస్ట్‌ ప్రాంతంలో వందల మంది బ్రిటిష్ సైనికులు చనిపోయారు. పాలస్తీనాతోపాటు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో చనిపోయిన సైనికుల స్మారకార్థం నిర్మించిన చిహ్నాలు ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని నాలుగు శ్మశానవాటికల్లో ఉన్నాయి.

అక్కడ చనిపోయిన వారి సమాధుల వద్ద వారి పేర్లతో ఏర్పాటు చేసిన రాళ్లు ఆ పాత జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతున్నాయి. అప్పట్లో బ్రిటిష్ సైన్యంలో భారత సైనికులు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వారిలో ఎక్కువ మంది ప్రస్తుత భారత్, పాకిస్తాన్, ఉమ్మడి పంజాబ్‌కు చెందిన వారే.

టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ ప్రచురించిన ''మెమోరియల్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ ఇన్ ఇజ్రాయెల్'' పుస్తకంలో వారి పేర్లను కూడా ప్రస్తావించింది. నవ్‌తేజ్ సింగ్ సర్నా భారత రాయబారిగా ఉన్న సమయంలో ఈ పుస్తకం ప్రచురితమైంది.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

అక్కడ భారత సైనికులు ఏం చేసేవారు?

ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం మొదలై నెల దాటిపోయింది.

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1400 మంది చనిపోయారు. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉత్తర గాజాపై సైనిక చర్యకు దిగింది. హమాస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం, ఇప్పటి వరకూ సుమారు 11 వేల మందికిపైగా చనిపోయారు. ఉత్తర గాజాలో ఇప్పటికే చాలా భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం ఆస్పత్రుల చుట్టూ భీకర పోరాటం కొనసాగుతోంది.

దీంతో సోషల్ మీడియాలోనూ, వార్తా పత్రికల్లోనూ ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం, దాని చరిత్ర చుట్టూ చర్చ నడుస్తోంది.

20వ శతాబ్దం మొదట్లో, ప్రస్తుత ఇజ్రాయెల్‌లో భారత సైనికులు మోహరించి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

తలపాగాలు ధరించిన సైనికులు అల్ - అక్సా మసీదు వద్ద మోహరించినట్లు ఆ ఫోటోల్లో కనిపిస్తోంది.

ప్రస్తుత ఇజ్రాయెల్‌లోని అల్ - అక్సా మసీదు లేదా టెంపుల్ మౌంట్ వెలుపల తలపాగాలు ధరించిన భారతీయ సైనికుల ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

అల్ - అక్సా మసీదు లేదా టెంపుల్ మౌంట్‌ను యూదులు, అరబ్బులు పవిత్ర స్థలంగా భావిస్తారని నవ్‌తేజ్ సర్నా చెప్పారు.

జెరూసలెం గురించి యూదులు, అరబ్బుల మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి. పలుమార్లు ఘర్షణలు కూడా జరిగాయి.

''అప్పట్లో ఆ ప్రాంతమంతా బ్రిటిష్ నియంత్రణలో ఉంది. భారతీయ సైనికులను తటస్థులుగా భావించేవారు. అందుకే భద్రత కోసం వారిని అక్కడ మోహరించారు'' అని సర్నా చెప్పారు.

అక్కడికి వచ్చే వారిని ఈ సైనికులు తనిఖీ చేసేవారని ఆయన చెప్పారు.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, INDIAN EMBASSY IN ISRAEL

ఫొటో క్యాప్షన్, జెరూసలెం ప్రధాన ద్వారాల్లో ఒకటైన లయన్స్ గేటు వద్ద భారత సైనికులు

పంజాబీ సైనికుల పాత్ర

బ్రిటిష్ సైన్యంలో అవిభజిత భారత్, అవిభజిత పంజాబ్‌‌కు చెందిన సైనికులు ఉండేవారని సైనిక చరిత్రాకారుడు మన్‌దీప్ సింగ్ బజ్వా తెలిపారు. హైఫా యుద్ధంతో పాటు అనేక యుద్ధాల్లో ఇక్కడి సైనికులు పాల్గొన్నారని ఆయన చెప్పారు.

అప్పట్లో భారతీయ సైనికుల్లో చాలా మంది తలపాగాలు ధరించేవారని, అది కొన్నిసార్లు సైనికులంతా పంజాబీలు, లేదా సిక్కులేననే అపోహలకు దారితీసేదని బజ్వా తెలిపారు.

అయితే, జనాభా పరంగా చూస్తే సిక్కుల భాగస్వామ్యం చాలా ఉంది. సినాయ్ - పాలస్తీనా క్యాంపెయిన్, పశ్చిమ దేశాల కూటమి, ఇరాక్‌(అప్పట్లో మెసపొటేమియా)లో కూడా సిక్కులు కీలక పాత్ర పోషించారు.

రెండో ప్రపంచ యుద్ధం వరకూ చాలా మంది భారత సైనికులు తలపాగాలు ధరించేవారు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి భారత సైనికుల వస్త్రధారణలో మార్పులు రావడం మొదలైంది.

కొన్నేళ్ల కిందట ఇజ్రాయెలీ ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది. అది కేవలం సిక్కు సైనికుల గౌరవార్థం మాత్రమే కాదని, భారతీయ సైనికుల గౌరవార్థం ఇజ్రాయెల్ ఆ స్టాంప్‌ను విడుదల చేసిందని బజ్వా చెప్పారు.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

హైఫా యుద్ధం: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం

మొదటి ప్రపంచ యుద్ధంలో ఇక్కడ జరిగిన హైఫా యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ హైఫా) చాలా ముఖ్యమైనదని మన్‌దీప్ సింగ్ బజ్వా చెప్పారు.

1918లో జరిగిన ఈ హైఫా యుద్ధంలో భారత సైనికులు కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ సైన్యానికి, ఓటొమన్ సామ్రాజ్యానికి మధ్య జరిగిన నిర్ణయాత్మక యుద్ధం ఈ హైఫా యుద్ధమని బజ్వా అన్నారు.

బ్రిటిష్ సామ్రాజ్యం తరఫున పోరాడుతున్న సైన్యంలో అశ్వదళం చాలా పెద్దది. ఆ దళం తుర్కిష్ సైన్యాన్ని ఓడించింది. ఆ సమయంలో బ్రిటిష్ సైన్యంలో 'ఇంపీరియల్ సర్వీస్ ట్రూప్స్' అని పిలిచే ఇండియన్ స్టేట్ ఫోర్స్ యూనిట్లు(భారత భద్రతా దళాలు) ఉన్నాయి.

హైఫా యుద్ధంలో జోధ్‌పూర్ లాన్సర్స్, మైసూర్ లాన్సర్స్ ప్రధాన పాత్ర పోషించాయి. ఈ యూనిట్లలో జోధ్‌ఫూర్, మైసూర్ ప్రాంతాలకు చెందిన సైనికులు ఉండేవారు.

హైఫా యుద్ధం జరుగుతున్న సమయంలో పటియాలాకి చెందిన పటియాలా లాన్సర్స్ సైన్యంలో భాగంగా ఉన్నప్పటికీ, వారు యుద్ధంలో పాల్గొనలేదని బజ్వా చెప్పారు.

అయితే, హైఫా యుద్ధంలో సిక్కు సైనికుల పాత్ర గురించి, ఆ యుద్ధంలో సిక్కు సైనికులు పాల్గొన్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతోంది.

''రెండు ప్రపంచ యుద్ధాల్లో పంజాబీ సైనికులు లేదా భారతీయ సైనికులు కీలక పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని, కానీ, హైఫా యుద్ధంలో సిక్కు సైనికులు పాల్గొన్నారనే వాదన నిజం కాదు'' అని బజ్వా చెప్పారు.

భారత ధర్మశాల
ఫొటో క్యాప్షన్, బాబా ఫరీద్ ధర్మశాలగా పిలిచే భారతీయ ధర్మశాల

హైఫా యుద్ధంలో ‘హీరో’ మేజర్ దల్పత్ సింగ్‌

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పాలస్తీనాలో పెద్ద యుద్ధమేమీ జరగలేదని నవ్‌తేజ్ సర్నా చెప్పారు. ఆయన 'ది హెరాల్డ్స్ గేట్ - ఏ జెరూసలెం టేల్' అనే పుస్తకం కూడా రాశారు.

భారతీయ సైనికులు విశ్రాంతి తీసుకునేందుకు, చికిత్స కోసం లిబియా, లెబనాన్, ఈజిస్ట్ తదితర ప్రాంతాల నుంచి జెరూసలెంకు వచ్చేవారని ఆయన చెప్పారు.

బాబా ఫరీద్ ధర్మశాలగా పిలిచే భారతీయ ధర్మశాలలోనూ వాళ్లు విశ్రాంతి తీసుకునేవారు. బాబా ఫరీద్ (షేక్ ఫరీద్ శకర్‌గంజ్) 1200 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో పాలస్తీనా ప్రాంతంలో జరిగిన అనేక యుద్ధాల్లో భారత సైనికులు పాల్గొన్నారు. ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్ దల్పత్ సింగ్‌ను హైఫా యుద్ధంలో హీరోగా చెబుతారు.

ఇండియన్ ఎంబసీ ప్రచురించిన పుస్తకం ప్రకారం, అవిభజిత భారత్‌కు చెందిన సైనికులు ప్రపంచ యుద్ధాల్లో ప్రధాన పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా పాలస్తీనా ప్రాంతంలో జరిగిన యుద్ధాల్లో కీలకంగా వ్యవహరించారు.

ప్రస్తుత ఈజిప్ట్, ఇజ్రాయెల్ ప్రాంతంలో దాదాపు 1,50,000 మంది భారత సైన్యాన్ని మోహరించినట్లు ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

1918 సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగిన పాలస్తీనా క్యాంపెయిన్‌లోనూ భాగస్వాములయ్యారు.

'కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్' లెక్కల ప్రకారం, 13,02,394 మంది భారత సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చేసరికి ఆ సంఖ్య 25 లక్షలకు పెరిగింది.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, IMPERIAL WAR MUSEUM PHOTOGRAPHIC ARCHIVE/OXFORD UNIVERSITY

1917లో జెరూసలెంను స్వాధీనం చేసుకున్న సైన్యంలో భారతీయులు

ఓటొమన్ సామ్రాజ్యానికి, బ్రిటిష్ సైన్యానికి యుద్ధం జరిగిన పాలస్తీనా కీలక ప్రాంతమని చరిత్రకారుడు మన్‌దీప్ సింగ్ బజ్వా చెప్పారు.

సిరియా, సినాయ్, జోర్డాన్ వరకూ ఓటొమన్ సామ్రాజ్యం విస్తరించి ఉండేది.

ఆ యుద్ధ సమయంలోనే బాల్‌ఫోర్ డిక్లరేషన్ (మైనారిటీలుగా ఉన్న యూదుల కోసం పాలస్తీనా ప్రాంతంలో ప్రత్యేక దేశం ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన బ్రిటిష్ డిక్లరేషన్) వచ్చిందని, అదే ప్రస్తుత ఇజ్రాయెల్ దేశ ఏర్పాటుకు బీజంగా మారిందని ఆయన చెప్పారు.

1917లో బ్రిటిష్ జనరల్ అలెన్‌బి జెరూసలెంను స్వాధీనం చేసుకున్నారని, అప్పుడు ఆయన సైన్యంలో భారత సైనికులు ఉన్నారని నవ్‌తేజ్‌ సర్నా చెప్పారు.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, INDIAN EMBASSY IN ISRAEL

హైఫా డే: ఏటా ఉత్సవాలు

మేజర్ దల్పత్ సింగ్ గౌరవార్థం ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని హైఫా ప్రజలు అనుకున్నారని, వాళ్లకు తాము మద్దతిచ్చామని నవ్‌తేజ్ సర్నా తెలిపారు. అప్పటి నుంచి హైఫా డే సందర్భంగా ఏటా సెప్టెంబర్ 23న వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.

హైఫా శ్మశానవాటిక కేవలం హైఫా యుద్ధంలో పాల్గొన్న వారి స్మృతులకు మాత్రమే గుర్తుకాదని, అప్పటి ఇతర సైనికులకు కూడా అది చిహ్నమని ఆయన అన్నారు. ఆ రోజు హైఫా శ్మశానవాటికలో సమాధులుగా మిగిలిన సైనికులతో పాటు హైఫా యుద్ధంలో పాల్గొన్న సైనికులందరినీ స్మరించుకుంటారని అన్నారు.

పర్యటకులతో పాటు అధికారులు ఇజ్రాయెల్ సందర్శనకు వెళ్లినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్లి వారికి నివాళులు అర్పిస్తుంటారని ఆయన చెప్పారు. అయితే, అది జరిగి చాలా కాలం అయిపోయిందని, ఇప్పటి తరానికి ఆ సైనికుల గురించి పెద్దగా తెలియదని అన్నారు.

''హైఫాలో నివసిస్తున్న వారు మాత్రం ఇప్పటికీ హైఫా యుద్ధంలో పోరాడిన సైనికులను గుర్తుంచుకుంటారు. హైఫా హిస్టారికల్ సొసైటీ కూడా దీని కోసం పనిచేస్తోంది'' అని నవ్‌తేజ్ సర్నా అన్నారు.

ఇజ్రాయెల్ - పాలస్తీనా

ఫొటో సోర్స్, Getty Images

భారత సైనికుల స్మారకాలు ఎక్కడెక్కడున్నాయి?

ఇజ్రాయెల్‌లోని నాలుగు శ్మశానాల్లో భారత సైనికుల సమాధులు ఉన్నాయి.

జెరూసలెం ఇండియన్ వార్ సెమెట్రీ(శ్మశాన వాటిక)లో 79 మంది భారత సైనికుల సమాధులు ఉన్నాయి. 1918 జులై నుంచి 1920 మధ్య వారిని అక్కడ ఖననం చేశారు. వారిలో ఒకరిని ఇప్పటికీ గుర్తించలేదు.

హైఫా ఇండియన్ వార్ సెమెట్రీలో పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, హైదరాబాద్‌కి చెందిన సైనికుల సమాధులు ఉన్నాయి.

రామల్లా వార్ సెమెట్రీలో భారత సైనికుల సమాధులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆ శ్మశానంలో 528 సమాధులున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ స్మారక చిహ్నం కూడా ఇక్కడ ఉంది.

1941లో ఏర్పాటు చేసిన ఖయాత్ బీచ్ వార్ సెమెట్రీలో రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన 691 మంది సైనికుల సమాధులు ఉన్నాయి. వాటిలో 29 భారత సైనికులవి.

కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికులను గుర్తుంచుకునేలా స్మారకాలను ఏర్పాటు చేసిందని నవ్‌తేజ్ సర్నా చెప్పారు. వీటిలో హైఫా సెమెట్రీ ప్రధానమని ఆయన అన్నారు.

నవ్‌తేజ్ సర్నా

ఫొటో సోర్స్, NAVTEJ SARNA

ఫొటో క్యాప్షన్, నవ్‌తేజ్ సర్నా 2008 నుంచి 2012 వరకూ ఇజ్రాయెల్‌లో భారత రాయబారిగా పనిచేశారు

1918లో ఈ హైఫా యుద్ధం జరిగింది. ఇందులో మైసూర్, జోధ్‌పూర్, బికనేర్ లాన్సర్స్(యూనిట్లు) పాల్గొన్నాయి. వారి స్మృత్యర్థం కొత్త దిల్లీలో 'తీన్ మూర్తి స్మారక్' నిర్మించారు.

ఈ సైనికుల్లో హిందువులు, ముస్లింలు, సిక్కులు ఉన్నారని సర్నా చెప్పారు.

''గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఆయా ప్రాంతాలను గుర్తించి, సైనికుల వివరాలు సేకరించి, వారి ఫోటోలు సహా పుస్తకం ప్రచురించాం'' అని ఆయన అన్నారు.

అందుకోసం కామన్వెల్త్ వార్ గ్రేవ్స్‌ కమిషన్‌తో కలిసి పనిచేశామని, ఇప్పుడు భారత్ నుంచి ఎవరైనా ఆ ప్రదేశానికి వెళ్తే ఆ సైనికులకు నివాళులు అర్పించి వస్తారని అన్నారు.

దాదాపు 60 దేశాల్లో నిర్మించిన బ్రిటిష్ సైనికుల శ్మశానవాటికలను కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ పర్యవేక్షిస్తుందని, అందుకు అయ్యే ఖర్చుకు భారత్ కూడా సహకరిస్తుందని చరిత్రకారుడు మన్‌దీప్ సింగ్ బజ్వా చెప్పారు.

ఇవి కూడా చదవండి: