కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత గర్భం దాల్చితే ఏం చేయాలి? వారికి ప్రభుత్వం చేసే సాయం ఎంత?

గర్భవతి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, వి.శారద
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పిల్లలు పుట్టకుండా మహిళలు లేదా పురుషులు చేయించుకునే శాశ్వత చికిత్స స్టెరిలైజేషన్ సర్జరీ లేదా కుటుంబ నియంత్రణ ఆపరేషన్.

140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో గర్భనిరోధక ఆపరేషన్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

ఇది పిల్లలు పుట్టకుండా ఉండేందుకు చేయించుకునే శాశ్వత చికిత్స అయినప్పటికీ, కొన్నిసార్లు విఫలమవుతుంది.

ఈ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా కొందరి జీవితాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు ఇది భారంగా మారుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి?

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత గర్భవతి అయిన కార్మికుడి భార్యకు ప్రతి నెలా రూ.10 వేలు చెల్లించాలని ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ ఆదేశించింది.

మదురైలోని అవనియపురంలో నివసించే సేందవర్ రకు అనే మహిళకు 2007లో కాశీ విశ్వనాథన్‌తో పెళ్లయింది.

వీరికి నలుగురు పిల్లలు. ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు.

2014లో రుకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. అయినప్పటికీ, రుకు ఐదోసారి గర్భవతి అయ్యారు.

ఈ విషయం గురించి సేందవర్ రుకుతో బీబీసీ తమిళ ప్రతినిధి మాట్లాడారు.

‘‘2019 నవంబర్‌లో నా పీరియడ్స్ ఆగిపోయాయి. కానీ, గర్భవతిని అవుతానని అనుకోలేదు. అప్పుడు నేనొక టైలరింగ్ కంపెనీలో పనిచేసేదాన్ని. మిషన్ వేడి వల్ల నా పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయని అనుకున్నాను.

అప్పుడు నా వయసు 37 ఏళ్లు. ఆ కారణంతోనే పీరియడ్స్ ఆగిపోయిండొచ్చు అనుకున్నాను. మూడు నెలల పాటు ఇలానే పీరియడ్స్ రాలేదు. కడుపులో ఎలాంటి వికారం కానీ, అలసట కానీ, కళ్లు తిరగడం కానీ లేవు. ఈ సమయంలో కేవలం నాకు కాస్త వెన్నునొప్పి, కడుపులో నొప్పి మాత్రమే వచ్చేవి’’ అని తెలిపారు రుకు.

‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత, నేను బాగా తీసిపోయాను. పీరియడ్స్ రాని ఈ మూడు నెలల పాటు కనీసం నా పొట్ట కూడా పెరగలేదు. కడుపులో ట్యూమర్ ఉండొచ్చేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకోవాలని నా పక్కింటి వారు చెప్పారు.

వారి సలహా మేరకు చెకప్ కోసం మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాను. 2020 ఫిబ్రవరి 19న నేను గర్భం దాల్చినట్లు వైద్యులు చెప్పారు. కానీ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని నేను వారికి చెప్పాను. వెంటనే, నాకు సర్జరీ చేసిన ఆస్పత్రికి వెళ్లమన్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకసలు అర్థం కాలేదు’’ అని రుకు చెప్పారు.

భర్త, పిల్లలతో రుకు
ఫొటో క్యాప్షన్, భర్త, పిల్లలతో రుకు

నాలుగోసారి గర్భవతి అయినప్పుడు రుకు డెలివరీ కోసం పుట్టిల్లు ఉండే విరుదునగర్ జిల్లాలోని నరికుడి గ్రామానికి వెళ్లారు. రుకు అమ్మ వ్యవసాయ కూలీగా పనిచేసేవారు.

నరికుడి గ్రామంలో ప్రాథమిక వైద్య కేంద్రంలో తన డెలివరీ అయింది. ఆ తర్వాత 2014 ఏప్రిల్ 17న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు.

కానీ, ఈ ఆపరేషన్ చేయించుకున్న ఆరేళ్ల తర్వాత రుకు మళ్లీ గర్భవతి అయ్యారు. అది రుకును తీవ్ర షాక్‌కు గురిచేసింది.

ఆర్థికంగా అంత స్తోమత కలిగినవారు కాకపోవడంతో, ఐదో బిడ్డను సాకడం కష్టమని అనిపించిందని రుకు చెప్పారు.

దీంతో అబార్షన్ చేయించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. కానీ గర్భం దాల్చిన మూడు నెలల తర్వాత అయితే అబార్షన్ కోసం కోర్టు అనుమతి అవసరం.

‘‘మార్చిలో నా కేసు విచారణ ప్రారంభమైంది. ఆ సమయంలో నేను ఐదు నెలల గర్భవతిని. కడుపులో బిడ్డ నా పొట్టను తంతున్న ఫీలింగ్‌ నాకు కలిగింది. ఇది నాకు చాలా ఇబ్బందికరమైన విషయం. మరో బిడ్డను సాకలేననే నా పరిస్థితిని తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చాను. చాలా అయోమయంలో కూడా ఉన్నాను’’ అని తెలిపారు.

రుకుకు ఈ విషయంలో సైకియాట్రిక్ కౌన్సిలింగ్‌ ఏర్పాటు చేసింది కోర్టు. అబార్షన్ సాధ్యం కాకపోతుండటంతో, ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది.

‘‘కోర్టు సపోర్టుతో నాకు కాస్త ఊరట లభించింది’’ అని రుకు తెలిపారు.

న్యాయవాది మనోకరణ్
ఫొటో క్యాప్షన్, న్యాయవాది మనోకరణ్

రూ.30 వేల సాయం అంత తేలిగ్గా రాలేదు

‘‘ఒకవేళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైతే సాధారణంగా పరిహారం కింద రూ.30 వేలు ఇవ్వాలి. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.

బాధితురాలు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా రుకుకు ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించలేదు. కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే రుకుకు రూ.30 వేల ఇచ్చారు.

డెలివరీ కోసం రాజాజీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు కూడా వారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రుకు చాలా బలహీనంగా ఉందని, మేం కోర్టుకు వెళ్లి, నేరుగా ఫిర్యాదు చేస్తామని చెప్పిన తర్వాతే పరిస్థితి కాస్త మారింది’’ అని న్యాయవాది మనోకరణ్ చెప్పారు.

2020 ఆగస్టులో రుకు మగపిల్లాడికి జన్మనిచ్చారు.

గర్భవతి

ఫొటో సోర్స్, GETTY IMAGES

మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఎలా చేస్తారు?

మహిళల శరీరంలో ఫెలోపియన్ నాళం ఉంటుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ సమయంలో, ఈ నాళాన్ని ఒక సెంటీమీటర్ సైజు కత్తిరించి కుడతారు.

యుటెరస్‌లోని అండాలతో పురుషుల వీర్యకణాలు కలవకుండా చేస్తారు. దీంతో ఫలదీకరణ ప్రక్రియ జరగదు. ఇది శాశ్వత గర్భనిరోధక చికిత్స.

ఈ చికిత్స తర్వాత గర్భం దాల్చడాన్ని నిరోధించేందుకు కండోమ్స్ లాంటి ఇతర గర్భనిరోధక పద్ధతులతో పనిలేదు. కొంత మంది మహిళలకు కొన్నిసార్లు ఈ చికిత్స విఫలమవుతుంది.

గర్భం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఏ పరిస్థితుల్లో ఆపరేషన్ విఫలమవుతుంది?

‘‘ఫెలోపియన్ నాళాన్ని కాకుండా దానికి పక్కనే ఉండే ఇతర టిస్యూలను తొలగించినప్పుడే ఈ తప్పిదం జరుగుతుంది. శస్త్రచికిత్స చేసిన తర్వాత అది ఫెలోపియన్ నాళమేనా? కాదా? అన్నది ధ్రువీకరించుకోవాలి.

ఒకవేళ ఆపరేషన్ విజయవంతంగా చేసినప్పటికీ, కొన్నిసార్లు ఫెలోపియన్ నాళాలు సహజంగానే అతుక్కుపోతుంటాయి. ఫెలోపియన్ నాళాలు అచ్చం నీళ్ల నాళాల మాదిరి ఉంటాయి. వాటిలోకి చిన్నచిన్న వీర్యకణాలు ప్రవేశించగలవు.

కొన్నిసార్లు సర్జరీని విజయవంతంగా చేసిన తర్వాత, అది విఫలమవుతుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళల్లో కొందరు మళ్లీ గర్భం దాల్చే ప్రమాదం ఉంది.

సాధారణంగా ఇది సర్జరీ చేయించుకున్న రెండేళ్ల తర్వాత జరుగుతుంటుంది’’ అని ప్రసూతి వైద్యురాలు జోసెఫిన్ విల్సన్ చెప్పారు.

ప్రసూతి వైద్యురాలు జోసెఫిన్ విల్సన్
ఫొటో క్యాప్షన్, ప్రసూతి వైద్యురాలు జోసెఫిన్ విల్సన్

ఎన్ని చికిత్సలు ఇలా విఫలమయ్యాయి?

2010-11లో తమిళనాడులో 318 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమయ్యాయి. 2011-12లో 217 చికిత్సలు, 2012-13లో 39 చికిత్సలు ఫెయిల్ అయ్యాయి.

2013-14లో 3,767 కుటుంబ నియంత్రణ సర్జరీలు ఫెయిల్ కాగా, 2014-15లో 5,928 సర్జరీలు విఫలమయ్యాయి. 2015-16లో 7,960 చికిత్సలు విజయవంతం కాలేదు.

‘‘కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దీనికి పలు కారణాలుంటాయి.

ఈ బాధితులకు తమిళనాడు ప్రభుత్వం రూ.30 వేల పరిహారం కూడా అందిస్తుంది. ఒకవేళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైతే, సంబంధిత జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ దీన్ని సమీక్షిస్తుంది.

రాష్ట్ర స్థాయి క్వాలిటీ అస్యూరెన్స్ కమిటీ ధ్రువీకరించిన తర్వాత, చర్యలు తీసుకుంటారు. గర్భవతి అయిన ఆధారం, చికిత్స చేయించుకున్న ఆధారాన్ని అప్లికేషన్‌తోపాటు సమర్పిస్తే, పరిహారాన్ని అందజేస్తారు.

పూర్తిగా కాకుండా పైపైన ఈ ఆపరేషన్ చేయడం, సహజంగా మళ్లీ ఈ నాళం అతుక్కోవడం, గాయాలు, ఇన్‌ఫెక్షన్ కారణాలను చూపుతూ అప్లికేషన్‌ను పెట్టుకోవచ్చు’’ అని తమిళనాడు కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు బీబీసీ తమిళ్‌తో చెప్పారు.

కుటుంబ నియంత్రణ ఆపరేషన్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ఆపరేషన్ చేయించుకుంటే సాయం లభిస్తుందా?

ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ చేయించుకుని, అది విఫలమైతే.. ఇదే కారణాలు చూపుతూ సాయం పొందవచ్చు.

కానీ, ఆ ఆస్పత్రి ప్రభుత్వం గుర్తించిన ఆస్పత్రి అయి ఉండాలి. ఆ తర్వాత కుటుంబ నియంత్రణ బీమా పథకం కింద ప్రభుత్వం పరిహార మొత్తాన్ని చెల్లిస్తుంది.

కోర్టు

3 లక్షల పరిహారం

రుకు కేసులో మద్రాసు హైకోర్టుకు చెందిన మదురై బెంచ్ ఇచ్చిన తుది తీర్పును చూస్తే.. బాధిత మహిళకు పరిహారంగా రూ. 3 లక్షలు ఇవ్వాలి. ఐదో బిడ్డకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్యను కల్పించాలి. అలాగే, బిడ్డకు 21 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతి నెలా రూ.10 వేలు ఇవ్వాల్సి ఉంటుంది.

2022 జనవరి నుంచి 2013 ఏప్రిల్ వరకున్న ఇలాంటి కేసుల్లో ప్రభుత్వం సాయం చేయాలని కోర్టు ఆదేశించింది. సాధారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విఫలమైతే ఇచ్చే పరిహారం రూ.30 వేలను ఆమెకు అందించారు. మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

డాక్టర్ల నిర్లక్ష్యంతోనే సర్జరీ విఫలమైన మరో కేసు ఈ ఏడాది జనవరిలో నమోదైంది. సంబంధిత మహిళకు ఉపశమన పరిహారం అందించాలని కూడా కోర్టు ఆదేశించింది.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం ఎంత సాయం అందిస్తుంది?

కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం, డిశ్చార్జ్ అయిన ఏడు రోజుల్లో ఈ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి మరణిస్తే రూ.2 లక్షల పరిహారమివ్వాలి.

ఒకవేళ డిశ్చార్జ్ అయిన వ్యక్తి ఎనిమిది లేదా 30 రోజుల్లో మరణిస్తే, రూ.50 వేలు చెల్లించాలి. సర్జరీ విఫలమైతే రూ.30 వేలను పరిహారంగా ఇవ్వాలి.

సర్జరీలో ఏదైనా సమస్యలు నెలకొంటే రూ.25 వేలు అందించాలి.

కోర్టు ఆమెకు అదనపు సాయం అందించినప్పటికీ, రుకు జీవితం చాలా క్లిష్టతరంగా మారింది.

‘‘ఐదో బిడ్డకు పేగు వ్యాధి సోకింది. నాకు కూడా పేగు ఇన్‌ఫెక్షన్ వచ్చింది. నా భర్త భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు. ఆయనకు కిడ్నీ ఫెయిల్ అయింది. వారంలో మూడు రోజులు డయాలసిస్ చేయించాలి.

కుటుంబమంతా నాకు వచ్చే జీతంతోనే బతకాలి. ఒక ప్రైవేట్ ఛారిటబుల్ సంస్థలో పార్ట్‌ టైమ్ పని చేస్తున్నాను. నాకు రూ.6,500 జీతమొస్తుంది. తక్కువ ఆదాయం కావడంతో, నేను పేగు వ్యాధికి చికిత్సను వాయిదా వేస్తూ వస్తున్నాను’’ అని రుకు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)