యుద్ధం లక్ష్యానికి ఇజ్రాయెల్ ఎంత దూరంలో ఉంది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, జొనాథన్ బీల్
- హోదా, బీబీసీ డిఫెన్స్ ప్రతినిధి
ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7 హమాస్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(ఐడీఎఫ్) నెల రోజులుగా సాగిస్తున్న యుద్ధం ఎంత వరకు వచ్చింది?
లక్ష్యానికి ఇజ్రాయెల్ ఎంత దూరంలో ఉంది? ఇజ్రాయెల్ లక్ష్యం అసలు నెరవేరేదేనా?
రెండు వారాల కిందట గాజాలోకి ఇజ్రాయెలీ సైనిక దళాలు చొచ్చుకుపోయాయి. అలాగే నెల రోజులుగా హమాస్ దాడికి ప్రతిగా వైమానిక దాడులనూ ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది.
హమాస్‌ను సైనికపరంగా, రాజకీయంగా ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైనిక చర్య చేపట్టింది.
ఇజ్రాయెల్ కు సంబంధించినంతవరకు ఇప్పుడే యుద్ధం ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ చాలా కఠినమైనది, దీర్ఘకాలం కొనసాగేదని ఇజ్రాయెల్ పదేపదే చెపుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) సీనియర్ అధికారి ఒకరు బాక్సింగ్ మ్యాచ్‌తో ఈ యుద్ధాన్ని పోలుస్తూ ఇది కేవలం మొత్తం 15 రౌండ్లలో 4వ రౌండే’’ అని చెప్పారు.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయం ఇజ్రాయెల్‌లో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
2017లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) నుంచి మోసల్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు పశ్చిమ దేశాల మద్దతు ఉన్న ఇరాకీ సేనలకు 9 నెలల సమయం పట్టిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.
ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని మరికొన్ని నెలలు కొనసాగించాలని భావిస్తూ ఉండవచ్చు. యుద్ధ విరామంపైనా, కాల్పుల విరమణపైనా అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధ కాలపరిమితిపై ఇజ్రాయెల్ ఏమీ చెప్పలేకపోతోంది.
ఇరు వైపులా నష్టం ఎలా ఉంది?
సీనియర్ హమాస్ కమాండర్లు సహా అనేక కీలక లక్ష్యాలను మట్టుపెట్టినట్టు, ఇప్పటిదాకా 14 వేలకు పైగా దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ చెపుతోంది. ప్రతిదాడుల్లోనూ ఇజ్రాయెల్ వివిధ రకాల ఆయుధాలను వినియోగించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ 23 వేలకు పైగా ఆయుధాలను వినియోగించిందని , జెరూసలెం న్యూస్ పేపర్ మాజీ సంపాదకుడు, సైనిక కార్యకలాపాలపై మంచి పట్టున్న యాకవ్ కట్జ్ తెలిపారు.
ప్రస్తుత యుద్ధాన్ని ఒకనాటి మోసుల్ కోసం జరిగిన యుద్ధంతో పోలుస్తూ అప్పట్లో పాశ్చాత్య మిత్రదేశాలు ఒక వారంలో ఐఎస్ లక్ష్యాలపై 5 వేలకు పైగా బాంబులు జారవిడిచాయని తెలిపారు.
యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాలో 4,400 మంది చిన్నపిల్లలు సహా 10,800 మంది మరణించారని హమాస్ నియంత్రణలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తమ సైన్యం గాజా స్ట్రిప్‌ను ఉత్తర, దక్షిణాలుగా విజయవంతంగా వేరు చేసిందని, గాజా సిటీని ఇజ్రాయెల్ సేనలు ముట్టడించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గాజా నడిబొడ్డుకు తమ సేనలు చొచ్చుకుపోయినట్టు చెప్పింది.
అయితే హమాస్ మాత్రం ఇజ్రాయెలీ దళాలు ఎటువంటి పై చేయి సాధించలేదని, గాజా నగరంలోకి చొచ్చుకు రాలేదని తెలిపింది.
హమాస్‌ను ఏకాకి చేయడమే తొలి లక్ష్యంగా ఇజ్రాయెలీ సేనలు ముందుకు సాగుతున్నాయి. ఇజ్రాయెలీ సైన్యం కారణంగా హమాస్ తీవ్ర నష్టాన్ని చూడాల్సి వస్తోంది. హమాస్ వద్ద 30 వేల నుంచి 40 వేల మధ్య ఫైటర్లు ఉన్నట్టు యుద్ద ప్రారంభంలో అంచనా వేశారు.
అయితే హమాస్ ఫైటర్లలో పది శాతాన్ని అంటే 4 వేల మందిని హతమార్చామని ఐడీఎఫ్ సీనియర్ లీడరు ఒకరు బీబీసీకి చెప్పారు. ఇలాంటి గణాంకాలను అంచనా వేయడం, వాటిని లెక్కించడం చాలా కష్టమైనది, చాలా జాగ్రత్తగానూ ఉండాలి. కానీ ఇజ్రాయెలీ బాంబు దాడుల వల్ల హమాస్ పోరాటపటిమ క్షీణిస్తోంది.
దీనికి భిన్నంగా ఇజ్రాయెలీ సైనిక నష్టం చాలా తక్కువగా కనిపిస్తోంది. గాజాలో పదాతిదళం చొచ్చుకుపోయినప్పటినుంచి ఇజ్రాయెలీ సైనికులు 34 మంది చనిపోయారు.
ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్, భద్రతా నిపుణుడు యోస్సీ కుపర్‌వాసర్ మాట్లాడుతూ- ఇజ్రాయెలీ సైన్యం తమ సైనికులు ఎక్కువ మంది చనిపోకుండా ఉండేందుకు గాజాలో భూతల ఆపరేషన్‌ను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తోందని తెలిపారు.
ఉత్తరం వైపున హమాస్‌కు చెందిన వారు ఎంత మంది ఉన్నారనేది స్పష్టంగా తెలియడం లేదు, ఎంత మంది ఫైటర్స్ ఇంకా సొరంగాలలో దాక్కున్నారో, ఎంత మంది స్థానిక జనాభాతో కలిసిపోయి దక్షిణానికి వెళ్ళిపోయారో తెలియదు.
ఇప్పటికీ గాజాలోని సొరంగాలు ఇజ్రాయెలీ దళాలకు సవాలుగానే ఉన్నాయి. సొరంగాలను కనుగొనగానే వాటిలోకి దిగి యుద్ధం చేయకుండా, వాటిని పేల్చివేస్తున్నారు.
నగరంలో యుద్ధం - సవాళ్ళు
సైనికపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా ఇజ్రాయెల్‌కు చాలా సానుకూలతలు ఉన్నాయి. అది సమచార వ్యవస్థలోకి చొచ్చుకుపోగలదు. గాజాలో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ పనిచేయకుండా చేయగలదు. గాజాలో భూభాగంపై ఏక్షణాన ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి దానికి జెట్లు, డ్రోన్లతో నింగిపైనుంచి ఆధిపత్యం చెలాయించగలగుతోంది. కానీ అదే సమయంలో భూగర్భంలోని సొరంగాలపై పట్టు సాధించలేకపోతోంది.
ఇప్పటికీ రోజూ 100 కొత్త స్థావరాలను కనుగొంటున్నామని, యుద్ధం సాగే కొద్దీ ఆ జాబితా తగ్గొచ్చని ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. ఇది ఎక్కువ కాలం కొనసాగుతుందని, లక్ష్యాలను గుర్తించడానికి, ప్రతిఘటించేవారిని ఏరిపారేయడానికి పదాతి దళంపై ఆధారపడక తప్పదని తెలిపారు.
రిస్క్ ఇంటెలిజెన్స్ కంపెనీ సిబీలైన్‌ను నిర్వహిస్తున్న మాజీ బ్రిటిష్ ఆర్మీ అధికారి జస్టిన్ క్రంప్ మాట్లాడుతూ గాజా జనసాంద్రతను బట్టి చూస్తే ఇజ్రాయెల్ చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. కాకపోతే ఇప్పుడు వారు నగరంలో భారీ రక్షణాత్మక ప్రాంతాల్లో పోరాడాల్సి ఉంటుందన్నారు.
‘‘ఇజ్రాయెలీ దళాలకు చక్కని ఆయుధాలు, మంచి శిక్షణ ఇచ్చి ఉండొచ్చు. కానీ పట్టణంలో యుద్ధం చేయడమనేది ఎంతటి అధునాతనమైన సైన్యానికైనా కఠినమైన విషయమే’’ అని చెప్పారు.
అయితే గాజాలో జరుగుతున్న పోరాటం పరిమితంగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఇదేమీ రష్యా, యుక్రెయిన్ మధ్య బుఖ్‌మత్ లాంటి పట్టణాలపై జరిగినంత తీవ్రమైన దాడి స్థాయిలో అయితే లేదు. ఇజ్రాయెల్ రక్షణ దళాలు విడుదల చేస్తున్న వీడియోలను బట్టి చూస్తే ట్యాంకులపైనా, రక్షణ కవచాలపైన ఆధారపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్ తన సైన్యాన్నంతా రంగంలోకి దించిందా అంటే కొంత మంది ఇప్పటిదాకా గాజాలో 30 వేల మంది ఇజ్రాయెలీ సైన్యం ఉందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ మొత్తం సైన్యం 1,60,00 మంది, అలాగే మరో 3,60,000 రిజర్వ్ బలగాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువభాగమే.
జస్టిన్ క్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెలీ సైనికులలో ఎంత మంది ప్రతి భవనాన్ని ఖాళీ చేయించడానికి, హమాస్ టన్నెల్స్‌తో పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని ప్రశ్నించారు.
హమాస్ బలమైన లక్ష్యాలను ఇజ్రాయెల్ ఎంచుకుంటుందని, బ్లాక్ బై బ్లాక్ పోరాటాలకు దిగికవపోచ్చని, ఎందుకంటే అది భారీ నష్టాన్ని మిగుల్చుతుందని, ఇది హమాస్ చెరలో ఉన్న 200 మందికి పైగా బందీల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇజ్రాయెల్‌పై పెరుగుతున్న అమెరికా ఒత్తిడి
హమాస్‌ను నిర్మూలించడమే తమ లక్ష్యమన్న ఇజ్రాయెల్ ప్రకటన నిజంగా ఆచరణ సాధ్యమేనా? ఓ భావజాలాన్ని బాంబులతోనూ, బుల్లెట్లతోనూ ధ్వంసం చేయలేమని ఇజ్రాయెలీ సీనియర్ అధికారులు కూడా గుర్తిస్తున్నారు.
కొంత మంది హమాస్ నాయకులు కూడా గాజాలో లేరు. ఈ యుద్ధంలో హమాస్ మూలాలు ఏవీ మిగిలినా, హమాస్ తాము ఇంకా మిగిలే ఉన్నామని, నిజానికి యుద్ధంలో గెలిచింది తామేనని చెపుతుంది అని కట్జ్ తెలిపారు.
ఈ కారణంతోనే హమాస్ దళాలను ఏరిపారేయడం ఒక్కటే ఇజ్రాయెల్ లక్ష్యం కాకూడదని, అక్టోబరు 7 నాటి దాడులు పునరావృతం కాకకుండా చూసుకోవాలని జస్టిన్ క్రంప్ నమ్ముతున్నారు.
తరువాత ఏం జరగనుందనే విషయాన్ని తెలియజేయాల్సిన ఒత్తిడి ఇజ్రాయెల్ పై రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యూఎస్ నుంచి ఒత్తిడి ఎక్కువైంది.
యుద్ధానంతర ప్రణాళిక లేకుండా గెలిచిన యుద్ధాలు చాలా తక్కువ. కానీ ఇప్పటిదాకా ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న యుద్ధంలో లోపించింది ఇదే.
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














