‘పాజిటివ్ పురుషత్వం’ అంటే ఏంటి, ఎలా ఉంటే మంచి మగవాడు అనిపించుకుంటారు?

పురుషత్వం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మగాడు ఏ పనిచేయాలి? ఏ పనిచేయకూడదనే విషయమై సమాజంలో మూసధోరణి ఆలోచనలు ఉన్నాయి

మగాళ్ళు ఎలా ఉండాలి? వారేం చేయాలి? ఏం చేయకూడదు? బహుశా ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి మగవాళ్ళు ఎలా ఉండాలనే విషయమై ఓ ప్రత్యేకమైన ఆలోచనాధోరణి కొనసాగుతూనే ఉంది.

అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు, మతాలను బట్టి మగాడి విషయంలో స్వల్ప తేడాలు ఉండచ్చేమోకానీ, మొత్తంగా అతను సామాజికంగా ఎలా ఉండాలనే విషయంలో పెద్ద తేడా అయితే కనిపించదు.

తరతరాలుగా మన ఇళ్ళలోనూ, చుట్టుపక్కలవారితో మాట్లాడేటప్పుడు, మీడియాలోనో ‘మగ’ విషయాలు అనేకం వింటుంటాం.

మగవాడు అన్నవాడు బాధపడకూడు, ఆడవారిలా ఏడవకూడదు, వాడేం మగాడ్రా తన్నులు తిని వచ్చాడు, గాజులేమన్నా తొడుక్కున్నాడా ఇలాంటి మాటలు తరచూ వింటూనే ఉంటాం.

నిజానికి ఇవ్వన్నీ మన పితృస్వామ్య సమాజానికి ప్రతిబింబాలు.

మగవాళ్ళు డబ్బు సంపాదించాలి, ఇంటికి కావాల్సిన సామాన్లు తేవాలి, కష్టమైన పనులు పురుషులే చేయాలి, ఇంటికి సంబంధించిన విషయాలలో మగవారే అంతిమనిర్ణయం తీసుకోవాలి లాంటివి మన సామాజిక ఆలోచనలలో ఇమిడిపోయి ఉన్నాయి.

ఈ ‘సామాజిక నిర్మాణం’ సమాజమే సృష్టించిందని పంజాబ్ యూనివర్సిటీలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఉమెన్ స్టడీస్ ప్రొఫెసర్ డాక్టర్ అమీర్ సుల్తానా చెప్పారు.

ఆమె బీబీసీతో మాట్లాడుతూ ‘‘ పురుషుల గురించి ఈ విధమైన ఆలోచనాధోరణిని సమాజమే సృష్టించింది. ఇందులో ప్రకృతి పాత్రేమీ లేదు’’ అని తెలిపారు.

‘‘అందుకే వివిధరకాల సమాజాలు ‘పురుషత్వానికి’ అనేక నిర్వచనాలు చెప్పినా వాటిలో ఉమ్మడిగా కనిపించే అంశం మాత్రం ఒక్కటే... పురుషుడు చాలా శక్తిమంతుడు, కాబట్టి తుది నిర్ణయాలు అతనే తీసుకోవాలి’’ అని చెప్పారు.

పురుషాధిక్యం
ఫొటో క్యాప్షన్, మగవాళ్ళ ఆలోచనలలో మార్పు వస్తోంది

2018లో ‘మీ టూ’ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మగవారికి సంబంధించిన ఈ తరహా ఆలోచనలకు ఓ ప్రత్యేకమైన పదం వాడుకలోకి వచ్చింది.

ఆ పదం ‘ టాక్సిక్ మాస్క్యూలానిటీ’. అంటే విషపూరిత మగతనమని దీని నిఘంటు అర్థం.

అంటే నువ్వు మగవాడివైతే ఆ విషయాన్ని ఓ ప్రత్యేక పద్ధతిలో నిరూపించి తీరాలన్నమాట.

మగవాడు బలవంతుడు. మహిళలు బలహీనులు. ఈ విషయాన్ని అంగీకరించడమే కాదు, ప్రవర్తనలోనూ కనిపించాలన్నమాట.

ఒకవేళ మీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే అవి నిజంగా ‘ టాక్సిక్ మాస్క్యూలానిటీ’ కిందే భావించాలి.

అయి దీని తరువాత ఓప్రశ్న ఉదయించవచ్చు. శతాబ్దాల తరబడి మగవాళ్ళ గురించి చేసిన ఆలోచనలన్నీ పురుషాధిక్యత కాక, విషపూరితమైన పురుషాధిక్యత అయితే, అసలు పురుషాధిక్యత అంటే ఏమిటని అనిపించవచ్చు?

ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేస్తుండగా ‘ ఆరోగ్యకరమైన పురుషత్వం’ లేదా ‘సానుకూల పురుషత్వం’ అనే కొత్త పదం వాడుక పెరుగుతున్నట్టు కనిపించింది.

గారీ బార్కర్ ఎకుమండో సెంటర్ ఫర్ మాస్క్యూలినిటీస్ అండ్ సోషల్ జస్టిస్ కేంద్రానికి సీఈఓ. ‘మెన్‌కేర్’ ‘మెన్ఎంగేజ్’ సంస్థలకు సహ వ్యవస్థాపకుడు కూడా.

ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకుపైగా ‘మెన్‌కేర్’ ప్రచారం సాగుతోంది. పురుషులను సంరక్షులకుల పాత్ర పోషించమని చెప్పడమే ఈ ప్రచారం ముఖ్యోద్దేశం.

మెన్‌ఎంగేజ్ ప్రపంచవ్యాప్తంగా 700కుపైగా ప్రభుత్వేతర సంస్థలతో అనుబంధంగా పనిచేస్తోంది.

గారి బార్కర్ ఇంటర్నేషనల్ మెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ సర్వే (ఇమేజస్) కు సహవ్యవస్థాపకుడిగానూ ఉన్నారు.

హింస, స్త్రీపురుష సమానత్వంపై పురుషుల ప్రవర్తన, తండ్రుల బాధ్యత, వారి ఆలోచనాధోరణి పై ప్రపంచంలోనే అతిపెద్ద సర్వేను ఇమేజస్ నిర్వహించింది.

గారీ బార్కర్ బీబీసీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘మంచి అబ్బాయిగానో, పురుషుడిగానో ఉండటమంటే ఏమిటనే విషయంలో చాలామంది అబ్బాయిలకు గందరగోళం ఉందని’’ గారీ బార్కర్ చెప్పారు.

‘పురుషుడు కుటుంబం బాగోగులు చూసుకున్నప్పుడు, అది కుటుంబానికంతటికి ప్రయోజనకరంగా ఉందని’ తమ సర్వేలో తేలిందని బార్కర్ చెప్పారు.

సానుకూల పురుషత్వం అనేది మహిళలపట్ల ఉండే చిన్నచూపునకు విరుగుడులాంటిదన్నారు.

మగవారిని తేలికగా మార్చే పద్ధతి ఏదైనా ఉందా అంటే లైంగిక వేధింపులు, మహిళలను కించపరిచే జోకులు విన్నప్పుడు వెంటనే వాటికి వ్యతిరేకంగా గొంతు విప్పేలా చేయడమే అత్యంత తేలికైన విధానమని చెప్పారు.

‘‘తమ బంధువులలోగానీ, ఆఫీసులోగానీ, తన మిత్రులలో గానీ ఎవరైనా లైంగిక హింసకు పాల్పడినట్టు తెలిస్తే వెంటనే పురుషులు తమ గొంతు విప్పాలి.’’ అని చెప్పారు.

సమాజంలో మహిళలు, బాలికలపట్ల ఏదైనా తప్పు జరిగినప్పుడు, దానికి వ్యతిరేకంగా పురుషులు తమ గొంతు వినిపించాలని పంజాబ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అమీర్ సుల్తానా కూడా చెప్పారు.

సానుకూల పురుషత్వం అంటే ఇదే అంటారు డాక్టర్ సుల్తానా.

‘‘ఒక మగవాడిగా ఇంట్లో తుది నిర్ణయం తీసుకునే హక్కు నీదైనప్పుడు కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకుంటాను అని చెప్పడం సానుకూల పురుషత్వం అవుతుంది’’ అని ఆమె ఓ ఉదాహరణగా చెప్పారు.

పురుషాధిక్యం
ఫొటో క్యాప్షన్, సంరక్షకుడిగా ఉండటమే సానుకూల పురుషత్వం

టాక్సిక్ మాస్క్యూలానిటి

మహిళా సాధికారికత, స్త్రీ,పురుష సమాన సాధించే ప్రయాణంలో మగవారి పాత్ర కీలకమంటారు బార్కర్.

ముంబాయి కేంద్రంగా భారతదేశంలో స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్న హరీష్ అయ్యర్ మాట్లాడుతూ అన్నిరకాల వారికి సమానమైన అవకాశాలు లభించడాన్ని స్వాగతించడమే సానుకూల పురుషత్వం అవుతుందని చెప్పారు.

స్త్రీవాద మూలంలోనే సానుకూల పురుషత్వం దాగుందని హరీష్ అయ్యర్ బీబీసీకి చెప్పారు.

పురుషాధిక్య సమాజం ప్రాథమ్యాలన్నీ పురుషల కోణం నుంచే తీసుకున్నవని, దీనివలన మహిళలు వివక్ష, అన్యాయాలను ఎదుర్కోవాల్సి వస్తోందని స్త్రీవాదం నమ్ముతుంటుంది.

‘సానుకూల పురుషత్వం’ కూడా స్త్రీవాద ఆలోచనలాంటిదేనని, కాకపోతే మహిళలు ఒక్కరికే కాకుండా అన్నిజెండర్లకు సమాన అవకాశాలు ఉండాలని హరీష్ అయ్యర్ చెప్పారు.

ఈరోజులలో సానుకూల పురుషత్వం గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నారంటే. పురుషాధిక్యత గురించి సమాజంలో మాట్లాడుతున్నప్పుడు, దానికి బదులుగా సహజంగానే ఇలాంటి ప్రగతిశీల ఆలోచనల గురించి కూడా చర్చ సాగుతుందన్నారు.

పురుషాధిక్యం అనేది కేవలం పురుషలకే సంబంధించిందని కాదని, కొంతమంది మహిళలు కూడా దీనిని పెంచి పోషిస్తుంటారని హరీష్ కీలకమైన విషయాన్ని చెప్పారు.

డాక్టర్ అమీర్ సుల్తానా కూడా పురుషాధిక్యతను పెంచి పోషించేవారిలో మహిళలు కూడా ఉన్నారనే విషయాన్ని నమ్ముతున్నారు. ‘‘పురుషులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చే సమాజంలో మహిళలు కూడా భాగస్వాములు. కొన్ని రాజకీయ నిరసన ప్రదర్శనలలో మహిళలు అధికారులకో, రాజకీయనాయకులకో గాజులు ఇస్తుంటారు. గాజులను నిరసనకు ఓ గుర్తుగా చేశారు’’

ఇటీవల కాలంలో మగవారి ఆలోచనలలోనూ మార్పులు వస్తున్నాయని గారీ బార్కర్ నమ్ముతున్నారు. ఈ పురుషాధిక్య ఆలోచనలలో చాలాప్రమాదం ఉందని వారు కూడా గ్రహిస్తున్నారు. లింగసమానత్వం వైపు ప్రపంచం ప్రయాణిస్తే, అది మగవారికి కూడా ఉపయోగకారి అవుతుంది.

స్త్రీ,పురుష సమానత్వం కోసం మహిళలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలిస్తే, ఈ మొత్తం ప్రక్రియలో మగవారు కూడా పురుషాధిక్యత విషయంలో పరిణితి చెందినవారవుతారు.

సానుకూల పురుషత్వమంటే సమాజంలో వేళ్ళూనుకుపోయిన నియమాలు, కట్టుబాట్లను సవాలు చేసేదని స్త్రీవాద సంస్థ నజారియలో సీనియర్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ జయాన్ తెలిపారు.

‘‘సమాజంలో గృహ హింస పెరుగుతున్న వేళ, దానిపైన చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ మొత్తం వ్యవహారంలో పురుషత్వం అంటే ఏమిటో మగవారితో నేరుగా చర్చించాలి, అందుకే ఇదే సరైన సమయం.’’ అని బీబీసీకి చెప్పారు.

పురుషాధిక్యం
ఫొటో క్యాప్షన్, స్త్రీ,పురుషసమానత్వం ఇంటినుంచే మొదలవ్వాలి

ఆలోచనలు మారాల్సిన సమయం వచ్చింది

జాతీయవాదం గురించి మాట్లాడుతున్న ప్రస్తుత తరుణంలో సంప్రదాయ పురుషాధిక్యత కూడా తన ప్రభావం చూపుతోంది.

‘‘ ఆరోగ్యకరమైన పురుషత్వం గురించి ఇండియాలో మాట్లాడుతున్నారు. కానీ అది ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉంది. మగపిల్లలను ఎలా పెంచాలి, వారిని ఎలా తీర్చిదిద్దాలి అనే విషయాన్ని కొన్ని సంస్థలు చెపుతున్నాయి’’ అని జయాన్ చెప్పారు.

ఇందులో తల్లిదండ్రుల పాత్ర ఏమిటంటే

డాక్టర్ అమీర్ సుల్తానా మాట్లాడుతూ ‘‘ముందు ఓ మంచి వ్యక్తి అయినప్పుడే, మంచి పురుషుడు అవుతాడు. ఆడపిల్లలు, మగపిల్లలు సమానమేనని, వారి మధ్య ఏ తేడాలు లేవని చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పడం మొదలుపెట్టాలి’’ అన్నారు.

ఇప్పుడీ విషయం కేవలం స్త్రీ, పురుషులదే కాదు, ఇప్పుడి ఎల్‌జీబీటీక్యూది కూడా అని ఆమె చెప్పారు.

సమాజం ప్రగతిశీలమైనప్పుడే మొత్తం సమాజం మారగలదని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)