జపాన్ రివ్యూ : ‘దొంగ’గా కార్తీ ప్రేక్షకుల మనసుల్ని దోచాడా?

జపాన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

నటుడిగా కార్తీ ప్రయాణం వైవిధ్యంగా సాగుతోంది. 'పొన్నియన్ సెల్వన్'లో చేసిన పాత్ర మంచి పేరు తీసుకొచ్చింది.

గత దీపావళికి సోలో హీరోగా వచ్చిన 'సర్దార్' కూడా మంచి విజయాన్నే ఇచ్చింది. ఈ దీపావళికి 'జపాన్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తీ

జోకర్ సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న రాజు మురగన్ ఈ చిత్రానికి దర్శకుడు.

మంచి అభిరుచి గల చిత్రాలు చేయడంతో పేరు తెచ్చుకున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించింది.

ప్రమోషనల్ పిక్చర్స్‌లో కార్తీ గెటప్, డైలాగ్స్ ఈ సినిమాపై ఉత్సుకతను పెంచాయి. మరీ ఆ ఆసక్తి సినిమాల్లో కొనసాగిందా ? కార్తీ మరో దీపావళి విజయాన్ని అందుకున్నాడా?

ఎవరీ జపాన్?

నగరంలో రాయల్ అనే నగల షాపులో దొంగతనం జరుగుతుంది. దాదాపు రూ.200 కోట్ల విలువైన నగలు అపహరణకు గురవుతాయి.

ఈ కేసుని ఛేదించడానికి రంగంలోకి దిగిన పోలీసులకు ఓ క్లూ దొరుకుతుంది. ఈ దొంగతనం జపాన్ (కార్తీ) స్టయిల్‌లో ఉందని, దొంగతనం చేసింది జపానే అనే నిర్ధరణకు వస్తారు పోలీసులు.

అసలు ఈ జపాన్ ఎవరు? ఇంత ఫేమస్ దొంగ ఎలా అయ్యాడు? చివరికి పోలీసులకు చిక్కాడా? లేదా ? అనేది మిగిలిన కథ.

జపాన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

క్యారెక్టర్ కొత్తగా ఉంది కానీ..?

కొన్ని సినిమాల కథలు పాత్రలు ఆధారంగా వుంటాయి. ఒక పాత్ర స్వభావం చుట్టూ సన్నివేశాలు అల్లుకుంటారు.

ఆ అల్లుకున్న సన్నివేశాలు కూడా అ పాత్రకు ముడిపడితేనే ఆ పాత్ర ప్రయాణం, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా వుంటాయి.

జపాన్ కూడా పాత్ర ఆధారంగా రాసుకున్న కథే. ఆ క్యారెక్టర్ వరకూ కొంచెం కొత్తదనం వుంది. అయితే ఈ క్యారెక్టర్ ప్రయాణం రక్తికట్టించేలా వుండదు.

నగల దొంగతనంతో కథ మొదలౌతుంది. తర్వాత పోలీసులు రావడం, జపాన్ గురించి తెలుసుకోవడం ఆసక్తిని రేపుతాయి.

జపాన్ పాత్ర పరిచయం కూడా ఆసక్తికరంగానే వుంటుంది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తిగా ఆ క్యారెక్టర్‌ని పరిచయం చేసిన తీరు తర్వాత ఏమౌతుందనే ఆసక్తిని రేకెత్తించింది.

అంతకుముందు జపాన్‌కు సినిమాలు, నటన పట్ల ఆసక్తి, అతను తీసిన సినిమా.. కొన్ని నవ్వుల్ని పంచుతాయి. అయితే సన్నివేశాలు గడుస్తున్న కొద్ది కథనంలో నీరసం ఆవహిస్తుంది.

పోలీసుల విచారణ గందరగోళానికి దారితీస్తుంది. షాకింగ్ ఎలిమెంట్‌తోనే విరామం పడుతుంది. కానీ ఇలాంటి విరామ సన్నివేశాలు ఇదివరకూ చాలా సినిమాల్లో చూసినట్లు అనిపిస్తాయి.

జపాన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

ఉపకథ సరే కానీ.. ప్రేమకథ దండగా..

జపాన్ కథకు ఓ ఉప కథ వుంది. పోలీసు అధికారి శ్రీధర్ (సునీల్) రాధ అనే అమాయకుడిని పట్టుకొని చిత్ర హింసలు పెడుతుంటాడు.

రాధ కథ ఎమోషనల్‌గా వుంటుంది. అది క్లైమాక్స్ లో ఉపయోగపడుతుంది.

శ్రీధర్ పాత్రలో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే, జపాన్ కథకు తోడైన హీరోయిన్ సంజు( అను ఇమ్మాన్యుయేల్) ట్రాక్ ఇందులో సరిగ్గా ఇమడలేదు.

జపాన్, సంజు మధ్య వున్న బంధాన్ని సరిగ్గా రిజిస్టర్ చేయలేకపోయారు. దీంతో ఆ ట్రాక్ అంతా అయోమయంగా వుంటుంది. పైగా సంజు పాత్ర చాలా బలహీనంగా ఉంటుంది.

జపాన్ మూవీ రివ్యూ

ఫొటో సోర్స్, Twitter/AnnapurnaStudios

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి పోస్టర్ చుట్టూ సెకండ్ హాఫ్

విరామం ఘట్టంలో కథలో ఒక మలుపు వస్తుంది. ఇది రెగ్యులర్‌గా అనిపించినప్పటికీ.. అసలు దొంగ ఎవరు? అన్న ఆసక్తి పెరగాలి. కానీ అలా ఏం జరగదు.

పవన్ కళ్యాణ్, అను ఇమ్మాన్యుయేల్ ఉన్న అజ్ఞాతవాసి సినిమా పోస్టర్‌ని ఓ అజ్ఞాతవ్యక్తి ముద్దు పెట్టుకుంటాడు. అతడు ఎవరనే సస్పెన్స్ చుట్టూ కథని నడిపేశారు.

ఈ క్రమంలో తెరపైకి వచ్చిన గంగాధర్ పాత్ర అతని నేపధ్యం జపాన్‌కి మైనస్‌గా మారింది.

గంగాధర్ నుంచి ఓ చిన్న విషయం రాబట్టుకోవడానికి జపాన్ చేసిన ఓ యుద్ధం .. పూర్తిగా అనవసరం అనిపిస్తుంది.

నిజంగా ఆ పాత్రల్లో ఎలాంటి డ్రామా, యాక్షన్, సస్పెన్స్ లేదు. అదంతా వృథా ప్రయాసగా మారింది.

పైగా జపాన్ చిత్రాన్ని హీస్ట్ థ్రిల్లర్‌గా ప్రచారం చేశారు. ఆ అంచనాలతో వెళితే మాత్రం ఇంకా నిరాశకు గురికావాల్సి వస్తుంది. ఇందులో దొంగతనాలు ఏ మాత్రం ఆకట్టుకోవు.

చివర్లో చెప్పిన చేప కథ ఎలా వుంది ?

అసలు జపాన్ ఎవరనే ప్రశ్నకు చివర్లో సమాధానం దొరుకుతుంది. అయితే అప్పటివరకూ ప్రేక్షకులు ఉత్సాహంగా ఉంటే.. అతను చెప్పే చేప కథ వినడానికి ఓపిక ఉంటే.. ఆ కథ .. జపాన్ పాత్రకు ఓ సరైన ముగింపు ఇచ్చిందనే భావన కలుగుతుంది.

జపాన్ గతం, తన తల్లితో అతడికి ఉన్న అనుబంధం.. ఈ కథను రాధ కథతో ముడిపెట్టడం...చివర్లో జపాన్ పాత్రకు దర్శకుడు రాసుకున్న ముగింపు ఫర్వాలేదనిపిస్తాయి.

జపాన్

ఫొటో సోర్స్, Twitter/DreamWarriorPictures

కార్తీ వన్ మ్యాన్ షో

విలక్షణమైన పాత్రలు చేయడానికి ముందు ఉంటాడు కార్తీ. జపాన్ పాత్ర కూడా విలక్షణమైనదే.

ఆ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు కార్తీ. యాక్షన్ సీన్స్‌లో తన ఈజ్ చూపించాడు.

అను ఇమ్మాన్యుయేల్‌ది చిన్న పాత్ర. ఆ పాత్రతో తనకు వచ్చిన అదనపు లాభం ఏమీ లేదు. పైగా ఆ పాత్రకు సరైన ముగింపు లేదు.

పోలీసు అధికారి శ్రీధర్‌గా సునీల్ పాత్ర బావుంది. ఇది సునీల్‌కు మరో వైవిధ్యమైన పాత్ర. గెటప్ కూడా బావుంది.

భవాని పాత్రలో చేసిన విజయ్ మిల్టన్ పాత్ర కూడా కీలకమే. అలాగే రాధ పాత్రలో చేసిన నటుడు కూడా మెప్పిస్తాడు.

మిగతా ఏ పాత్రలకు సరైన ప్రాధాన్యత లేదనిపిస్తుంది. కె.ఎస్. రవికుమార్‌తో పాటు చాలా పాత్రల్లో స్పష్టత లేదు.

అలాగే చాలా పాత్రలు ఎలాంటి పరిచయం లేకుండానే కథలో కీలకమని చూపించిన విధానం ఏ మాత్రం ఆకట్టుకోవు. పైగా గందరగోళాన్ని సృష్టించాయి.

వీడియో క్యాప్షన్, జపాన్ రివ్యూ : ‘దొంగ’గా కార్తీ ప్రేక్షకుల మనసుల్ని దోచాడా?

టెక్నికల్‌గా ఎలా ఉంది?

టెక్నికల్‌గా జపాన్ మెప్పిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ పాటల్లో టచ్చింగ్ టచ్చింగ్ పాట క్యాచిగా వుంది.

నేపధ్య సంగీతం కొన్నిచోట్ల బాగానే చేశాడు. ఎస్. రవి వర్మన్ అందించిన విజువల్స్ డార్క్ మూడ్‌ని బాగానే చూపించాయి.

ప్రొడక్షన్ డిజైనర్ వినేష్ బంగ్లాన్ పనితీరు ఫరవాలేదనిపిస్తుంది.

ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ ఇంకా పదును ఉండాల్సింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి.

దర్శకుడు రాసుకున్న మాటలు కొన్ని నవ్విస్తే, కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి.

ఒక క్రేజీ క్యారెక్టర్‌తో వ్యవస్థలు, లొసుగులు, మనస్తత్వాలు, మంచి చెడులు, పరిస్థితులు, ఫిలాఫసీ.. ఇలా చాలా విషయాలని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేయాలనుకున్నాడు దర్శకుడు.

ఈ ప్రయత్నం అక్కడక్కడా మెప్పిస్తుంది కానీ.. చాలా చోట్ల నిరాశకు గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)