కోమటిరెడ్డికి రూ. 458 కోట్లు, పొంగులేటికి రూ. 434 కోట్ల ఆస్తులు

పొంగులేటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఫొటో సోర్స్, facebook

తెలంగాణలో నామినేషన్ల గడువు శుక్రవారంతో పూర్తి కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలలో ఇప్పటికే అనేక మంది నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ల సందర్భంగా నాయకులు దాఖలు చేసిన అఫిడవిట్లలో తమ ఆస్తుల వివరాలు, కేసుల వివరాలు, విద్యార్హతలు వంటివన్నీ వెల్లడించారు.

ఇప్పటివరకు నామినేషన్లు దాఖలు చేసిన నాయకులు, అధికారులకు అఫిడవిట్లు సమర్పించిన నాయకులలో అత్యధిక మొత్తంలో ఆస్తులున్నది పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికే.

బీఆర్ఎస్ అభ్యర్థులలో భువనగిరి నుంచి పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి ఆస్తులు కూడా వందల కోట్లలో ఉన్నాయి.

మరికొందరు అభ్యర్థులు, వారి భార్యల వద్ద కిలోల కొద్దీ బంగారం ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు.

గజ్వేల్‌లో నామినేషన్ వేసిన కేసీఆర్

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, గజ్వేల్‌లో నామినేషన్ వేసిన కేసీఆర్

కేసీఆర్‌కు వాహనాలు లేవు, భార్య పేరిట స్థిరాస్తులు లేవు.. బంగారం సుమారు 3 కేజీలు

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఈ ఎన్నికలలో గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆదాయం, సంపద వంటి వివరాలన్నీ వెల్లడించారు.

దాని ప్రకారం.. నామినేషన్ వేసే నాటికి కేసీఆర్ చేతిలో రూ. 2,96,605 నగదు ఉన్నట్లు వెల్లడించారు.

బ్యాంకులలో సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్‌డ్, టెర్మ్ డిపాజిట్లు వంటి అన్ని ఖాతాలలో ఆయనకు రూ. 11,16,25,887 ఉన్నట్లు చూపించారు.

ఆయన భార్య కల్వకుంట్ల శోభకు బ్యాంకులలో రూ. 6,29,08,404 ఉంది.

తెలంగాణ బ్రాడ్‌కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో రూ. 2,31,00,000 విలువైన వాటాలు.. తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ. 4,16,25,000 విలువైన వాటాలు ఉన్నాయి.

కేసీఆర్ పేరిట వాహనాలేమీ లేవు. మొత్తం రూ. 17,40,000 విలువ చేసే బంగారం, వజ్రాలు, రత్నాలు ఆయన వద్ద ఉన్నాయి.

ఆయన భార్య శోభ పేరిట 2,841 గ్రాముల (2 కేజీల 800 గ్రాముల) బరువైన బంగారు ఆభరణాలున్నాయి. 45 కేజీల వెండి వస్తువులున్నాయి. వీటన్నిటి మొత్తం విలువ రూ. 1,49,16,408గా పేర్కొన్నారు.

మొత్తంగా కేసీఆర్ పేరిట చరాస్తులు రూ. 17,83,87,492.. ఆయన భార్య పేరిట రూ. 7,78,24,488.. కేసీఆర్ హిందూ అవిభాజ్య కుటుంబానికి రూ. 9,81,19,820 మేర చరాస్తులున్నాయి.

స్థిరాస్తుల విషయానికొస్తే కేసీఆర్ పేరిట రూ. 8.5 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా ఆయన భార్య పేరిట ఏమీ లేవు.

కేసీఆర్ దంపతులకు స్థిర, చరాస్తులన్నిటి మొత్తం విలువ రూ. 58,93,31,800. మొత్తం అప్పులు రూ. 24,51,13,631

revanth reddy

ఫొటో సోర్స్, revanth reddy

రేవంత్ రెడ్డి: 89 పెండింగ్ కేసులు, రెండు తుపాకులు, సెకండ్ హ్యాండ్ కారు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ చేస్తున్నారు. దాంతోపాటు కొడంగల్‌లోనూ ఆయన పోటీ చేస్తున్నారు.

నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన వ్యక్తిగత వివరాలు వెల్లడించారు.

దాని ప్రకారం....ఆయనపై 89 పెండింగ్ కేసులున్నాయి. ఇంతవరకు ఏ కేసులోనూ ఆయన దోషిగా తేలలేదు. నామినేషన్ వేసే నాటికి ఆయన వద్ద 5,34,000 రూపాయల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, ఆయన భార్యకు కలిపి ఉన్న స్థిర, చరాస్తుల అన్నిటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 30,95,52,652గా పేర్కొన్నారు.

ఇద్దరికీ కలిపి మొత్తం రూ. 1,30,19,901 మేర అప్పులున్నట్లు అఫిడవిట్లో చూపించారు.

రేవంత్ రెడ్డి వద్ద రెండు వాహనాలు ఉండగా అందులో ఒకటి హోండా సిటీ, రెండోది బెంజ్. వాటిలో బెంజ్ సెకండ్ హ్యాండ్ కారని పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి దగ్గర రూ. 2 లక్షల విలువ చేసే పిస్టల్ ఒకటి, రూ. 50 వేల విలువ చేసే రైఫిల్ ఒకటి ఉన్నాయి.

రేవంత్ భార్య వద్ద 1235 గ్రాముల బరువైన బంగారం, వజ్రాల నగలున్నాయి. వాటి విలువ రూ. 83,36,000. దీంతో పాటు ఆమె వద్ద 9,700 గ్రాముల వెండి ఉంది. దాని విలువ రూ. 7,17,800.

eatala rajender

ఫొటో సోర్స్, eatala rajender

ఈటల రాజేందర్: కారు, బైక్, బంగారం లేవు.. భార్యకు మాత్రం మూడు కార్లు, కేజిన్నర బంగారం

గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ వేశారు.

ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తులు, కేసులు వంటి వివరాలన్నీ వెల్లడించారు.

తన పేరిటి కార్లు కానీ, బైక్‌లు కానీ, బంగారం కానీ లేవని వెల్లడించారు.

అయితే, ఈటల రాజేందర్ భార్య జమున పేరిట మూడు కార్లున్నాయి.

ఆమెకు రూ. 50 లక్షల విలువ చేసే ఒకటిన్నర కేజీల బంగారం ఉంది.

ఈటల, భార్యకు కలిపి మొత్తంగా రూ. 53,94,28,868 ఆస్తులుండగా రూ. 19,00,20,637 మేర అప్పులున్నాయి.

gangula kamalakar

ఫొటో సోర్స్, gangula kamalakar

గంగుల కమలాకర్: తెలంగాణ పొలిటికల్ గోల్డ్ మేన్.. ఆయనకు 4.5 కేజీలు, భార్యకు 8 కేజీల బంగారం

కరీంనగర్ సిటింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి మళ్లీ అక్కడే పోటీ చేస్తున్న గంగుల కమలాకర్ తన అఫిడవట్‌లో తనకు మొత్తం రూ. 35.065 కోట్ల ఆస్తులు, రూ. 50 లక్షల అప్పులు ఉన్నట్లు చూపించారు.

అయితే, కమలాకర్ అఫిడవిట్లో వెల్లడించిన బంగారం వివరాలు చూసి సోషల్ మీడియాలో ఆయన్ను ‘గోల్డ్ మేన్ ఆఫ్ తెలంగాణ’ అంటున్నారు.

ఆయనకు రూ. 2 కోట్ల 45 లక్షల విలువైన 436 తులాల బంగారం, రూ. 80 వేల విలువైన కేజీ వెండి ఉండగా.. ఆయన భార్యకు రూ. 4 కోట్ల 50 లక్షల విలువైన 800 తులాల బంగారం, అంటే తులం 10 గ్రాముల లెక్క వేసుకుంటే సుమారు 8 కేజీల బంగారం ఉన్నట్లు. దీంతో పాటు రూ. 80 వేల విలువైన కేజీ వెండి ఉంది.

కమలాకర్ కుమార్తెకు రూ. 14 లక్షల విలువైన 25 తులాల బంగారం ఉంది.

bandi sanjay

ఫొటో సోర్స్, bandi sanjay

బండి సంజయ్: స్థిరాస్తులు లేవు.. మొత్తం చరాస్తులే

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ తన అఫిడవిట్లో తనకు స్థిరాస్తులేమీ లేనట్లు చూపించారు.

ఆయనకు, భార్యకు కలిపి ఫార్చ్యూనర్, మారుతి సియాజ్, ఇన్నోవా కార్లు.. హీరోహోండా స్ప్లెండర్, యాక్టివా బైకులున్నాయి.

సంజయ్ పేరిట బంగారం ఏమీ లేదు. భార్యకు రూ. 24,08,000 విలువైన 43 తులాల బంగారం, రూ. 3 లక్షల విలువైన వెండి ఉన్నాయి.

బండి మొత్తం ఆస్తులు రూ. 42,33,000 కాగా భార్య అపర్ణ పేరిట రూ. 37,18,000.

బండి సంజయ్ అప్పులు రూ. 5,44,890 కాగా భార్య అప్పులు రూ. 12,40,000.

తనపై మొత్తం 35 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు బండి సంజయ్ తన అఫిడవిట్‌లో వెల్లడించారు.

komatireddy rajgopalreddy

ఫొటో సోర్స్, twitter/komatireddy rajgopalreddy

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: రూ. 458 కోట్ల ఆస్తిపరుడు

మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి శుక్రవారం నామినేషన్ వేశారు.

తనకు రూ. 92 లక్షల 56 వేల విలువైన 1,780 గ్రాముల బంగారం.. తన భార్య లక్ష్మికి రే. 2 కోట్ల 7 లక్షల 79 వేల విలువైన 3,996 గ్రాముల బంగారు నగలు, రూ. 14 లక్షల 40 వేల విలువైన 20 కేజీల వెండి.. రూ. 94 లక్షల 41 వేల విలువైన 30 క్యారట్ల వజ్రాలు ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో వెల్లడించారు.

ఆయనకు, భార్యకు కలిపి స్థిర, చరాస్తులు రూ. 458,39,39,115 అంటే అక్షరాల 458 కోట్ల 39 లక్షల 39 వేల 115 రూపాయల ఆస్తి ఉన్నట్లు.

ఇందులో సుషీ ఇన్‌ఫ్ఱా అండ్ మైనింగ్ లిమిటెడ్‌లో ఆయనకు 239 కోట్ల రూపాయలకు పైగా విలువ ఉన్న షేర్లు ఉన్నాయి.

Ponguleti Srinivasa Reddy

ఫొటో సోర్స్, Ponguleti Srinivasa Reddy

పొంగులేటి: రూ. 434 కోట్ల ఆస్తులు

పాలేరు అసెంబ్లీ నియోజకవకర్గంలో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులను చూసి ఆయనే అందరికంటే ధనిక అభ్యర్థి అని చెప్తున్నారు.

ఆయనకు రూ. 2,85,000 విలువైన 50 గ్రాముల బంగారం ఉండగా భార్యకు రూ. 2 కోట్ల 43 లక్షల విలువైన మూడున్నర కేజీల బంగారం, వజ్రాలు ఉన్నాయి. ఇది కాకుండా రూ. 7.5 లక్షల విలువైన 10 కేజీల వెండి ఉంది.

పొంగులేటి చరాస్తుల విలువ రూ. 32,44,27,100 కాగా భార్య పేరిట 364 కోట్ల 51 లక్షల 2 వేల 385 రూపాయల చరాస్తులున్నాయి. అందులో తన్లా ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సంస్థలో షేర్ల విలువ రూ. 236 కోట్ల 78 లక్షల 60 వేల 295 కాగా... రాఘవ కనస్ట్రక్షన్స్‌లో రూ. 47 కోట్లకు పైగా విలువైన షేర్లు ఉన్నాయి.

మొత్తంగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతుల ఆస్తి రూ. 433,93,34,880

ఇక అప్పుల విషయానికొస్తే పొంగులేటికి రూ. 4,22,72,411.. భార్యకు రూ. 39,30,51,803 కలిపి మొత్తం రూ. 43,53,24,214 అప్పులున్నాయి.

Pailla shekar reddy

ఫొటో సోర్స్, Pailla shekar reddy

పైళ్ల శేఖర్ రెడ్డి: రూ. 227 కోట్ల అభ్యర్థి

భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి అఫిడవిట్లో తన ఆస్తులు రూ. 227,51,86,867గా చూపించారు.

ఎస్ఎల్ఎస్ ప్రాపర్టీస్‌లో పార్ట్‌నర్‌గా , హిల్లాండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్, సంసిద్ధి డెవలపర్స్ పార్టనర్‌గా ఉన్న ఆయనకు స్థిరాస్తులున్నాయి. అయితే, తన పేరిట బంగారమేమీ లేదు. కార్లు నాలుగైదున్నాయి.

శేఖరరెడ్డి పేరిట రూ. 120,70,33,601 భార్య పేరిట రూ. 4,36,26,517 చరాస్తులున్నాయి.

స్థిరాస్తుల విషయానికొస్తే శేఖర్ రెడ్డి పేరిట రూ. 38,50,34,800 భార్య పేరిట రూ. 63,92,36,495 ఉన్నాయి.

మొత్తంగా రూ. 227,51,86,867 విలువైన ఆస్తులున్నాయి.

అప్పులు శేఖర్ రెడ్డికి రూ. 90,61,17,233.. భార్యకు రూ. 22,13,96,627 ఉన్నాయి.

malla reddy

ఫొటో సోర్స్, malla reddy

మల్లారెడ్డి: చేతిలో చిల్లిగవ్వ లేదు

‘పాలమ్మి, పూలమ్మి సంపాదించిన’ అని తరచూ చెప్పే మంత్రి మల్లారెడ్డి ప్రస్తుతం మేడ్చల్‌లో బీఆర్ఎస్ టిక్కెట్‌పై మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయనపై ఒక పెండింగ్ కేసు ఉంది.

అఫిడవిట్ ప్రకారం ఆయన చేతిలో(క్యాష్ ఇన్ హ్యాండ్) ఒక్క రూపాయి కూడా లేదు.

అంతేకాదు, ఆయనకు, భార్యకు వాహనాలు కూడా లేవు.

ఇద్దరికీ కలిపి మొత్తం ఆస్తి రూ. 95,94,73,407 కాగా రూ. 7,39,94,301 మేర అప్పులున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)