మేడిగడ్డ బరాజ్: డ్యామ్ సేఫ్టీ నివేదిక‌లో ఏముంది, ప్రభుత్వ వాదనేంటి?

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, FACEBOOK/COLLECTOR BHUPALPALLI

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్ (ఫైల్ ఫొటో)
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగానికి పనికిరాదని ‘జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ కమిటీ తేల్చింది. పూర్తిస్థాయిలో పునరుద్ధరించాల్సి ఉందని స్పష్టం చేసింది.

బరాజ్‌లోని పియర్లు (పిల్లర్లు) కుంగిపోవడం, పగుళ్లు రావడం కారణంగా దాని పనితీరుపై ప్రభావం పడిందని తేల్చింది.

ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటైన్స్ సరిగా లేకపోవడమే మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి కారణాలని కమిటీ తేల్చింది.

ఇంతకీ ఆ నివేదికలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయి? ఇంకా ఏం చెప్తోంది?

కాళేశ్వరం ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది

డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక

మేడిగడ్డ బరాజ్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది. దీన్ని ప్రాణహిత నది, గోదావరిలో కలిసే చోట నుంచి 22 కిలోమీటర్లకు దిగువన 2019లో గోదావరి నదిపై నిర్మించారు.

1.6 కిలోమీటర్ల పొడువు, 110 మీటర్ల వెడల్పుతో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో నిర్మించింది తెలంగాణ ప్ర‌భుత్వం.

ఈ ఏడాది అక్టోబరు 21న బరాజ్‌లోని పునాది (పియర్) కుంగిపోయింది. ఫలితంగా బరాజ్ వంతెన కుంగడంతోపాటు పియర్లకు పగు‌ళ్లు వచ్చాయి.

‘జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ’ కమిటీ అక్టోబర్ 23 నుంచి 25వ తేదీ వరకు మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించింది. ముందుగా అక్టోబర్ 23న తెలంగాణ నీటి పారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)తో సమావేశమైంది. మరుసటి రోజు మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించింది. తర్వాత రోజు మరోసారి నీటి పారుదల శాఖ, ఎల్ అండ్ టీ, ఎస్‌డీఎస్‌ఓ తదితర సంస్థలు, ఆయా వి‌‍భాగాలతో సమావేశమైంది.

దీనిపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) కమిటీ 11 అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ 43 పేజీల పరిశీలన నివేదికను ఇచ్చింది. దీన్ని రాష్ట్ర నీటి పారుదల ‌‍శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ షైనీకి ఎన్‌డీఎస్ఏ ఛైర్మన్ సంజయ్ కుమార్ సిబల్ పంపించారు.

బరాజ్ వైఫల్యాలపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని ఆ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది.

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, Revanth Reddy/X

ఫొటో క్యాప్షన్, డ్యామ్‌ను పునర్నిర్మించాలని రిపోర్టులోనే ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

జియోలాజికల్‌గా సాధ్యం కాదా?

మేడిగడ్డ బరాజ్ నిర్మా‌ణంలో జియోలాజికల్ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని, అందుకే నిర్మాణ లోపాలు తలెత్తుతున్నాయని హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త అశోక్ కుమార్ బీబీసీకి చెప్పారు.

‘‘మేడిగడ్డ నిర్మాణ లోపాలపై 2019లోనే హైకోర్టులో పిల్ వేశాం. ఇది 191/2020 నంబరుతో లిస్టు అయ్యింది. ఈ విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. కేవలం ల్యాడర్ సర్వే చేసి, క్షేత్రస్థాయిలో జియోలాజికల్ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా డ్యాం నిర్మించారు. బరాజ్ నిర్మించిన చోట 500 అడుగుల లోతుకు పరిశీలన చేయాలి. అలా కాకుండా హడావుడిగా నిర్మించేశారు. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. డ్యామ్ సేఫ్టీ లేదని కేంద్ర ప్రభుత్వం ముందే ఎందుకు ఆపలేదనేది మా ప్రశ్న. ఈ విషయంలో క్రిమినల్ కేసు పెట్టేందుకు వీలుంది’’ అని అశోక్ కుమార్ బీబీసీకి చెప్పారు.

బ్లాకును పూర్తిగా నిర్మించాలి. మేడిగడ్డలో సమస్య తలెత్తడానికి కారణం ఏడో బ్లాక్. ‌

ఇందులోని 21వ నంబరు కుంగిపోయింది. డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక ప్రకారం దెబ్బతిన్న బ్లాక్‌ను పునర్నిర్మించి, పని చేసేలా చేయాల్సి ఉంటుంది. అలాగే మిగిలిన బ్లాకులలోనూ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక బరాజ్ మొత్తాన్ని సరిచేయాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్‌ను నీటితో నింపినా లేదా వాడినా దాని పనితీరుపై మరింత దెబ్బతీసే అవకాశం ఉంది.

ఈ విషయంలో తెలంగాణ నీటి పారుదల శాఖ ఇప్పటికే స్పందించింది.

బరాజ్‌లోని నీటిని పూర్తిగా కిందకు విడిచిపెట్టే ప్రక్రియ చేపట్టింది.

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, కుంగిన మేడిగడ్డ బరాజ్

ఇసుక కొట్టుకుపోవడంతోనే సమస్య

బరాజ్ పిల్లర్లు కుంగడానికి కారణాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది.

  • బరాజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడంతో పియర్ల(పిల్లర్ల)కు ఆధారం బలహీనంగా మారింది.
  • ఫౌండేషన్ (పునాది)లో వాడిన మెటీరియల్ సామర్థ్యం లేదా పటిష్టత తక్కువగా ఉండటం.
  • బ్యారేజి లోడ్ కారణంగా సెకాంట్ వాల్స్ పై ఒత్తిడి పడి వైఫల్యం చెందడం.

వీటిన్నింటి కారణంగా ప్లానింగ్‌కు తగ్గ డిజైన్, నిర్మాణం జరగలేదని డ్యామ్ సేఫ్టీ అథారిటీ తేల్చిచెప్పింది. బరాజ్‌ను నీటిపై తేలియాడే నిర్మాణం (ఫ్లోటింగ్ స్ర్టక్చర్)గా డిజైన్ చేసి గట్టిదైన కట్టడంగా నిర్మించారని చెప్పింది.

బరాజ్ పైన, కింద వైపులా ఉన్న రాతిని చేరుకోవడానికి వరుసగా కాంక్రీట్ గోడలనే ఉపయోగించారు.

ఇదే విషయంపై బెంగళూరు యూనివర్సిటీ వాటర్ ఇనిస్టిట్యూట్ సాంకేతిక సలహాదారు బీవీ సుబ్బారావు బీబీసీతో మాట్లాడారు.

‘‘డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021ను తీసుకువచ్చారు. దాన్ని అనుసరిస్తున్నారా..లేదా అనేది కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇప్పుడు అంతా అయ్యాక చట్టాలు తెలుస్తున్నాయా..?’’ అని అన్నారు.

‘‘ఇప్పుడు మేడిగడ్డ బరాజ్ కట్టిన ప్రదేశంపై 2000 సంవత్సరంలోనే కేంద్ర జల వనరుల సంఘం నివేదిక ఇచ్చింది. అక్కడ ‌భారీ వరద వస్తుందని చెప్పింది. వందేళ్ల వర్షపాతం చూసుకుని డ్యామ్ నిర్మాణం చేయాలి. మరి దాన్ని ఎందుకు పట్టించుకోలేదు. అలాగే అవన్నీ జురాసిక్ పిరియడ్ సెడిమెంటరీ రాక్స్ ప్రాంతం. అక్కడ బొగ్గు గనులపై నది ప్రవాహం సాగుతుంది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టును అలాంటి చోట ఎందుకు కట్టాల్సి వచ్చిందో సమా‌‍‌‍‌‍‌‍ధానం చెప్పాలి’’ అని సుబ్బారావు బీబీసీతో అన్నారు.

నిర్వాహకులదే బాధ్యత

2019లో బరాజ్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఏటా వర్షాకాలం తర్వాత తనిఖీలు చేయాలని నివేదికలో కమిటీ ప్రస్తావించింది.

‘‘డ్యామ్ దిగువ భాగంలో ఎప్పటికప్పుడు పరిశీలన చేయాల్సి ఉంటుంది. డ్యామ్ నిర్వాహకులు తనిఖీ చేయకపోవడం లేదా సరిగా సిమెంట్ బ్లకాకులను నిర్వాహించకుండా వదిలేశారు. అదే బరాజ్‌ను బలహీన పరిచి వైఫల్యానికి కారణమైంది. ఇది పూర్తిగా నిర్వహణ లోపమే’’ అని కమిటీ స్పష్టంచేసింది.

మేడిగడ్డ విషయంలో వర్షాకాలానికి ముందు, తర్వాత కచ్చితంగా తని‌‍ఖీలు చేయని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తరచూ తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్‌కు చెప్పినట్లు నివేదికలో ఉంది.

‘‘తనిఖీలు చేసినట్లుగా లేదు. ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాఫ్టర్ 10 సెక్షన్ 41(బి)ని ఉల్లంఘించడమే. అంతేకాకుండా యాక్ట్‌లోని చాలా విషయాలను పాటించినట్లుగా కనిపించలేదు. బరాజ్ భద్రత, ఆర్థికపరమైన అంశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా సీరియస్‌గా చూడాలి’’ అని కమిటీ స్పష్టం చేసింది.

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, UGC

డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ఏం చెబుతోంది?

డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021లోని చాఫ్టర్ 10 సెక్షన్ 41(బి)ని కమిటీ ప్రధానంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఇది కీలకంగా మారింది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర పరిధిలోని డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ లేదా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనలు పాటించకుండా ‘ఏదైనా డ్యామ్ భద్రత’కు విఘాతం కలిగిస్తే ఏడాది వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. డ్యామ్ నిర్వాహకులపై ఈ విధమైన చర్యలు తీసుకునేందుకు చట్టం వీలు కల్పిస్తోంది.

ఒకవేళ డ్యామ్ భద్రత సరిగా లేక ఎవరైనా చనిపోవడం లేదా ప్రమాదం జరిగితే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే వీలుంది.

డేటా మొత్తం ఇవ్వలేదు

మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి 20 అంశాలపై డేటా కావాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ తెలంగాణ నీటి పారుదల ‌‍శాఖను కోరింది. అందులో కేవలం 11 అంశాలకు సంబంధించిన డేటా మాత్రమే తెలంగాణ నీటి పారుదల శాఖ ఇచ్చినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రధానంగా తొమ్మిది అంశాలలో అడిగిన డేటా ఇవ్వలేదని తెలిపింది. నిజానికి ఆయా అంశాలకు సంబంధించి సమాచారం ఇవ్వాలంటూ లేఖ రాసిన తర్వాత.. ఆ వివరాలు పంపించేందుకు అక్టోబరు 27 వరకు గడువు ఇచ్చింది. ఆ గడువులోగా వివరాలు రాకపోతే ప్రభుత్వం వద్ద లేవని ‌‍భావించాల్సి ఉంటుందని కమిటీ తెలిపింది.

నిర్దేశిత గడువులోగా పంపించలేదు కనుక ఆ వివరాలు లేవని కమిటీ ‌‍భావించినట్లుగా నివేదికలో ఉంది.

తెలంగాణ నీటి పారుదల శాఖ వద్ద వివరాలు లేకనే ఇవ్వలేదా.. లేదా కావాలని దాచి పెట్టారా.. అనే విషయాలు బయటకు తెలియడం లేదు.

‘‘సమాచారం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండి కూడా ఇవ్వకపోతే డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది’’ అని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రధానంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం కింది విషయాలను తెలంగాణ నీటి పారుదల శాఖ ఇవ్వలేదు.

  • ఇన్‌స్ట్రుమెంటేషన్ డేటా
  • ప్రీ మాన్ సూన్, పోస్టు మాన్ సూన్(వర్షాకాలం ముందు, తర్వాత) డ్యామ్ తనిఖీ చేసిన నివేదికలు
  • బరాజ్ పూర్తయిన నివేదిక
  • క్వాలిటీ కంట్రోల్ రిపోర్టు
  • గేట్ల కండిషన్
  • థర్డ్ పార్టీ మానిటరింగ్ రిపోర్టులు
  • నది కొలతలను చూపించే ముఖ్యమైన స్ట్రక్చరల్ డ్రాయింగ్స్

‘‘డేటా ఇవ్వలేదని కమిటీ చెబుతోంది. అసలు ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన డేటాను ఎప్పటికప్పుడు ముందే ఎందుకు తీసుకోవడం లేదు. నిర్దేశిత డేటా లేకుండానే ప్రాజెక్టు కట్టడానికి అనుమతి ఎలా ఇచ్చారు’’ అని బీవీ సుబ్బారావు బీబీసీతో అన్నారు.

జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికపై మాట్లాడేందుకు కాళేశ్వరం ఈ‌ఎన్‌సీ వెంకటేశ్వర్లును బీబీసీ ఫోన్లో సంప్రదించింది. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

అన్నారం ప్రాజెక్ట్

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, అన్నారం ప్రాజెక్ట్

అన్నారం, సుంది‌‍ళ్లను పరి‌‍శీలించాలి

మేడిగడ్డ బరాజ్‌‌ ఎగువన మరో రెండు బరాజ్లను ప్రభుత్వం నిర్మించింది. అవి.. అన్నారం, సుందిళ్ల. ఈ రెండు కూడా మేడిగడ్డ బరాజ్ తరహాలోనే డిజైన్, నిర్మాణం జరిగిందని కమిటీ తేల్చింది.

దీనివల్ల భవిష్యత్తులో ఆ రెండు బరాజ్‌లలో వైఫల్యాలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.

‘‘ఇప్పటికే అన్నారం బరాజ్ దిగువ వైపు నీరు ఉబికి వస్తున్న సంకేతాలున్నాయి. వైఫల్యాలలో ఇదొక సంకేతం. ఈ రెండు బరాజ్‌లను వెంటనే పరి‌‍శీలించి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.

మేడిగడ్డ బరాజ్

ఫొటో సోర్స్, Gkishanreddy/X

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్ దగ్గర కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు

నివేదికపై తెలంగాణ ప్రభుత్వం ఏమని బదులు ఇచ్చింది?

జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఇచ్చిన నివేదికపై తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ షైనీ స్పందించారు.

జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ సంజయ్ కుమార్ సిబల్‌కు రాసిన లేఖలో, “తొందరపాటులో నేరారోపణ చేయడం సరికాదు. నివేదికలోని విషయాలు చాలావరకు నిరూపితమైనవి కావు, వాస్తవాలు పట్టించుకోకుండా నివేదిక ఇచ్చారు” అంటూ లేఖలోని మొదటి పేరాలోనే ప్రస్తావించారు.

కమిటీ తరఫున ఎలాంటి పరిశోధన లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలు అంటూ నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.

జాతీయడ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ 20అంశాలకు సంబంధించి నివేదిక అడిగితే కేవలం 11అంశాలకు సంబంధించి మాత్రమే సమాచారం ఇచ్చామని చెప్పడం కూడా సరికాదని పేర్కొన్నారు.

‘‘కమిటీతో జరిగిన సమావేశాల్లో అన్ని డాక్యుమెంట్లను చూపాం. 20 అంశాలకు సమాధానాలు ఇవ్వాలని అక్టోబరు 27 సాయంత్రం మరో లేఖ కమిటీ పేరిత వచ్చింది. 29వ తేదీలోగా ఆ వివరాలు ఇవ్వాలని అందులో ఉంది.

చాలా తక్కువ సమయంలో పెద్దమొత్తంలో సమాచారాన్ని ఇవ్వాలని కమిటీ కోరినప్పటికీ, 17 రకాల అంశాల వివరాలను అక్టోబరు 29 సాయంత్రానికి ఈమెయిల్ ద్వారా పంపాం. మిగిలిన మూడు అంశాలకు సంబంధించిన సమాచారాన్ని నవంబరు 1న పంపాం.

స్టేట్ డ్యామ్ సెక్యురిటీ ఆర్గనైజేషన్ పంపిన వివరాలు పరిశీలించకుండానే తొందరపాటుతో కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరారోపణ చేశారు.’’ అని రజత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నారు.

కమిటీ తరఫున ఎలాంటి పరిశోధన లేకుండానే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలు అంటూ నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పారు.

‘‘డ్యాం పియర్లు కుంగడానికి కారణాలేమిటన్నది తేలాల్సి ఉంది. ప్రస్తతం కడుతున్న కాఫర్ డ్యాం పూర్తయ్యాక ఎక్కడైతే దెబ్బతిన్నదో అక్కడ పరిశీలించేందుకు వీలుంటుంది.

అప్పుడే పియర్లు ఎందుకు కుంగాయో తెలుస్తుంది. ఆ నివేదికలో చెప్పినట్లు ఇసుక కొట్టుకుపోవడం వల్లనో.. నాణ్యత, ప్లానింగ్ లేదా డిజైన్ లోపం వల్లనో కుంగిందని చెబితే ఏకీభవించేది లేదు.’’ అని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

లేఖలో ఆయన విభేదించిన మరికొన్ని అంశాలు..

అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కనీసం చూడకుండానే సూచనలు చేయడం సరికాదు. ఆ రెండు డ్యామ్‌లను రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తోంది.

కేంద్ర జల్ శక్తి మినిస్ట్రీ సలహా కమిటీ 6 జూన్ 2018న కాళేశ్వరం ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు ఇచ్చింది. అనంతరం నాటి కేంద్ర జల వనరుల సం‌‍‌‍ఘం ఛైర్మన్ మసూద్ హుస్సేన్ ప్రాజెక్టును సందర్శించి, కాళేశ్వరం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అద్భుతమని అన్నారు.

బరాజ్ ఆర్సీసీ ర్యాఫ్ట్‌ను ఇండియన్ స్టాండర్డ్ కోడ్ 6966ను అనుసరించి డిజైన్ చేసి నిర్మించాం.

డ్యామ్‌లోని సికెంట్ ఫైల్స్‌(రాళ్లతో కూడిన ప్రత్యేక నిర్మాణం)ను కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ మార్గదర్శకాల ప్రకారమే నిర్మించాం.

డ్యామ్ నిర్మాణ సమయంలో నాణ్యతను పట్టించుకోలేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదికలో పేర్కొనడం సరికాదు.

రాజకీయంగా విమర్శలు.. ప్రతి విమర్శలు

మేడిగడ్డపై జాతీయ డ్యామ్ సేఫ్టీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ విమర్శల దాడి మొదలుపెట్టాయి. ఆరోపణలపై బీఆర్ఎస్ కూడా దీటుగా బదులిస్తోంది. ఈ విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విలేఖరులతో మాట్లాడారు.

‘‘మేడిగడ్డ బరాజ్‌లోని లోపాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలి. ఇంజినీర్ల సలహాలు లేకుండా తానే సొంతంగా డిజైన్ చేసి నిర్మించారు. ఇప్పటివరకు సీఎం ఎందుకు సమాధానం చెప్పడం లేదు’’ అని ప్రశ్నించారు.

దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించినట్లు ఈనాడు పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇచ్చిందని కేటీఆర్ అన్నట్లుగా ఆ వార్తలో ఉంది.

‘‘గతంలో సీడబ్ల్యూసీ ఛైర్మన్ సహా అందరూ ఇంజినీరింగ్ అద్భుతం అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఇంజినీరింగ్ డిజాస్టర్ అయ్యిందా?’’ అని ప్రశ్నించారు.

కమిటీ రావడం, పరిశీలన చేయడం, నివేదిక ఇవ్వడం మూడు రోజుల్లో జరగడం చూస్తే.. దేశంలో మిగతా వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో.. ఇదీ అలాగే పనిచేస్తున్నట్లుందని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఈనాడు రాసింది.

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.

వీడియో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్: డ్యామ్ సేఫ్టీ నివేదిక‌లో ఏముంది, ప్రభుత్వ వాదనేంటి?

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)