తెలంగాణ: అలా పార్టీ మార్చేస్తున్నారు.. ఇలా మాటా మార్చేస్తున్నారు

వివేక్

ఫొటో సోర్స్, facebook

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2009లో కాంగ్రెస్.. 2013లో టీఆర్ఎస్‌.. 2014లో మళ్లీ కాంగ్రెస్.. 2016లో టీఆర్ఎస్.. 2019లో బీజేపీ.. 2023లో మళ్లీ కాంగ్రెస్..

పద్నాలుగేళ్లలో మూడు పార్టీలలో ఆరు సార్లు చేరిన నాయకుడు వివేక్ వెంకటస్వామి.

తెలంగాణలోని పెద్దపల్లి కేంద్రంగా రాజకీయాలు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేత వెంకటస్వామి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2009లో తొలిసారి కాంగ్రెస్ టికెట్‌పై పెద్దపల్లి నుంచి ఎంపీగా గెలిచారు.

ఆ తరువాత మళ్లీ ఇంతవరకు ఎన్నికలలో గెలవనప్పటికీ తరచూ పార్టీలు మారుతూ తెలంగాణలోని అన్ని ప్రధాన పార్టీలలోనూ పనిచేశారాయన.

తాజాగా ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌)ను గద్దె దించడమే తన లక్ష్యమంటూ, అందుకోసమే కాంగ్రెస్‌లో చేరుతున్నానంటూ ఆయన కండువా మార్చేశారు ఈసారి.

ఇదే వివేక్ ఒకప్పుడు కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లోనూ కొంత కాలం ఉన్నారు.

ఆ పార్టీలో టికెట్ రాకపోవడంతోనే బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.

ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో, ఎందుకు పార్టీ మారుతారో తెలియదంటూ సోషల్ మీడియాలో ఆయనపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

ఎన్నికల ముందు పార్టీలు మారడం కొత్తేమీ కానప్పటికీ ప్రస్తుత ఎన్నికలలో పార్టీలు మారుతున్నవారు పెద్ద సంఖ్యలో ఉండడం చర్చనీయమవుతోంది.

ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో వివేక్ ఒక్కరే కాదు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మైనంపల్లి హన్మంతరావు, పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, విష్ణువర్ధన్ రెడ్డి, రేఖా నాయక్, రాఠోడ్ బాపూరావు, వేముల వీరేశం వంటి చాలా మంది నాయకులు పార్టీలు మారారు.

తాజాగా తెలంగాణలో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్‌లో చేరారు.

వీరిలో కొందరు అధికార పార్టీ నుంచి ఇతర పార్టీలకు మారితే,మరికొందరు ఇతర పార్టీల నుంచి అధికార పార్టీలోకి మారారు.

టికెట్ రాక పార్టీ మారినవారు కొందరైతే టికెట్ ఇచ్చినా పార్టీ మారిన వారు మరికొందరు.

పార్టీ మారడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు.

వీరిలో కొందరు ఎవరిపైనా ఏమీ విమర్శలు చేయకుండా పార్టీలు మారుతుంటే, మరికొందరు మాత్రం వీడుతున్న పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు ఒకప్పుడు తమ నోటితోనే విమర్శించిన పార్టీ నేతలను ఇప్పుడు తెగ పొగిడేస్తున్నారు.

ఇవన్నీ గమనిస్తున్న ఈ తరం ఓటర్లు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యంగా నాగం జనార్దన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, పొన్నాల లక్ష్మయ్య, వివేక్ వంటి సీనియర్ నేతలను మీమ్స్‌తో ఆటపట్టిస్తున్నారు.

వివేక్

ఫొటో సోర్స్, facebook

వివేక్ : చేరని పార్టీ లేదు, మార్చని కండువా లేదు

బీజేపీలో నాలుగు సంవత్సరాలు ఉన్నాను. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నాలుగేళ్లు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడానని,ఇప్పుడు కేసీఆర్‌ను ఓడించడానికి కాంగ్రెస్‌లో చేరుతున్నానని వివేక్ పార్టీ మార్పు సందర్భంగా చెప్పారు.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న బీజేపీ గత ఏడాదిగా బలహీనపడడంతో కేసీఆర్‌పై పోరాటానికి ఇప్పుడు కాంగ్రెస్ సరైన వేదికగా భావించి పార్టీ మారుతున్నట్లు ఆయన చెప్పారు.

అయితే, ఆయన ఇంతవరకు తానున్న బీజేపీపై ఎలాంటి తీవ్ర విమర్శలు చేయలేదు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: ‘ఖరీదైన’ ఉప ఎన్నికకు కారణమైన నేత మళ్లీ కాంగ్రెస్‌లోకి

2022లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో మునుగోడు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించారు. ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికలో విజయం కోసం బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు భారీగా ఖర్చు చేశాయని అప్పట్లో విమర్శలొచ్చాయి.

అయితే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Komatireddy Raj Gopal Reddy letter

ఫొటో సోర్స్, fb/Komatireddy Raj Gopal Reddy

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరగడంతో దాన్ని ఖండిస్తూ ఆయన అక్టోబర్ 5న లేఖ కూడా విడుదల చేశారు.

కానీ, అక్కడికి కొద్ది రోజుల్లోనే ఆయన మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

నాగం జనార్దన్ రెడ్డి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాగం జనార్దన్ రెడ్డి

నాగం జనార్దన్ రెడ్డి: ఒకప్పుడు కేసీఆర్‌పై విమర్శలు, ఇప్పుడే కేసీఆర్ పార్టీలోకే..

తెలంగాణకే చెందిన మరో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పార్టీ మార్పు కూడా చర్చనీయమైంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశంలో పార్టీలో సుదీర్ఘ కాలం ఉన్న ఆయన 2011లో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు మద్దతుగా ఆయన కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది.

దాంతో ఆయన తెలంగాణ నగారా సమితి అనే సొంత పార్టీ పెట్టారు. అనంతరం 2013లో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. 2018లో బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు అక్టోబర్ 31న ఆయన బీఆర్ఎస్‌లో చేరారు.

నాగర్ కర్నూలు అసెంబ్లీ స్థానాన్ని ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన కూచికుళ్ల రాజేశ్ రెడ్డికి ఇవ్వడంతో నాగం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు.

‘‘నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? నా అనర్హత ఏంటి? ఇప్పుడు మీరు టికెట్ ఇచ్చిన రాజేశ్ రెడ్డి తండ్రి నేటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నారు’’ అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు.

అయితే ఆయన బీఆర్ఎస్‌లో చేరడానికి ముందు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు కేసీఆర్‌ను, మంత్రి హరీశ్ రావును విమర్శిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్ 17న ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు అవినీతికి పాల్పడుతున్నారంటూ విమర్శలు చేశారు. కాగ్ రిపోర్ట్‌ను ఉటంకిస్తూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఆ డబ్బు రికవరీ చేసే బాధ్యత సీఎం కేసీఆర్ తీసుకోవాలనిఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌లో టికెట్ రాకపోవడంతో నాగం ఇంతకాలం తాను విమర్శించిన బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్‌పై విమర్శలు కురిపిస్తున్నారు.

పొన్నాల

ఫొటో సోర్స్, FACEBOOK/KCR

పొన్నాల లక్ష్మయ్య: గులాబీ కండువా కప్పుకోగానే కేసీఆర్‌పై ప్రశంసలు

మరో సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కూడా ఇటీవలే పార్టీ మారారు.

సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల బీఆర్ఎస్‌లో చేరారు.

ఆ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిపై, దిల్లీలోని కొందరు కాంగ్రెస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేస్తూ బయటకొచ్చారు.

పొన్నాల గతంలో కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మేనిఫెస్టోలో కూడా ఆన్‌లైన్‌లో లేకుండా చేశారని, బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చెప్పినవేమీ నిలబెట్టుకోలేదని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆయన పార్టీ మారిన తరువాత జనగామలో బీఆర్ఎస్ నిర్వహించిన సభలో కేసీఆర్ పాల్గొనగా, పొన్నాల ఆ సభలో కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘మల్లన్నసాగర్, ఏడు రిజర్వాయర్లు తీసుకురావడం, చెరువులు నింపడం వంటివన్నీ కేసీఆర్ ఘనతలే. అభివృద్ధి, అణగారిన వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేస్తున్నారు’’ అంటూ ఆయన అంతకుముందు తాను చేసిన విమర్శలన్నీ పక్కనపెట్టి ప్రశంసలు కురిపించారు.

mynampally hanumantha rao

ఫొటో సోర్స్, mynampally hanumantha rao/fb

ఫొటో క్యాప్షన్, మైనంపల్లి హనుమంతరావు

మైనంపల్లి: టికెట్ ఇచ్చినా పార్టీ మారిపోయారు

ఈ నేతలందరికీ ఒక ఎత్తయితే మల్కాజ్‌గిరికి చెందిన నేత మైనంపల్లి హన్మంతరావుది మరో తీరు.

ఆయనకు బీఆర్ఎస్ పార్టీ తన తొలి జాబితాలోనే టికెట్ కేటాయించింది.

కానీ, తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మైనంపల్లికి, ఆయన కుమారుడికి ఇద్దరికీ టికెట్లు ఇచ్చింది.

ఇప్పుడు మైనంపల్లి బీఆర్ఎస్ నేతలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఇక పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పార్టీ మారారు. మొన్నటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన, జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. అయితే, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్‌కు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ రావడంతో విష్ణు బీఆర్ఎస్‌లో చేరారు.

విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మండిపడుతున్నారు.

ఆయన సోదరి విజయారెడ్డి కాంగ్రెస్ టికెట్‌పై ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు.

మోత్కుపల్లి నర్సింహులు: కాంగ్రెస్‌లోనైనా టికెట్ వస్తుందా?

‘‘అంబేడ్కర్‌కు అసలైన వారసుడు కేసీఆరే’’ అంటూ ఒకప్పుడు ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి నర్సింహులు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

మోత్కుపల్లి సమైక్య రాష్ట్రంలో టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేశారు.

రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరిన ఆయన ఆ తరువాత బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి తుంగతుర్తి టికెట్ ఆశిస్తున్న ఆయన, ఆ అవకాశం రాకపోతే ఏం చేస్తారన్నది చూడాలి.

తుంగతుర్తి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీకే చెందిన అద్దంకి దయాకర్ కూడా పోటీ పడుతున్నారు.

వీరే కాకుండా అనేక మంది ఇతర నాయకులూ పార్టీలు మారారు.

రేఖా నాయక్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Rathod Bapurao

ఫొటో సోర్స్, Rathod Bapurao/fb

ఫొటో క్యాప్షన్, రాఠోడ్ బాపూరావు

బీఆర్ఎస్‌లో టికెట్ రాక కాంగ్రెస్‌కు దరఖాస్తు.. అక్కడా రాకపోవడంతో బీజేపీలోకి జంప్

బోథ్ నియోజవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపురావుది మరో కథ.

2014, 2018లో రెండుసార్లు బీఆర్ఎస్ టికెట్‌పై బోథ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఈసారి బీఆర్ఎస్ టికెట్ రాలేదు.

దాంతో ఆయన రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

కానీ, కాంగ్రెస్ కూడా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఇప్పుడాయన బీజేపీలో చేరారు.

అయితే, బీజేపీలో కూడా ఇప్పటికే బోథ్ అభ్యర్థిని ప్రకటించేశారు.

ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావును బోథ్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.

దీంతో తాను ఇప్పుడు సోయం బాపూరావు విజయానికి పనిచేస్తానని, తర్వాత తనకు ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని రాఠోడ్ బాపూరావు బీజేపీ దిల్లీ నేతలను కోరుతున్నారు.

kotta jayapal reddy

ఫొటో సోర్స్, facebook/kotta jayapal reddy

ఫొటో క్యాప్షన్, కొత్త జయపాల్ రెడ్డి

కొత్త జయపాల్ రెడ్డి: రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి.. మళ్లీ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి

కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత కొత్త జయపాల్ రెడ్డి ఆగస్ట్ నెలలో కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీలోనూ చేరారు.

తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శనాత్మకమైన పోస్టులను తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేస్తుండేవారు. హఠాత్తుగా ఆయన రెండు రోజుల కిందట బీఆర్ఎస్‌లో చేరిపోయారు.

కాంగ్రెస్ తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేయడంతో బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.

కాంగ్రెస్‌కు కొత్త జయపాల్ రెడ్డి రాజీనామా

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్‌కు కొత్త జయపాల్ రెడ్డి రాజీనామా

కృష్ణ యాదవ్:

హైదరాబాద్‌కు చెందిన మరో నేత, ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కృష్ణ యాదవ్ ఇటీవల బీజేపీలో చేరారు.

ఆయనకు తాజాగా అంబర్‌పేట టికెట్ కేటాయించింది ఆ పార్టీ.

మంత్రిగా ఉన్నప్పుడు స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని రాజకీయంగా చాలా కాలం తెరమరుగైన ఆయన మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు.

రాగిడి లక్ష్మారెడ్డి

ఫొటో సోర్స్, twitter

ఫొటో క్యాప్షన్, రాగిడి లక్ష్మారెడ్డి

రాగిడి లక్ష్మారెడ్డి:

హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడి టికెట్ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఆయన ప్రెస్ మీట్ పెట్టి, రేవంత్‌కు తన ఉసురు తగులుతుందంటూ.. ఏడుస్తూ తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

లక్ష్మారెడ్డి ఆ తరువాత బీఆర్ఎస్‌లో చేరారు. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థిని అంతకుముందే ప్రకటించారు.

వీరే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు, మండల స్థాయి నాయకులు అనేక మంది రోజుకో కండువా మారుస్తూ స్థానికంగా చర్చల్లో నిలుస్తున్నారు.

అయితే, పార్టీలు మారినవారందరికీ కొత్త పార్టీలో టికెట్ దక్కే అవకాశం లేదు. కానీ, అప్పటివరకు ఉన్న పార్టీలో టికెట్ రాకపోవడంతో ఆగ్రహించి పార్టీలు మారారు. కొత్తగా చేరిన పార్టీలో వచ్చే ఎన్నికలలో ఎంపీ టికెట్ వస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కావొచ్చని, లేదంటే ఇంకేవైనా పదవులు దక్కించుకోవచ్చని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)