షరాన్‌ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’

షరాన్‌ స్టోన్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో షరాన్‌
    • రచయిత, జోయల్ గింటో
    • హోదా, బీబీసీ న్యూస్

సోని పిక్సర్స్‌కు చెందిన ఓ మాజీ అధికారి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు ప్రసిద్ధ హాలివుడ్ నటి షరాన్‌ స్టోన్ తెలిపారు. 1980లలో ఓ సమావేశం సందర్భంగా తానీ సమస్యను ఎదుర్కొన్నట్టు ఆమె చెప్పారు.

అయితే, తనను వేధించినవారి పేరు ఆమె వెల్లడించలేదు. ‘‘నా సుదీర్ఘ కెరీర్‌లో ఎదురైన భయంకరమైన అనుభవాలలో ఇది చివరిదైతే కాదు’’ అని షరాన్‌ అన్నారు.

దీనిపై స్పందన కోసం సోని పిక్చర్స్‌ను బీబీసీ సంప్రదించగా, ఆ సంస్థ స్పందించలేదు.

ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన 65 ఏళ్ళ షరాన్‌ కెల్లీ రిపా నిర్వహించిన యూఎస్ పాడ్ కాస్ట్ షోలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు.

‘‘అప్పట్లో ‘సోని హెడ్’గా ఉన్న ఆ అధికారితో సమావేశమయ్యేందుకు పిలుపు రావడంతో 1980లో మొదటిసారి లాస్ ఏంజెల్స్ వెళ్ళాను. అద్భుతంగా ఉన్నావు. ఇటీవలి కాలంలో నీలాంటి అందగత్తెను ఎప్పుడూ చూడలేదు. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వో కళాఖండంలా ఉన్నావు. చాలా సుకుమారంగా, అందంగా ఉన్నావు. ఇక ఆ జుట్టు చూడు.. అంటూ ఆయన నా ఎదురుగా వచ్చి నిలబడ్డారు. కానీ ‘‘ముందుగా’’ అంటూ ఆయన నా ముందే ప్యాంట్ విప్పి మర్మాంగాన్ని బయటపెట్టారు’’ అని షరాన్‌ చెప్పారు.

తాను భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఆయన వెనకడగువేశారని, తన డెస్క్ వెనుక ఉన్న తలుపుగుండా వెళ్ళిపోయారని ఆమె తెలిపారు.

ఆ తరువాత ఆయన సెక్రటరీ తనను ఆఫీసు బయటకు తీసుకువచ్చారని షరాన్‌ వెల్లడించారు.

‘‘ఆ సమయంలో నేనీ విషయం బయటపెట్టి ఉంటే సోని పిక్సర్చ్ నన్నెప్పడూ వారి సినిమాల్లోకి తీసుకునేది కాదు’’ అని షరాన్‌ స్టోన్ తెలిపారు.

ఆమె తన జీవితకథ ‘ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్’ పుస్తకం ప్రమోషన్ చేస్తున్న వేళ హాలీవుడ్‌లో లైంగిక వేధింపుల గురించి చెప్పాలా? వద్దా అనే ఒత్తిడికి గురయ్యారు.

వినోద పరిశ్రమలో కొంతమంది పెద్దల లైంగిక వేధింపులపై ‘మీ టూ’ ఉద్యమం వచ్చిన కొన్నేళ్ళ తరువాత షరాన్‌ పుస్తకం ప్రచురితమైంది.

షరాన్‌ స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షరాన్‌ స్టోన్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి

షరాన్‌ స్టోన్ ఓ పడిలేచిన కెరటం...

1990 దశకంలో షరాన్‌ స్టోన్ హాలివుడ్‌లో పేరు మోసిన నటీమణి. టోటల్ రీకాల్, బేసిక్ ఇన్‌స్టింక్ట్, కాసినో చిత్రాలతో ఆమె ఎంతో ప్రాచుర్యం పొందారు.

ఆమె జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 2001లో ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దాన్నుంచి కోలుకున్నాక ‘ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్’’ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

షరాన్‌ పెన్సిల్వేనియాలో పుట్టి పెరిగారు.

ఆమె తాత షరాన్‌‌తో అసభ్యంగా ప్రవర్తించేవారు. షరాన్‌పై వచ్చిన పుస్తకంలో ఈ నటీమణి జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎంతగా పోరాటం చేశారో తెలుస్తుంది.

షరాన్‌ స్టోన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2002 ఆస్కార్ వేడుకలో జాన్ ట్రావోల్టాతో కలిసి షరాన్‌ డ్యాన్స్ చేశారు

షరాన్‌‌ను వెంటాడిన ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’

1992లో వచ్చిన ‘బేసిక్ ఇన్‌స్టింక్ట్’ సినిమా షరాన్‌ జీవితంలో పెద్ద ఎదురుదెబ్బకు కారణమైంది.

ఆ సినిమాలో ఆమె ఘాటైన సీన్లలో నటించడం వలన తనపై అందరికీ దురభిప్రాయాలు ఏర్పడినట్టు ఆమె ఓ పాడ్‌కాస్ట్ షోలో చెప్పారు.

షరాన్‌ ఆమె భర్త రాన్ బ్రాన్‌స్టెన్ కలిసి ఓ పిల్లాడిని దత్తత తీసుకున్నారు.

అయితే, ఈ దంపతులు విడిపోయే వేళ పిల్లాడి పెంపకంపై కోర్టులో వాదనలు జరిగాయి.

‘‘నీకు మీ అమ్మ సెక్స్ సీన్లలో నటిస్తుందని తెలుసా?’’ అని తన నాలుగేళ్ళ కొడుకుని జడ్జి అడిగిన సంగతిని షరాన్‌ గుర్తుచేసుకున్నారు.

తరువాత ఈ అబ్బాయి పెంపకం బాధ్యతను తండ్రికే అప్పగిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

దీంతో తీవ్ర మనోవేదనతో షరాన్‌ గుండెపోటుకు గురయ్యారు.

బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమా హిట్ అయ్యాక ఆమె దారుణమైన అనుభవాలను ఎదుర్కొన్నారు.

‘‘మీరు మహా అయితే సెకనులో 16వ వంతు నా నగ్నత్వాని చూసి ఉంటారు. కానీ దాని కారణంగా నేను నాబిడ్డను పోగొట్టుకున్నాను’’ అని తెలిపారు.

‘‘బేసిక్ ఇన్‌స్టింక్ట్ సినిమాలో తన నటనకు గానూ షరాన్‌ ల్డెన్‌గ్లోబ్ అవార్డుకు ఎంపికయ్యాను. అయితే వారు నా పేరు పిలిచినప్పుడు అక్కడున్న కొంతమందినవ్వారని ఆమె గుర్తు చేసుకున్నారు. నేనెంతో అవమానానికి గురయ్యాను’’ అని షరాన్‌ చెప్పారు.

కథానాయికలను వారు పోషించే పాత్రలతో పోల్చవద్దని ఆమె కోరారు.

1996లో ఆమె ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

కాసినో చిత్రంలో ఆమె నటనకు గాను ‘ఉత్తమ నటి’ అవార్డు దక్కింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)