ప్రియా రమానీ కేసులో కోర్టు తీర్పుతో ఆఫీసుల్లో మహిళల పరిస్థితులు ఏమైనా మారుతాయా?

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"లైంగిక వేధింపుల కేసులో బాధితురాలిని అయినప్పటికీ, కోర్టు రూమ్‌లో ఒక నిందితురాలిలా నిలబడ్డాను. కానీ, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసుకు ఎంత ప్రాధాన్యం లభించాలో అది దక్కినందుకు నాకు సంతోషంగా ఉంది".
పరువునష్టం కేసులో నిర్దోషిగా బయటికొచ్చిన జర్నలిస్ట్ ప్రియా రమానీ చెప్పిన మాటలివి.
మహిళా జర్నలిస్టు ప్రియా రమానీపై మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ క్రిమినల్ పరువు నష్టం కేసు పెట్టారు.
కానీ, దిల్లీలోని ఒక కోర్టు ఫిబ్రవరి 17న ప్రియా రమానీ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది.
చాలా మంది దీనిని చరిత్రాత్మక తీర్పుగా చెబుతున్నారు. కొంతమంది దీనిని మీటూ మూవ్‌మెంట్ మొదటి విజయంగా వర్ణిస్తున్నారు.
చాలా మంది నిపుణులు పరువునష్టం కేసులో వచ్చిన ఈ తీర్పును కార్యాలయాల్లో లైంగిక వేధింపుల చట్టానికి జోడించి కూడా చూస్తున్నారు.
ఎంజే అక్బర్ కేసు ఏంటి?
ఈ తీర్పు క్రిమినల్ పరువునష్టానికి సంబంధించినది, దీనిని మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మహిళా జర్నలిస్ట్ ప్రియా రమానీపై వేశారు.
మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ 2018 #MeToo మూవ్‌మెంట్ సమయంలో ప్రియా రమానీ ఒక ఆర్టికల్ ట్వీట్ చేశారు.
ఆ ఆర్టికల్ 2017లో ఆమె ఒక ఇంగ్లిష్ పత్రిక కోసం రాసినది. దానిని 2018లో ట్వీట్ చేశారు. ఆ ఘటన 1993 డిసెంబర్‌లో జరిగిందని ఆర్టికల్‌లో రాశారు.
ప్రియా రమానీ ఈ కేసులో నిందితురాలుగా ఉన్నారు. ఆమెను దిల్లీలోని ఒక కోర్టు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు చెప్పింది.
మాజీ విదేశాంగ మంత్రి ఎంజే అక్బర్ ఈ తీర్పుపై పైకోర్టుకు వెళ్లవచ్చు. కోర్టులో అపీల్ చేసుకోవచ్చు. ఇది కార్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసు కాదు.

ఫొటో సోర్స్, Getty Images
కోర్టు ఆదేశాల్లో కీలకాంశాలు...
91 పేజీల తన తీర్పులో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఇలా రాశారు.
లైంగిక వేధింపుల వల్ల బాధితురాలిపై ఎలాంటి ప్రభావం పడుతుందో సమాజం అర్థం చేసుకోవాలి. లైంగిక వేధింపులు, బాధితురాలి ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి.
వేధించేవారు మనలో ఎవరైనా కావచ్చు. సమాజంలో ప్రముఖులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడవచ్చు.
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన ఒక మహిళను అవమానించడానికి వేసిన క్రిమినల్ ధిక్కార కేసులో శిక్షించలేం. ఎందుకంటే ఇది ఒకరి ప్రతిష్ఠకు సంబంధించిన కేసు. ఒక వ్యక్తి పరువు హక్కును రక్షించడానికి, ఇంకొకరి జీవించే హక్కును, ఒక మహిళ గౌరవాన్ని పణంగా పెట్టలేం.
కార్యాలయాల్లో లైంగిక వేధింపుల కేసులో ఈ తీర్పు మైలురాయిగా నిరూపితం కాబోతోందని, మనం తీర్పులో ఈ భాగాన్ని చదివి చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, TWITTER/SUPARNASHARMA
కాల పరిమితి షరతు అంతమవుతుందా
ఇక, మహిళలు దశాబ్దాల నాటి పురాతన లైంగిక వేధింపుల గురించి కూడా తమ గళం వినిపించవచ్చని భావిస్తున్నారు. కానీ, నిజంగా అలా జరగుతుందా..
దిల్లీ విశ్వవిద్యాలయం లా ఫ్యాకల్టీ ప్రొఫెసర్ వేద కుమారి దీని గురించి వివరించారు.
"కార్యాలయాల్లో లైంగిక వేధింపుల చట్టాన్ని 2013లో చేశారు. అంతకు ముందు లైంగిక వేధింపుల కేసుల్లో ఈ చట్టం అమలు కాదు. అందుకే, వాటిని 2013 చట్టం ప్రకారం కొత్తగా విచారించలేం" అన్నారు.
మామూలు ఫిర్యాదులను పక్కన పెడితే, క్రిమినల్ లా ప్రకారం సీరియస్ నేరాల్లో ఫిర్యాదు చేయడానికి లేదా కేసు పెట్టడానికి ఒక కాలపరిమితిని నిర్ణయించడం అనేది ఉండదు. సివిల్ లాలో కాలపరిమితి ఉంటుంది. అందుకే పాత లైంగిక వేధింపుల కేసులను ఎప్పుడైనా తెరవవచ్చు.
ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. లైంగిక వేధింపుల ఫిర్యాదును మీరు మీ ఆఫీసులో ఏర్పాటు చేసిన ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ(ఐసీసీ) ఎదుట ఉంచినపుడు, అది సివిల్ కేసు అవుతుంది. కానీ, మీరు అదే ఫిర్యాదుతో పోలీసుల దగ్గరకు వెళ్లినపుడు అది క్రిమినల్ కేసు అవుతుంది.

ఫొటో సోర్స్, iStock
ఐసీసీలో లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడానికి 3 నెలల కాలపరిమితిని నిర్ధరించారు. కానీ ఐపీసీలో 2013 తర్వాత సెక్షన్ 354(లైంగిక వేధింపుల సెక్షన్)లో కొన్ని మార్పులు చేసి, కొత్త సెక్షన్ జోడించారు. లిమిటేషన్ పిరియడ్‌కు స్వస్తి పలికారు. 2013కు ముందు ఐపీసీ సెక్షన్ 354లో ఈ లిమిటేషన్ పిరియడ్ మూడేళ్లు ఉండేది.
"మహిళ ఆఫీసులో ఐసీసీకి ఫిర్యాదు చేయాలనుకుంటే, మూడు నెలల లోపు ఫిర్యాదు చేయాలి. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటే దానికి ఎలాంటి లిమిటేషన్ పిరియడ్ ఉండదు. కానీ ఆలస్యానికి బలమైన కారణం ఇవ్వాల్సుంటుంది" అని సుప్రీంకోర్టు అడ్వకేట్ షారూఖ్ ఆలం చెప్పారు.
ప్రియా రమానీ లైంగిక వేధింపుల గురించి పోలీసులకు లేదా తమ ఆఫీసులో ఎలాంటి ఫిర్యాదూ చేయలేదు. తన ఆర్టికల్ ట్వీట్ చేసిన తర్వాత మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ ఆమెపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు.
సీనియర్ వకీల్ ఇందిరా జయసింగ్ ఈ తీర్పును చారిత్రకంగా వర్ణిస్తూ ఒక ఆర్టికల్ రాశారు.
లైంగిక వేధింపుల గురించి ఆలస్యంగా ఫిర్యాదు చేశారన్న ఎంజే అక్బర్ వాదనలను కోర్టు పరిగణించలేదన్నది ఈ తీర్పులో అత్యంత కీలకమైనదని ఆమె వర్ణించారు.
ప్రియా రమానీ ఆర్టికల్ లోని వివరాల ప్రకారం ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం ఆమె ముంబయిలోని ఒక హోటల్‌కు వెళ్లినపుడు ఆ ఘటన జరిగింది. 1993లో కార్యాలయాల్లో లైంగిక వేధింపుల చట్టం లేదు. అందుకే, అలాంటి ఫిర్యాదులు చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవు.
మాజీ కేంద్ర మంత్రి వేసిన పరువు నష్టం కేసులో ప్రియా రమానీ లైంగిక వేధింపుల ఫిర్యాదు 'టైమింగ్' గురించి ప్రశ్నలు వచ్చాయి.

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES
పనిచేసే చోట లైంగిక వేధింపుల చట్టంలో ఏం మారుతుంది.
ఈ తీర్పుతో ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా
దీనికి సుప్రీంకోర్టు అడ్వకేట్ షారూఖ్ ఆలం సమాధానం ఇచ్చారు.
"లైంగిక వేధింపుల ఫిర్యాదు విషయంలో చట్టపరమైన నిబంధన లేనప్పుడు లేదా ఆ చట్టపరమైన నిబంధనను సరిగా పాటించనపుడు కాలపరిమితి పట్టింపు లేదనే విషయం తీర్పులోనే రాసి ఉంది. సంస్థలో లైంగిక వేధింపులు అడ్డుకునే నిబంధనలు సరిగా లేకపోతే, వేరే ఏదైనా వేదిక ద్వారా తమ మాటను చెప్పడం తప్పుకాదని కూడా ఈ తీర్పులో చెప్పారు" అన్నారు.
పరువు నష్టం కేసు వేసిన ఎంజే అక్బర్ లైంగిక వేధింపుల కేసులో ఒక బాధితురాలు ఏ పబ్లిక్ ప్లాట్‌ఫాంలోనూ మాట్లాడలేరు అని కూడా చెప్పానుకున్నారు.
"ఈ తీర్పుతో కార్యాలయాల్లో లైంగిక వేధింపుల ప్రస్తుత చట్టాన్ని మార్చాల్సిన అవసరం లేదు. దానికి బదులు ఆ చట్టాన్ని సరిగా వివరించాల్సిన అవసరం ఉంది. ఈ తీర్పులో ప్రస్తుత చట్టం ఏం చెబుతోందో, అది చరిత్రాత్మకం. దానిని సరైన పద్ధతిలో అనుసరిస్తే, ప్రస్తుతం చట్టంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఈ తీర్పు ప్రస్తుత చట్టం పరిధిని పెద్దది చేసింది" అన్నారు.
షారూఖ్ ఆలం తన మాటలను చట్ట పరిభాషతో అర్థమయ్యేలా చెప్పారు.

ఫొటో సోర్స్, iStock
భారత్‌లో ప్రస్తుత లైంగిక వేధింపుల చట్టం
వద్దని చెబుతున్నా ఎవరినైనా తాకడం, తాకడానికి ప్రయత్నించడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవాలని కోరడం, అశ్లీల వ్యాఖ్యలు చేయడం, పోర్నోగ్రఫీ చూపించడం లేదా అంగీకార లేకుండానే లైంగిక ఇబ్బందులకు గురిచేసినా భారత్‌లోని చట్టంలో వాటిని లైంగిక వేధింపులుగా భావిస్తారు.
2013లో సెక్సువల్ హరాస్‌మెంట్ ఆఫ్ వుమెన్ వర్క్ ప్లేస్( ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) తీసుకొచ్చారు. ఇది ముఖ్యంగా పనిచేసే చోట అమలవుతుంది. ఇందులో లైంగిక వేధింపుల నిర్వచనం అదే ఉంది. కానీ దానిని ప్రాంతం, పని జోడించారు.
ఇక్కడ పని అంటే ఆఫీసు మాత్రమే కాదు, ఆఫీసు పనిగా ఎక్కడికైనా బయటకు వెళ్లడం. ప్రయాణంలో, మీటింగ్ జరిగే ప్రాంతం లేదా ఇంటి దగ్గర కలిసి పనిచేయడం అన్నీ వస్తాయి.
ఈ చట్టం ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాలన్నింటికీ అమలవుతుంది. మహిళలు తాము పని చేసే ప్రాంతంలోనే కొన్ని శిక్షలు వేయించడానికి ఒక దారి కల్పిస్తుంది. అంటే, జైలు, పోలీసులు అనే కఠిన చర్యలకు భిన్నంగా మరోలా న్యాయం చేయడానికి ఒక మధ్యేమార్గాన్ని అందించారు. అంటే సంస్థ స్థాయిలో నిందితుడిపై కఠిన చర్యలు, హెచ్చరిక, జరిమానా, సస్పెన్షన్, తొలగించడం లాంటివి చేయవచ్చు.
నిజానికి, 2018లో #MeToo మూవ్‌మెంట్ నడిచిన సమయంలో ప్రియా రమానీ ఒక పత్రికలో ఏడాది క్రితం రాసిన ఆర్టికల్‌ను ట్వీట్ చేశారు. ఆ ఘటన 1993 డిసెంబర్‌లో జరిగింది.
తన ఆర్టికల్‌లో జర్నలిస్టుగా ఇంటర్వ్యూ సమయంలో ముంబయిలోని ఒక హోటల్లో ఎంజే అక్బర్ తనతో ఎలా ప్రవర్తించిందీ, ఆ సమయంలో తనకు ఎంత అసహజంగా అనిపించిందీ ఆమె రాశారు. అది జరిగినప్పుడు కార్యాలయాల్లో లైంగిక వేధింపుల చట్టం లేదు.

ఫొటో సోర్స్, iStock
ఈ తీర్పుతో దశాబ్దాల నాటి పాత కేసులు వెల్లువెత్తుతాయా...
దీనికి ప్రొఫెసర్ వేద కుమారి, "ఈ తీర్పుతో ఎక్కువ మంది మహిళలు లైంగిక వేధింపుల గురించి గళం వినిపిస్తారని మేం ఆశిస్తున్నాం. కానీ, ఇంత బలమైన పోరాటాం ఎంత మంది మహిళలు చేయగలరు అనే ప్రశ్న కూడా వస్తుంది. ప్రియా రమానీ ఒక వేరే. ఆమెలో ఇంతకాలం పాటు పోరాడగలిగే సాహసం ఉంది" అని అన్నారు.
మామూలు మహిళకు ఇప్పటికీ ఇదంతా అంత సులభం కాదు. మహిళ ఒక మామూలు ఫిర్యాదు చేయడానికే భయపడుతుంది. మిగతా మహిళలంతా అప్పుడు ఆమెకు అండగా నిలబడతారా అనేది చెప్పడం ఇప్పటికీ కష్టమే.
ఇక్కడ ఇంకో విషయం ఉంది. ప్రస్తుత తీర్పు సెషన్ కోర్టు ఇచ్చింది. ఆ తర్వాత హైకోర్ట్, సుప్రీంకోర్టు ఉన్నాయి. ఈ తీర్పును ఇప్పటికీ సవాలు చేయవచ్చు. అక్బర్ దీనిని పైకోర్టులో అపీల్ చేస్తే, ఏం కాదు, కానీ ఆయన అలా అపీల్ చేస్తూనే ఉంటే, ఈ తీర్పుపై స్టే కూడా విధించవచ్చు" అంటారు వేద కుమారీ.

ఫొటో సోర్స్, iStock
తీర్పు వల్ల ఏం సాధించారు
తీర్పు ప్రాధాన్యం గురించి అడ్వకేడ్ షారూఖ్ ఆలమ్ వివరించారు.
"ఇది కేవలం ఆర్డర్ కాదు, 91 పేజీల వాదనల ఆధారంగా రాసిన ఒక తీర్పు. ప్రస్తుత చట్టం గురించి ఈ తీర్పు వివరంగా చెప్పింది. పై కోర్టులో ఈ తీర్పును సవాలు చేసే ముందు, ఇందులో ఇచ్చిన వాదనలను తోసిపుచ్చడానికి ఆధారాలు వెతకాల్సుంటుంది. ఈ తీర్పులో అత్యంత ముఖ్యమైన విషయం అదే" అన్నారు.
"#MeToo మూవ్‌మెంట్ బలం అదే. శక్తివంతమైన మహిళలపై కూడా లైంగిక వేధింపులు జరిగాయి. సాధారణ మహిళలకు అలా జరుగుతూనే ఉంటుంది. వారిలో ఎంతమంది మహిళలు తమ గళం వినిపిస్తున్నారు. ఈ తీర్పు తర్వాత వారంతా తమ గొంతు వినిపించడం మొదలవుతుందా.
"ఈ తీర్పుతో ఒకటి మాత్రం జరిగింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల అంశంపై చర్చ లాంటి వాతావరణం ఏర్పడింది. జనం దీని గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఇప్పుడు ఇలాంటి కేసులు వెల్లువెత్తుతాయని, ప్రతి మహిళా తనపై జరిగిన వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తుందని నాకు అనిపించడం లేదు" అన్నారు షారూఖ్.

ఫొటో సోర్స్, EPA
సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఇందిరా జయసింగ్ ఈ తీర్పును మరోలా చూస్తున్నారు.
"భారత్ #MeToo మూవ్‌మెంట్‌కు ఈ తీర్పు మైలురాయా అనేది కాలమే చెబుతుంది. కానీ, లైంగిక వేధింపుల వల్ల బాధితురాలు ఎలాంటి మానసిక స్థితిలో చిక్కుకుపోతారో ఈ తీర్పు చెప్పింది. కేసును రిపోర్ట్ చేయడం, చేయకపోవడం లేదా ఆలస్యంగా చేయడం అనేది ఎన్నో కారణాలపై ఆధారపడి ఉంటుంది" అన్నారు.
బీబీసీ కేసు గురించి ప్రియా రమానీని సంప్రదించాలని ప్రయత్నించింది. కానీ ఆమె నుంచి మాకు సమాధానం రాలేదు.
ప్రియా రమానీ కేసులో సాక్షిగా కోర్టుకు హాజరైన జర్నలిస్ట్ గజాలా వహాబ్ ఈ మొత్తం విషయం గురించి బీబీసీతో మాట్లాడారు.
"ఎంజే అక్బర్ వర్సెస్ ప్రియా రమానీ కేసు పరువునష్టం కేసు. లైంగిక వేధింపులు ఎవరిపై జరిగాయో, వారినే ఈ కేసులో నిందితులుగా చేశారు. కానీ, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల చట్టం లేదా విశాఖా గైడ్‌లైన్‌తో ఈ మొత్తం కేసుకు ఎలాంటి సంబంధం లేదు" అన్నారు.
"నేను బుధవారం కోర్టుకు హాజరయ్యాను. జడ్జ్ కావాలనుకుంటే రెండు లైన్లలో తీర్పు వినిపించి ఉండచ్చు. కానీ, ఆయనలా చేయలేదు. ఒక యువతి లైంగిక వేధింపులక గురవుతుంటే, ఆమె వాటి గురించి ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసే ఆ టైమింగ్ గురించి ప్రశ్నలు రాకూడదు అని జడ్జి తన తీర్పులో చెప్పారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక లైంగిక వేధింపుల బాధితురాలు తనకు జరిగినవి చెప్పినపుడు, మీపై అవి జరిగాయనడానికి ఏవైనా సాక్ష్యాలున్నాయా అని అడగలేం. మూసిన తలుపుల వెనుక జరిగిన దానికి ఆధారాలు, సాక్ష్యాలు తీసుకురావడం కష్టం అని కూడా జడ్జి తన తీర్పులో చెప్పారు" అంటారు గజాలా.

ఫొటో సోర్స్, EPA
ఈ తీర్పులో చెప్పినవాటిని కార్పొరేట్ ఆఫీసుల సెక్సువల్ హరాస్‌మెంట్ కమిటీలో కూడా చేర్చితే, మహిళలకు కార్యాలయాల్లో భద్రత అందించడం సులభం అవుతుంది. ఫిర్యాదుచేసేవారికి ఆఫీసుల్లోని ఇంటర్నల్ కమిటీల్లో కూడా ఆధారాలు చూపించాల్సిన అవసరం రాకూడదు.
అయితే ఇక లైంగిక వేధింపుల ఏదైనా కేసు ఎంజే అక్బర్ మీద నడుస్తుందా?
"నేను ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోను. నా వరకు ఇది ముగిసింది. నేను ఒక ఆర్టికల్ రాశాను. ప్రియా కేసులో సాక్షిగా నా యుద్ధం ముగిసింది. నేనిక ముందుకు వెళ్లను" అన్నారు గజాలా.
"కోర్టు రూంలో తీర్పు చదువుతున్నప్పుడు, ఫిర్యాదుదారు(ఎంజే అక్బర్)కు ఇంతకంటే అవమానం వేరే ఏముంటుంది అని నాకు అనిపించింది. నేను ఏది రాశానో, ఏది చెప్పానో అవే మాటలను జడ్జి తన తీర్పులో వినిపించారు. పబ్లిక్ పోరం నిండిన కోర్టు గదిలో మన ఎదురుగా ఒకరు అవే ఆరోపణలను పునరావృత చేస్తే, ఒక పెద్దమనిషికి అంతకంటే పెద్ద అవమానం కలిగించేది ఏదీ ఉండదు. నాకు అది చాలు" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- #MeToo: భారత మీడియాలో వెలుగు చూస్తున్న లైంగిక వేధింపులు
- #BollywoodSexism: బాలీవుడ్, టాలీవుడ్‌లలో లైంగిక వేధింపులపై కథనాలు
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- ప్రపంచంలో ఈ భాష ముగ్గురే మాట్లాడతారు!
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- బుమ్రా, షమీ, ఉమేశ్, ఇషాంత్... ఇంగ్లండ్‌ను భయపెడుతున్న భారత పేసర్లు
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








