ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కంటి మార్పిడి ఆపరేషన్

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, కోల్ కిమ్
- హోదా, బీబీసీ న్యూస్
ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కంటి మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించినట్లు న్యూ యార్క్ డాక్టర్లు తెలిపారు.
హై ఓల్టేజ్ కరెంట్ షాక్ వల్ల చిధ్రమైన ఆరన్ జేమ్స్ అనే వ్యక్తి మొఖంలోని సగ భాగానికి రూపమిచ్చేందుకు 21 గంటలపాటు నిర్వహించిన శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు.
ఇందులో భాగంగా ఆయనకు పూర్తి కంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అయితే, తిరిగి చూపు పొందుతారా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ శస్త్ర చికిత్స సత్ఫలితాన్నిస్తే చూపు కోల్పోయిన లక్షల మందికి తిరిగి చూపునివ్వొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
తొలిసారిగా సర్జరీ..
దక్షిణ అమెరికాలోని అర్కన్‌సాస్ ప్రాంతానికి చెందిన ఆరన్ జేమ్స్ 2021లో ప్రమాదవశాత్తు 7200 వోల్టుల విద్యుత్ ప్రవహిస్తున్న వైరుకు తగిలిన ఘటనలో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన ముఖం దాదాపుగా చిధ్రమైంది.
140 మంది వైద్య నిపుణుల బృందం ఈ ఏడాది మే 27న అరుదైన పాక్షిక ముఖ మార్పిడితోపాటు పూర్తి కంటి మార్పిడి శస్త్రచికిత్సను కూడా నిర్వహించింది.
ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన సర్జన్లు ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ, రెండు శస్త్రచికిత్సల అనంతరం 46 ఏళ్ల జేమ్స్ కోలుకుంటున్నారని, మార్పిడి చేసిన కన్ను ఆరోగ్యవంతంగానే ఉందని తెలిపారు. ఆయన కుడి కన్ను పనిచేస్తోందని చెప్పారు.
“ముఖం సహా పూర్తిస్థాయి కంటి మార్పిడి చేయడం అసాధ్యమని చాలాకాలంగా భావిస్తున్నా, మేం ఈ పనిని పూర్తి చేశాం” అని సర్జరీ నిర్వహించిన బృందంలోని ప్రముఖ సర్జన్ డా.ఎడ్యురాడో రోడ్రిగ్వెజ్ అన్నారు.
“మేం పెద్ద అడుగు వేశాం. తిరిగి చూపును తీసుకువచ్చే రెండో అడుగు దిశగా పయనిస్తున్నాం” అన్నారు.
కోలుకుంటున్న జేమ్స్..
డా. రోడ్రిగ్వేజ్ ఏబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ “మేం తిరిగి చూపు వస్తుందని చెప్పడం లేదు. కానీ, ఆ దశకు చాలా దగ్గరలోనే ఉన్నామని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు” అన్నారు
కంటిలోని కీలక భాగమైన రెటీనాకు రక్తప్రసరణ జరుగుతోందని వైద్యులు తెలిపారు. కన్ను చూసిన దృశ్యాలను రెటీనా ద్వారానే మెదడుకు చేరవేస్తుంది. అయితే, జేమ్స్ తన కొత్త కంటిలో కూడా చూపును పొందుతారా అన్న ప్రశ్నకు మాత్రం వైద్యులు స్పష్టత ఇవ్వలేదు.
జేమ్స్ తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ఒకవేళ నేను చూడగలిగితే గనుక, నిజంగా ఇది అద్భుతమనే అంటాను. కానీ, ఈ సర్జరీ వలన వైద్యరంగంలో కొత్త దిశగా పరిశోధనలు జరగడానికి నేను సహకరించానని అనుకుంటాను” అన్నారు.
మిలటరీలో పనిచేసిన జేమ్స్ ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణలోనే ఉన్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, ఎండీ అయిన బ్రూస్.ఇ.గెల్బ్ మాట్లాడుతూ, “మార్పిడి జరిగిన కన్ను ఆరోగ్యంగా ఉంది. ఈ పురోగతి అసాధారణం “ అన్నారు.
ఈ సర్జరీ కోసం 30 ఏళ్ల మధ్య వయసున దాత నుంచి సేకరించిన కన్ను, ముఖంతోపాటు అతడి మజ్జె ఎముక (బోన్ మ్యారో) నుంచి సేకరించిన మూలకణాలను ఆప్టిక్ నర్వ్‌లోకి పంపడం ద్వారా వేగంగా కోలుకునేలా చేశారు.
అమెరికాలో ముఖ మార్పిడి చేసుకున్న వారిలో జేమ్స్ 19వ వ్యక్తి.
సీఎన్ఎన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన భార్య మీగన్ జేమ్స్ మాట్లాడుతూ తనకు ఈ విషయం ఆశ్చర్యంతోపాటు సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఇది వినడానికి వింతగా ఉన్న అద్భుతమని భావిస్తున్నట్లు చెప్పారు.
ప్రమాదంలో గాయపడిన జేమ్స్, నొప్పి కారణంగా తన ఎడమ కంటిని తొలగించుకోవలసి వచ్చింది. ముఖం చిధ్రం అవడంతోపాటు, చేయి కూడా దెబ్బతింది. పలు సర్జీల అనంతరం ప్రోస్థెటిక్ చేతిని అమర్చారు.
సర్జరీకి సహకరించిన దాతకు, అతడి కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఈ కంటి మార్పిటి తన జీవితాన్ని మార్చే సంఘటన అని జేమ్స్ అన్నారు.
“రోడ్డుపై నడుస్తుంటే నేను కూడా అందరిలాగా సాధారణమైన వ్యక్తినేనని నాకు అనిపిస్తోంది” అంటూ ఎన్‌బీసీ న్యూస్‌తో చెప్పారు జేమ్స్.
ఇవి కూడా చదవండి..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














