గాజా: ‘బాంబు దాడిలో నా రెండేళ్ల పాప కాళ్లు పోగొట్టుకుంది.. ఏం తప్పు చేసిందని?’

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, శిథిలాల్లో చిక్కుకుని రెండు కాళ్లూ పోగొట్టుకున్న ఫాతిమాతో తల్లి నెహద్
    • రచయిత, యోగిత లిమాయే
    • హోదా, బీబీసీ న్యూస్, జెరూసలెం

నోట్: ఈ కథనంలో కలచివేసే అంశాలు ఉన్నాయి.

నొప్పితో ఏడుస్తోన్న తన బిడ్డను సముదాయించేందుకు నెహద్ అబు జాజర్ తన గద్గద స్వరంతోనే పాట పాడుతున్నారు. ఆ పాట రెండు కాళ్లూ కోల్పోయిన ఫాతిమా నొప్పిని తగ్గించదని ఆమెకు తెలుసు. తన బిడ్డ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఆ బాంబు దాడి.

“అక్టోబర్ 17వ తేదీ. నిద్రపోతున్న నేను బాంబుల శబ్దానికి ఉలిక్కిపడి లేచాను. అప్పటికే మేం శిథిలాల కింద చిక్కుకుపోయాం. నా ఒడిలో ఉన్న ఫాతిమా పైకి లేచేందుకు ప్రయత్నించింది. అప్పుడే తన రెండు కాళ్లూ నలిగిపోయాయని నేను గుర్తించాను” అంటూ నెహద్ అబు జాజర్ బాధగా చెప్తున్న దృశ్యాలను చిత్రీకరించారు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు. బీబీసీ కోసం వారు నెహాద్ అబుతో మాట్లాడారు.

తీవ్రంగా గాయాలవడం వలన రెండేళ్ల ఫాతిమా మోకాళ్ల కింది నుంచి రెండు కాళ్లనూ తొలగించారు వైద్యులు.

దక్షిణ గాజాలోని యూరోపియన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫాతిమా తన తల్లి ఒడిలో కూర్చుని ఉంది.

రెండు కాళ్లకూ తెల్లటి బ్యాండేజీలు ఉన్నాయి. నొప్పి కలిగినప్పుడల్లా ఫాతిమా ఏడుస్తోంది.

వివాహమైన 14 సంవత్సరాలకు తమకు ఫాతిమా జన్మించిందని నెహాద్ చెప్పారు.

“తను ప్రాణాలతో బయటపడటం నా అదృష్టం. కానీ నా బిడ్డ చేసిన నేరమేంటి? ఏం తప్పు చేసింది? ఇతర పిల్లల్లాగా నా బిడ్డ కూడా సాధారణ జీవితాన్ని గడపాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు నెహద్.

“ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్‌తోనే ఆమె జీవితం గడుస్తోంది. ఒకటి అయిపోగానే మరొకటి.. ఇలా పెయిన్ కిల్లర్స్ ఇస్తూనే ఉన్నాం. అలాగే రోజు విడిచి రోజు ఆమెకు సర్జరీ చేయాల్సి వస్తోంది” అన్నారామె.

అక్టోబర్‌ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడి, జరిపిన మారణకాండలో 1200 మందికి పైగా మరణించారు. చాలా మందిని మిలిటెంట్లు బందీలుగా తీసుకుని వెళ్లారు.

ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇప్పటివరకు గాజాలో 10,800 మంది చనిపోయారని, వీరిలో 4,400 మందికి పైగా చిన్నారులు ఉన్నారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తెలిపింది. దీనిపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది. కానీ ఈ సంఖ్య నమ్మదగినదిగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది.

26 వేల మందికి పైగా ఈ దాడుల్లో గాయపడ్డారు. వీరిలో ఫాతిమా వంటి పిల్లల జీవితాలు తలకిందులయ్యాయి.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ
ఫొటో క్యాప్షన్, రక్షణ కోసం దక్షిణ గాజాలోని రఫాకు వచ్చిన అమీరా కూడా బాంబు దాడిలో గాయపడింది

సురక్షిత ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులు

మరొక గదిలోని బెడ్‌పై 13 ఏళ్ల అమీరా అల్ బదావి పడుకుని ఉంది.

“బాంబు దాడి జరిగిన సమయంలో నేను నిద్రపోతున్నాను. కళ్లు తెరిచేసరికి నాకు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. చుట్టూ జనాల అరుపులు వినిపించాయి. పైన, కిందా రాళ్ల మధ్యన చిక్కుకుపోయాను” అని చెప్పింది అమీరా.

ఈ దాడిలో అమీరా వెన్నెముకకు చాలా చోట్ల గాయాలయ్యాయి. మళ్లీ తను నడుస్తుందో లేదో తెలీదు.

ఈ ఘటనలో తల్లిని, ఏడుగురు సోదరులని కూడా కోల్పోయింది అమీరా.

ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలతో తాము నివసించే అల్ జైటౌన్‌ నుంచి దక్షిణ గాజాలోని రఫా దగ్గరకు చేరుకున్నామని, అయినా తాము బాంబు దాడికి గురయ్యామని అమీరా తండ్రి ఇయాద్ అల్ బదావి చెప్పారు.

ఉత్తర గాజాలో దాడులు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో పౌరులను దక్షిణ గాజా వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం పదే పదే చెప్పింది. కానీ, మధ్య, దక్షిణ గాజాల్లోని పలు ప్రాంతాలపైనా బాంబు దాడులు జరుగుతున్నాయి. హమాస్ స్థావరాలపైనే తాము దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్తోంది.

“గాయపడిన నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా కుటుంబం గురించి ఆందోళన చెందుతున్న నాకు, నా భార్యతోపాటు నా పిల్లలు కూడా చనిపోయారని చెప్పారు. మేం వాళ్లని పెంచి, చదువు చెప్పించాం. కొంత మందికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ఇప్పుడు వారిని కోల్పోయి, ఒంటరిగా మిగిలాం” అంటూ బాధపడ్డారు ఇయాద్.

తన 18 నెలల కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు.

అమీరా మాట్లాడుతూ “శాంతితోపాటు రక్షణను కోరుకుంటున్నాను. చికిత్స పూర్తవగానే, మా ఇంటికి వెళ్లి, తిరిగి సాధారణ జీవితం గడపాలని ఆశపడుతున్నాను” అంది.

కానీ అది సాధ్యపడదు. గాజాలో ప్రస్తుతం సురక్షిత ప్రాంతమనేదే లేదు.

ఆసుపత్రులన్ని మృ‌తదేహాలు, క్షతగాత్రులతో నిండిపోతున్నాయి. వీరిలో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు.

గాజాలో బాంబు దాడులు
ఫొటో క్యాప్షన్, 11 ఏళ్ల అస్సెఫ్ అబు మజెన్ ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో బాంబు దాడికి గురయ్యాడు

‘‘ఒక కాలు లేదని, ఫ్రెండ్స్ నన్నేమైనా ఆటపట్టిస్తారా’’

అల్ నజీరత్‌లోని బీచ్‌ సమీపాన నివసించే 11 సంవత్సరాల అస్సెఫ్ అబు మాజెన్ పక్కనే ఉన్న క్లబ్‌లో ఫుట్‌బాల్ ఆడుతుండేవాడు.

ఆటలో రాణిస్తూ జట్టులో ఢిఫెండర్‌గా ఆట మొదలుపెట్టిన అస్సెఫ్ ఇప్పుడు గోల్ కీపర్‌గా మారాడు.

ఆ రోజు స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో జరిగిన వైమానిక దాడిలో అస్సెఫ్ ఇంటితోపాటు అతడి జీవితం కూడా నాశనం అయింది.

కుడి కాలును మోకాలి కింది నుంచి తొలగించాల్సి వచ్చింది.

బెడ్‌పై కుడికాలికి తెల్లటి బ్యాండెజ్ కట్టుతో కనిపించాడు అస్సెఫ్.

“నా వయస్సు 11 సంవత్సరాలే. నేను ఎవరికీ ఏ హాని చేయలేదు. నేను చేసిన తప్పేంటి?” అని అస్సెఫ్ అడిగాడు.

ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్న అతడి కల చెదిరిపోయింది.

“నేను చాలా బాగా ఆడతాను. కావాలంటే మా కోచ్‌ని అడగండి” అన్నాడు.

అస్సెఫ్‌కు సంబంధించిన ఒక ఫోటోను చూపించారు కుటుంబసభ్యులు. అందులో ఫుట్ బాల్ కిట్‌తో ఉన్న అస్సెఫ్ కనిపించాడు.

లేత నీలం రంగు జెర్సీ, ముదురు నీలంరంగు షార్ట్స్, ఆకుపచ్చ, నలుపురంగు షూతో కనిపించాడు.

“నా కిట్ ఆ శిథిలాల మధ్యనే ఉండిపోయింది. నా సాక్స్, షూ, నాకెంతో ఇష్టమైన నా ఫుట్‌బాల్.. అన్ని పోయాయి” అని చెప్పాడు.

దాడిలో గాయపడిన అస్సెఫ్‌ను వీల్ చైర్‌లో ఆసుపత్రికి తీసుకుని వచ్చారు వాలంటీర్లు.

ఆ ప్రాంగణమంతా టెంట్లు, తాత్కాలిక శిబిరాలతో నిండిపోయింది. ఉత్తర గాజా నుంచి వచ్చేవారి కోసం వాటిని ఏర్పాటుచేశారు.

అస్సెఫ్ వాలంటీర్లతో జోకులు వేస్తూ, నవ్విస్తుంటాడు.

ఈ నవ్వు అసందర్భమే కానీ, ఆందోళన, భయాలతో జీవిస్తున్న గాజా ప్రజలకు చాలా అవసరం.

అస్సెఫ్ నిబ్బరం వెనుక భవిష్యత్తు పట్ల ఆందోళన కూడా దాగి ఉందని అతడి తల్లి అన్నారు.

“అమ్మా, నా స్నేహితులు నా ఒక్క కాలిని చూసి నన్నేమైనా ఆటపట్టిస్తారా? అని నన్ను అడుగుతాడు.

రాత్రిళ్లు తాను ఫుట్‌బాల్ ఆడుతున్నప్పుడు తీసిన పాత ఫోటోలను చూసి ఏడుస్తుంటాడు” అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)