రష్యా ఇచ్చిన ఏ బలంతో అమెరికాపై హిజ్బుల్లా కన్నెర్ర చేసింది? ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హిజ్బుల్లా చేరుతుందా?

ఫొటో సోర్స్, GOKTAY KORALTAN, BBC
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపకపోతే, యుద్ధ పరిధి మరింత పెరుగుతుందని లెబనాన్ తీవ్రవాద సంస్థ హిజ్బుల్లా హెచ్చరించింది.
దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా ఫైటర్లకు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య అక్టోబర్ 7 నుంచే స్వల్ప స్థాయి వివాదం కొనసాగుతోంది. అయితే, అక్కడ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
హిజ్బుల్లా సంస్థకు చెందిన ఇద్దరు అగ్ర నేతల ప్రకటనల కారణంగా ఇజ్రాయెల్- లెబనాన్ సరిహద్దులో యుద్ధం జరుగుతుందనే భయం నెలకొంది.
మధ్య ప్రాచ్యంలో చాలా తీవ్రమైన, ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజ్బుల్లా రెండో అతిపెద్ద నాయకుడు షేక్ నయీమ్ కాసెమ్ అన్నారు. వాటి ప్రభావాలను ఎవరూ ఆపలేరని ఆయన చెప్పారు.
అమెరికాను హెచ్చరిస్తూ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా చేసిన ప్రకటనల తర్వాత, షేక్ నయీమ్ కాసెమ్ తాజా వ్యాఖ్యలు వచ్చాయి.
గత వారం అమెరికాను నస్రల్లా హచ్చరించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం తర్వాత ఈ ప్రాంతానికి చేరుకున్న అమెరికా యుద్ధనౌకల కోసం హిజ్బుల్లా భాండాగారంలో ఏదో దాచి ఉంచినట్లు నస్రల్లా చెప్పారు.

అమెరికాకు హెచ్చరిక
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ పరిధి ఎప్పుడైనా పెరుగవచ్చని, దీనికి ఇజ్రాయెల్‌దే బాధ్యత అని బీరూట్‌లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజ్బుల్లా నాయకుడు షేక్ కాసెమ్ అన్నారు.
‘‘ఈ ముప్పు నిజమైనది. ఎందుకంటే సాధారణ పౌరులపై ఇజ్రాయెల్ దూకుడు పెంచుతోంది. మహిళలు, పిల్లల్ని చంపుతోంది. ఇదంతా కొనసాగుతూ ఉంటే ఈ ప్రాంతానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉంటుందా? నాకైతే అలా అనిపించడం లేదు.
లెబనాన్‌లో ఎవరైనా యుద్ధం అంటే భయపడతారు. ఇలా భయపడటం మామూలే. యుద్ధాన్ని ఎవరూ ఇష్టపడరు. అయితే, యుద్ధం మరింత పెరగకుండా శాంతిని పునరుద్ధరించమని ఇజ్రాయెల్‌కు చెప్పండి.
ప్రతీ దానికి ఒక సమాధానం ఉంటుంది. హిజ్బుల్లాకు చాలా సామర్థ్యం ఉంది’’ అని షేక్ కాసెమ్ అన్నారు.

ఫొటో సోర్స్, reuters
మధ్యదరా సముద్రంలో అమెరికా యుద్ధనౌకలను మోహరించడం పట్ల శుక్రవారం నాటి ప్రసంగంలో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ప్రశ్నలు లేవనెత్తారు.
హమాస్, హిజ్బుల్లా, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌లకు సహాయపడే ఇరాన్ జోక్యం వల్ల యుద్ధం పరిధి పెరగకూడదనే ఉద్దేశంతో రెండు విమాన వాహక యుద్ధనౌకలను, ఇతర నౌకలను అక్కడ మోహరించినట్లు అమెరికా చెప్పింది.
ఈ యుద్ధనౌకలను తమకు పొంచి ఉన్న ప్రత్యక్ష ముప్పుగా హిజ్బుల్లా భావిస్తోంది.
ఎందుకంటే వాటి నుంచి తమపై, తమ మిత్రదేశాలపై దాడి చేయగలదని హిజ్బుల్లా అనుకుంటోంది.
అమెరికాను హెచ్చరిస్తూ నస్రల్లా ఇలా అన్నారు. ‘‘మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా నౌకలకు మేం ఎప్పుడూ భయపడలేదు.
ఏ బలం ఆధారంగా మీరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారో, దాన్ని ఎదుర్కొనేందుకు మేం తగిన ఏర్పాట్లు చేశాం’’ అని అన్నారు.
హిజ్బుల్లా అనేక రకాల ఆయుధాలను సంపాదించినట్లు ప్రస్తుత, మాజీ అమెరికా అధికారులు నమ్ముతున్నారని వార్తా ఏజెన్సీ రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, WAEL HAMZEH/EPA-EFE/REX/SHUTTERSTOCK
హిజ్బుల్లా చేసిన 'ఏర్పాట్లు' ఏమిటి?
రష్యా నుంచి అందుకున్న శక్తిమంతమైన క్షిపణుల అండతోనే అమెరికాను హిజ్బుల్లా చీఫ్ హెచ్చరించినట్లు రాయిటర్స్ పేర్కొంది. హిజ్బుల్లా ఆయుధాల నిల్వపై అవగాహన ఉన్న మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పై సమాచారాన్ని వెల్లడించింది.
రష్యాలో తయారైన యాఖోంట్ క్షిపణులను దృష్టిలో పెట్టుకొనే హిజ్బుల్లా చీఫ్ ‘తగిన ఏర్పాట్లు చేశామంటూ’ వ్యాఖ్యానించారని లెబనాన్‌లోని రెండు మూలాలను ఉటంకిస్తూ రాయిటర్స్ పేర్కొంది. యాఖోంట్ మిసైల్, 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యలను ఛేదించగలదు.
హిజ్బుల్లాకు ఈ క్షిపణులు సిరియా మీదుగా వచ్చాయని మీడియాలో అనేక కథనాలు రావడంతో పాటు నిపుణులు కూడా అభిప్రాయపడ్డారు.
పదేళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధం మొదలైనప్పటి నుంచి సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌కు హిజ్బుల్లా మద్దతు ఇస్తోంది. సిరియా నుంచే హిజ్బుల్లాకు ఈ క్షిపణులు లభించాయని భావిస్తున్నారు. తమ వద్ద యాఖోంట్ క్షిపణులు ఉన్నట్లు హిజ్బుల్లా ఎప్పుడూ ప్రకటించలేదు.
"హిజ్బుల్లా వద్ద యాఖోంట్ మిసైల్స్ ఉన్నాయి. ఇవే కాకుండా వేరే ఆయుధాలు కూడా ఉన్నాయి. ఒకవేళ హిజ్బుల్లా ఈ ఆయుధాలను అమెరికా నౌకల మీద ఉపయోగిస్తే, ఆ ప్రాంతం అంతా యుద్ధంలో చిక్కుకుందని భావించాలి’’ అని తమ మూలాలు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
ఇజ్రాయెల్ - హిజ్బుల్లా తలపడితే ఏం జరుగుతుంది?
రాజకీయంగా, సైనికపరంగా శక్తిమంతమైన లెబనీస్ షియా గ్రూప్ ‘హిజ్బుల్లా’ను బ్రిటన్, అమెరికా, అరబ్ లీగ్‌లు తీవ్రవాద సంస్థగా ప్రకటించాయి.
గాజా యుద్ధానికి సంబంధించి ఇప్పటివరకు ఈ గ్రూపు చాలా జాగ్రత్తగా స్పందించింది.
అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసినప్పటి నుంచి, లెబనాన్-ఇజ్రాయెల్ సరిహద్దులో హిజ్బుల్లా ఫైటర్లు, ఇజ్రాయెల్ సైనికుల మధ్య చిన్న స్థాయిలో వివాదం కొనసాగుతోంది.
గాజాలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్న కొద్దీ మధ్యప్రాచ్యం అంతటా ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
లెబనాన్‌లో ప్రతీ సామాన్య పౌరుడి మరణానికి బదులుగా సరిహద్దు అవతలివైపు కూడా ఒక ప్రాణం పోతుందని హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హెచ్చరించారు.
అయితే, ఇజ్రాయెల్‌తో బహిరంగ యుద్ధం గురించి ఆయన ఎలాంటి బెదిరింపులు చేయలేదు.
ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య యుద్ధం జరిగితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో బీబీసీతో బీరూట్‌లోని రక్షణ, భద్రతా సలహాదారు నికోలస్ బ్లాన్‌ఫోర్డ్ చెప్పారు.
“ఒకవేళ్ హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఎన్నో దేశాల కంటే ఎక్కువ ఆయుధాలను కలిగి ఉన్న శత్రువును ఇజ్రాయెల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిజ్బుల్లా వద్ద 1.5 లక్షల రాకెట్ మిసైల్స్, 60 వేల యుద్ధ విమానాలు ఉన్నాయని అంచనా.
ఒకవేళ హిజ్బుల్లా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే, ఇప్పుడు గాజాలో జరుగుతున్నదంతా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఒక రకమైన లాక్‌డౌన్ విధిస్తారు. బాంబుల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది జనాభాను షెల్టర్లను పంపించాల్సి ఉంటుంది.
ఇజ్రాయెల్‌లో వాయు, సముద్ర యానం నిలిచిపోతుంది. హిజ్బుల్లా గైడెడ్ క్షిపణులు ఇజ్రాయెల్‌లో ఎక్కడైనా లక్ష్యాలను చేధించగలవు. అలాగే ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌ను కార్ పార్కింగ్ (ఖాళీ స్థలం)గా మార్చగలదు’’ అని ఆయన వివరించారు.
ఇప్పటి వరకు హిజ్బుల్లా ప్రధానంగా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంది.
ఆదివారం దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఒక మహిళ, ముగ్గురు పిల్లలు చనిపోయారు.
హిజ్బుల్లా దీనికి ప్రతిస్పందనగా రష్యాలో తయారైన గ్రైడ్ రాకెట్‌ను ప్రయోగించి ఒక ఇజ్రాయెల్ పౌరుడిని చంపింది.
ఇవి కూడా చదవండి:
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?
- ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?
- 1971 వార్: పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆ రాత్రి ఏం జరిగింది?
- గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో
- ఆధార్ వివరాలతో డబ్బులు మాయం చేస్తున్న మోసగాళ్లు.. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలంటే..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










