'దైవదూత వచ్చాడు' అంటూ అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లాను ఎందుకు ప్రశంసిస్తున్నారు?

రహ్మానుల్లా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్

అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ చూపిన దాతృత్వం పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ వరల్డ్ కప్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఒకప్పటి ప్రపంచ విజేతలు ఇంగ్లండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించింది అఫ్గానిస్తాన్ జట్టు. టోర్నీలో మొత్తం నాలుగు మ్యాచ్‌లు గెలిచిన అఫ్గానిస్తాన్ జట్టుకు భారత క్రికెట్ అభిమానుల నుంచి ప్రోత్సాహం లభిస్తోంది.

వరల్డ్ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్ అడేందుకు అహ్మదాబాద్ వెళ్లింది అఫ్గానిస్తాన్ జట్టు.

ఈ సమయంలో క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ చేసిన మంచి పనిపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అఫ్గానిస్తాన్ జట్టు

ఫొటో సోర్స్, VIRAL VIDEO/SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, ఆర్జే లవ్ షా అనే వ్యక్తి ఈ వీడియోను అప్‌లోడ్ చేయగా, వైరల్ అయింది

వైరల్ వీడియోలో ఏముంది?

‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. దీపావళి పండుగ ముందు రోజు రాత్రి, అహ్మదాబాద్‌లోని దూరదర్శన్ కేంద్రం సమీపంలో ఫుట్‌పాత్ పై నిద్రిస్తున్న వారి దగ్గర డబ్బులు పెడుతూ ఓ వ్యక్తి కనిపించాడు.

అదే సమయానికి ఆ ప్రాంతం మీదుగా వెళ్తున్న రేడియో జాకీ లవ్ షా ఆ దృశ్యాలను రికార్డ్ చేశారు.

ఆ వ్యక్తి వెళ్లిపోయాక, అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి ఎవరని ఆరా తీశారు. అతడు అఫ్గానిస్తాన్ క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అని తెలుసుకున్నాక, ఆర్జే లవ్ షా తాను తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

ఆ వీడియోలో ఓ వ్యక్తి తన పక్కనున్న మహిళతో మాట్లాడుతూ, ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నవారి పక్కన డబ్బులు పెడుతూ కనిపించాడు.

గుర్బాజ్ 500 రూపాయల నోట్లను వారి దగ్గర ఉంచినట్లు గుర్తించారు ఆర్జే లవ్ షా.

వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, వైరల్ అయింది. యూజర్లు ఆ వీడియోపై తమ తమ అభిప్రాయలను పంచుకుంటున్నారు.

రహ్మానుల్లా గుర్బాజ్

ఫొటో సోర్స్, @SHASHITHAROOR

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

ఇలాంటి ‘సెంచరీలు’ ఎన్నో చేయాలి: శశి థరూర్

ఈ వీడియోను ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్, “అఫ్గానిస్తాన్ నుంచి దేవదూత(ఏంజెల్) వచ్చాడు” అని ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆ వీడియోను షేర్ చేసిన సందర్భంలో ,"రహ్మానుల్లా చేసిన పని ఎంతో ప్రశంసించదగ్గది. ఇది అతడు సాధించిన సెంచరీ కన్నా గొప్పది. ఇలాంటి సెంచరీలు ఎన్నో చేస్తారని నేను నమ్ముతున్నాను" అని రాశారు.

మరో యూజర్ రోషన్ రాయ్, "దీపావళి పండుగ సమయంలో ఇలాంటి ఘటన చూడటం అద్భుతం. ఇందుకే అప్గాన్ క్రికెటర్లను భారతీయులు ఎంతో ప్రేమిస్తున్నారు" అని రాశారు.

రాజేంద్ర ఖంభట్ అనే యూజర్, "నిర్మలమైన మనస్సు ఉన్న మంచి వ్యక్తులకు మతంతో పని లేదు. మన నాయకులు కూడా దీని నుంచి పాఠం నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. రహ్మానుల్లా ఎప్పటికీ భారతీయుల గుండెల్లో నిలిచిపోతాడు" అని రాశారు.

"అఫ్గాన్ నుంచి వచ్చిన దేవదూత" అని మహ్మద్ అఫ్జల్ జర్ఘోనీ ట్వీట్ చేశాడు.

రహ్మానుల్లా గుర్బాజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐపీఎల్‌లో ఆడిన రహ్మానుల్లా గుర్బాజ్

ఎవరీ రహ్మానుల్లా?

21 ఏళ్ల రహ్మానుల్లా కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, అఫ్గాన్ జట్టు వికెట్ కీపర్.

2019లో టీ20ల్లో, 2021లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయింట్స్ జట్ల తరుపున ఐపీఎల్‌లో ఆడాడు.

ఇప్పటివరకు 43 టీ20 మ్యాచ్‌లు, 35 వన్డే మ్యాచ్‌లు ఆడిన రహ్మానుల్లా వన్డేల్లో 5 సెంచరీలు చేశాడు.

2023 ప్రపంచ కప్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలతో మొత్తం 280 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)