'క్రికెట్ అంటే ఆనందం, ఆరోగ్యం...' ఇలాంటి మహిళల క్రికెట్ క్లబ్‌ను మీరెక్కడైనా చూశారా?

క్రికెట్ ఆడుతున్న మహిళ

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, వారంలో మూడు రోజులు మహిళలు వారి సౌకర్యార్థం ఈ క్లబ్‌కి వచ్చి ప్రాక్లీస్ చేసుకోవచ్చు.
    • రచయిత, జాహ్నవి మూలే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నాకంతా క్రికెటే లోకం. విరాట్ కోహ్లీని బాగా అభిమానిస్తాను’ అని క్రికెట్ గురించి చాలా ఉత్సాహంగా చెబుతున్నారు 72 ఏళ్ల తారులత సంఘ్వి.

తారులత సంఘ్వి ముంబైలో నివసిస్తారు. ఇటీవలే ఆమె టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడటం ప్రారంభించారు.

‘‘నేను గృహిణిని. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తొమ్మిది మందితో మాది చాలా పెద్ద కుటుంబం. ప్రతి ఒక్కరికీ మ్యాచ్ చూడటమంటే ఇష్టం’’ అని తారులత సంఘ్వి చెప్పారు.

భర్త, కొడుకు ప్రోత్సాహంతో తారులత ఈ వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించారు.

తనకు బౌలింగ్ అంటే ఇష్టమని అన్నారు. వికెట్లు కూడా తీయగలనని ఎంతో సంతోషంతో చెబుతున్నారు.

విరాట్ కోహ్లి అభిమాని 72 ఏళ్ల తారులత

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, విరాట్ కోహ్లి అభిమాని 72 ఏళ్ల తారులత

ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న సర్వశ్రేష్ఠ క్రికెట్ క్లబ్‌ తారులత వంటి 300 మందికి పైగా మహిళలను మైదానంలోకి తీసుకొచ్చింది.

ప్రతి ఆదివారం ఉదయం, సాయంత్రం పూట వారంలో రెండుసార్లు ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

టెన్నిస్ బాల్‌తో వారు క్రికెట్‌ను ప్రాక్టీస్ చేస్తుంటారు. కృత్రిమ గడ్డిపై వారు మ్యాచ్‌లు ఆడుతూ ఉంటారు.

ముంబైలో అమ్మాయిల కోసం ఇలాంటి క్రికెట్ అకాడమీలు చాలా ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీల్లోని విద్యార్థినులు వీటిల్లో టీమ్‌లుగా ఉన్నారు.

మయూర అమర్‌కాంత్, ఆమె స్నేహితురాళ్లు కలిసి గత కొన్నేళ్ల కిందట సర్వశ్రేష్ఠ క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో మహిళలు క్రికెట్ ఆడుకోవచ్చు.

మయూర అమర్‌కాంత్

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, మయూర అమర్‌కాంత్

మహిళల క్రికెట్ క్లబ్ ఎలా అవతరించింది?

‘‘నేను ఒక క్రికెటర్‌ను పెళ్లాడాను. ఆయన క్రికెట్‌ను పెళ్లి చేసుకున్నారు’’ అని మయూర జోక్ చేశారు.

46 ఏళ్ల మయూర డిజిటల్ స్ట్రాటజిస్ట్, రైటర్. తల్లి, భార్య, ఉద్యోగ బాధ్యతలతో సతమతమయ్యే సమయంలో, మయూర దృష్టి క్రికెట్ వైపు మరలింది.

ఎందుకంటే ఆమె భర్త అమర్‌కాంత్ జైన్ క్రికెటర్ కావడంతో క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు.

చిన్నప్పటి నుంచి అమర్‌కాంత్ క్రికెట్ అభిమాని. ముంబైలో లోకల్ క్రికెట్‌లో ఆయన ఆడారు.

‘‘స్నేహితుల గురించి అయినా, తన గురించి అయినా చెప్పుకునేటప్పుడు పూర్తిగా క్రికెట్‌తో ముడిపడిన అంశాలనే మాట్లాడుతుండే వారు’’ అని చెప్పారు మయూర.

‘‘నా భార్తను నేను బాగా ప్రేమించేదాన్ని. కానీ, మాట్లాడుకునేందుకు మా ఇద్దరికి కామన్‌గా నచ్చే అంశాలు ఉండేవి కావు. అందుకే నేను క్రికెట్‌ను అభిమానించడం మొదలుపెట్టాను’’ అని అన్నారు.

అప్పటి నుంచి మయూర క్రికెట్ చూడటం మొదలుపెట్టారు. గేమ్‌పై ఆసక్తి పెంచుకున్నారు.

ఆ తర్వాత అమర్‌కాంత్ ప్రోత్సాహంతో టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు. వారి టీమ్ కొన్ని మ్యాచ్‌లు గెలిచింది.

కానీ, తమకు సరైన శిక్షణ, సాధన లేదని వారు గుర్తించారు.

‘‘క్రికెట్ ఆడేటప్పుడు ఒకరు లేదా ఇద్దరు ఆడలేరు. మీకు టీమ్ కావాల్సి ఉంటుంది. మట్టిగడ్డిని అద్దెకు తీసుకునేందుకు కేవలం నలుగురు లేదా ఐదుగురు మాత్రమే డబ్బులు చెల్లించే వారు’’ అని మయూర అన్నారు.

‘‘ఆ తర్వాత నాకో ఆలోచన వచ్చింది. మనమెందుకు మహిళలతో కలిసి ఒక చిన్న క్లబ్‌ను ఏర్పాటు చేయకూడదని అనిపించింది. ప్రతి శనివారం వారు ఆడుకునేలా ఒక చిన్న క్లబ్‌ను ప్రారంభించాలనుకున్నా. ఆ విషయాన్ని టీమ్‌కు, కోచ్ చేతన్ సార్‌కు చెప్పాను’’ అని తెలిపారు.

క్లబ్‌ను ఏర్పాటు చేసిన మహిళలు

ఫొటో సోర్స్, MAYURA AMARKANT

ఫొటో క్యాప్షన్, మేఘనా గాల, దియా, శ్రుతికా, మయూర, నమ్రతా, కోచ్ చేతన్ సార్. ఐదుగురు సభ్యులతో ప్రారంభమైన ఈ క్లబ్‌లో ప్రస్తుతం 300 మందికి పైగా సభ్యులు

మయూర, ఆమె స్నేహితురాళ్లు నమ్రతా గాల, మేఘన గాల, శ్రుతికా తవారి, దియా సంఘ్వి కలిసి ఈ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. మయూర భర్త అమర్‌కాంత్ ఈ క్లబ్‌కు మెంటార్.

ఈ క్లబ్ గురించి వాట్సాప్‌లలో, స్నేహితుల గ్రూప్‌లలో ప్రచారం జరగగా.. చాలా మంది మహిళలు దీనిలో చేరారు.

‘‘మేం ఐదుగురిగా ఈ క్లబ్‌లో చేరాం. ఇప్పుడు మూడు వందల మందికి పైగా అయ్యాం. వీరందరూ ముంబైలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు.

మలాద్ వెస్ట్‌లో మేం సాధన చేస్తాం. థానే, మీరా రోడ్, నేవి ముంబై, వర్లి నుంచి కూడా చాలా మంది మహిళలు ఇక్కడ ఆడుకునేందుకు వస్తుంటారు’’ అని మయూర చెప్పారు.

మూడు వందల మందికి పైగా మహిళా సభ్యులున్న ఒకే ఒక్క క్రికెట్ క్లబ్ ఇదని కొందరు తమకు చెబుతుంటారని అన్నారు.

విరాట్ కోహ్లి అభిమాని 72 ఏళ్ల తారులత

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, క్రికెట్ ఆడుతున్న 72 ఏళ్ల తారులత

వయసు కేవలం ఒక సంఖ్యనే

అక్టోబర్ చివరిలో ఒక రోజు ఉదయం పూట మయూరను తాము కలిసినప్పుడు, 50 మంది కలిసి అక్కడ ఆడుతూ కనిపించారు.

ముంబైలోని మలాద్ వెస్ట్ ప్రాంతంలోని సఖా కాంప్లెక్స్‌లో కృత్రిమ గడ్డిపై టోర్నమెంట్ ఆడేందుకు వారందరూ సిద్ధమవుతున్నారు.

జంటగా ఉన్న పిచ్‌లపై వారు ఒకేసారి సాధన చేస్తున్నారు. టెన్నిస్ బాల్‌తో పాటు, తేలికైన బ్యాట్లతో వారు క్రికెట్ ఆడుతున్నారు.

ఒకరు బ్యాటింగ్ చేస్తుంటే, మరొకర బౌలింగ్, మరొకరు ఫీల్డింగ్ చేస్తున్నారు. ఇలా ఆడుతూ ఒకరికొకరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు.

అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు క్రికెట్ ఆడటం చాలా తక్కువగా ఉందని 2020లో ఇండియన్ స్పోర్ట్స్‌ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సందర్భంగా బీబీసీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

భారత్‌లో చాలా పట్టణాలు, నగరాల్లో అమ్మాయిలు అసలు మైదానంలోకి రావడం లేదు.

ముంబైలో ఎక్కువ మంది అమ్మాయిలే ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ, కొంత వయసు వచ్చిన తర్వాత మైదానంలోకి వచ్చే వారు చాలా తక్కువే ఉంటున్నారు.

టాప్ క్రికెట్ క్లబ్‌లలో ఈ సంఖ్యలో చాలా తేడా ఉంది.

సర్వశ్రేష్ఠ క్రికెట్ క్లబ్‌లో ఆడుతున్న వారిలో అత్యంత తక్కువ వయసున్న అమ్మాయికి 9 ఏళ్లు కాగా.. ఎక్కువ వయసున్న మహిళకు 72 ఏళ్లుంటాయి.

వయసు కేవలం సంఖ్యనేనని ప్రజక్తా చెబుతున్నారు. ప్రతివారం మానేయకుండా తాను ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు వస్తుంటానని చెప్పారు.

చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టపడే ప్రజక్తా

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, చిన్నప్పటి నుంచి క్రికెట్‌ అంటే ఇష్టపడే ప్రజక్తా

‘‘నాకిప్పుడు 43 ఏళ్లు. నాకు ఆడటమంటే ఇష్టం. శరీరం సహకరిస్తున్నప్పుడు, ఎలాంటి వ్యాధులు లేకపోతే, క్రీడల నుంచి ఆనందం పొందొచ్చు’’ అన్నారు.

ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకునేందుకు, కొంత ఎక్సర్‌సైజు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ప్రజక్తా న్యాయవాది వృత్తిలో ఉన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు చూడటం ఆమెకు ఇష్టం.

రెగ్యులర్‌గా మ్యాచ్‌లు చూస్తుంటారు. గత ఏడాది క్రితం ఆమెకు ఈ క్లబ్ గురించి తెలిసింది. ఆ తర్వాత నుంచి ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఆడటం మొదలుపెట్టారు.

‘‘క్రికెట్ నా తొలి ప్రేమ. నా చిన్నప్పుడు క్రికెట్ గురించి పెద్దగా ప్రచారం, ఆదరణ ఉండేది కాదు. ఒకవేళ ఉండుంటే క్రికెటర్ అయ్యేదాన్ని. దీని కోసం ఎక్కడికి వెళ్లాలో తెలిసేది కాదు. ప్రస్తుతం నాకు అవకాశం దొరికింది. ఎంజాయ్ చేస్తున్నాను’’ అని ప్రజక్తా చెప్పారు.

క్రీడాకారులు

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

క్రికెట్‌తో ఆనందం, ఆరోగ్యం

మహిళలు ఈ క్లబ్‌కు వారి సౌకర్యార్థం వారంలో ఒకటి లేదా మూడు రోజులు వస్తుంటారు.

వారు మ్యాచ్‌లు ఆడుతుంటారు. క్లబ్‌ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన వారు ఇక్కడ ప్రత్యేక బహుమతులు గెలుచుకుంటూ ఉంటారు.

నిత్యం ఇక్కడ వారికి క్రీడా కోచింగ్ ఇచ్చే వారు ఉంటారు. ఆరుగురు కోచ్‌లకు చెందిన ఏడుగురు సభ్యుల టీమ్‌ ఉంటుంది. ఈ కోచింగ్ టీమ్‌లో చేతన్ బాగ్దే, అక్షయ్ మండనే, దావల్ సార్ ఉన్నారు.

కేవలం క్రీడల గురించి మాత్రమే కాక, మహిళల ఫిట్‌నెస్‌ను పెంచడంపై కూడా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటామని అక్షయ్ మండనే చెప్పారు.

‘‘ఈ మహిళలందరూ చాలా శ్రమిస్తారు. కొందరు ఉద్యోగం చేసేవాళ్లు అయితే, కొందరు ఇంట్లో తమ పిల్లల్ని చూసుకోవాల్సి ఉంటుంది. వారంలో రెండు గంటల సమయాన్ని వారికెలా మర్చిపోలేని అనుభూతిగా మార్చాలని మేం ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే గేమ్స్ ద్వారా నవ్విస్తుంటాం, సాధన చేపిస్తుంటాం’’ అని అక్షయ్ తెలిపారు.

‘‘చాలా మందికి ఫిట్‌నెస్ తక్కువగా ఉంటుంది. వారిపై మేం శ్రద్ధ తీసుకుంటాం. క్రికెట్‌ను మించి జీవితంలో ఉపయోగపడే చాలా అంశాలను మహిళలు నేర్చుకుంటారు. అంటే ఓర్పుగా ఎలా ఉండాలి, వివిధ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలు తెలుసుకుంటారు. క్రికెట్ వారికొక థెరపీ లాగా పనిచేస్తుంది’’ అని చెప్పారు.

చాలా మంది మహిళలు కరోనా సమయంలో తమ ప్రియమైన వారిని కోల్పోయారు. కొందరు మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ, క్రికెట్ వారికి ఏదైనా కొత్తగా చేయమని స్ఫూర్తినిచ్చింది.

దీపా దమానియా

ఫొటో సోర్స్, SHARDUL KADAM/BBC

ఫొటో క్యాప్షన్, దీపా దమానియా

‘‘కరోనా నాకు ఊహించని చేదు అనుభవాలను మిగిల్చింది. క్రికెట్ వాటి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది. అంతకుముందు నేనెప్పుడూ క్రికెట్ ఆడలేదు’’ అని దీపా దమానియా చెప్పారు.

‘‘క్రికెట్ వల్ల క్రమశిక్షణ పెరిగింది. నేను మరింత ఫిట్‌గా, ఆరోగ్యపరంగా చాలా శ్రద్ధగా మారాను. ఇక్కడికి వస్తే, మీ తలపై ఎలాంటి భారాలు ఉన్నట్లు మీకు అనిపించవు. ప్రతి శనివారం నేర్చుకునేందుకు ఏదో కొత్తది ఉన్నట్లు అనిపిస్తుంది’’ అని తెలిపారు.

క్రీడలు మీకన్నీ ఇస్తాయన్నారు దీపా.

మయూర కూడా అదే రకమైన అనుభూతి పొందుతున్నారు.

‘‘మహిళలం మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఇంట్లో, ఆఫీసులో, కుటుంబంలో చాలా విషయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ టెన్షన్లను మర్చిపోయి సంతోషంగా ఉండేందుకు మేం ఇక్కడికి వస్తుంటాం’’ అని చెప్పారు.

‘‘ఒక్క మాటలో క్రికెట్ అంటే సంతోషం. ఆడుతున్నప్పుడు వారి కళ్లలో నేను ఆనందాన్ని చూస్తాను’’ అని అన్నారు మయూర.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)