డయాబెటిస్ ఎందుకు వస్తుంది? దీని నుంచి తప్పించుకోవడం ఎలా?

స్వీట్ చేతిలో పట్టుకుని ఆలోచిస్తున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. ఎవరికైనా ఈ జబ్బు రావొచ్చు. ప్రతీ ఏడాది లక్షల మంది డయాబెటిస్ కారణంగా చనిపోతున్నారు.

డయాబెటిస్‌నే షుగర్ వ్యాధి, మధుమేహం అని కూడా అంటారు.

రక్తంలోని చక్కెరల (గ్లూకోజ్)ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, మూత్రపిండాల వైఫల్యం వంటివి సంభవించే ముప్పు ఉంటుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం, ఇది పెరుగుతున్న సమస్య. 40 ఏళ్ల నాటితో పోలిస్తే ఇప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి నాలుగు రెట్లు పెరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మంది డయాబెటిస్‌తో జీవిస్తున్నట్లు అంచనా.

ఈ వ్యాధి వల్ల ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ, డయాబెటిస్ ఉన్నవారిలో సగం మందికి దాని గురించి తెలియదు.

జీవనశైలిలో మార్పులతో చాలా వరకు ఈ వ్యాధిని నివారించవచ్చు. అదెలాగో ఈ కథనంలో తెలుసుకోండి.

వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లోమగ్రంథి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్లోమగ్రంథి నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది

డయాబెటిస్‌కు కారణాలు ఏమిటి?

మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను జీర్ణవ్యవస్థ చక్కెరలు (గ్లూకోజ్)గా విడగొడుతుంది.

క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్, శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోజ్‌ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది.

శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిస్ సంభవిస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుపడి డయాబెటిస్ వస్తుంది.

షుగర్ టెస్ట్ చేసుకున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్ రకాలు

డయాబెటిస్‌లో అనేక రకాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్.

క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతే, రక్తంలో చక్కెర పేరుకుపోతుంది. ఇలా వచ్చే దాన్ని ‘టైప్ 1 డయాబెటిస్’ అని అంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. జన్యువుల ప్రభావం వల్ల గానీ, లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల క్లోమ గ్రంథిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలు దెబ్బతినడం వల్ల గానీ ఇలా జరుగుతుండొచ్చని వారు భావిస్తున్నారు. డయాబెటిస్ వ్యాధి ఉన్న వారిలో దాదాపు 10 శాతం మందికి టైప్1 డయాబెటిస్ ఉంటుంది.

టైప్ 2 డయాబెటిస్ అంటే, క్లోమగ్రంథి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయదు. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.

మధ్య వయస్సు లేదా వృద్ధాప్యంలో సాధారణంగా ఇలా జరుగుతుంది. అయితే, అధిక బరువు, ఎక్కువగా కూర్చునే పనిచేయడం, కనీస శారీరక శ్రమ లేకపోవడం వల్ల యువతలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని జాతుల్లో ప్రత్యేకించి దక్షిణాసియా వారికి టైప్ 2 మధుమేహం ఎక్కువగా వస్తుంది.

గర్భంతో ఉన్నప్పుడు కడుపులోని బిడ్డకు, తల్లికి సరిపడా ఇన్సులిన్‌ను శరీరం ఉత్పత్తి చేయలేకపోతే కొందరు గర్భిణులు ‘గర్భస్థ డయాబెటిస్‌’ను ఎదుర్కొంటారు.

6 నుంచి 16 శాతం మంది గర్భిణులు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారని విభిన్న ప్రాతిపదికల మీద నిర్వహించిన అధ్యయనాలు అంచనా వేశాయి.

డైట్, శారీరక వ్యాయామం, ఇన్సులిన్ తీసుకోవడం ద్వారా గర్భిణులు ఈ టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా శరీరంలో చక్కెర స్థాయుల్ని నియంత్రించుకోవాలి.

కొందరికి ‘ప్రి డయాబెటిస్’ అనే పరిస్థితి వస్తుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరణ అవుతుంది. ఇది డయాబెటిస్ రావడానికి ముందు దశ. ఇది ఇలాగే కొనసాగితే మధుమేహానికి దారి తీస్తుంది.

డయాబెటిస్

ఫొటో సోర్స్, AFP

డయాబెటిస్ లక్షణాలు

డయాబెటిస్‌లో సాధారణంగా కింది లక్షణాలు కనిపిస్తాయి.

  • అధికంగా దాహం వేయడం
  • ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడం, ముఖ్యంగా రాత్రివేళల్లో.
  • బాగా అలసిపోవడం
  • బరువు తగ్గిపోవడం
  • తరచుగా పుండ్లు కావడం
  • చూపు స్పష్టంగా లేకపోవడం
  • గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం

బ్రిటిష్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెప్పినదాని ప్రకారం, టైప్ 1 డయాబెటిస్‌ లక్షణాలు చిన్నప్పుడే లేదా యుక్తవయస్సులో కనిపిస్తాయి. ఈ లక్షణాలు తీవ్రంగా ఉంటాయి.

సాధారణంగా 40 ఏళ్లు పైబడిన వారిలో, దక్షిణాసియా ప్రజల్లోనైతే 25 ఏళ్లు పైబడితే ‘టైప్ 2 డయాబెటిస్’ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా ఈ జబ్బు ఉన్నా, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారిలో, దక్షిణాసియా, చైనా, ఆఫ్రో-కరీబియన్, బ్లాక్ ఆఫ్రికా మూలాలు ఉన్నవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగానే ఉంటుంది.

డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్‌ను నివారించగలమా?

జన్యు, పరిసర సంబంధిత కారకాల మీద డయాబెటిస్ ఆధారడి ఉంటుంది. ఆరోగ్యకర ఆహారం, క్రియాశీల జీవన విధానంతో రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచవచ్చు.

చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఆహారాలు, పానీయాలను తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఆహారాల బదులుగా సంపూర్ణ ఆహారాన్ని తీసుకోవడం ఇందుకు మొదటి మెట్టు.

రిఫైన్డ్ షుగర్, రిఫైన్డ్ తృణధాన్యాల్లో పోషకాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే రిఫైన్ చేసే ప్రక్రియలో వాటిలోని పీచు పదార్థాలు, విటమిన్లు కోల్పోతాయి. ఉదాహరణకు తెల్ల పిండి (వైట్ ఫ్లోర్), వైట్ బ్రెడ్, వైట్ రైస్, వైట్ పాస్తా, పేస్ట్రీలు, షుగరీ డ్రింక్స్, స్వీట్లు, బ్రేక్‌ఫాస్టు సెరియల్స్‌లలో అదనంగా చక్కెరలను చేర్చుతారు.

ఆరోగ్యకరమైన ఆహారం అంటే కూరగాయలు, పండ్లు, బీన్స్, తృణధాన్యాలు, ఆరోగ్యకర ఆయిల్స్, గింజలు, ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపల్ని చెప్పవచ్చు.

మధ్య మధ్య విరామాల్లో ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కడుపు నిండగానే తినడం ఆపాలి. రక్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గించడంలో శారీరక వ్యాయామం సహాయపడుతుంది.

వారంలో రెండున్నర గంటల పాటు ఏరోబిక్ వ్యాయాయం చేయాలని బ్రిటన్ నేషనల్ హెల్త్ సిస్టమ్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తుంది. ఇందులో వేగంగా నడవడం, మెట్లు ఎక్కడాన్ని చేర్చింది.

ఆరోగ్యకర బరువును కొనసాగిస్తే రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుకోవడం సులభం అవుతుంది. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే ఆ ప్రక్రియను చాలా నెమ్మదిగా చేయాలి. అంటే వారానికి అర కేజీ లేదా కేజీ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి.

గుండె వ్యాధుల ముప్పును తగ్గించుకోవడానికి కోలెస్ట్రాల్ స్థాయుల్ని పరిమితిలో ఉంచుకోవడం, పొగ తాగడం వదిలేయడం వంటివి చాలా ముఖ్యం.

డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

డయాబెటిస్ వల్ల తలెత్తే సమస్యలు

రక్తంలో అధికంగా ఉండే చక్కెర స్థాయులు, రక్త నాళాలను తీవ్రంగా దెబ్బతీయగలవు.

ఒకవేళ శరీరంలో రక్తం సరిగ్గా ప్రవహించలేకపోతే, రక్తం అవసరమైన భాగాలకు అది చేరదు. దీనివల్ల నాడులు దెబ్బతినడం, చూపు కోల్పోవడం, కాళ్లకు ఇన్‌ఫెక్షన్లు వాటిల్లే ముప్పు పెరుగుతుంది.

కంటిచూపు పోవడం, మూత్రపిండాల వైఫల్యం, గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి డయాబెటిస్ ముఖ్య కారణం అని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

2016లో మధుమేహం వల్లే 16 లక్షల మంది చనిపోయినట్లు అంచనా.

డయాబెటిస్

ఫొటో సోర్స్, Getty Images

80% మంది రోగులు మధ్య, అల్పాదాయ దేశాల్లోనే..

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 42.2 కోట్ల మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా.

డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1980లో 108 మిలియన్ల నుంచి 2014లో 422 మిలియన్లకు పెరిగింది.

1980లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహం బారిన పడిన వయోజనులు (18 ఏళ్ల కంటే పైబడినవారు) 5 శాతం కంటే తక్కువ ఉండగా, 2014 నాటికి వీరి సంఖ్య 8.5 శాతానికి పెరిగింది.

మధుమేహంతో జీవిస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది మధ్య, అల్పాదాయ దేశాల్లో ఉన్నారని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ అంచనా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)