రొమ్ము క్యాన్సర్‌ నివారణకు అనస్ట్రోజోల్ డ్రగ్

రొమ్ము క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అనబెల్ రఖాం
    • హోదా, బీబీసీ హెల్త్ రిపోర్టర్

ఇంగ్లండ్‌లో వేల మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు అనస్ట్రోజోల్ డ్రగ్ ప్రయోజనకరంగా మారనుంది.

చాలా ఏళ్లుగా వ్యాధి చికిత్సకు వినియోగిస్తున్న అనస్ట్రోజోల్ మాత్రను ఇకపై నివారణ కోసం వినియోగించేందుకు అనుమతి లభించింది.

తాజాగా నిర్వహించిన ట్రయల్స్‌లో మెనోపాజ్ దశను దాటిన మహిళలు దీనిని తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ బారిప పడే ప్రమాదం 50% మేర తగ్గుతుందని తెలిసింది.

వారసత్వంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణలో ఇది “ముఖ్యమైన అడుగు” అని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.

ఈ లెక్కన చూస్తే 2,89,000 మంది మహిళలు ఈ మందును తీసుకునేందుకు అర్హులని అంచనా.

ఒకవేళ వీరిలో ప్రతి నలుగురులో ఒకరు ముందుకు వస్తే ఇంగ్లండ్‌లో రెండు వేలకు పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు తగ్గుతాయని, ఫలితంగా 15 మిలియన్ పౌండ్ల విలువైన చికిత్స వ్యయం కూడా తగ్గుతుందని ఇంగ్లండ్ ఎన్‌హెచ్ఎస్ చెప్తోంది.

తమకు రొమ్ము క్యాన్సర్ సోకుతుందనే ఆందోళన ఉన్న మహిళలు జనరల్ ఫిజీషియన్లను సంప్రదించవచ్చు. వారు ఫుల్ రిస్క్ అసెస్మెంట్‌ను నిర్వహించే స్పెషలిస్టుల వద్దకు పంపిస్తారు.

అక్కడ పూర్తిస్థాయి పరీక్షలు, కుటుంబ చరిత్ర వంటి పలు అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయిస్తారు.

బ్రెస్ట్ క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మమ్మోగ్రామ్ పరీక్షతో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తిస్తారు

ఒక మాత్రకు 4 పైసలే ఖర్చు

అనస్ట్రోజోల్ మందుకు ఎలాంటి పేటెంట్ హక్కులు లేవు. అంటే ఒకటి కంటే ఎక్కువ సంస్థలు దీనిని తయారుచేయవచ్చు. దీనితోపాటు ఈ మందు చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఒక మాత్రకు 4 పైసలే ఖర్చవుతుంది.

2017లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ అండ్ కేర్ ఎక్స్‌లెన్స్ దీనిని నివారణకు మార్గంగా సిఫార్సు చేసింది.

ఎన్‌హెచ్ఎస్ ఇంగ్లండ్ మెడిసిన్స్-రీపర్పసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ద్వారా ఈ వినియోగానికి లైసెన్స్ పొందింది.

రోజుకు ఒకటి చొప్పున ఐదేళ్ల పాటు తీసుకోవాల్సిన ఈ కోర్సును పూర్తి చేశారు 61 ఏళ్ల లెస్లీ-ఆన్న్ వూడ్హమ్స్.

నా తల్లి క్యాన్సర్‌తో చేసిన పోరాటం చూశాక, ఈ నిర్ణయం తీసుకోవడం సులభమని అనిపించింది అన్నారు

నేను రొమ్ము క్యాన్సర్ బారిన పడతానేమో అన్న ఆందోళన లేకుండా, ప్రశాంతంగా నా జీవితాన్ని సాగిస్తాను అన్నారామె.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న భయం వదిలి, నేను నా కుటుంబం ప్రశాంతంగా జీవించొచ్చు. ఇది నిజంగా వరం లాంటిది అన్నారు.

క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్న వారికి ఈ మందు ఆశాకిరణమని బీబీసీ రేడియో 4 లోని టుడే ప్రోగ్రాంలో పాల్గొన్న ఎన్‌హెచ్ఎస్ ఇంగ్లండ్‌‌ క్లినికల్ డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ అయిన ప్రొఫెసర్ పీటర్ జాన్సన్ అన్నారు.

పరిశోధనల్లో ఇది రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలను తగ్గించడంలో సఫలమైందని, టామోక్సిఫెన్‌తో పోలిస్తే దుష్ప్రభవాలు చాలా తక్కువ అని చెప్పారు.

టామోక్సిఫెన్‌ను క్యాన్సర్ నివారణ చికిత్సలో ఇప్పటికే వాడుతున్నారు.

ఈ టామోక్సిఫెన్ తీసుకోవడం వలన రక్తం గడ్డకట్టడం, కొన్నిసార్లు గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉండటంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అనస్ట్రోజోల్‌ను తీసుకోవడం వలన ఇలాంటివేమీ ఎదురయ్యే అవకాశాలు కనిపించకపోవడం సంతోషించే విషయం అన్నారు.

అయితే, ఈ డ్రగ్‌ను తీసుకోవడం వలన కొన్ని దుష్ప్రభావాలు కలగొచ్చు అవి,

శరీరం వేడిగా అనిపించడం (హాట్ ఫ్లషెస్)

బలహీనంగా అనిపించడం

కీళ్లనొప్పులు

ఆర్థరైటిస్

చర్మంపై దద్దుర్లు

తలనొప్పి

డిప్రెషన్

కడుపులో తిప్పినట్లుగా, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం

ఆస్టియోపోరోసిస్

పైన చెప్పిన దుష్ప్రభావాలు ఎదురైతే వారు వైద్యులు లేదా ఫార్మసిస్టులను సంప్రదించాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు.

లెస్లీ-ఆన్ వూడ్హం

ఫొటో సోర్స్, LESLEY-ANN WOODHAM

ఫొటో క్యాప్షన్, ఐదేళ్ల చికిత్సను పూర్తిచేసుకున్న లెస్లీ-ఆన్ వూడ్హం

ఐదేళ్ల కోర్సు

ఈ అనస్ట్రోజోల్ మాత్ర ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను తగ్గించేందుకు, అరోమటేజ్ అనే ఎంజైమ్‌ను బ్లాక్ చేయడంలో ఉపయోగపడుతుంది.

1 మిల్లీ గ్రాము ట్యాబ్లెట్‌ను రోజుకు ఒకటి చొప్పున ఐదేళ్లపాటు తీసుకోవలసి ఉంటుంది. ఈ కోర్సు పూర్తయ్యాక కూడా ఈ మందు ప్రభావం కొన్నేళ్లపాటు ఉంటుందని అధికారులు చెప్తున్నారు.

“అనస్ట్రోజోల్‌ వినియోగానికి అనుమతి లభించడం ప్రధానమైన ముందడుగు. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర కలిగిన మహిళలు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదాన్ని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది” అని ‘బ్రెస్ట్ క్యాన్సర్ నౌ’ చీఫ్ ఎగ్జిక్యుటివ్ బరోనెస్ డెలియత్ మోర్గాన్

ఇంగ్లండ్‌లో రొమ్ము క్యాన్సర్ బారినపడటం సాధారణంగా మారింది. ఏటా 47 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో ప్రతి 10 మందిలో ఎనిమిది మంది మహిళలు 50 ఏళ్లు పైబడిన వారే ఉంటున్నారు.

BRCA జీన్ మ్యూటేషన్స్ ఉన్న మహిళలు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది.

యూకేలోని ఎక్కువ శాతం మంది మహిళలు తమ జీవితకాలంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం 15% ఉంది. మ్యూటేషన్‌ల వలన ఈ శాతం పెరుగుతూ వస్తోంది.

కుటుంబంలో ఎవరైనా క్యాన్సర్ బారినపడిన ఘటనలు ఉంటే వారు జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటే, వారసత్వంగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు.

రొమ్ము క్యాన్సర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రోజుకు ఒకటి చొప్పున ఐదేళ్లపాటు ఈ ట్యాబ్లెట్లు తీసుకుంటే రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు

క్రూరమైన వ్యాధులను నివారించే మందుగా అనాస్ట్రోజోల్‌ డ్రగ్‌కు అనుమతి రావడాన్ని స్వాగతించారు ఆరోగ్య శాఖ మంత్రి విల్ క్విన్స్.

“ఈ వ్యాధి సోకిన పోస్ట్ మెనోపాజ్ దశను దాటిన మహిళలకు అనస్ట్రోజోల్‌ను ఇవ్వడం వల్ల కలిగిన సానుకూల ప్రభావాన్ని మేం గుర్తించాం. ఇప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఉన్న మహిళలూ దీనిని తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు” అన్నారు.

స్కాట్లాండ్‌లోని వైద్యాధికారులు మాట్లాడుతూ, ఎక్కువ మందికి ఈ మందును ఇవ్వడం వలన కలిగే ప్రభావాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

వేల్స్ ప్రభుత్వ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఎన్ఐసీఈ మార్గదర్శకాలను అనుసరించి, రొమ్ము క్యాన్సర్ వ్యాధి చరిత్ర కలిగిన కుటుంబాలకు చెందిన వారికి ఇప్పటికే ఈ మందును సిఫార్స్ చేస్తున్నామని, తాజా అనుమతులకు అనుగుణంగా మార్పులు చేస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)