సరస్వతి నది నిజంగానే ఉందా... ఏమిటి దీని మిస్టరీ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జైదీప్ వసంత్
- హోదా, బీబీసీ
మీరెప్పుడైనా ప్రయాగ వెళ్ళారా? అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేశారా? ఓ పక్క నుంచి యమున, మరోపక్క నుంచి గంగానది ఇక్కడ సంగమిస్తాయి. త్రివేణి సంగమం అంటే మూడునదులు కదా అనే అనుమానం మీకు కలగవచ్చు. మరి ఇక్కడ రెండు నదులే కనిస్తుంటాయి. మూడో నది ఏమైందనే ప్రశ్న రావచ్చు. ఆ మూడో నదే సరస్వతి. ఇక్కడా నది కనిపించదు. కానీ, అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని హిందువుల విశ్వాసం.
సరస్వతి నది నిజంగా ఉందా? వేదాలలో ఉన్న సరస్వతినది ప్రస్తావన, ప్రస్తుతం మనం భావిస్తున్న సరస్వతి నది ఒకటేనా?
త్రివేణి సంగమంలోని సరస్వతి నది, వేదాలలోని సరస్వతి నది ఒకటేనా?
అసలు సరస్వతి నది నిజమా, అబద్ధమా? ఆధారాలు ఏం చెబుతున్నాయి, వాదోపవాదాలు ఎలా ఉన్నాయి.?
సరస్వతి నది అంతర్ధానమైనా, ఆ నది ఉనికిని ఇప్పటికీ చాలామంది నమ్ముతుంటారు.
ప్రాచీన కాలంలో సరస్వతి నది హరియాణాలో పుట్టి, గుజరాత్‌లోకి ప్రవేశించి సముద్రంలో కలిసేదనే వాదన ఉంది.
ఇటీవల ఈ నది ఆనవాళ్ళు భౌగోళికంగానూ, పురావస్తు రూపంలోనూ కనుగొనడంతో ఈ ప్రాచీన నది ఉందనే వాదనకు మద్దతు పెరిగింది.
అయితే ఈ సరస్వతి నదితో ముడిపడిన ఆర్యులు నిజంగా భారతీయులేనా? లేక బయటి ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారా? అనే ప్రశ్న తలెత్తతోంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పురాణాలలోని సరస్వతినదిని నిజమని చెప్పడం ద్వారా ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంది.

ఫొటో సోర్స్, ISRO
వేదనది సరస్వతి
హిందువులకు చతుర్వేదాలు పవిత్రమైనవి. వాటిల్లో రుగ్వేదం అత్యంత పురాతనమైనది. ఇది ప్రాచీన సంస్కృతంలో ఉంది. ఇది 3500 సంవ్సరాల కిందటి ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పంజాబ్‌లో రూపొందింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఈ వేదం లిఖితరూపంలోకి వచ్చింది. అప్పటిదాకా ఈ వేదం తమ తరువాతి తరం వారికి ‘శృతి, స్మృతి’ అనే సంప్రదాయ పద్ధతిలో అందించేవారు. అంటే వినడం, విన్నదాని వల్లెవేయడం ద్వారా ఎప్పటికీ మరిచిపోకుండా ఈ పద్ధతిని అనుసరించేవారు.
రుగ్వేదంలోని 45వ శ్లోకంలో సరస్వతి నదిని స్తుతించారు. మొత్తం 72 సార్లు సరస్వతిని స్తుతించారు. ఇందులో ‘‘నిండుగా ప్రవహిస్తోంది’’ ‘‘ఉత్కృష్టమైనది’’ ‘‘వేగంలోనూ, ప్రవాహంలోనూ ఇతర నదులను అధిమిస్తోంది’’ ‘‘నిరంతరాయంగా ప్రవహిస్తూ గమ్యం చేరుతోంది’’ అని ఉంది.
రుగ్వేదంలోని పదోమండలంలో 75 శ్లోకాలలోని 5వ శ్లోకంలో నదీస్తుతి సుక్తం యమున, సట్లేజ్ నదుల మధ్యన సరస్వతి నది సాగిపోవడాన్ని వర్ణిస్తుంది. అలాగే పర్వతం నుంచి సముద్రంలోకి సాగిపోయే స్వచ్ఛమైన జలధార అని రుగ్వేదంలోని 17వ మండలంలోని 95వ శ్లోకం వర్ణిస్తుంది.
సరస్వతి నదిని ‘సింధుమాత’ అని పిలుస్తారు. అంటే నదులకు తల్లి అని అర్థం. ఇది కనపడకుండా ప్రవహిస్తుంది కాబట్టే దీనిని అంతర్వాహిని అని పిలుస్తారు.
ఈ నది ఒడ్డున ‘త్రిత్సు భారత్’ అనే తెగ జీవించేది. దాంతో వారిని ‘భారతి’ అని పిలిచేవారు.
రుగ్వేదంలో సరస్వతి నదికి సంబంధించిన సమాచారాన్నంతా డాక్టర్ సంజీవ్ సన్యాల్ ఇచ్చారు. ఈయన భారత ప్రధానమంత్రి ‘ ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ’లో సభ్యుడు. అలాగే ‘ఇందిరాగాంధీ జాతీయ కళాకేంద్ర’లో రచయితగానూ ఉన్నారు. కపిలవాత్సాయన సంస్మరణ ప్రసంగాలలో భాగంగా పై విషయాలను ప్రసంగించారు.
మహాభారతంలోని ‘శల్యపర్వం’ ప్రకారం కృష్ణుడి అన్న బలరాముడు పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు.
ఆ సమయంలో ఆయన యాత్రలలో ఉన్నారు. బలరాముడు ద్వారక నుంచి తన యాత్ర మొదలుపెట్టారు. ఆయన ‘వినాశన్’ అనే ప్రాంతంలో సరస్వతి నది అంతరార్థనమైపోతుండటాన్ని చూశారు. ప్రస్తుతం ఈ ప్రాంతం థార్ ఎడారిలో ఉందని నమ్ముతారు.
కురుక్షేత్రంలో అఘావతి పేరుతో ప్రవహించే సరస్వతి నదిలో ఏడు నదులు సంగమించేవని చెపుతారు.

ఫొటో సోర్స్, ISRO
సరస్వతి నదిపై అనేక ప్రశ్నలు, సమాధానాలు
శతాబ్దానికి పైగా సరస్వతి నది ఉనికి పై చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భూగర్భశాస్త్రవేత్తల మధ్య ఎంతో చర్చ నడుస్తోంది. ఇందులోని సంక్లిష్టతకు భిన్నరకాలైన ప్రకటనలు, ఆధారాలు, పరిశోధనలు జత కూడాయి.
సరస్వతి నది మనుగడపై ఉన్న పరదాను తొలగిస్తే హరప్పా, వేద నాగరికత సరిహద్దులేమిటో మనం అర్థం చేసుకోగలుగుతాం.
ప్రస్తుతానికి ఈ సరిహద్దు తూర్పు అప్ఘనిస్తాన్ నుంచి సింధు, గంగ యమునా ప్రాంతాల వరకు విస్తరించినట్టు నమ్ముతున్నారు.
విద్యావేత్తలు హబీబ్, రోమిల్లా థాపర్, రాజేష్ కొచ్చర్ ప్రకారం సరస్వతి నది తూర్పు అప్ఘనిస్తాన్‌లో ‘హరక్స్వతి’ అయి ఉండవచ్చు.
సరస్వతి నది పేరు కచ్చితంగా దీన్నుంచే పుట్టి ఉండవచ్చు. రుగ్వేదాన్ని రచించిన తొలితరం వారు సింధునాగరికతలోకి ప్రవేశించకముందు హరక్స్వతి ఒడ్డున నివసించి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు.
దీని ఆదారంగానే సీనియర్ పాత్రికేయుడు టోనీ జోసెఫ్ ‘ఎర్లీ ఇండియన్స్’ పుస్తకాన్ని రాశారు.
‘‘భారతదేశం ఓ వలస ప్రాంతం. వైదీకులు హరప్పా నాగరికత మొదలైన తరువాత మూడో విడత వలసలలో ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు’’ అని రాశారు.
వేదకాలంలో ఆర్యులు భారతీయులు. తరువాత వారు తూర్పు, ఉత్తర ప్రాంతాలకు వలస వెళ్ళారు. సింధునదిలాంటి అతిపెద్ద నది ప్రస్తుత భారతదేశ సరిహద్దులలో ప్రవహించినట్టుగా రుజువైతే అది టోనిజోసెఫ్ వాదనకు బలం చేకూర్చినట్టవుతుంది.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మ్యాగజైన్ ‘మంథన్’ కోసం 1995 ప్రాంతంలో పూణెలోని దక్కన్ కాలేజీ డైరక్టర్, ప్రొఫెసర్ వి.ఎన్.మిశ్రా ‘ అంతరించిపోయిన సరస్వతి, హరప్పా సంస్కృతి మూలం’ అనే వ్యాసం రాశారని, ఆ తరువాత సంవత్సరమే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్.పి. గుప్తా ‘‘ ద ఇండస్-సరస్వతి సివిలైజేషన్’’ పుస్తకం రాశారని చరిత్రకారుడు ఇర్ఫాన్ హబీబ్ చెప్పారు.
సరస్వతి నది ఉనికి ఉందని చెప్పేందుకు సంఘ్ పరివార్ ఆలోచనాపరులు రుగ్వేదంలోని శ్లోకాలను చూపుతుంటారని హబీబ్ తెలిపారు.
వర్ణనల ప్రకారం సరస్వతి నది గంభీరమైనది. పర్వతాలలో పుట్టి సముద్రంలో కలుస్తుంది. అయితే సరస్వతికి నది రూపం కాకుండా దేవత రూపం ఇచ్చారని హబీబ్ చెప్పారు. మరికొందరి నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సింధు నదే నాటి సరస్వతి నది.
హరియాణాలో ప్రస్తుతం సరస్వతి పేరుతో ఓ నది ఉంది. కానీ ఇది పర్వతాలలో పుట్టింది కాదు, సముద్రంలో కలిసే నది కూడా కాదు. ఇది ‘ఘాగ్గర్’ నదితో కలవదు. ఒకవేళ ఇది ఎడారిలో ప్రవహించే హక్రా నదితో ముడిపడినా అది సరస్వతి నది కాకపోవచ్చు.
హరియాణాలోని యమునానగర్‌లో గల ఆదిబద్రిలో సరస్వతి నది జన్మించింది. సరస్వతి నది ప్రస్తుతం ఉన్న హరియాణా, రాజస్థాన్, పాకిస్తాన్ మీదుగా ప్రవహించి శివాలిక్ పర్వత శ్రేణుల వద్ద కచ్‌లో కలుస్తుందని స్థానికుల విశ్వాసం.

ప్రభుత్వం మారినప్పుడల్లా సరస్వతి రూపమూ మారిందా?
1999 నుంచి 2004 వరకు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. సరస్వతి నది అన్వేషణకు అప్పటి సాంస్కృతిక వ్యవహారాల శాఖామంత్రి జగ్మోహన్ ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
2004లో యూపీఏ ప్రబుత్వం అధికారంలోకి వచ్చాకా సరస్వతి నది ఉనికికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేనందున ఆ ప్రాజెక్ట్ ను కొనసాగించడంలేదని అప్పటి సాంస్కృతిక శాఖామంత్రి జైపాల్ రెడ్డి పార్లమెంట్‌కు తెలిపారు.
2006లో సాంస్కృతిక వ్యవహారాల పార్లమెంట్ కమిటీకి సీపీఎంకు చెందిన సీతారాం యేచూరి నాయకత్వం వహించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్ట్ విషయంలో సరైన విధానాలు పాటించలేదని మండిపడ్డారు.
2009లో యూపీఏ 2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీజేపీ సభ్యుడు ప్రకాష్ జవదేకర్ లేవనెత్తిన ప్రశ్నకు జలవనరుల శాఖ ఇచ్చిన సమాధానంలో భూగర్భంలో ఓ ప్రాచీన నీటివనరును ఇస్రో కనుగొందని, బహుశా అది వేదకాలంనాటి సరస్వతి నది అయి ఉండవచ్చని తెలిపింది.
2014 జూన్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈసారి బీజేపికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. హిందూ నాయకుడిగా ముద్రపడిన నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యారు. 2014 నవంబరులో ఇస్రో 76 పేజీల ఓ నివేదికను సమర్పించింది.
రిమోట్ సెన్సింగ్, భౌగోళిక సమాచారం ఆధారంగా సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, రాజస్థాన్ మీదుగా కచ్ ఎడారిలో కలిసినట్టుగా పేర్కొంది.
9,000 సంవత్సరాల నుంచి 4,000 సంవత్సరాల కిందట ఈ నది ప్రవహించి ఉండవచ్చవని ఆ రిపోర్టులో ముక్తాయించింది. (పేజీనంబరు 13)
2015లో హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం సరస్వతి హెరిటేజ్ డెవలప్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేసింది. ‘సరస్వతి నది పునరుజ్జీవం’ ఈ బోర్డు లక్ష్యం.
సరస్వతి నది పొడవునా పర్యాటక, సాంస్కృతికాభివృద్ధితోపాటు అవసరమైన నిర్మాణాలు చేపట్టడం ఈ బోర్డు పని.
దీంతోపాటు సరస్వతి నదిపై పరిశోధనలు చేయడానికి, చేసిన పరిశోధనలు ప్రపంచానికి తెలియజేయడానికి సభలు, సమావేశాలు నిర్వహించడం కూడా ఈ బోర్డు పనే.
హిందువుల నమ్మకం ప్రకారం ‘వసంత పంచమి’ సరస్వతిదేవికి సంబంధించిన రోజు. చిన్నారులకు ఈరోజున విద్యాభ్యాసం ప్రారంభించే సంప్రదాయం కూడా కొనసాగుతోంది.
సరస్వతి హెరిటేజ్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏటా వసంతి పంచమిరోజున ‘సరస్వతి మహోత్సవం’ నిర్వహిస్తున్నారు.
2017లో కురుక్షేత్ర యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ రివర్ సరస్వతిని నెలకొల్పారు. ప్రాచీన నీటివనరులు, సరస్వతి నది సంస్కృతిపై ఈ కేంద్రం పరిశోధనలు కొనసాగిస్తోంది.

ఫొటో సోర్స్, ISRO
‘నమ్మకానికీ ఆధారాలు కావాలి’
హిందూ దేవుళ్ళయిన బహ్మ,విష్ణు,మహేశ్వరులు సరస్వతి, యుమన, గంగా నదులతో ముడిపడి ఉన్నారు. విష్ణుమూర్తి 8వ అవతారమైన శ్రీకృష్ణుడు యమునా నది ఒడ్డున పచ్చని పొలాలను సృష్టించారు. భగీరధుడు తన పూర్వీకులను రక్షించుకునేందుకు గంగను ప్రసన్నం చేసుకోగా, శివుడు తన ఝటాఝటంలో గంగను బంధించి ఒక పాయ నుంచి గంగను భువిపైకి వదిలారు..
హరిద్వార్‌కు సమీపంలోనే ఉన్నప్పటికీ హరియాణాలోని కొన్ని గ్రామాల గుండా ప్రవహించే సరస్వతి నది ఒడ్డునే పూర్వీకుల అంతిమ సంస్కారాలు జరిగేవని ఏఎస్ఐ ఆర్కియాలజీ మేగజైన్‌లో డాక్టర్ చౌదురి చెప్పారు.
ఆదిబదిరి దాటాకా అనేక యాత్రాస్థలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలలో స్నానం చేయడం చాలా ముఖ్యమైన విషయం, అలాగే మహాభారతంతో ముడిపడి ఉన్న అంశం కూడా. (పేజీ నంబర్ 51, 2021, 124-140)
ఇస్రో తన నివేదికలో (పేజీ నంబర్ 38) జోధ్‌పూర్‌లో 120 నుంచి 151 మీటర్ల లోతున బోర్లు తవ్వితే 14 ప్రదేశాలలో భూగర్భజల జాడ కనుగొన్నట్టు తెలిపింది.
ఇదే నివేదికలోని 43వ పేజీలో రాజస్థాన్‌లోని జైసల్మీర్‌నుంచి 10 ప్రాంతాలలో భూగర్భనీటి నమూనాలను తీసుకున్నామని, వీటిని బాబా న్యూక్లియర్ పరిశోధనా కేంద్రంలో విశ్లేషించినట్టు తెలిపింది. ఈ నీరు 1900 నుంచి 18800 సంవత్సరాల కిందటదని చెప్పింది.
ఇస్రోనివేదికను అనుసరించి ఏఎస్ఐ పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌లోని ‘దుషద్వతి’ నది భూగర్భ ఒడ్డుకు ఇరువైపులా వివిధ యుగాలకు చెందిన పురాతనస్థావరాలు సరస్వతి నది చుట్టూ ఉన్నాయని కనుగొన్నట్టు తెలిపారు.
రాజస్థాన్‌లో అనూప్‌ఘర్ తరువాత ఈ నది ప్రస్తుత పాకిస్తాన్ గుండా ప్రవహించి థార్ ఎడారిలోకి ప్రవేశించి ఆ తరువాత కచ్ ప్రాంతంలో సముద్రంలో కలుస్తుంది. దీంతో పర్వతాల నుంచి సముద్రం దాకా సరస్వతి నది ప్రయాణం పూర్తవుతుంది.
సరస్వతి నది అంతరించిపోయినా దీని ఒడ్డున పండే పంటలు, చెట్లు, వృక్షసంపదలోని ఏకరూపత ఈ నది ఉండేదనే నమ్మకాన్ని పరిశోధకులకు కలగచేస్తోంది.
శ్రీమద్భగావత పురాణం ప్రకారం మానససరోవరం, బిందు, నారాయణ, పంపా, పుష్కర సరోవరాలు హిందువులకు పవిత్రమైనవి. కచ్‌లోని నారాయణ సరోవరం విష్ణు సంబంధమైనదిగా చెపుతారు.
నారాయణ సరోవరం సమీపంలోనే సరస్వతి నది ప్రవహించేదని చెపుతారు. సరస్వతి నది ప్రవాహంతోనే ఈ సరోవరం నిండేది. ఇప్పటికీ బనా, సరస్వతి, రూపెన్ ఆరావళి నదులలో పుట్టి కచ్‌లోని ఎడారి ప్రాంతంలో కలిసిపోతాయి. అవి సముద్రంలో సంగమించవు కాబట్టి వాటిని ‘ కన్యా నదులు’ గా పిలుస్తారు.
పరిశోధకులు రేడియోకార్బన్ డేటింగ్ చేసినప్పుడు హిమాలయాల నుంచి కచ్ వరకు సరస్వతి నది ద్వారా అవక్షేపాలు ప్రవహించినట్టు గుర్తించారు. దీన్నిబట్టి సరస్వతి నది వర్షాధారం కాదని, హిమనీనదమని తేలింది. కాలం గడిచేకొద్దీ సింధు, సరస్వతి నదులు పశ్చిమంవైపు మళ్ళాయి. అందుకే సింధునది అవక్షేపాలను సరస్వతి నదితోపాటుగా కనుగొంటున్నారు.
థార్ఎడారి విస్తరణ వలనే సరస్వతి నది అదృశ్యమైనట్టు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
దీంతోపాటుగా వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా ఒక కారణం.
ఈ నది ఎండిపోవడం మొదలుకాగానే, పరిసరప్రాంతాలలోని ప్రజానీకం సంఖ్య క్రమంగా తగ్గతూ వచ్చింది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దశాబ్దాలు లేదా శతాబ్దాలు పట్టి ఉండవచ్చు.
‘‘వేదిక్ సరస్వతి’’ అనే పుస్తకాన్ని రిటైర్డ్ ఇస్రో శాస్త్రవేత్త పీ.ఎస్. ఠక్కర్ రాశారు. ప్రస్తుత నర్మద, సుఖి, సోమ, వత్రాక్, సబర్మతి, భద్రా నదులు సరస్వతి నదిలో కలిసేవని ఆయన చెప్పారు.
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సంజీవ్ కుమార్ ‘‘ఫౌనా ఆఫ్ నల్ లేక్ గుజరాత్’’ అనే పుస్తకాన్ని రాశారు.
ఆ పుస్తకంలోని 11,12 పేజీలలో ప్రాచీనకాలపు చివరిలో గల్ఫ్ ఆఫ్ కచ్ నుంచి గల్ఫ్ ఆఫ్ కంబత్ మధ్య లోతులేని సముద్ర జలాలు ఉండేవి. వాటి మధ్య ఓ సరస్సు ఉండేది. వేలాది సంవత్సరాల కిందట సముద్రజలాలు వెనక్కి వెళ్ళడంతో భూభాగం ఏర్పడిందని తెలిపారు.

ఫొటో సోర్స్, ISRO
సరస్వతి అంటే అర్ధమేంటి?
సరస్వతి నది హరియాణాలోని కచ్ ఎడారిలో ప్రవహిస్తుండేది. అలాంటప్పుడు ప్రయాగరాజ్‌లో సరస్వతి నది మాటేమిటి?
హిందువుల విశ్వాసం ప్రకారం గంగ, యమున, సరస్వతి ప్రయాగరాజ్‌లో సంగమిస్తాయి. ఇక్కడ ప్రతి 12 ఏళ్ళకోసారి కుంభమేళా జరుగుతుంది.
త్రివేణిసంగమంలో గంగ, యమున నీటిని మనం వాటి రంగుల ఆదారంగా స్పష్టంగా చూడవచ్చు. యమునా నది నీళ్ళు నల్లగానూ, గంగానది నీళ్ళు గోధుమరంగులోను ఉంటాయి. అయితే సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంటుందని స్థానికులు నమ్మతుంటారు.
‘‘ సరస్వతి నదీ భౌగోళిక ఒడిదుడుకుల కారణంగా ఏకరీతిలో ఉండదు. కచ్ ప్రాంతంలో ప్రవహించినది వైదిక సరస్వతి నది’’ అని డాక్టర్ ఏఆర్ చౌదురి బీబీసికి తెలిపారు.
‘‘ పూర్వం సరస్వతి నది ఆదిబదిరి వద్ద రెండు పాయలుగా విడిపోయేది. ఒక పాయ రాజస్థాన్‌లోని కురుక్షేత్రం చేరుకుని, ఉత్తరప్రదేశ్ నుంచి కిందుగా ప్రయాగరాజ్ వరకు ప్రవహించేది. మరో పాయ రోహతక్‌జిల్లాలో మహమ్ లోని కార్నల్ నుంచి ఉత్తరాన రాజస్థానలో చురువరకు ప్రవహించేది’’ అని చెప్పారు.
శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, జీఐస్ చిత్రాల ఆదారంగా ప్రాచీన సరస్వతి నది ప్రవాహమార్గంపై డాక్టర్ చౌదురి పరిశోధన చేశారు.
2021లో సీఎస్ఐఆర్-ఎన్‌జీఆర్ఐ పరిశోధనా ఫలితాలను ప్రచురితమయ్యాయి. ప్రయాగరాజ్‌లో సంగమించడానికి ముందు ఓ 45 కిలోమీటర్ల పురాతన నీటికుంట ఉందని, , దీనిని సరస్వతి నదిగా నమ్ముతున్నట్టు ఆ పరిశోధనలో పేర్కొన్నారు. ఈ కుంట వెయ్యి మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరుపట్టేంత ఉంది.
సరస్వతి నది పునరుజ్జీవం కోసం కేంద్రం, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది ధార్మిక సాంస్కృతిక పర్యాటకాన్ని పెంచుతుంది. కానీ దీని చుట్టుపక్కల ప్రాంతాలు ఈ నది నీటిపారుదల వలన లాభపడతాయో లేదో తెలియదు.
ఏదేమైనా సరస్వతి నది హిందు ఆచారాలలో నేటికీ కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తరాఖండ్: సొరంగంలో చిక్కుకున్న 36 మంది ఎలా ఉన్నారు? వారిని బయటికి ఎలా తీసుకొస్తారు?
- జెరూసలెంలోని 'అల్ అక్సా మసీదు'కు రక్షణగా భారత సైనికులు, అప్పుడేం జరిగింది?
- ఆధార్ వివరాలతో డబ్బులు మాయం చేస్తున్న మోసగాళ్లు.. దీన్నుంచి ఎలా తప్పించుకోవాలంటే..
- మనీశ్ మిశ్రా: బిచ్చగాడు అనుకుని సాయం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














