తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఈ మహిళా అభ్యర్థుల ప్రత్యేకతలేంటి?

సరిత తిరుపతయ్య, కంకణాల నివేదిత రెడ్డి, కోట నీలిమ, బోగ శ్రావణి

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్, సరిత తిరుపతయ్య, కంకణాల నివేదిత రెడ్డి, కోట నీలిమ, బోగ శ్రావణి
    • రచయిత, ఆకుల దుర్గాప్రసాద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి ప్రధాన పార్టీలు మూడింటి నుంచి 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

బీఆర్ఎస్ 8 మంది మహిళలను పోటీలో నిలపగా, కాంగ్రెస్ 11 మందిని బరిలో దించింది.

బీజేపీ, జనసేన కూటమి నుంచి 14 మంది మహిళలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి 13, జనసేన నుంచి ఒక మహిళా అభ్యర్థి ఈ అసెంబ్లీ ఎన్నికలలో పోటీపడుతున్నారు.

ప్రధాన పార్టీల నుంచి పోటీలో ఉన్న 33 మంది మహిళలలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనుభవం ఉన్నవారు కాగా మరికొందరు కొత్తవారు.

సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానం నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ మహిళలకే టికెట్‌లు ఇచ్చాయి.

ఎస్టీ నియోజకవర్గం ములుగులోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి మహిళా అభ్యర్థులే పోటీలో ఉన్నారు.

Boga Shravani

ఫొటో సోర్స్, Boga Shravani/facebook

ఫొటో క్యాప్షన్, బోగ శ్రావణి

బోగ శ్రావణి: శాసనసభలో అడుగుపెడతానంటున్న డెంటిస్ట్

ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 32 ఏళ్ల బోగ శ్రావణికి రాజకీయ నేపథ్యం ఉంది.

బీఆర్ఎస్‌లో ఉంటూ జగిత్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యారు.

అయితే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై వివిధ ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది ప్రారంభంలో ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు.

బీజేపీ ఆమెకు టికెట్ ఇవ్వడంతో ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్) చదువుకున్న ఆమె రాజకీయాలను ప్రధాన వృత్తిగా స్వీకరించారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి పోటీ పడుతున్నారు.

Saritha Thirupathayya

ఫొటో సోర్స్, Saritha Thirupathayya/facebook

ఫొటో క్యాప్షన్, సరిత తిరుపతయ్య

సరిత తిరుపతయ్య: తొలి ప్రయత్నంలోనే జడ్పీ చైర్మన్, మరి, అసెంబ్లీ సంగతేంటి?

గద్వాల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 40 ఏళ్ల సరిత తిరుపతయ్యకు ఇప్పటికే రాజకీయ అనుభవం ఉంది. అయితే, శాసనసభకు పోటీ చేయడం ఇదే తొలిసారి.

కొద్ది నెలల కిందట వరకు బీఆర్ఎస్‌లో ఉన్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే గెలిచిన ఆమె అనూహ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయ్యారు.

అయితే, శాసనసభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జులైలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి టికెట్ సంపాదించి పోటీలో నిలిచారు.

సరిత హైదరాబాద్‌లోని నాంపల్లిలో మైక్రోబయాలజీలో బీఎస్సీ చదివారు.

గద్వాలలో 1999లో గట్టు భీముడు మినహా ఇటీవల కాలంలో రెడ్డి సామాజికవర్గ నేతలే గెలుస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాత్రం ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ మినహా మిగతా రెండు పార్టీలూ బీసీలకు అవకాశం ఇచ్చాయి.

బీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి కురుమ సామాజికవర్గ నేత సరిత తిరుపతయ్య, బీజేపీ నుంచి బీసీ అభ్యర్థి బోయ శివ పోటీలో ఉన్నారు.

ఇక్కడ బీజేపీ నేత డీకే అరుణ తాను పోటీలో ఉండబోనని, బీసీలకు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరి పోటీ నుంచి తప్పుకొన్నారు.

యశస్విని రెడ్డి

ఫొటో సోర్స్, facebook/yashaswinireddy

ఫొటో క్యాప్షన్, యశస్విని రెడ్డి

యశస్విని రెడ్డి: అనుభవజ్ఞులతో పోటీ పడుతున్న 26 ఏళ్ల అమ్మాయి

పాలకుర్తి శాసనసభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్న 26 ఏళ్ల మామిడాల యశస్విని రెడ్డికి రాజకీయ అనుభవం ఏమీ లేదు.

ఆమె అత్త ఝాన్సీ రెడ్డి అమెరికాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేరు సంపాదించారు. ఈ ఎన్నికలలో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ టికెట్ ఆశించినా ఆమెకు భారత పౌరసత్వం రాకపోవడంతో టికెట్ దక్కలేదు.

దీంతో ఆమె కోడలు యశస్విని రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. యశస్విని భర్త రాజమోహన్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉంటారు. ఆయనకు కూడా భారత పౌరసత్వం లేదు.

యశస్విని హైదరాబాద్‌లో బీటెక్ చదువుకున్నారు. వివాహమైన తరువాత భర్తతో అమెరికా వెళ్లినప్పటికీ మళ్లీ కొన్నాళ్లుగా తెలంగాణలోనే ఉంటున్నారు.

ప్రస్తుత ఎన్నికలలో పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె నామేషన్ చెల్లదంటూ ఫిర్యాదులు వచ్చాయి. అధికారులు ఆమె నామినేషన్ పరశీలించి నిబంధనల ప్రకారం ఉందంటూ ఆమోదించడంతో బరిలో నిలిచారామె.

పాలకుర్తిలో బీఆర్ఎస్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పోటీలో ఉండగా బీజేపీ నుంచి లేగ రామ్మోహన్ రెడ్డి పోటీలో ఉన్నారు.

రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో పోటీ పడుతుండడంతో ఈ యువతి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అందరిలో ఆసక్తి కలిగిస్తున్నారు.

Lasya Nanditha

ఫొటో సోర్స్, facebook/LasyaNanditha

ఫొటో క్యాప్షన్, లాస్య నందిత

లాస్య నందిత: ఎమ్మెల్యే కూతురిగా ఎన్నికల బరిలో

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో పాలక బీఆర్ఎస్ పార్టీ 36 ఏళ్ల లాస్య నందితను పోటీలో నిలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్ నేత సాయన్న మరణించడంతో ఆయన కుమార్తె లాస్య నందితకు పార్టీ అవకాశం ఇచ్చింది.

లాస్య నందిత ఇంతకుముందు ఒకసారి జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇంకో ప్రయత్నంలో ఓటమి పాలయ్యారు.

ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నందిత హైదరాబాద్‌లోనే పుట్టి పెరగడం, కార్పొరేటర్‌గా పనిచేయడంతో నియోజకవర్గంలో చాలామందికి పరిచితురాలే.

వెన్నెల

ఫొటో సోర్స్, Venela Gaddar/Facebook

ఫొటో క్యాప్షన్, గద్దర్ కూతురు వెన్నెల

వెన్నెల: ప్రజాక్షేత్రంలోకి గద్దర్ కూతురు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 43 ఏళ్ల జీవీ వెన్నెల పోటీ చేస్తున్నారు. ఇటీవల మరణించిన విప్లవ గాయకుడు గద్దర్ కుమార్తె ఈమె.

విద్యాసంస్థను నడుపుతున్న ఈమెకు ప్రత్యక్ష రాజకీయాలలో అనుభవం లేదు. ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఇదే తొలిసారి.

ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసిన ఈమె విద్యారంగంలో పనిచేస్తున్నారు. తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం రావడంతో ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.

బడే నాగజ్యోతి

ఫొటో సోర్స్, facebook/bade nagajyothi

ఫొటో క్యాప్షన్, బడే నాగజ్యోతి

బడే నాగజ్యోతి: మావోయిస్ట్ నేపథ్యంతో సీతక్కపై పోటీ

ఎస్టీ నియోజకవర్గం ములుగులో బీఆర్ఎస్ పార్టీ 29 ఏళ్ల బడే నాగజ్యోతికి అవకాశం కల్పించింది. శాసనసభ ఎన్నికలలో తొలిసారి పోటీ చేస్తున్నప్పటికీ నాగజ్యోతికి రాజకీయ అనుభవం ఇప్పటికే ఉంది.

2019లో ఆమె తొలిసారి సర్పంచిగా గెలిచి రాజకీయాలలో అడుగుపెట్టారు. అనంతరం తాడ్వాయి నుంచి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి ములుగు జిల్లాలో జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. కొద్దినెలల కిందట ములుగు జడ్పీ చైర్మన్ మరణించడంతో నాగజ్యోతి ఇంచార్జ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

నాగజ్యోతి కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బోటనీ చదివారు, బీ.ఈడీ కూడా పూర్తి చేశారు.

నాగజ్యోతి తల్లిదండ్రులు ఇద్దరూ మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు.

ములుగు నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ధనసరి అనసూయ అలియాస్ సీతక్కది మావోయిస్ట్ నేపథ్యమే.

ప్రస్తుత ఎన్నికలలో సీతక్క మరోసారి ములుగు నుంచి పోటీ చేస్తున్నారు.

kota neelima

ఫొటో సోర్స్, kota neelima

ఫొటో క్యాప్షన్, కోట నీలిమ

కోట నీలిమ: పొలిటికల్ సైన్స్ పీహెచ్‌డీతో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి...

హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో తలపడుతున్నారు 52 ఏళ్ల కోట నీలిమ.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నీలిమ చాలాకాలంగా ఆ పార్టీ కోసం పనిచేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు పవన్ ఖేడా ఈమె భర్త.

జర్నలిస్ట్‌, రచయిత్రి అయిన నీలిమ దిల్లీ యూనివర్సిటీ నుంచి రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌ చేశారు.

ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిలతో నీలిమ పోటీ పడుతున్నారు.

Rani Rudrama Reddy

ఫొటో సోర్స్, Rani Rudrama Reddy

ఫొటో క్యాప్షన్, రాణి రుద్రమ రెడ్డి

రాణి రుద్రమ రెడ్డి: కేటీఆర్‌పై పోరాటం

సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న 43 ఏళ్ల రాణి రుద్రమ గతంలోనూ ఎన్నికలలో పోటీ చేశారు.

జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె అనంతరం రాజకీయాలలోకి వచ్చారు. యువ తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీలో చేరారు.

ఎంసీఏ, ఎంసీజే చదువుకున్న ఆమె ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోటీ చేస్తున్నారు.

chandupatla keerthi reddy

ఫొటో సోర్స్, facebook/chandupatla keerthi reddy

చందుపట్ల కీర్తి రెడ్డి: జంగారెడ్డి వారసురాలిగా

భూపాలపల్లిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 42 ఏళ్ల చందుపట్ల కీర్తి రెడ్డి కుటుంబం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంది.

ఆమె మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కోడలు.

2018 ఎన్నికలలోనూ ఆమె బీజేపీ నుంచి భూపాలపల్లిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఫిజియో థెరపీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసిన కీర్తి రెడ్డి ప్రస్తుత ఎన్నికలలో మరోసారి తలపడుతున్నారు.

ఇక్కడ బీఆర్ఎస్ నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ పోటీ చేస్తున్నారు.

bandi sanjay

ఫొటో సోర్స్, bandi sanjay

బీజేపీ మహిళా అభ్యర్థులు వీరే...

ఈ పార్టీ మొత్తం 13 మంది మహిళలను పోటీలో నిలిపింది. బీజేపీతో పొత్తు ఉన్న జనసేన ఒక స్థానంలో మహిళకు అవకాశం కల్పించింది.

నిజానికి బీజేపీ తొలుత 14 మందికి అవకాశం ఇచ్చినా అందులో వేములవాడ స్థానం నుంచి టికెట్ ప్రకటించిన మహిళా అభ్యర్థి తుల ఉమ స్థానంలో చెన్నమనేని వికాస్ రావుకు చివరి నిమిషంలో బీ ఫారం ఇవ్వడంతో ఆ పార్టీ నుంచి 13 మంది మహిళలే పోటీలో ఉన్నారు.

బీజేపీ బాల్కొండలో ఏలేటి అన్నపూర్ణ, జుక్కల్(ఎస్సీ నుంచి అరుణతార, జగిత్యాలలో బోగ శ్రావణి, రామగుండంలో కందుల సంధ్యారాణి, చొప్పదండి(ఎస్సీ)లో బొడిగె శోభ, సిరిసిల్లలో రాణి రుద్రమ రెడ్డి, చార్మినార్‌లో మేఘారాణి, ఆలంపూర్(ఎస్సీ)లో మేరమ్మ, నాగార్జునసాగర్‌లో కంకణాల నివేదిత రెడ్డి, హుజూర్‌నగర్‌లో చల్లా శ్రీలత రెడ్డి, డోర్నకల్(ఎస్టీ)లో భూక్యా సంగీత, వరంగల్ వెస్ట్ స్థానంలో రావు పద్మ, భూపాలపల్లిలో చందుపట్ల కీర్తిరెడ్డిని పోటీలో నిలిపింది.

దీంతో పాటు బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన అశ్వారావుపేట(ఎస్టీ) స్థానంలో ఉమాదేవికి టికెట్ ఇచ్చింది.

బీజేపీ, జనసేనలు మొత్తంగా మూడు ఎస్సీ, రెండు ఎస్టీ నియోజకవర్గాలలో మహిళలకు అవకాశం ఇచ్చాయి.

revanth reddy

ఫొటో సోర్స్, revanth reddy

కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు.

మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్‌లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది.

వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.

ktr

ఫొటో సోర్స్, ktr

ఫొటో క్యాప్షన్,

బీఆర్ఎస్ మహిళా అభ్యర్థులు...

బీఆర్ఎస్ మొత్తం 8 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. అందులో ఒకరు ఎస్సీ మహిళ కాగా ఇద్దరు ఎస్టీ మహిళలు.

ఆసిఫాబాద్(ఎస్సీ) స్థానంలో కోవ లక్ష్మి, నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి, మెదక్‌లో పద్మ దేవేందర్ రెడ్డి, మహేశ్వరంలో సబిత ఇంద్రారెడ్డి, కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో లాస్య నందిత, ఆలేరులో గొంగడి సునీత, ఇల్లందు(ఎస్టీ) స్థానంలో బానోత్ హరిప్రియ, ములుగు ఎస్టీ స్థానంలో బడే నాగజ్యోతి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)