కేసీఆర్ ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల పాత్ర ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందా?

ఫొటో సోర్స్, Facebook/BRS
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తాము చేశామని చెబుతున్న ‘అద్భుతాల్లో’ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి.
ఈ ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో ఇటీవల పిల్లర్లు దెబ్బతిన్నాయి. బరాజ్ కూడా కుంగింది. ఈ ప్రాజెక్టు దెబ్బతినడంపై చర్చ అంతా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంగానే నడిచింది.
ఎందుకంటే- ఆ ప్రాజెక్టును ‘రీడిజైన్’ చేసింది కేసీఆర్ అని స్వయంగా ఆయన మేనల్లుడు, ఒకప్పటి సాగునీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పి ఉన్నారు.
అంతేకాదు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని పెద్ద పెద్ద ఇంజినీర్లకే సలహాలిచ్చారని బీఆర్‌ఎస్ తరచూ చెప్పుకునేది. కొందరు ఇంజినీర్లు కూడా అలానే చెప్పారు. కానీ లా, లిటరేచర్ చదువుకున్న కేసీఆర్... కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ ఎలా చేస్తారు, సివిల్ ఇంజినీర్లకు సలహాలు ఇవ్వడం ఎలా సాధ్యం అని పెద్దగా ఎవరూ ప్రశ్నించలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డ బరాజ్ అంశం, కాంగ్రెస్, బీజేపీలకు ప్రధాన అస్త్రంగా మారింది. ఆ పార్టీలన్నీ ‘కేసీఆర్ రీడిజైన్ల’ ఫలితంగానే మేడిగడ్డ బరాజ్ దెబ్బతిందని విమర్శిస్తున్నాయి.
తెలంగాణలో ప్రతీ అంశం కేసీఆర్ చుట్టూనే తిరుగుతుందనడానికి ఇదొక ఉదాహరణ.

ఫొటో సోర్స్, FaceBook/Kcr
కుటుంబ పాలన ఆరోపణలు
భారత్‌లోని ప్రాంతీయ పార్టీలన్నింటిలో సాధారణంగా అధ్యక్ష స్థానం ఒకే కుటుంబం చేతిలో ఉంటుంది. పార్టీలో నంబర్ వన్ స్థానంలో ఆ కుటుంబం వారే ఉంటారు. కొన్ని సందర్భాల్లో నంబర్ టూ స్థానంలో కూడా కుటుంబ సభ్యులే ఉంటారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇతర నేతలు ఉంటారు.
అయితే ఈ విషయంలో బీఆర్ఎస్‌కు ఒక మినహాయింపు ఉంది. బీఆర్‌ఎస్‌లో నంబర్ వన్ మాత్రమే కాదు, టూ, త్రీ, ఫోర్, ఫైవ్ కూడా.. అంటే పార్టీలో మొదటి అయిదు స్థానాలూ కేసీఆర్ కుటుంబ సభ్యులవే. వేరే ఎవరూ ఆ స్థానాల్లోకి వెళ్లలేకపోయారు.
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రిగా ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయనే.
కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రిగా ఉన్నారు.
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ.
కేసీఆర్ తోడల్లుడి కుమారుడు బి. సంతోష్ రావు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
ప్రభుత్వంలో, బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్రపై తరచూ చర్చ జరుగుతుంటుంది. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందనే విమర్శలు వస్తుంటాయి.
‘‘బీఆర్ఎస్ పార్టీకి చరిత్ర ఒక అవకాశం ఇచ్చింది. ఆ పార్టీ ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకుంది. పోరాటం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి మిగిలిన ప్రాంతీయ పార్టీల కంటే భిన్నంగా ఉంటుందని అనుకున్నాం. కానీ, అలా జరగలేదు. ప్రొఫెసర్ కోదండరాం వంటి ఉద్యమకారులను అధికారంలో భాగస్వాములను చేయలేదు’’ అని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ హరగోపాల్ బీబీసీతో అన్నారు.

తెలంగాణ ఏర్పడిన తరువాత అధికారమంతా ఒకే కుటుంబం చేతిలో కేంద్రీకృతమైందనే ఆరోపణలు ఉన్నాయి.
‘‘తెలంగాణ ఉద్యమం ప్రజాస్వామ్య సంస్కృతి నుంచి వచ్చింది. కానీ, రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారం అంతా ఒకే కుటుంబం దగ్గర ఉంది. ఏ శాఖ మంత్రి దగ్గరకు వెళ్లినా ముఖ్యమంత్రిని అడిగి చేస్తాననే చెబుతారు. ఇది వన్ మ్యాన్ షో’’ అని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.
అయితే, కేసీఆర్ పిల్లలు, బంధువులు తెలంగాణ ఉద్యమంలో పోరాడి, ఎన్నికల్లో గెలిచి పదవులు చేపట్టారని వాదించే బీఆర్‌ఎస్ నేతలు కూడా ఉన్నారు.
ఈ వాదనపై కోదండరాం స్పందిస్తూ- ‘‘ఉద్యమకారునిగా చూసినా సరే కేటీఆర్ కూడా పెద్ద పదవులకు అనర్హుడే. ఎందుకంటే ఆయన కంటే ఎక్కువ పోరాడిన నాయిని నరసింహారెడ్డికి రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదు. మరొక ఉద్యమకారుడు ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి తరిమేశారు. మాట వినడం లేదని జితేందర్ రెడ్డి వంటి వారికి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. తెలంగాణ కోసం కృషి చేసిన వారికి పదవులు రావాలి. ఆయన కుటుంబానికి మాత్రమే కాదు’’ అని విమర్శించారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలనూ కలిపి ఉంచే జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్‌గా కోదండరాం చాలా చురుకైన పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్‌తో విభేదించి ఆయన సొంతంగా పార్టీ పెట్టారు.

ఫొటో సోర్స్, FaceBook/Kcr
‘‘కుటుంబ పాలన’’ అనే ఆరోపణ దేశమంతా ఉన్నదేనని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ చక్రపాణి అన్నారు.
‘‘నెహ్రూ ఉన్నప్పుడు ఆయన చెల్లెలు, ఇతర బంధువులు కలిపి అయిదుగురు వరకూ పదవుల్లో ఉండేవారు. ఆఖరికి సొంత కుటుంబం లేదనుకునే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇది భారతదేశం అంతా ఉన్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ కాస్త నయం.
తెలంగాణ ఉద్యమం వల్ల కొత్త నాయకత్వం వచ్చింది. 2014 తెలంగాణ శాసనసభలో 70 శాతానికి పైగా ఎమ్మెల్యేలు ఏ వారసత్వం లేకుండా వచ్చిన వారు. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 70 శాతానికి పైగా ఏదో ఒక వారసత్వంతో వచ్చిన వారే’’ అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, FaceBook/Kcr
ప్రజాధనంతో మొక్కులు
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనేక హిందూ దేవాలయాలకు మొక్కులు తీర్చుకున్నారు. కొరివి వీరభద్రుని దగ్గర నుంచి తిరుమల వేంకటేశ్వరుని వరకూ ఖరీదైన ఆభరణాలు ఇచ్చారు. తెలంగాణ వచ్చినందుకు మొక్కు తీర్చుకుంటున్నానని కేసీఆర్ తెలిపారు. అజ్మీరు దర్గాకు కూడా కానుకలు పంపారు. లౌకిక ప్రభుత్వం కదా, ప్రజాధనంతో మొక్కులు ఎలా చెల్లిస్తారని ఎవరూ ఆయన్ను ప్రశ్నించే పని చేయలేదు.
కేసీఆర్ విషయంలో ఆశ్చర్య పరిచే మరొక అంశం ఆయన వ్యక్తిగత విశ్వాసాలు, అభిరుచుల కోసం పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును ఖర్చు చేయడం.
తెలంగాణ ఏర్పాడ్డక 2014-2018 మధ్య ఒక్క రోజు కూడా సచివాలయంలో కేసీఆర్ అడుగు పెట్టలేదు. రెండోసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత, హుస్సేన్ సాగర్ తీరంలో దాదాపు 25 ఎకరాల్లో ఉన్న సచివాలయాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. ఆ భవనాలేమీ శిథిలావస్థకు చేరుకున్నవి కాదు. కానీ, వాటిని కూల్చి వాటి స్థానంలో కొత్త సచివాలయం కట్టారు. అందుకు కారణం అది కేసీఆర్‌కు నచ్చకపోవడమే.

ఫొటో సోర్స్, FaceBook/TelanganaCMO
‘‘ఎవరైనా బయటి వారు వస్తే చూపించడానికి ఈ భవనాలు బాగా లేవు. కొత్త రాష్ట్రానికి ఒక మంచి సచివాలయం ఉండొద్దా’’ అని తరచూ ప్రశ్నించేవారు కేసీఆర్. చూడ్డానికి అందంగా లేకపోవడమనేది పైకి చెప్పిన కారణమైతే పైకి చెప్పని కారణం వాస్తు అని కొందరు అంటారు.
కరోనావైరస్ మహమ్మారి సమయంలో అంటే 2020 జులై నెలలో పాత సచివాలయాన్ని కూల్చారు. బెడ్లు లేక, జనాలు ఇబ్బందులు పడుతున్న వేళ, ప్రపంచమంతా మహమ్మారిని ఎదుర్కొంటున్న వేళ అకస్మాత్తుగా భవనాలు కూల్చి కొత్త సచివాలయ నిర్మాణం ప్రారంభించారు కేసీఆర్.
ముచ్చటపడి కట్టించుకున్న కొత్త సచివాలయానికి కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారు అనే ప్రశ్న వస్తే, అది మరో చర్చ.
ఆయన సచివాలయం కూల్చడం పరిపాలన సౌలభ్యం మాత్రమే కాదనీ, ఒక ఐకానిక్ భవనం కావాలనే ఆకాంక్ష అని, అలాగే వాస్తు నమ్మకం కూడా అని చాలా మంది సన్నిహితులు చెబుతారు.
‘‘విద్యావైద్య రంగాల్లో తెలంగాణ ఎంతో వెనుకబడి ఉంది. అసలు స్కూళ్లు, ఆసుపత్రుల పరిస్థితి బాగా లేదు. ఇటువంటి సమయంలో వందల కోట్లు పెట్టి కొత్త సచివాలయం అవసరమా అని ఆలోచించలేదు. పేరు కోసం భవన నిర్మాణాల మీద పెట్టిన దృష్టి విద్యావైద్యం మీద లేదు. తెలంగాణకు కొత్తగా ఐకాన్లు అక్కర్లేదు. ఉన్నవాటిని కాపాడితే చాలు’’ అని కోదండరాం అన్నారు.

ఫొటో సోర్స్, FaceBook/Kcr
ఆస్పత్రులు, పాఠశాలల పరిస్థితి ఏమిటి?
తరచూ వందల మంది పండితులతో భారీ యాగాలు చేసే కేసీఆర్‌కు నమ్మకాలు కూడా ఎక్కువే అనేది అందరికీ తెలిసిందే. ఆయన ఇటీవలే తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం చేశారు.
స్వాతంత్ర్యం వచ్చాక గుజరాత్‌లో నిర్మించిన సోమ్‌నాథ్ ఆలయం నుంచి, తాజాగా అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం వరకూ ఏదీ ప్రభుత్వ ఖర్చుతో చేయలేదు. విరాళాలతోనే చేశారు. కానీ కేసీఆర్ మాత్రం ప్రభుత్వ డబ్బుతో మొక్కులు తీర్చడం, గుళ్లు కట్టడం చేస్తుంటారు.
తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో యాదగిరి గుట్ట అనే హిందూ క్షేత్రం ఉంది. ఆ దేవాలయాన్ని ప్రభుత్వ సొమ్ముతో పునరుద్ధరించాలని నిర్ణయించారు కేసీఆర్. అంతే వెయ్యి కోట్ల రూపాయలతో గుడి కట్టేశారు. ప్రభుత్వ సొమ్ముతో ఇలా చేయడం సబబేనా అని కేసీఆర్‌ను ఎవరూ ప్రశ్నించలేదు.
అదే సమయంలో తెలంగాణలో ఎన్నో పాఠశాలలు కనీసం టాయిలెట్లు లేక దీనావస్థలో ఉన్నాయనీ, ఎన్నో ఆసుపత్రుల్లో భవనాలు, బెడ్లు చాలడం లేదన్న వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. వరంగల్‌లో నిర్మిస్తానని కేసీఆర్ చెప్పిన భారీ ఆసుపత్రులు పూర్తి కాలేదు కూడా. గుళ్లు పూర్తయినంత వేగంగా ఆసుపత్రులు ఎందుకు పూర్తి కాలేదు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
‘‘విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనే లక్షణం దేశమంతా పెరిగింది. కానీ ఇప్పుడు రాజకీయాలు, విశ్వాసాలు కలగలసిపోయాయి. ముఖ్యమంత్రి కార్యాలయం లౌకిక కార్యాలయం. ప్రజా ధనాన్ని వ్యక్తిగత విశ్వాసాలకు వినియోగించడం రాజ్యాంగబద్ధం కాదు’’ అని హరగోపాల్ అభిప్రాయపడ్డారు.

అవినీతి ఆరోపణలు
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఆ కుటుంబానికి ‘ఏటీఎం’గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబం అవినీతి మీద విచారణ చేపడతామంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రకటించారు.
మిషన్ భగీరథ, ఔటర్ రింగ్ రోడ్ టోల్ కేటాయింపులు వంటి వాటిలోనూ అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, మంత్రుల మీద భూ ఆక్రమణ ఆరోపణలు వచ్చాయి. ధరణి వెబ్ సైట్ సవరణలను ఆధారం చేసుకుని వేల కోట్ల లావాదేవీలు తెలంగాణలో జరుగుతున్నాయంటూ అనేక సందర్భాల్లో కాంగ్రెస్ గగ్గోలు పెట్టింది.
అవినీతి, అక్రమాల ఆరోపణలను ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ఖండిస్తూ వస్తున్నాయి.
‘‘తెలంగాణ ఏర్పడ్డాక భూ ఆక్రమణలు పెరిగాయి. ఇసుక మాఫియా పెరిగింది. రియల్ ఎస్టేట్ వాళ్లే రాజకీయాలను శాసిస్తున్నారు’’ అని హరగోపాల్ అన్నారు.
ఇక దిల్లీ లిక్కర్ ‘కుంభకోణం’లో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్నారు. దిల్లీ మద్యం పాలసీలో కవిత జోక్యం చేసుకుని అక్కడి ప్రభుత్వంలోని వారికి లంచాలు ఇప్పించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు ఆమె విచారణకు హాజరయ్యారు.
‘‘కేసీఆర్ మీద ఇప్పుడు ఉన్న ఆరోపణలు అన్నీ వాస్తవాలే. తానొక్కడే తెలంగాణ కోసం కొట్లాడినట్టు చెప్పుకుంటూ వచ్చారు. తనను ప్రశ్నించడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమే అని ప్రచారం చేశారు. ఇలా నిరంకుశ పాలనను తీసుకొచ్చి, దాని చాటున విచ్చలవిడిగా వనరులను దోచుకోవడానికి అధికారాన్ని వాడుకున్నారు. కుటుంబ ఆర్థిక బలం పెంచుకుని దాని ఆధారంగా రాజకీయ అధికారం చెలాయిస్తున్నారు’’ అని కోదండరాం విమర్శించారు.

ఫొటో సోర్స్, KALVAKUNTLA KAVITHA/FACEBOOK
అదే నిజమైతే బీజేపీ విచారణ ఎందుకు జరిపించడం లేదు?: చక్రపాణి
కేసీఆర్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలను బీఆర్ఎస్ కొట్టి పారేస్తోంది.
‘‘కేసీఆర్ మీద ఆరోపణలు చేయడానికి ఏ ఆధారాలు లేవు. అందుకే అవినీతి, కుటుంబ పాలన అంటూ విమర్శిస్తుంటారు. కేటీఆర్, హరీశ్ రావు రాజకీయాల్లో తమను తాము నిరూపించుకున్నారు. ఎన్నికల్లో కొట్లాడి గెలుస్తున్నారు. కవిత తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి చేసిన సేవను అందరూ చూశారు. ఇక్కడ కుటుంబ పాలన ఏమీ లేదు. అనర్హులు ఎవరూ లేరు. ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ఉండే వ్యూహం ప్రకారం ఆ పార్టీ కొన్నిసార్లు ఉద్యమంలో లేని వారికి కూడా పదవులు ఇవ్వాల్సి వస్తుంది. అదేమీ తప్పు కాదు. ఇక నవ తెలంగాణ గుర్తుగా ఒక సచివాలయాన్ని నిర్మించడం అనేది తప్పెలా అవుతుంది? బీజేపీ పార్లమెంటు భవనం నిర్మించలేదా’’ అని ప్రశ్నించారు బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్.
‘‘కేసీఆర్ పై చాలా మంది ఆరోపణలు చేశారు. కానీ ఏదీ నిరూపణ కాలేదు. కేంద్రం చేతిలో ఎన్నో ఏజెన్సీలు ఉన్నాయి. వారు సుమోటోగా విచారణ చేయవచ్చు కదా. ఈడీ, ఐటీ విచారణ చేస్తే తేలిపోతుంది కదా. కాళేశ్వరం సంగతే చూద్దాం.. కాళేశ్వరం మొత్తం ఖర్చే లక్ష కోట్లు కాదు. అందులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? పోనీ మేఘా సంస్థ ఆఫీసుల్లో సోదాలు చేసినప్పుడు అవినీతి ఆధారాలు దొరికాయా? రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు, తరువాత విచారణ చేస్తాం అంటున్నారు. కానీ బీజేపీ ఎందుకు విచారణ చేయడం లేదు? అభివృద్ధి జరిగినప్పుడు ఆరోపణలు వస్తాయి. ఏమీ రాకుండా ఉండాలంటే, ఏమీ చేయకుండా ఉండాలి. సాక్ష్యాలు ఉంటే నిరూపించవచ్చు’’ అన్నారు ప్రొఫెసర్ చక్రపాణి.
కేసీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, ప్రభుత్వాన్ని, పార్టీని ఆయన నడిపే విధానం, తన నమ్మకాలను బట్టి, అభిరుచులను బట్టి వివిధ ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీసుకునే పద్ధతి, పార్టీలో, ప్రభుత్వంలో ఆయన కుటుంబ పాత్ర.. ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్షాలకు పెద్ద అస్త్రాలుగా మారాయి.
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కేసీఆర్, రేవంత్, ఈటల: రెండు నియోజకవర్గాలలో పోటీ...చరిత్ర ఏం చెప్తోంది?
- దిల్లీ కాలుష్యం - క్లౌడ్ సీడింగ్ : కృత్రిమ వానలను ఎలా కురిపిస్తారు? ఇలాంటి వానలతో కాలుష్యాన్ని నివారించవచ్చా?
- బంగ్లాదేశ్ చరిత్రలో రక్తపు మరకలు...ఆ వారం రోజుల్లో ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











