యూదుల ఊచకోత నుంచి బతికి బయటపడ్డ చిన్నారి జార్జ్ ఇప్పుడు ఎలా ఉన్నారు? నాటి మహా విషాదంపై ఆయన ఏమన్నారు?

ఫొటో సోర్స్, FAMILY OF GEORGE SHEFI
- రచయిత, డామియన్ మెక్‌గినెస్
- హోదా, బీబీసీ న్యూస్
యాదులకు వ్యతిరేకంగా రాసిన అసభ్య పదజాలాన్ని చెరిపేసేందుకు ప్రయత్నించిన ఒక యూదు దుకాణదారున్ని చూసి 50 నుంచి 60 మంది వ్యక్తుల బృందం ఎగతాళిగా నవ్వింది.
ధ్వంసం చేసిన ఒక యూదు వ్యక్తి హ్యాట్ షాపు బయట రోడ్డు అంతా పగిలిపోయిన అద్దాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న టోపీలే కనిపించాయి.
1938 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు జార్జ్ షెఫీ నాజీలు సృష్టించిన మారణహోమం తర్వాత బెర్లిన్‌లోని తన అపార్ట్‌మెంట్ వెలుపల నుంచి చూసిన దృశ్యాలివి.
‘‘నా మనసులో ఇంకా ఆ దృశ్యం కదులుతోంది. నిన్న జరిగిన మాదిరే పడిపోయిన హ్యాట్స్, గ్లాస్‌లు ఇంకా నా కళ్ల ముందు మెదలుతున్నాయి’’ అని జార్జ్ గుర్తుకు చేసుకున్నారు.
92 ఏళ్ల జార్జ్ ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు జార్జ్ తన తల్లిదండ్రులు లేకుండా పారిపోయి ప్రాణాలు రక్షించుకున్నారు.
దాడుల తర్వాత బ్రిటన్‌కు తరలిపోయిన 10 వేల మంది యూదు చిన్నారుల్లో జార్జ్ కూడా ఒకరు.
యూదుల ఊచకోత నుంచి పిల్లల్ని రక్షించేందుకు చేపట్టిన ఈ ఆపరేషన్‌ను బ్రిటీష్ కిండర్‌ట్రాన్స్‌పోర్ట్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు.
ఈ హత్యాకాండకు 85 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జార్జ్ తిరిగి బెర్లిన్ వెళ్లారు.
చిన్నతనంలో నాజీ జర్మనీల నుంచి తాను తప్పించుకునేందుకు చేసిన ప్రయాణాలను ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు.
బెర్లిన్‌లోని స్కోనెబర్గ్ జిల్లాలో ఉన్న తన ఇంటికి బయట ఉన్న షాపులు ధ్వంసమైన తీరును జార్జ్ గుర్తుకు చేసుకున్నారు.
ఈ హత్యాకాండల తర్వాత కొద్ది రోజుల పాటు బయటికి వెళ్లొద్దని అప్పట్లో వారికి చెప్పారు.
యూదుల ప్రార్థనా మందిరానికి ఆనుకుని ఉన్న తన పాఠశాల అగ్గికి ఆహుతైందని తెలియగానే జార్జ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
కానీ జర్మనీ అంతటా ఇలానే జరుగుతోందని జార్జ్‌కు తెలియదు. ఆయన జీవితం పూర్తిగా మారబోతుందని జార్జ్ కనీసం ఊహించలేదు కూడా.

ఫొటో సోర్స్, FAMILY OF GEORGE SHEFI
1938 నవంబర్ 9 రాత్రి నాజీల మూక దేశమంతా దాడులకు పాల్పడింది.
యూదుల దుకాణాలను, ఇళ్లను ధ్వంసం చేసింది. జర్మనీలోని యూదుల ప్రార్థనా మందిరాలన్నింటినీ అగ్నికి ఆహుతి చేసింది.
అప్పుడు 91 మంది యాదులను హత్య చేశారు. 30 వేల మంది యూదులను నిర్భంద శిబిరాలకు పంపారు. ఏం జరుగుతుందో జార్జ్ తల్లి మేరీకి పూర్తిగా అర్థమైంది.
ఆ సమయంలో ఆమె అత్యంత బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కొడుకు జార్జ్‌ను ఒక్కడినే బ్రిటన్‌కు పంపి రక్షించాలని భావించారు.
యాదులకు వ్యతిరేకంగా చెలరేగిన హింస అదుపు దాటడం, నిర్ఘాంతపరిచే ఘర్షణలు తలెత్తడంతో, జర్మనీలోని యూదులు తమకు అక్కడ సురక్షితం కాదని భావించారు.
వీలైన వారు దేశం విడిచిపెట్టారు. వీలు కానీ, వారు తమ పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు పంపేందుకు ప్రయత్నించారు.
1939 జూలైలో మేరీ తన కొడుకు జార్జ్ కోసం కిండర్‌ట్రాన్స్‌పోర్ట్‌లో చోటు సంపాదించారు.
కిండర్‌ట్రాన్స్‌పోర్ట్‌లో భాగంగా.. 1938 నుంచి 1940 మధ్య కాలంలో యూరప్‌లోని నాజీ నియంత్రత ప్రాంతాల్లోని యూదుల పిల్లల్ని సురక్షితంగా బ్రిటన్‌కు పంపే ఆపరేషన్ ఇది.
‘‘ఒకరోజు సాయంత్రం అమ్మ ఏం చెప్పారంటే, నీకు కావాల్సిన బొమ్మలు తీసుకో, రేపు నువ్వు ట్రైన్‌లో వెళ్లాల్సి ఉంది. నౌకలో వెళ్లాల్సి ఉంటుంది. మరో దేశాన్ని, నీకు తెలియని మరో భాషను నువ్వు వినబోతున్నావని చెప్పారు’’ అని జార్జ్ తెలిపారు.
ఈ ప్రయాణాన్ని విలాసవంతమైనదిగా చెప్పాలని తన తల్లి ప్రయత్నించినట్లు జార్జ్ చెప్పారు.
కానీ, ‘‘ ఇదొక సాహస యాత్ర’’ అని జార్జ్ భావించారు.
చివర్లో జార్జ్ తన బొమ్మల్లో దేన్నీ తీసుకోలేకపోయారు. అత్యంత అవసరమైన వస్తువులతో పాటు చిన్న, సీల్ చేసిన సూట్‌కేసు మాత్రమే పిల్లలతో అనుమతించారు.
కొందరు పిల్లలు కేవలం తమ పేరుతో ఉన్న లేబుల్‌ను తీసుకుని మాత్రమే ఈ ప్రయాణం చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బెర్లిన్‌లోని ఫ్రెడ్రిచ్‌స్ట్రాస్సే స్టేషన్‌కు జార్జ్‌ను తీసుకొని వెళ్లారు మేరీ. అక్కడ్నుంచే పిల్లల్ని రైలులో బ్రిటన్‌కు పంపిస్తున్నారు.
‘‘ఇది చాలా భయంకరమైనది. ఎందుకంటే చాలా మంది తమ పిల్లలతో విడిపోయేది ఇక్కడే’’ అని జార్జ్ చెప్పారు. ఏం జరుగుతుందో తానసలు గుర్తించలేకపోయాయని అన్నారు జార్జ్.
‘‘నాకు గుడ్‌బై చెప్పేందుకు ప్లాట్‌ఫామ్ మీద అమ్మ పరిగెత్తడం నేను చూశాను’’ అని గుర్తుకు చేసుకున్నారు.
‘‘నేను అమ్మను చూడగలిగాను. కానీ, నన్ను అమ్మ చూడలేకపోయింది. ఎందుకంటే, ఆ రైలు చాలా రద్దీగా ఉంది’’ అని తెలిపారు.
అమ్మను చూడటం అదే చివరిసారని జార్జ్ తెలుసుకోలేకపోయారు.
1943లో మేరీని ఆష్విట్జ్ నిర్భంద శిబిరానికి తీసుకుని వచ్చారు. ఆమెను అక్కడికి తీసుకొచ్చిన కొన్ని గంటల్లోనే హత్య చేశారు.
బ్రిటీష్ ప్రభుత్వం ఈ కిండర్‌ట్రాన్స్‌పోర్ట్ స్కీమ్‌ను నడిపింది. ఎన్‌జీఓ నిధులు, విరాళాలు, వాలంటీర్ల చేత ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు.
పిల్లలకు వీసాల అవసరాన్ని బ్రిటీష్ ప్రభుత్వం మాఫీ చేసింది. కానీ, వారి తల్లిదండ్రులకు కాదు. హోలోకాస్ట్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
తప్పించుకుని పారిపోయి వచ్చిన పిల్లలందరం ఇంగ్లాండ్‌కు చేరుకున్నాం. ఎన్నడూ చూడని, కలవని కుటుంబాలను కలిశాం. కనీసం వారి భాష కూడా అర్థం కాలేదు అని జార్జ్ చెప్పారు.

‘‘అది అచ్చం పశువుల మార్కెట్ లాగా ఉంది’’ అని జార్జ్ చెప్పారు.
‘‘ఒకవేళ నువ్వు ఐదేళ్ల బాలిక అయి ఉండి, మంచి జుట్టు, నీలం కళ్లు ఉంటే, మంచి కుటుంబం దొరుకుతుంది. కానీ, నువ్వు ఒక 17 ఏళ్ల వాడివి అయి, మీ ముక్కు కాస్త వంకరగా ఉండే, చౌకగా దొరికన లేబర్‌గా నిన్ను ఎవరో ఒకరు తీసుకుని వెళ్తారు’’ అని జార్జ్ ఆనాటి సంఘటనలను గుర్తుకు చేసుకున్నారు.
‘‘దత్తత తీసుకునే కుటుంబాలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండేది కాదు. మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారు అని వారితో పాటు వెళ్లిన వారు తర్వాత చెప్పారు’’ అని జార్జ్ చెప్పారు.
బెర్లిన్‌లో జార్జ్ చదువుకున్న పాఠశాలలో, మేరీతో పాటు హోలోకాస్ట్‌లో హత్య కాబడిన స్థానిక యాదులకు గుర్తుగా ప్లేగ్రౌండ్ గోడలపై స్మారకార్థ ఫలకలను ఏర్పాటు చేశారు.
తన జీవితం గురించి, ఆనాడు జరిగిన ఘటనలపై మాట్లాడేందుకు 11 ఏళ్ల జర్మన్ స్కూల్ పిల్లల తరగతి గదికి వచ్చారు జార్జ్ .
‘‘నిజంగా ఒక తల్లికి ఇది చాలా కష్టమైన విషయం. ట్రైన్‌లో తన కొడుకును కూర్చోపెట్టి, మళ్లీ తనని ఎప్పటికీ చూడనని తెలియడం నిజంగా చాలా బాధాకరం’’ అని జార్జ్ ప్రసంగం తర్వాత ఒక విద్యార్థి అన్నారు.
జార్జ్, ప్రాణాలతో బతికిన మరో ఇద్దరు కలిసి ప్రస్తుతం ఈ ప్రయాణం చేశారు. ఆనాటి రోజులను గుర్తుకు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, FAMILY OF GEORGE SHEFI
జర్మనీలోని తమ చిన్ననాటి ఇళ్ల నుంచి రైలులో, బోటులో ప్రయాణించి, లండన్‌లోని లివర్‌పూల్ స్ట్రీట్ ట్రైన్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఇక్కడే తమ దత్తత కుటుంబాలను లేదా బంధువులను కిండర్‌ట్రాన్స్‌పోర్ట్ పిల్లలు కలుసుకున్నారు.
‘‘నేడు ప్రపంచాన్ని చూస్తే, యాంటీ సెమిటిజం పెరుగుదలను చూస్తే, ద్వేషం అన్ని రూపాల్లో ఉందని తెలుస్తుంది. ఇది ఇస్లామోఫోబియా రూపంలో లేదా హోమోసెక్సువల్‌పై ద్వేషం రూపంలో ఇలా ఏదో ఒక రూపంలో ఉంది. మనందరం ఒకేతాటిపై నిల్చుని, ఈ హింసను వ్యతిరేకించాలి. మళ్లీ ఇది జరగకుండా చూసుకోవాలి’’ అని హోలోకాస్ట్ ఎడ్యుకేషన్ ఛారిటీకి చెందిన స్కాట్ సాండర్స్ చెప్పారు.
13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జార్జ్ సొంతంగా ఒక ప్రయాణం చేశారు. ఆ సమయంలో బోటులో అమెరికాకు వెళ్లారు.
18 ఏళ్ల వయసున్నప్పుడు, ఇజ్రాయెల్‌కు తరలివెళ్లారు. అక్కడే ఆయన నేవిలో చేరి, తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
కుటుంబాన్ని కోల్పోయిన బాధను, విడిపోవడాన్ని తట్టుకుని ఎలా నిలబడగలిగారని జార్జ్‌ను అడిగారు.
‘‘నాకు సాయం చేసిన చాలా మందిని నేను కలిశాను. మంచి కుటుంబాన్ని పొందాను. నాకిప్పుడు 92 ఏళ్లు’’ అని జార్జ్ చెప్పారు.

జార్జ్, ఆయన కుటుంబం చాలాసార్లు బెర్లిన్ వచ్చి, అక్కడి ప్రజలతో మాట్లాడారు. చరిత్ర ఎప్పటికీ మర్చిపోనిది, పునరావృతం కానిది అయ్యుండాలని జార్జ్ కోరుకున్నారు.
ప్రతి ప్రయాణంలో కూడా సంప్రదాయంగా, 90 ఏళ్ల క్రితం తాను చిన్నప్పుడు ఎక్కడైతే నవ్వుతూ, ఏం జరగబోతుందో తెలియని క్షణాల్లో ఫోటో తీసుకున్నారో అక్కడే జార్జ్ ఫోటోను తీసుకుంటున్నారు.
వృద్ధి చెందుతున్న తన కుటుంబాన్ని ఈ ఫోటోలు చూపిస్తున్నాయి.
జార్జ్ షెఫీ పిల్లలు, మనవళ్లు, మునిమనుమళ్ళే హిట్లర్‌పై ఆయన అంతిమ విజయం.
ఇవి కూడా చదవండి:
- నారాయణ మూర్తి: వారానికి 70 పని గంటలపై భారత్‌లో జరుగుతున్న చర్చ ఏంటి?
- గర్భవతిని కాకుండానే నా బిడ్డకు ఎలా పాలిచ్చానంటే...
- పారాసైట్ ఫీటస్: రక్తం తాగుతూ 10 నెలల పాప కడుపులో ఎదగని పిండం, ఎలా తెలిసిందంటే....
- భారత్‌లో గత ఏడాది 1.68 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు... ప్రపంచంలో ఒకే ఒక శాతం వాహనాలున్న దేశంలో ఇన్ని ప్రమాదాలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














