హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? 50 వేల మందికి జీతాలు ఎలా ఇస్తోంది?

హమాస్ సైన్యం

ఫొటో సోర్స్, Getty Images

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కానీ, అతిపెద్ద ఇస్లామిక్ సంస్థ అయిన హమాస్‌కు డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? దీని వెనుక ఉన్న దేశాలు, సంస్థలు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.

గాజాపై రెండు దశాబ్దాలుగా పట్టుబిగించిన హమాస్‌ను వెనకుండి నడిపిస్తున్న శక్తి ఏమిటి?

రెండేళ్ళ కిందట ఇజ్రాయెల్‌తో 11 రోజులపాటు యుద్ధం చేసిన హమాస్ అప్పట్లో 4 వేల రాకెట్లను ప్రయోగించింది.

కానీ, ఈ ఏడాది అక్టోబరు 7 నాటి దాడులలో ఒక్క రోజులోనే కొన్నివేల రాకెట్లను వినియోగించింది.

దీన్నిబట్టి చూస్తే హమాస్ దగ్గర ఇంకా బోలెడు రాకెట్లు ఉంటాయని స్పష్టమవుతోంది.

హమాస్ సైనిక వ్యయం సంగతి అటుంచితే గాజా స్ట్రిప్‌లో పనిచేస్తున్న సుమారు 50 వేల మంది ఉద్యోగులకు ప్రతినెలా 30 మిలియన్ డాలర్లకు పైనే ఖర్చుచే స్తున్న విషయం కూడా ముఖ్యమైనదే.

దీనికి తోడు యుద్ధంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి, గాయపడినవారికి కూడా హమాస్ ఆర్థికసాయం అందిస్తోంది.

పాలస్తీనా నాయకులు

ఫొటో సోర్స్, 'IRANIAN LEADER PRESS OFFICE/GETTY IMAGE

ఫొటో క్యాప్షన్, ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలి ఖోమెనీ ని కలిసిన హమాస్ నేత ఇస్మాయిల్ హనియా

హమాస్ ఆర్థిక మూలాలు..

గాజా ప్రభుత్వ వార్షిక బడ్జెట్ 700 మిలియన్ డాలర్ల పైమాటే. వీటిల్లో 260 మిలియన్ల డాలర్ల ప్రస్తుత వ్యయం కూడా కలిసి ఉందని రాయ్‌టర్స్ వార్తా సంస్థ తెలిపింది.

గాజాస్ట్రిప్‌లోని ప్రభుత్వంతోపాటు, హమాస్‌కు కూడా అనేక మార్గాలలో ఆర్థిక సాయం అందుతుంది.

ఇతర ప్రభుత్వాల నుంచి కూడా వీరికి కొంత ఆర్థికసాయం అందుతుంది. పౌరుల నుంచి, దాతృత్వ సంస్థల నుంచి సైతం డబ్బులు అందుతాయి.

క్రిప్టో కరెన్సీ ద్వారా కొంత మొత్తాన్ని సంపాదిస్తారు.

అలాగే వివిధ దేశాలలో పెట్టుబడుల ద్వారానూ డబ్బు సంపాదిస్తారు.

ఇరాన్, ఖతార్, కువైట్, టర్కీ, సౌదీ అరేబియా, అల్జీరియా, సుడాన్ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశాలు హమాస్‌కు రాజకీయ, ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.

హమాస్‌కు ఆర్థిక, రాజకీయ అండదండలు అందించే దేశాలలో ఖతార్ చాలా ముఖ్యమైనది.

ఖతారీయుల నుంచి 30 మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రతినెలా హమాస్ పొందుతోందని ఫ్రెంచ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నెషనల్ అండ్ స్ట్రాటజిక్ ఎఫైర్స్ (ఐఆర్ఐఎస్) వైస్ ప్రెసిడెంట్ దీదీదా బెల్యూన్ ఇటీవల చెప్పారు.

ఈ సాయాన్ని గాజాస్ట్రిప్‌లోని ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు.

అయితే, వేసవికాలంలో ఖతార్ నుంచి సాయం అందడంలో ఆలస్యం కావడంతో హమాస్ తన ఉద్యోగులకు జీతాలు చెల్లించలేకపోయింది.

గాజాలో అతిపెద్ద మానవసంక్షోభ నివారణకు ఖతార్ 2014 నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు 2018లో ఫ్రెంచ్ దినపత్రిక ‘లిబరేషన్’ తెలిపింది. మానవతా దృక్పథంతో ఖతార్ ఈ సాయం చేస్తోందని, ఇదేమీ రహస్యం కాదని పేర్కొంది.

ఖతార్‌ అతిపెద్ద మద్దతుదారు

హమాస్ మద్దతు దారులలో ఖతార్ కీలకమైనది.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా 2012 నుంచి దోహాలో జీవిస్తున్నారు.

హమాస్ రాజకీయ కార్యాలయం కూడా ఖతార్ రాజధానిలోనే ఉంది.

ఖతార్ 2012 నుంచి 2022 మధ్యన 1.3 బిలియన్ డాలర్ల సాయాన్ని హమాస్‌కు అందించిందని సెంటర్ ఫర్ అరబ్ స్టడీస్ కు చెందిన వాషింగ్టన్ చెప్పారు.

గడిచిన రెండు దశాబ్దాలలో అల్జీరియా 908 మిలియన్ డాలర్లు, కువైట్ 758 మిలియన్ డాలర్లు, సౌదీ అరేబియా 4 బిలియన్ల 766 మిలియన్ డాలర్లు అందించాయి. వెస్ట్ బ్యాంక్ కూడా గాజాస్ట్రిప్‌కు ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించి నేటివరకు ఆ మాటను నిలబెట్టుకుంటూనే ఉంది.

ఈజిప్ట్‌తో సంబంధాలు

హమాస్ పాలస్తీనాలో ఇఖ్వానుల్ ముసీల్‌మీన్ శాఖగా ప్రారంభమైంది.

ఇఖ్వానుల్ ముసీల్‌మీన్ ఓ ఇస్లామిక్ సంస్థ. ఇది ఈజిప్ట్‌లో 1928లో ప్రారంభమైంది.

ఈజిప్ట్‌కు గాజాస్ట్రిప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

కానీ అబ్దుల్ ఫతా అల్‌సీసీ 2013లో ఈజిప్ట్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడ నివసిస్తున్న పాలస్తీనా గ్రూపులతో సంబంధాలు బలహీనపడటం మొదలైంది.

సరిహద్దును దాటేందుకు హమాస్‌కు ఈజిప్ట్ చాలా ముఖ్యమైనది.

గాజాస్ట్రిప్‌కు ఆహారం, గుడ్లు పెద్ద ఎత్తున ఈజిప్ట్‌ నుంచే సరఫరా అవుతుంటాయి.

అమెరికన్ థింక్ ట్యాంక్ ‘కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ ప్రకారం వెస్ట్ బ్యాంక్, ఈజిప్ట్ నుంచి వస్తున్న సరుకులపై 2021లో హమాస్ 12 మిలియన్ డాలర్లకుపైగా పన్నులు వసూలు చేసింది.

ఈజిప్ట్‌లానే టర్కీ కూడా హమాస్ రాజకీయ మద్దతు పలుకుతోంది.

కానీ టర్కీ హమాస్‌కు ఆర్థిక సాయం చేస్తున్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

అయినప్పటికీ ఇజ్రాయెలీ మీడియా ‘హార్టెజ్’ టర్కీ బహుశా ప్రతి ఏడాది 300 మిలియన్ యూస్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందిస్తోందని తెలిపింది.

దీంతోపాటుగా 16 టన్నుల పేలుడు పదార్థాలను టర్కీ గాజాకు పంపించిందని, దానిని జప్తు చేసినట్టు ఇజ్రాయెలీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.

హమాస్ ఫైటర్స్

ఫొటో సోర్స్, REUTERS/IBRAHEEM ABU MUSTAFA

ఫొటో క్యాప్షన్, హమాస్ ఫైటర్స్

ఇరాన్ , దాతృత్వ సంస్థలు

హమాస్‌కు సైనిక, ఆర్థిక అందడండలు అందించడంలో ఇరాన్ కీలకంగా వ్యవహరిస్తోంది.

‘‘ మేం మొదటి నుంచి చెపుతూనే ఉన్నాం. ఇరాన్ హమాస్‌కు అన్నిరకాల అందడదండలు అందిస్తోంది. హమాస్ సైనిక విభాగానికి నిధులు సమకూర్చుతోంది. వారికి మిలటరీ శిక్షణ కూడా ఇస్తోంది’’ అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు జాక్ సుల్వాన్ ఇటీవల చెప్పారు.

మరోపక్క హమాస్ ఆయుధ సంపత్తిలో 93 శాతం ఇరాన్ నుంచే వస్తోందని యురోపియన్ కమిషన్ ఇటీవల తెలిపింది.

ఏటా 100 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ఇరాన్ హమాస్ కు అందిస్తోందని 2020 యూఎస్ స్టేట్ డిపార్‌మెంట్ రిపోర్ట్ వెల్లడించింది.

వివిధ దేశాలలోని సాధారణ పౌరులు, గ్రూపులు, దాతృత్వ సంస్థలు ఇచ్చే విరాళాలు కూడా హమాస్ ఆర్థిక మూలాల్లో కీలకమైనవి.

పర్షియన్ గల్ఫ్ దేశాల‌తో పాటుగా, పాలస్తీనియన్లు, ప్రవాసంలో ఉన్నవారు, పాలస్తీనియన్ చారిటీల ద్వారా హమాస్‌కు ఆర్థిక సాయమందుతోందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది.

హమాస్‌కు ఎన్జీవోల మద్దతుతోపాటు ‘అల్ అన్సార్’ లాంటి సంక్షేమ సంఘాలు కూడా కీలకమైన మద్దతుగా నిలుస్తున్నాయి.

అల్ అన్సా ర్ కు ఇస్లామిక్ జిహాద్‌తో సహాచర్యం ఉంది. పాలస్తీనా ప్రాంతాలలో సహాయం అందించడానికి అల్ అన్సారీని 2001లో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గాజా, వెస్ట్ బ్యాంక్‌లలో పనిచేయడానికి దీనిని నెలకొల్పారు.

గాజా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాకు తరలుతున్న సాయం

పెట్టుబడుల నుంచి నిధులు

హమాస్ ఆర్థిక కార్యకలాపాలలో ముఖ్యమైనది క్రిప్టో కరెన్సీ

హమాస్ క్రిప్టో కరెన్సీలో గత ఏడు సంవత్సరాల నుంచి పెట్టిన పెట్టుబడులపై 41 మిలియన్ల డాలర్లను సంపాదించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఇటీవల ప్రచురించింది.

క్రిప్టో కరెన్సీ ద్వారా మిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థికసాయాన్ని హమాస్ పొందుతోందని కూడా తెలిపింది.

ఈ సమాచారం తెలిసిన తరువాతే హమాస్ కార్యకలాపాలను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను చేయాలని అమెరికన్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది.

ఇరాన్ కూడా హమాస్‌కు క్రిప్టో కరెన్సీ ద్వారా సాయం అందిస్తోందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఈ మధ్యలో క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో హమాస్ కార్యకలాపాలు ఒడిదుడుకులకు గురయ్యాయి.

హమాస్ విరాళాల సేకరణకు సంబంధించిన వర్చువల్ కరెన్సీ ఫండ్స్‌ను సీజ్ చేసినట్టు ఇజ్రాయెలీ కౌంటర్ టెర్రరిజమ్ ఆర్థిక అధికారి తెలిపారు.

ఇరాన్ నుంచి హమాస్ అందుకుంటున్న సొమ్ము వివిధ దేశాలలో పెట్టుబడులు పెడుతోందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

మిలియన్ల కొద్దీ డాలర్లను సూడాన్, అల్జీరియా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలలో పెట్టుబడులు పెట్టినట్టు చెప్పింది.

హమాస్ పోర్ట్ ఫోలియో‌లోని కంపెనీలు చట్టబద్ధమైన వ్యాపారాలు చేస్తున్నట్టుగా కనిపిస్తాయి, వీటి ప్రతినిధులు తమ ఆస్తులపై హమాస్ నియంత్రణ ఉన్న విషయాన్ని కప్పి పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు.

పెట్టుబడుల నెట్‌వర్క్‌ను హమాస్ అగ్రనేతలు పర్యవేక్షిస్తుంటారని, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ నుంచి వచ్చే డబ్బుతో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అమెరికన్ స్టేట్ డిపార్టమెంట్ తెలిపింది.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)