ఆస్పత్రి దగ్గర 'బండకింద హమాస్ సొరంగం'.. మరో ఆసుపత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం

హమాస్

ఫొటో సోర్స్, ISRAEL DEFENSE FORCES

ఫొటో క్యాప్షన్, అల్-రంటసీ ఆసుపత్రి సమీపంలో గుర్తించిన సొరంగాన్ని చూపిస్తున్న ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగరీ

ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) దాడులు కొనసాగుతున్నాయి.

హమాస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయడమే తమ లక్ష్యమని పదే పదే చెప్తోన్న ఇజ్రాయెల్, ఆ దిశగానే దాడులు ముమ్మరం చేసింది.

గాజా సిటీలోనే అతిపెద్ద ఆసుపత్రి అయిన అల్-షిఫా ఆసుపత్రి కింద హమాస్ ప్రధాన కార్యాలయం ఉందని ఇజ్రాయెల్ పలుమార్లు ఆరోపించింది.

ఇప్పుడు ఆ ఆస్పత్రిలోకి బలగాలు ప్రవేశించాయని సైన్యం తెలిపింది.

ఇదిలా ఉంటే, ఉత్తర గాజాలోని అల్-రాంటిసీ ఆసుపత్రి సమీపంలో హమాస్ నిర్మించుకున్న సొరంగాన్ని గుర్తించామంటూ ఇజ్రాయెల్ సైన్యం ఓ వీడియోను పోస్ట్ చేసింది.

బండ కింద ఉన్న సొరంగం ద్వారాన్ని చూపిస్తూ, ఐడీఎఫ్ అధికార ప్రతినిధి రేర్ అడ్మిరల్ డేనియల్ హగరీ కనిపించిన వీడియోను, సోషల్ మీడియా వేదిక ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది ఐడీఎఫ్.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

'బందీలను ఇక్కడే ఉంచారు'

నవంబర్ 14వ తేదీ ఉదయం ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన వీడియోలో ఆయన కొన్ని ప్రాంతాలను చూపించారు.

ఆరు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియోలో హగరీ మాట్లాడుతూ ఆసుపత్రికి 200 మీటర్ల దూరంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు చెప్పారు.

ఆసుపత్రికి చేరేందుకు ఒక మార్గమని చెప్తూ, ఆ సొరంగానికి వెళ్లే దారిని చూపిస్తూ చెప్పారు. సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారని, దీని ద్వారానే బంకర్‌కు విద్యుత్ సరఫరా అవుతుందని చెప్పారు.

అయితే, అక్కడ హమాస్‌ కమాండ్ సెంటర్ ఉందనడానికి ఎలాంటి అధారాలు చూపలేదు హగరి. ఈ విషయంపై తాము దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ఆ వీడియోలో అల్ రాంటిసీ ఆసుపత్రి బేస్‌మెంట్‌కు సంబంధించిన దృశ్యాలను చూపించారు. అక్కడ తాము గుర్తించిన గదులు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, బుల్లెట్ దాడికి గురైన మోటార్‌ సైకిల్‌ను కూడా చూపించారు.

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు అపహరించిన వారిని తీసుకువచ్చి, అక్కడి బేస్‌మెంట్‌లో ఉంచారని చెప్పడానికి సంకేతాలు ఉన్నాయని వీడియోలో చెప్పారు.

కుర్చీ, బంధించేందుకు తాడు ఉన్న దృశ్యాలు, ఆ పక్కనే డబ్ల్యూ‌హెచ్‌ఓ అన్న చిహ్నంతో ఉన్న కంట్రోల్ ప్యానెల్, దానిపై పిల్లలకు పాలు పట్టించే పాలసీసా కనిపించాయి.

మరో గదిలో గోడపై అతికించిన పేపర్‌ను చూపిస్తూ, బందీల వద్ద షిఫ్టుల వారీగా విధులు నిర్వహించేందుకు క్యాలెండర్ రూపొందించుకున్నారని చెప్పారు.

కర్టెన్లు ఏర్పాటు చేసిన ఆ గదిని హమాస్ వీడియో స్టూడియోగా ఉపయోగించుకుందని, ఇది హమాస్ విడుదల చేసిన బాధితుల వీడియోలలో ఒకదానిలో ఉన్న బ్యాగ్రౌండ్‌ను పోలి ఉందని హగరీ అన్నారు.

అయితే, ఈ ఆరోపణలను హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది.

ఐడీఎఫ్ పోస్ట్ చేసిన వీడియో “భూటకం” అని వర్ణించింది. ఆ వీడియోలో చూపించిన ప్రదేశాన్ని వైమానిక దాడుల నుంచి రక్షణకు, నిర్వహణకు వినియోగించామని చెప్పింది.

వీడియో కోసమే ఆయుధాలను అక్కడ పెట్టారని, అలాంటి బైక్‌లు గాజాలో వేల సంఖ్యలో ఉన్నాయని పేర్కొంది.

అల్ షిఫా ఆస్పత్రి

అల్-షిఫా ఆసుపత్రి ముట్టడి

గాజాలో ఇజ్రాయెల్ దాడులు మొదలై నెలరోజులు దాటుతోంది.

మొదటి నుంచి అల్-షిఫా ఆసుపత్రి కింద హమాస్ ప్రధాన కార్యాలయం ఉందని ఆరోపిస్తోన్న ఇజ్రాయెల్, ప్రస్తుతం ఆ ఆసుపత్రిని ముట్టడిచింది.

ఆ ఆసుపత్రి ఆవరణలో వేలకొద్దీ పౌరులు తలదాచుకుంటున్నారని అంచనా.

ఇప్పటికే ఆసుపత్రికలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, అత్యవసర చికిత్స అందాల్సిన రోగుల ఆరోగ్యంపై ఆందోళన ఉందని అధికారులు చెప్తున్నారు.

ఆసుపత్రిలో నెలలు నిండకుండానే పుట్టిన శిశువులు ఉన్నారని, విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంక్యుబేటర్లలో ఉంచలేని పరిస్థితి నెలకొందని వైద్యులు చెప్పారు.

ఆసుపత్రిలో ఎంత మంది ఉన్నారు?

ఆసుపత్రి వద్ద వేలకొద్దీ పౌరులు తలదాచుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.

మంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన లెక్కల ప్రకారం.. ఆసుపత్రిలో 700 మంది రోగులు, 400 మంది ఆసుపత్రి సిబ్బంది, 3 వేల మంది పౌరులు ఉన్నారు.

హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తున్న లెక్కల ప్రకారం, 2,300 మంది వరకు ఆసుపత్రిలో ఉన్నట్లుగా వెల్లడించింది. వీరిలో 650 మంది రోగులు, రెండు వందల నుంచి ఐదు వందల మంది ఆసుపత్రి సిబ్బందితోపాటు సుమారు 1,500 మంది పౌరులు ఉన్నట్లు తెలిపింది.

ఇజ్రాయెల్-గాజాల మధ్య కొనసాగుతున్న ఘర్షణ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆసుపత్రిలోని సర్జికల్ విభాగ భవనం

‘ఆసుపత్రి కిందనే హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్’

ఇజ్రాయెల్ పదే పదే ఆరోపిస్తున్నట్లు అల్-షిఫా ఆసుపత్రి కింది భాగంలో హమాస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉందని అమెరికా చెప్పింది.

అమెరికా నేషనల్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మాట్లాడుతూ, ఆసుపత్రి కింద హమాస్ ఆయుధాలను నిల్వచేస్తోందని, ఇజ్రాయెల్‌పై దాడికి అక్కడే సిద్ధమైందని అన్నారు.

ఈ ఆరోపణలకు అమెరికా మద్దతు ఇవ్వడం ఇదే తొలిసారి.

ఆసుపత్రిని ఇజ్రాయెల్ దళాలు ముట్టడిస్తున్న నేపథ్యంలో, ఆసుపత్రిలో ఉన్నవారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది.

ఆసుపత్రిలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని, ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మాట్లాడుతూ, చుట్టూ కొనసాగుతున్న ఘర్షణల నుంచి ఆసుపత్రిని కాపాడి తీరాలని అన్నారు.

ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలకు లోబడి వ్యవహరించాలని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ అన్నారు.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)