ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటు వేసింది?

మోదీ, నెతన్యాహు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత ప్రధామంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు

ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లను వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో గత వారం ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటేసింది.

‘‘తూర్పు జెరూసలేం, సిరియన్ గోలాన్‌ సహా ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్స్’’ పేరుతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఐరాసలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా.. ఏడు దేశాలు వ్యతిరేకించాయి. 18 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి.

ఈ తీర్మానానికి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఓటేసిన దేశాలలో అమెరికా, కెనడా, హంగేరి, ఇజ్రాయెల్, మార్షల్ ఐల్యాండ్స్, ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా, నౌరు ఉన్నాయి.

అయితే, భారత్ ఈ తీర్మానంపై ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడం విశేషం.

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అంటే తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన దేశాలలో బంగ్లాదేశ్, భూటాన్, చైనా, ఫ్రాన్స్, జపాన్, మలేసియా, మాల్దీవులు, రష్యా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బ్రిటన్‌లు ఉన్నాయి.

ఐరాసలో ఇజ్రాయెల్‌పై భారత వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆంగ్ల వార్తాపత్రిక ‘ద హిందూ’కి భారత అధికారులు చెప్పారు.

ఇజ్రాయెల్‌ విషయంలో ప్రతి సంవత్సరం ఐరాసలో ఇలాంటి ప్రతిపాదనలు వస్తూ ఉంటాయని, భారత వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు తెలిపారు.

ఓటింగ్ ప్రక్రియ

ఫొటో సోర్స్, @UN

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఎందుకు ఓటేసింది?

ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటేయడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదని భారత్‌లోని అంతర్జాతీయ వ్యవహాహరాల విశ్లేషణ సంస్థ అయిన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) సభ్యులు కబీర్ తనేజా అన్నారు.

‘‘ఐరాస జనరల్ అసెంబ్లీలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటేయడం అంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ద్విదేశ పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తోంది.

అరబ్ భాగస్వాములతో సమతుల్యంగా వ్యవహరించడమన్నది పాత విషయమే. ఈ ప్రతిపాదనను ఉగ్రవాదంతో వేరుగా చూడాల్సి ఉంది’’ అని తనేజా రాశారు.

‘‘ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి వచ్చిన ఓటింగ్ చూస్తే, అమెరికా ఏకాకి అయిందని స్పష్టంగా అర్థమవుతుంది. ట్రూడో ఏకపక్ష నాయకత్వంలో ఉన్న కెనడాను మినహాయించి, అమెరికాను తన అన్ని మిత్రదేశాలు ఏకాకిని చేశాయి’’ అని ప్రముఖ వ్యూహాత్మక నిపుణులు బ్రహ్మ చెలాని చెప్పారు.

‘‘భారత విషయంలో రూల్స్ గురించి మాట్లాడుతున్న ట్రూడో, పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడానికి మద్దతిస్తోంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం’’ అని బ్రహ్మ చెలాని ట్వీట్‌పై సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర స్పందించారు.

గత నెలలో గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఉద్దేశించి కాల్పుల విరమణ ప్రతిపాదనను ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉంది.

ఆ సమయంలో ఇజ్రాయెల్ విషయంలో మోదీ ప్రభుత్వం కాస్త మెతక ధోరణిని ప్రదర్శించింది.

అయితే, గత వారం ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఐరాస ప్రవేశపెట్టిన తీర్మానం ఏకపక్షంగా ఉందని అమెరికా ఆరోపించింది.

‘‘ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని మీ అందరిని మేం కోరుతున్నాం. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద దాడులు జరిపినప్పటికీ, ఈ తీర్మానంలో వాటిని ప్రస్తావించలేదు. హమాస్‌ చేస్తున్న యుద్ధ నేరాలను కూడా ఈ తీర్మానంలో పేర్కొనలేదు. ఈ సమయంలో, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని అన్ని దేశాలను అభ్యర్థిస్తున్నాం’’ అని ఇజ్రాయెల్ కోరింది.

అయినప్పటికీ, ఇజ్రాయెల్ అభ్యర్థనను భారత్ పట్టించుకోకుండా, ఐరాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది.

ఇజ్రాయెల్, గాజా సరిహద్దులు
ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్, గాజా సరిహద్దులు
నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు

ఫొటో సోర్స్, GETTY IMAGES

భారత ఈ వైఖరికి అర్థమేంటి?

ఐరాసలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా భారత్ ఓటేయడాన్ని చాలా మంది ప్రజలు ఇజ్రాయెల్ విషయంలో మోదీ ప్రభుత్వ విధానంలో మారుతున్న ధోరణిగా చూస్తున్నారు.

గాజాలో ఇజ్రాయెల్ చేపడుతోన్న భీకర దాడులపై ఐరాస అక్టోబర్ 26న అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో కాల్పుల విరమణ ఒప్పంద ఓటింగ్‌ను చేేపట్టింది.

కాల్పుల విరమణ ఒప్పంద ఓటింగ్‌లో భారత్ అసలు పాల్గొనలేదు.

ఆ సమయంలో భారత్‌ను ఇజ్రాయెల్‌కు అనుకూలంగా భావించారు.

ఇజ్రాయెల్ భూభాగంలో అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించలేదని ఆ సమయంలో భారత్ చెప్పింది.

అంతేకాక, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని భారత్ తెలిపింది.

అక్టోబర్ 26న ఐరాసలో ఓటింగ్ జరిగినప్పటి నుంచి అరబ్, గల్ఫ్ దేశాల చాలా మంది నేతలతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.

ఈ చర్చల్లో, పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలని ప్రధాని మోదీని అరబ్ నేతలు అభ్యర్థించారు.

మోదీ మాట్లాడిన నేతల్లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహ్మిం రైసీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్ అల్-సిసి ఉన్నారు.

ఇండో-అమెరికా ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ సోమవారం నిర్వహించిన చర్చలో అమెరికా, బ్రిటన్‌కు మాజీ భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా మాట్లాడారు.

‘‘భారత వైఖరి పూర్తిగా దేశ ప్రయోజనాలకు, వాస్తవిక అంశాలకు అనుగుణంగా ఉంటుంది. ఒకవేళ అరబ్ దేశాలను చూస్తే, అటు వైపు నుంచి కూడా పాలస్తీనాకు బలమైన మద్దతు లభించడం లేదు. మనం ఏ వైపు నిలబడతామనేది భారత వైఖరికి అతి ముఖ్యమైన సూచిక. ద్విదేశ పరిష్కార సిద్ధాంతంపై ఇజ్రాయెల్‌కు అనుకూలంగా నిలబడతాం’’ అని అన్నారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భారత వైఖరి గురించి ఆంగ్ల వార్తాపత్రిక హిందూకి అక్టోబర్ 31న ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ఒక వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంలో భారత్ ఎల్లవేళలా ద్విదేశ పరిష్కారాన్నే కోరుకుంటోందని చెప్పారు.

ఇజ్రాయెల్‌లో ఉగ్రవాద దాడులపై భారత్ ఆందోళన చెందడం సహజమని అన్నారు.

పాలస్తీనా ప్రజలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

అరబ్ దేశాల వైఖరి ఎలా ఉంది?

‘‘ఇజ్రాయెల్-పాలస్తీనా సంక్షోభంలో పశ్చిమ దేశాలపై కపటత్వం, ద్వంద్వ ప్రమాణాల విషయంలో విమర్శలు రావొచ్చు. కానీ, ఈ విషయంలో అరబ్బులు నిర్దోషులా? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు తక్కువ చేసి చూడట్లేదా?

ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించే క్రమంలో అరబ్ దేశాలు... పాలస్తీనియన్ల సమస్య గురించి మాట్లాడుతూ, పాలస్తీనాలోని ఏ ప్రాంతాలను ఆక్రమించబోమని ఇప్పుడు ఇజ్రాయెల్ అంగీకరించిందని చెప్పాయి. కానీ, ఇందుకు విరుద్ధంగా ఇజ్రాయెల్ వ్యవహరిస్తోంది.

పాలస్తీనియన్లకు మద్దతుగా వీధుల్లో చేసే నిరసనలను ఆపడం ఇప్పుడు అరబ్ దేశాల పని. పాలస్తీనియన్ల హక్కులను విస్మరించడం ద్వారా ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడం అరబ్ దేశాలకు భద్రతను అందించదు’’ అని నవ్‌తేజ్ సర్నా రాసుకొచ్చారు.

‘‘గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపేందుకు వారి చమురును గల్ఫ్ దేశాలు ఒక ఆయుధంగా చేయలేదా? పాలస్తీనా ప్రజల హక్కులను విస్మరిస్తూ, ఇజ్రాయెల్‌తో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి తగినంత భద్రతను కల్పించలేం. అది కూడా గల్ఫ్ దేశాల్లో లిబరల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో’’ అని అన్నారు.

అక్టోబర్ 26న, గాజాలో కాల్పుల విరమణ తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ జరిగినప్పుడు భారత్ గైర్హాజరు కావడంతో, ఫ్రాన్స్‌ను ఉదహరిస్తున్నారు.

ఈ ఓటింగ్ సమయంలో కాల్పుల విరమణకు అనుకూలంగా ఫ్రాన్స్ ఓటేయగా.. పశ్చిమ దేశాలు బహిరంగంగా ఇజ్రాయెల్‌కు మద్దతు పలికాయి.

అక్టోబర్ 7న హమాస్ దాడుల తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఇజ్రాయెల్‌ను సందర్శించారు.

బెంజమిన్ నెతన్యాహుకు మద్దతుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన భవంతి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఖాన్ యూనిస్‌లో ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైన భవంతి

‘‘గాజాలో కాల్పుల విరమణ తీర్మానానికి అనుకూలంగా ఫ్రాన్స్ ఓటేసింది. యూరప్‌లో యూదుల జనాభా ఎక్కువగా ఉన్న దేశం ఫ్రాన్స్.

ఇజ్రాయెల్, అమెరికా తర్వాత, ఫ్రాన్స్‌లోనే అత్యధికంగా యూదులు ఉన్నారు. అలాగే యూరప్‌లో అత్యంత ఎక్కువగా ముస్లిం జనాభా కూడా ఫ్రాన్స్‌లోనే ఉంది. ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.

నెతన్యాహును ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ స్నేహితుడిగా భావిస్తారు. కానీ, పశ్చిమ దేశాల మాదిరి కాకుండా, ఓటింగ్‌కు గైర్హాజరు కాకుండా ఈ తీర్మానానికి ఫ్రాన్స్ అనుకూలంగా ఓటేసింది’’ అని ఫ్రాన్స్ వైఖరిపై అంతర్జాతీయ వ్యవహరాల నిపుణులు నిరుపమ సుబ్రమణ్యం రాశారు.

గత నెలలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగినప్పుడు భారత్ దూరంగా ఉండటంపై దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పశ్చిమాసియా స్టడీ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఏకే పాషా స్పందించారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మోదీ ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలను భారత్ ప్రదర్శిస్తోందన్నారు.

‘‘దీనివల్ల యుక్రెయిన్-రష్యా యుద్ధంలో స్వతంత్ర విదేశీ విధానంతో గ్లోబల్ సౌత్ గళంగా మారడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ తగిలింది.

గాజాలో ప్రతి రోజూ సామాన్య ప్రజలు, చిన్నారులు, మహిళలు చనిపోతున్నారు. ఐరాసలో ఈ కాల్పులను విరమించాలని కోరుతూ ప్రతిపాదన వచ్చినప్పుడు, భారత్ దీనికి దూరంగా ఉంది.

ఇప్పుడు భారత్ ఎలా తాను గ్లోబల్ సౌత్ అని చెప్పుకోగలదు? ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల్లో మోదీ ప్రభుత్వ వైఖరి, అమెరికా ఆధీనంలో ఉన్నట్లు కనిపిస్తోంది. భారత స్వతంత్ర విదేశీ విధానానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది’’ అని ఏకే పాషా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)