సుబ్రతా రాయ్: ఖరీదైన జీవనశైలి, 127 ట్రక్కుల్లో పత్రాలను సెబీకి పంపిన వ్యాపారవేత్త

ఫొటో సోర్స్, Reuters
సహారా ఇండియా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ 75 ఏళ్ల వయసులో గుండెపోటుతో ముంబయిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చనిపోయారు.
ఆయన మరణవార్తను ధ్రువీకరిస్తూ సహారా గ్రూప్ ప్రకటన విడుదల చేసింది.
బీపీ, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్న సుబ్రతా రాయ్ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపింది.
బుధవారం లఖ్‌నవూలోని సహారా సిటీలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
భారతీయ వ్యాపార ప్రముఖులలో సుబ్రతా రాయ్ పేరు కచ్చితంగా ఉంటుంది.
చిన్న సంస్థగా మొదలైన సహారా ఇండియా గ్రూప్, ఒక సమయంలో 12 లక్షల మంది ఉద్యోగులు ఉన్న అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ కంపెనీగా కూడా వార్తల్లో నిలిచింది.
కానీ, ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా డబ్బులు సేకరించారన్న ఆరోపణలతో జైలుకు వెళ్లారు సుబ్రతా రాయ్. అక్కడి నుంచే పతనం మొదలైంది.
అసలు ఏం జరిగింది? సుబ్రతా రాయ్ ఎందుకు వార్తల్లో నిలిచారు?

ఫొటో సోర్స్, Getty Images
రూ.2,000తో మొదలుపెట్టి...
1948 జూన్ 10న బిహార్‌లోని అర్‌రియాలో పుట్టిన సుబ్రతా రాయ్.. కోల్‌కతా హోలీ చైల్డ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు.
1978లో రెండు వేల రూపాయల పెట్టుబడితో సహారా ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో సుబ్రతా రాయ్ తన వ్యాపారాలను అన్ని రంగాల్లోనూ విస్తరించారు. ఎయిర్‌లైన్స్, ఫార్ములా వన్ టీం, ఐపీఎల్ జట్టు, లండన్, న్యూయార్క్ నగరాల్లో హోటళ్లు.. ఇలా అన్ని రంగాల్లోనూ సహారా గ్రూప్ ప్రవేశించింది.
దేశంలో భారతీయ రైల్వే తర్వాతి స్థానంలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ 12 లక్షల మంది ఉద్యోగులతో వార్తల్లో నిలిచింది.
సహారా ఇండియా గ్రూప్ సంస్థ వెబ్‌సైట్ ప్రకారం, ఈ సంస్థకు 9 కోట్ల మంది పెట్టుబడిదారులు, వినియోగదారులు ఉన్నారు. రూ.2.59 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వేల క్యాంపస్‌లు, 30,970 ఎకరాల భూములు ఉన్నట్లు సహారా ఇండియా వెబ్‌సైట్ చెబుతోంది. అయితే, సెబీ చర్యల కారణంగా సుబ్రతా రాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం పతనం అవడం మొదలైంది.
సహారా సంస్థ రియల్‌ఎస్టేట్ పెట్టుబడుల కోసమంటూ మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుంచి రూ.24 వేల కోట్ల రూపాయలను సమీకరించడంపై ఈ కేసు మొదలైంది.
ఒకానొక సమయంలో సుబ్రతా రాయ్ తన వ్యాపారాలను అన్ని రంగాల్లోకీ విస్తరించారు.
ఎయిర్‌లైన్స్, ఫార్ములా వన్ టీం, ఐపీఎల్ జట్టు, లండన్, న్యూ యార్క్ నగరాల్లో విలాసవంతమైన హోటళ్లు.. ఇలా అనేక రంగాల్లోకి సహారా గ్రూప్ ప్రవేశించింది.
దేశంలో భారతీయ రైల్వే తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ 12 లక్షల మంది ఉద్యోగులతో వార్తల్లో నిలిచింది.
సినీ, రాజకీయ రంగ ప్రముఖులతో సుబ్రతా రాయ్‌కి స్నేహం ఉండేది.
ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్‌తో ఆయనకు మంచి స్నేహం ఉందని, ములాయం ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఈ స్నేహం మరింత బలపడిందని చెప్తారు.

ఫొటో సోర్స్, Getty Images
సహారా గ్రూప్ పతనం..
సెబీతో సహారా గ్రూప్ వివాదం చాలాకాలంగా కొనసాగుతోంది. 2010లో ఇన్వెస్టర్ల డబ్బును తిరిగి చెల్లించాలని సెబీ ఆదేశించింది. అంతేకాకుండా సహార్ గ్రూప్‌కు సంబంధించిన రెండు సంస్థలను బ్యాన్ చేయడంతోపాటు ఐపీవోను నిలిపివేసింది.
వివరాలు సమర్పించాలని సెబీ అడిగిన నేపథ్యంలో 2013లో సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులను సెబీ కార్యాలయానికి పంపి, వార్తల్లో నిలిచారు సుబ్రతా రాయ్. ఆ ట్రక్కుల్లో మూడు కోట్ల దరఖాస్తు పత్రాలు, రెండు కోట్ల రిడంప్షన్ ఓచర్లు ఉన్నాయి.
నిర్ణీత గడువులోగా రూ. 10 వేల కోట్ల బకాయిలు చెల్లించలేకపోయినందున 2014 మార్చి 4న సుబ్రతా రాయ్ జైలుకి వెళ్లాల్సి వచ్చింది.
రూ.5 వేల కోట్లు నగదు రూపంలో, మిగతా రూ.5 వేల కోట్లు బ్యాంకు గ్యారంటీ రూపంలో సమర్పిస్తేనే ఆయన విడుదల సాధ్యమవుతుందని కోర్టు స్పష్టం చేసింది.
రెండేళ్ల జైలు జీవితం అనంతరం పెరోల్‌పై విడుదలయ్యారు సుబ్రతా రాయ్.
2020 నవంబర్‌లో సుబ్రతా రాయ్ చెల్లించాల్సిన మొత్తం రూ.62,600 కోట్ల రూపాయలు అని సుప్రీం కోర్టుకు సెబీ నివేదించింది.
భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా..
సహారా గ్రూప్ 2001 నుంచి 2013 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు స్పాన్సర్‌గా వ్యవహరించింది. పుణె వారియర్స్ జట్టును కొనుగోలు చేసి 2011లో ఐపీఎల్‌లో ప్రవేశించింది.
అయితే, సహారా గ్రూప్ సంస్థ క్షీణించడంతో 2013లో ఒప్పందాలు రద్దయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
ఖరీదైన జీవనశైలి..
సుబ్రతా రాయ్ తన సంస్థను ఒక కుటుంబంగా, తాను సహారా పరివార్ (కుటుంబం) సంరక్షుడిగా చెప్పుకుంటారు.
ఖరీదైన జీవితాన్ని గడిపారు. ఆయన నివాసం అమెరికాలోని వైట్ హౌజ్ నమూనాను పోలి ఉంటుంది.
రోల్స్ రాయ్స్, బెంట్లీ, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు, ప్రైవేట్ జెట్స్, హెలికాఫ్టర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
కుమారుల పెళ్లిళ్లతో..
సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్‌ను తన స్నేహితుడిగా చెప్తుంటారు సుబ్రతా రాయ్. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో కూడా సాన్నిహిత్యం ఉంది.
2004లో జరిగిన సుబ్రతా రాయ్ ఇద్దరు కుమారుల వివాహ వేడుకను భారతదేశంలో గత 100 ఏళ్లలో జరిగిన భారీ వివాహ వేడుకల్లో ఒకటిగా చెప్తుంటారు.
ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్లతోపాటు 10 వేల మందికి పైగా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
అతిథులను ప్రత్యేక విమానాల్లో లఖ్‌నవూకు తీసుకువెళ్లారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ కూడా ఈ వివాహానికి హాజరై, వధూవరులను ఆశీర్వదించారు.
ప్రముఖుల నివాళి
సుబ్రతా రాయ్ మృతి పట్ల పలువురు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.
ఆయన మృతి బాధాకరమని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నప్పుడు నాకు మద్దతుగా ఉన్న అతికొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. ఆయన నా కుటుంబంలో ఒకరు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను” అని రాశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ నివాళులర్పించారు.
“సుబ్రతా రాయ్ మరణం ఉత్తరప్రదేశ్‌తోపాటు దేశానికి తీరని లోటు. విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా సున్నితమైన వ్యక్తిగా, పెద్ద మనసుతో అసంఖ్యాకమైన ప్రజలకు మద్దతునిచ్చారు. ఆయనకు హృదయపూర్వక నివాళులు” అంటూ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
- గాజా ఆస్పత్రిలో పేరుకుపోతున్న శవాలు.. పనిచేయని ఐసీయూ, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల ప్రాణాలకు ముప్పు
- క్రికెట్ వరల్డ్ కప్: అఫ్గానిస్తాన్ మనసుల్ని గెలిచింది...సంక్షోభంలో ఉన్న దేశానికి ఇదెలా సాధ్యమైంది?
- ఆర్ధిక నేరాలు: ‘నాకు తెలియదు, గుర్తు లేదు’ అని కోర్టుల్లో చెప్పడం కేసుల నుంచి తప్పించుకునే పెద్ద వ్యూహమా?
- 1971 వార్: పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆ రాత్రి ఏం జరిగింది?
- గాజాలో రోజూ 160 మంది పిల్లలు చనిపోతున్నారు- డబ్ల్యూహెచ్‌వో
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















