పట్టిసీమ: కృష్ణా డెల్టా రైతులకు ఇదే పెద్దదిక్కు అయ్యిందా? మరి పోలవరం పూర్తయ్యేది ఎప్పుడు?

పట్టిసీమ
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించి, ఎగువన కృష్ణా జలాలను రాయలసీమ అవసరాలకు వినియోగించుకుంటామని చెబుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోగా ఈ లిఫ్ట్ స్కీమ్ ఉపయోగపడుతుందని తొలుత ప్రకటించారు. కానీ, పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి అవుతుందన్న దానిపై స్పష్టత రావడం లేదు. దీంతో ఏడేళ్లు దాటుతున్నా పట్టిసీమ ఎత్తిపోతల పథకమే ఇప్పుడు కృష్ణా డెల్టాకు పెద్ద దిక్కులా కనిపిస్తోంది.

పట్టిసీమ నుంచి గోదావరి జలాలను తరలించకపోతే కృష్ణా డెల్టాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగయ్యే పరిస్థితి కనిపించలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? పట్టిసీమకు అసలు ప్రత్యామ్నాయం ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?

పట్టిసీమ
ఫొటో క్యాప్షన్, గోదావరి జలాలు కృష్ణా నదిలో ప్రవేశించే చోటు

తూర్పు డెల్టా కింద 7,36,953 ఎకరాల ఆయకట్టు

కృష్ణా నదిపై ప్రకాశం బరాజ్ నుంచి ఎడమ వైపు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు సాగు, తాగు నీటిని తరలిస్తారు. తూర్పు ఒడ్డు కాలువ, బందరు కాలువ, ఏలూరు కాలువ, రైవ్స్ కాలువగా పిలిచే నాలుగు కాలువల ద్వారా నీటిని అందిస్తారు.

తూర్పు డెల్టా కింద 7,36,953 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 5,30,136 ఎకరాల్లో పంట సాగు చేసినట్టు ఇరిగేషన్ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

కుడి వైపు గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు నీరందిస్తారు. మొత్తం 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈసారి మొత్తం ఆయకట్టు అంతా పంట సాగు అవుతోందని ప్రభుత్వం అంటోంది.

సాధారణంగా కృష్ణా నదిపై ప్రకాశం బరాజ్ వద్ద నీటికి అడ్డుకట్ట వేసి నదీ జలాలను ఆయకట్టు అవసరాలకు అనుగుణంగా తరలిస్తారు. ఎగువన పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని విడతల వారీగా విడుదల చేస్తూ సాగునీటికి వాడుతారు.

గడిచిన నాలుగు సీజన్లలో 2019 నుంచి 2022 వరకు అసాధారణంగా వర్షాలు పడ్డాయి. సగటుకు మించి వర్షపాతం నమోదైంది. కృష్ణా నదిలో పుష్కలంగా నీటి లభ్యత ఉండేది. దాంతో ఏటా 400 టీఎంసీలకు పైగా నీటిని వృథాగా సముద్రం పాలు చేయాల్సి వచ్చేది. నీటికొరత లేని కారణంగా రైతులకు సాగునీటి సమస్య కనిపించలేదు.

పట్టిసీమ
ఫొటో క్యాప్షన్, పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్‌ను 2016లో ప్రారంభించారు.

వర్షాభావంతో తలకిందులు

ఈ ఖరీఫ్ సీజన్‌లో పరిస్థితి తలకిందులైంది. అంచనాలకు మించి వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫలితంగా కృష్ణా నదీ జలాల ప్రవాహం నామమాత్రంగా మారింది. ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండుకున్నాయి. దాంతో దిగువన పులిచింతలకు ఇన్ ఫ్లో లేకుండా పోయింది. గత ఏడాది నిల్వ ఉంచిన నీరు తప్ప ఈ ఏడాది అదనంగా ఎగువ నుంచి నీరు రాకపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడింది.

మున్నేరు, పాలేరు, కీసర వంటి ఉపనదుల నుంచి వచ్చిన ఇన్ ఫ్లో ప్రకాశం బరాజ్‌కు కొంత ఉపయోగపడింది. దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం వచ్చిందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు.

2021లో సుమారు ఆరు నెలల పాటు ప్రకాశం బరాజ్ నుంచి మిగులు జలాలను దిగువన సముద్రంలోకి వదిలేయగా, 2023లో కేవలం నాలుగు రోజులు మాత్రమే గేట్లు ఎత్తేసే పరిస్థితి వచ్చిందంటే ఇన్ ఫ్లో ఎంత తక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రధానంగా ఆగస్టు, అక్టోబర్ మాసాల్లో తీవ్ర లోటు వర్షపాతం కనిపించింది.

13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్న కృష్ణా డెల్టాలో దాదాపు 11 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సాగు జరుగుతుండగా పంటలకు సాగునీరు, గ్రామాలకు తాగు నీరు కోసం సుమారుగా 110 టీఎంసీల నీటి అవసరం ఏర్పడింది.

కానీ, పులిచింతలలో సీజన్ ప్రారంభం నాటికి కేవలం 38 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఏడాది వర్షాలతో మున్నేరు, పాలేరు, కీసర నుంచి మరో 20 టీఎంసీల నీరు లభించడంతో మొత్తంగా 60 టీఎంసీల వరకు మాత్రమే అవకాశం ఏర్పడింది.

పట్టిసీమ

అక్టోబరు చివరి నాటికి 40 టీఎంసీల తరలింపు

కృష్ణా నదిలో ఎగువ నుంచి నీరు లభించే అవకాశం లేకపోవడంతో కృష్ణా డెల్టా ఆయకట్టు రైతుల అవసరార్థం పట్టిసీమను ఆశ్రయించాల్సి వచ్చింది.

2019 నుంచి 2023 జులై 21 వరకు పట్టిసీమ ఎత్తిపోథల పథకంపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం రాలేదు.

దాదాపు నాలుగేళ్ల తర్వాత మళ్లీ పట్టిసీమ నీటిని పూర్తిస్థాయిలో తరలించాల్సిన అవసరం ఈసారి ఏర్పడింది.

2016లో ప్రారంభించిన పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ నుంచి 2023 ఖరీఫ్ ముందు వరకు మొత్తం 345 టీఎంసీల నీటిని గోదావరి నంచి కృష్ణాలోకి తరలించారు. పోలవరం ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా ఆ నీటిని ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా నదిలో కలిపారు. అక్కడి నుంచి దిగువన ప్రకాశం బరాజ్ ద్వారా అవసరాలకు వినియోగించారు.

"నాలుగేళ్లలో కేవలం ఒక్కసారి మాత్రమే వాడాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, ప్రస్తుతం పులిచింతలలో ఉన్న మొత్తం నీటిని తోడితే, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో గోదావరి ప్రవాహాన్ని డెల్టాకు తరలించాం. నాగార్జున కుడి కాలువ ద్వారా ఐదు టీఎంసీల నీటిని కూడా వాడాం. మంచినీటి ఎద్దడి నివారణ, రైతులకు చిక్కు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేశాం. రైతులు పంట నష్టపోకుండా అన్నిరకాలుగా ప్రయత్నించాం" అని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

ఈ ఏడాది జులై 21న పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ నుంచి నీటి తరలింపును మళ్లీ మొదలుపెట్టారు. అక్టోబర్ నెలాఖరు వరకు సుమారుగా 40 టీఎంసీల నీటిని తరలించి కృష్ణా ఆయకట్టు రైతులకు అందించినట్లు మంత్రి చెప్పారు.

పట్టిసీమ

పోలవరం ఎప్పుడు?

పోలవరం ప్రాజెక్టు పూర్తికి అప్పటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం, ప్రస్తుత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గడువులు పెడుతూ వచ్చాయి. కానీ, అనేక కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు.

ఇక ఎప్పటికి పూర్తవుతుందన్నది కూడా చెప్పలేమంటూ కొన్ని నెలల క్రితమే మంత్రి అంబటి రాంబాబు తేల్చేశారు.

పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది కాబట్టి అది పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టా అవసరాలు తీర్చేందుకు 2015లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం మొదలైంది. 2016లో పూర్తి చేశారు. 24 మోటార్ల ద్వారా గోదావరి జలాలను పంప్ చేసి పట్టిసీమ నుంచి పోలవరం కుడికాలువకు తరలించి, అక్కడి నుంచి కృష్ణా నదిలో చేర్చే ప్రయత్నం మొదలైంది.

పట్టిసీమ ప్రాజెక్టు మీద అనేక అభ్యంతరాలు, అవినీతి అరోపణలు వచ్చాయి. చివరకు కాగ్ కూడా నిధులు అధికంగా వినియోగించారంటూ ప్రస్తావించింది.

2019కి ముందు వరుసగా మూడేళ్లు నీటి ఎద్డడి కారణంగా పట్టిసీమను ఉపయోగించారు. కానీ, ఆ తర్వాత మూడేళ్ల పాటు దాని అవసరం కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలతో కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తున్నారు.

"ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. పట్టిసీమ శాశ్వతం కాదు. లిఫ్ట్ స్కీమ్ మీద ఆధారపడి కృష్ణా డెల్టాకు సాగునీరు అని చెప్పడం శ్రేయస్కరం కాదు. పోలవరం పూర్తి చేయడమే అసలైన పరిష్కారం. దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ప్రభుత్వాలు అక్కడ నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఈసారి కూడా ఖరీఫ్‌లో అత్యంత క్లిష్టంగా మారింది. కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాల్లో శివారు భూములకు నీరు అందలేదు. రాబోయే కాలంలో ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులు తీవ్రమైతే మరింత సమస్యగా మారుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకుండా ఈ సమస్య తీరదు" అని ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి వై. కేశవరావు బీబీసీతో అన్నారు.

కృష్ణా నదీ జలాల పునఃపంపిణీకి ప్రయత్నాలు జరుగుతున్న వేళ కృష్ణా డెల్టా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకపోతే ఈ ప్రాంత వాసులంతా చిక్కుల్లో పడతారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

పట్టిసీమ
ఫొటో క్యాప్షన్, పోలవరం కుడి కాలువలోకి పట్టిసీమ ద్వారా నీరు

ప్రశ్నార్థకంగా రబీ

పులిచింతలలో నిల్వ ఉంచిన నీటితో పాటు, ఈ ఏడాది ఆగస్టులో ఎగువన కురిసిన వర్షాలు, పట్టిసీమ ద్వారా లభించిన గోదావరి జలాలతో ఈసారి ఖరీఫ్ ఏదో రకంగా గట్టెక్కే పరిస్థితి వచ్చింది. శివారు రైతులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ అత్యధిక శాతం ఖరీఫ్ పంట చేతికొచ్చే అవకాశం ఏర్పడింది.

ప్రస్తుతం అందరి దృష్టి రబీ మీద ఉంది. రబీ పంటకు సాగు నీరు ఎలా అన్నది అంతుచిక్కట్లేదు. వాస్తవానికి నవంబర్ మొదటి వారంలోనే రబీ సాగు మీద స్పష్టత ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారికంగా ఇంకా నిర్ణయం వెలువడలేదు. దాంతో ఈ రబీ కాలంలో ఏం చేయాలన్నది రైతులకు అంతుబట్టడం లేదు.

అక్టోబర్, నవంబర్ మాసాల్లో కూడా ఆశించినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో ప్రాజెక్టులన్నీ నిండుకున్నాయి. కృష్ణా డెల్టాకు ఎగువన ప్రాజెక్టుల ద్వారా నీరు లభించే అవకాశం లేదు. అదే సమయంలో 14 అడుగుల దిగువకు చేరితే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలించడాన్ని కూడా నిలిపివేయాల్సి ఉంటుంది.

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ కుంగిపోయి సమస్యలు ఏర్పడటంతో ఈసారి నవంబర్ మధ్యలో కూడా ఎగువ నుంచి గోదావరి జలాలు ఆశావహంగా వచ్చాయి.

"మరో నెల తర్వాత గోదావరి ఆయకట్టుకు కూడా రబీ నీటిని తరలించాల్సిన సమయంలో అక్కడే సీలేరు మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించడం ప్రశ్నార్థకం. కాబట్టి ఈసారి ఆరుతడి పంటలు మినహా కృష్ణా డెల్టాలో రబీకి వరి పంట అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే దాని మీద స్పష్టత ఇస్తే రైతులకు ఉపయోగం. ఖరీఫ్ పంట చేతికొచ్చే వేళ రబీ సాగు విషయమై అస్పష్టత కొనసాగడం రైతులను ఇబ్బందుల్లోకి నెడుతుంది" అని ఇరిగేషన్ కృష్ణా డెల్టా మాజీ ఇంజినీర్ ఆర్.రామలింగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.

రైతులందరికీ స్పష్టత ఉందని, ప్రత్యామ్నాయ పంటలకు సన్నద్ధమవుతున్నారని, ఆరు తడి పంటలకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కృష్ణా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)