గాజా: అల్-షిఫా హాస్పిటల్‌లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారా... ఇజ్రాయెల్ సైన్యంతో లోపలికి వెళ్ళిన బీబీసీకి అక్కడ ఏం కనిపించింది?

అల్-షిఫా ఆస్పత్రిలోకి వెళ్లిన బీబీసీ ప్రతినిధులు
ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆస్పత్రిలోకి వెళ్లిన బీబీసీ ప్రతినిధులు
    • రచయిత, లుసి విలియమ్సన్
    • హోదా, బీబీసీ న్యూస్
    • నుంచి, గాజా నగరం

ధ్వంసమైన గోడను ఎక్కి చీకట్లో అల్-షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌లోకి దూకాం. లోపలికి వెళ్లేందుకు ఇజ్రాయెల్ దళాలు మంగళవారం బుల్డోజర్‌తో ఈ గోడను పగలగొట్టాయి.

అక్కడ ఏముందో చూపించేందుకు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) ఆహ్వానించిన తొలి జర్నస్టులం మేం. బీబీసీ రిపోర్టర్, మరొక టీవీ కెమెరా పర్సన్‌‌ను ఐడీఎఫ్ ఆ హాస్పిటల్‌ లోపలికి తీసుకువెళ్ళింది.

ఇక్కడ అదనపు వెలుతురు అనేది మరింత ప్రమాదకరం. అందుకే కాంపౌండ్ గుండా మేం మెల్లగా లోపలికి వెళ్లాం. టెంట్లు, శిథిలాలు, నిద్రపోతున్న ప్రజల మధ్య నుంచి మేం నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాం.

కరెంట్, ఆహారం, నీళ్లు లేకుండా తాము రేయింబవళ్లు పనిచేయాల్సి వస్తుందని ఆస్పత్రిలోని వైద్యులు చెప్పారు.

దీంతో అప్పుడే పుట్టిన పిల్లలు సహా పరిస్థితి విషమంగా ఉన్న రోగులు చనిపోతున్నారని వైద్యులు తెలిపారు.

గాజాలో ఘర్షణల వల్ల నిరాశ్రయులైన ప్రజలు ఆస్పత్రి కాంప్లెక్స్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు.

అల్-షిఫా ఆస్పత్రి కింద కూడా భూగర్భ సొరంగాల నెట్‌వర్క్‌ను హమాస్ నిర్వహిస్తుందని ఇజ్రాయెల్ చెబుతోంది.

ముఖాలను కప్పేసుకున్న సాయుధ దళాలు భవనాల శిథిలాలు, పగిలిపోయిన గ్లాస్‌ గుండా మమ్మల్ని తీసుకెళ్లేటప్పుడు, ఇక్కడ పరిస్థితి ఎంత ఉద్రిక్తతంగా ఉందో తెలిసింది.

ఈ ఆస్పత్రిని ఇజ్రాయెల్ తన ఆధీనంలోకి తీసుకున్న ఒకరోజు తర్వాత మేం అక్కడికి వెళ్లాం.

ఇజ్రాయెల్ సైన్యం ఇక్కడికి ఎందుకు వచ్చిందో, దాని వెనకున్న కారణమేంటో ప్రపంచానికి తెలియజేసేందుకు వారు మాతో మాట్లాడారు.

ఐడీఎఫ్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్‌తో మాట్లాడిన బీబీసీ టీమ్
ఫొటో క్యాప్షన్, ఐడీఎఫ్ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్‌తో మాట్లాడిన బీబీసీ టీమ్

ఆస్పత్రి ఎంఆర్ఐ యూనిట్ కారిడార్లలో కనుగొన్న కలాష్నికోవ్ రైఫిళ్లు, మందుగుండు సామాగ్రి, బుల్లెట్ ప్రూఫ్ వస్త్రాలకు చెందిన సీక్రెట్ నిల్వలను లెఫ్టినెంట్ కల్నల్ జోనాథన్ కాన్రికస్ మాకు చూపించారు.

కొన్ని గ్రనేడ్లతో పాటు సుమారు 15 తుపాకీలను ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.

లెఫ్టినెంట్ కల్నల్ కాన్రికస్ కొన్ని మిలటరీ బుక్‌లెట్లను, పాంప్లెట్లను, మ్యాప్‌ను చూపించారు. దీనిలో ఆస్పత్రిలోకి వెళ్లే, బయటకు వచ్చే మార్గాలు మార్క్ చేసి ఉన్నట్లు తెలిపారు.

హమాస్ సైనిక అవసరాల కోసం ఈ ఆస్పత్రిని వాడుకుంటుందని ఇవి మనకు చెబుతున్నాయని అన్నారు.

‘‘ప్రస్తుత పరిస్థితికి నిలువుటద్దమైన ఎన్నో కంప్యూటర్లను, ఇతర పరికరాలను కూడా మేం వెలికితీశాం. బందీల గురించి కూడా ఆశాజనకమైన సమాచారాన్ని పొందాం’’ అని చెప్పారు.

తాము స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లలో బందీలకు చెందిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. వారిని కిడ్నాప్ చేసిన తర్వాత గాజాకు తీసుకెళ్తున్న సమాచారం ఉంది.

అక్టోబర్ దాడుల తర్వాత అరెస్ట్ చేసిన హమాస్ ఫైటర్ల విచారణకు చెందిన ఫుటేజీలను కూడా ఇజ్రాయెల్ పోలీసులు ఇటీవలే విడుదల చేశారు.

అయితే, ఈ ల్యాప్‌టాప్‌లలో ఏముందో బీబీసీకి చూపించలేదు.

గత కొన్ని రోజులుగా హమాస్ ఇక్కడుందనే దానికి ఇవి సంకేతమని లెఫ్టినెంట్ కల్నల్ అన్నారు.

‘‘చివరికి, ఇది ఒక దారుణమైన పరిస్థితికి మూలమని అర్థమవుతుంది’’ అని చెప్పారు.

‘‘మేం ఇక్కడికి వస్తున్నట్లు తెలిసి హమాస్ ఈ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయింది. వారు తప్పించుకుని వెళ్లేటప్పుడు వదిలిపెట్టి వెళ్లిన సామాన్లు ఇవి. ఇంతకంటే ఎక్కువ ఆయుధాలు, సామాగ్రి వారి వద్ద ఉంటాయని మేం భావిస్తున్నాం’’ అని లెఫ్టినెంట్ కల్నల్ అన్నారు.

అల్-షిఫా ఆస్పత్రి లోపల ఎంఆర్ఐ స్కానర్ వెనుక కలాష్నికోవ్ రైఫిల్స్ నిల్వలు కనుగొన్నట్లు చెప్పిన ఐడీఎఫ్ సైనికులు
ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆస్పత్రి లోపల ఎంఆర్ఐ స్కానర్ వెనుక కలాష్నికోవ్ రైఫిల్స్ నిల్వలు కనుగొన్నట్లు చెప్పిన ఐడీఎఫ్ సైనికులు
పాంప్లెట్లు

ఆస్పత్రి గేట్లను దాటుకుని లోపలికి వెళ్లేందుకు ఇజ్రాయెల్ సైన్యం వారాల పాటు పోరాటం చేసింది.

గత కొన్ని రోజులుగా గాజా వీధుల్లో భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం.

మా సందర్శన కూడా చాలా కట్టుదిట్టంగా సాగింది. ఆస్పత్రి లోపల మాకు పరిమిత సమయమే కేటాయించారు.

అక్కడ రోగులు లేదా వైద్యులతో మేం సరిగ్గా మాట్లాడలేకపోయాం.

బయట నుంచి ఏం కనిపించకుండా మూసివేసిన సైనికుల క్యారియర్‌లో మేం గాజాలోకి ప్రయాణించాం.

గత కొన్ని వారాల క్రితం గాజాలో ఇజ్రాయెల్ తొలి గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత మేం అక్కడికి వెళ్లాం.

మేం వెళ్తోన్న సైనికుల వాహనంలో ఉన్న స్క్రీన్లలో, వ్యవసాయ భూమి నుంచి గుట్టలుగా పేరుకుపోయిన భవనాల శిథిలాలున్న వీధులను మేం చూశాం.

ధ్వంసమైన భవనాలు మసకమసకగా మాకు కనిపించాయి.

అల్-షిఫా ఆస్పత్రి‌లో వెతుకుతున్నట్లు చెప్పిన ఐడీఎఫ్
ఫొటో క్యాప్షన్, అల్-షిఫా ఆస్పత్రి‌లో వెతుకుతున్నట్లు చెప్పిన ఐడీఎఫ్

వెహికిల్స్ మారేందుకు గాజా నగరానికి దక్షిణ దిక్కున మేం ఆగాం.

సైనికుల చిన్న గ్రూపులు క్యాంప్‌ఫైర్లను ముట్టిస్తూ ట్యాంకుల పక్కనే వంట చేస్తున్నాయి.

‘‘ఇది రహస్యంగా చేసే వంటకం’’ అంటూ ఒక సైనికుడు కన్ను గీటాడు.

భవనాలన్ని అక్కడ వివిధ ఆకారాల్లో ధ్వంసమై ఉన్నాయి. ఒక షాపు ముందు రోలింగ్ మెటల్ డోర్ సగం తెరిచి ఉంది.

ఒక గోడపై ఎర్ర రంగులో నక్షత్రం గుర్తు వేసి, దానిలో ఐడీఎఫ్ అని రాసి ఉంది. దాని పైన ‘నెవర్ అగైన్’ అని ఉంది.

అక్టోబర్ 7న దాడులు జరిగిన తర్వాత హమాస్‌తో ఇజ్రాయెల్ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి.

హమాస్ సైనిక, రాజకీయ శక్తిని పూర్తిగా నిర్మూలించడం ద్వారా ఎన్నో ఏళ్లుగా సాగుతోన్న ఘర్షణలకు ఫుల్ స్టాప్ పెడతామని ఇజ్రాయెల్ కంకణం కట్టుకుంది.

హమాస్‌ను బ్రిటన్, అమెరికా, ఇతర దేశాలు ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నాయి.

దక్షిణ గాజా నగరంలో ఒక గోడపై వేసిన పెయింటింగ్
ఫొటో క్యాప్షన్, దక్షిణ గాజా నగరంలో ఒక గోడపై వేసిన పెయింటింగ్

గాజా నగరం నడిబొడ్డుకు వెళ్తామని చెప్పడమంటే.. అల్-షిఫా ఆస్పత్రిలోకి కూడా వెళ్లడమని అర్థం.

ఆస్పత్రి కిందనున్న సొరంగాలలో దాగున్న హమాస్ ఫైటర్ల కోసం ఇజ్రాయెల్ బలగాలు తీవ్రంగా వెతుకుతున్నాయి.

తాము వస్తోన్న సంగతి తెలిసి హమాస్ ఫైటర్లు వారి వద్దనున్న బందీలను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్లి ఉంటారని ఇజ్రాయెల్ బలగాలు భావిస్తున్నాయి.

గాజాతో ఇజ్రాయెల్ చేస్తోన్న యుద్ధంలో ఈ ఆస్పత్రి భవనం కేంద్రంగా మారింది. హమాస్ కార్యకలాపాలను కొల్లగొట్టే కీలకమైన కమాండ్ సెంటర్‌గా దీన్ని పేర్కొంటున్నారు.

గాజా నగరానికి కేంద్రంగా ఉన్న ఈ ఆస్పత్రిలోకి వెళ్లేందుకు ఇజ్రాయెల్ సైన్యానికి వారాల పాటు సమయం పట్టింది.

ఆస్పత్రిలో 24 గంటల పాటు తీవ్రంగా శోధించిన తర్వాత ఆయుధాలు, ఇతర మందుగుండు సామాగ్రిని, ఇతర ఇక్విప్‌మెంట్‌ను గుర్తించారు.

ఇవి హమాస్ ఫైటర్లు, వారి చేతిలో బందీగా మారిన ఇజ్రాయెల్ పౌరుల సమాచారాన్ని తెలుసుకునేందుకు సహకరించాయి.

కానీ, అప్పటికే వారు తప్పించుకుని వెళ్లిపోయారు.

మేం ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి, గాజా తీర ప్రాంత రోడ్డు మార్గంలో శిథిలాల గుండా ప్రయాణించాం.

గాజా నగరాన్ని పూర్తిగా యుద్ధ ట్యాంకులే పాలిస్తున్నాయి. భూకంపం తర్వాత ఎలాగైతే ఆ ప్రాంతం శ్మశానంగా కనిపిస్తోందో అలా ఉంది. ఈ తీవ్రత చాలా ప్రమాదకరంగా ఉంది.

ఈ వీధులను ఇజ్రాయెల్ పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకునేందుకు ఏం చేసిందో స్పష్టంగా అర్థమవుతోంది.

అల్-షిఫా ఆస్పత్రి

ఫొటో సోర్స్, Maxar, Al-Shifa hospital staff

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)